మరి మంత్రులను ఎందుకు విచారించడం లేదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరి మంత్రులను ఎందుకు విచారించడం లేదు?

మరి మంత్రులను ఎందుకు విచారించడం లేదు?

Written By ysrcongress on Saturday, February 4, 2012 | 2/04/2012


ముఖ్యమంత్రితో భేటీ అయిన 60 మందికిపైగా ఐఏఎస్‌లు
తమను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ సీబీఐ వేధిస్తోందని ఆగ్రహం
కేబినెట్ నిర్ణయాలను అమలు చేస్తే మమ్మల్నెలా తప్పుబడతారని ప్రశ్న

కేబినెట్ నిర్ణయాలు అమలు చేయడమే మా బాధ్యత.. మరి మంత్రులను ఎందుకు విచారించడం లేదు?
దర్యాప్తు జరుగుతున్న ఆ ప్రాజెక్టులను రద్దయినా చేయండి లేదా సమర్థించండి
సీఎంకు తేల్చిచెప్పిన ఐఏఎస్ అధికారులు... ఈ పరిణామం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయో తెలియకుండానే సీబీఐ దర్యాప్తు సాగుతోంది..
పీపీపీ విధానంపై కూడా సీబీఐకి కనీస అవగాహన లేనట్టుగా ఉంది
విచారణల పేరుతో పిలిస్తే.. పత్రికల్లో ఫొటోలు వస్తే.. మా కుటుంబసభ్యులు బాధపడరా?
సీనియర్ అధికారులను విచారించేటప్పుడు గౌరవమర్యాదలుండాలి.. ఇక్కడవేమీ జరగడం లేదు
అధికారులను న్యాయపరంగా ప్రభుత్వమే బలపరచాలి.. మొత్తం ఆరు డిమాండ్లతో కిరణ్‌కు వినతిపత్రం
తక్షణం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి.. సరిగా స్పందించని సీఎం కిరణ్!
అరెస్టు చేయడం అంటే శిక్ష కాదని, బెయిల్ తీసుకోవచ్చునని ముఖ్యమంత్రి వ్యాఖ్యానం!
ఐఏఎస్ అధికారుల సంఘం అసంతృప్తి.. రేపు జనరల్ బాడీలో భవిష్యత్ కార్యాచరణ 

సహాయ నిరాకరణ, సామూహిక సెలవు యోచన!

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి సీబీఐ దర్యాపు చేస్తున్న తీరుపై ఐఏఎస్‌ల సంఘం తీవ్రంగా మండిపడింది. కీలక నిర్ణయాలు చేసే మంత్రులను, మంత్రివర్గాన్ని వదిలేసి అధికారులను బలిపశువులను చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తున్న తీరు, విచారణల పేరుతో వారి కుటుంబాలను మనోవేదనకు గురిచేస్తున్న తీరును నిరసించింది. ‘‘సీబీఐ విచారిస్తున్న కేసుల్లోని ప్రాజెక్టులను రద్దు చేయండి... లేదంటే ఆ ప్రాజెక్టుల నిర్ణయాలను సమర్థించండి...’’ అంటూ ఐఏఎస్‌ల సంఘం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అల్టిమేటం ఇచ్చింది. సీబీఐ విచారణలో ఉన్న ఎస్‌ఈజెడ్‌లు, పోర్టుల ఏర్పాటు, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, గనుల కేటాయింపులతో పాటు మరికొన్ని పరిశ్రమలకు కేటాయించిన భూములను రద్దు చేయాలని, లేదంటే సమర్థించాలని స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు పేరుతో అధికారులను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం ఐఏఎస్‌ల సంఘం కార్యవర్గం సమావేశమై సీబీఐ దర్యాపు తీరుతెన్నులు, మంత్రులను వదిలేసి అధికారులనే టార్గెట్ చేస్తున్న తీరుపై సుదీర్ఘంగా చర్చించింది. సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో దాదాపు 60 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి తో సమావేశమై సీబీఐ దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌ల సంఘం ఆరు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించింది. సీబీఐ దర్యాప్తు తీరు.. అధికారులను ఏ విధంగా బలిపశువులను చే స్తున్నారు, అధికారులు కేబినెట్ నిర్ణయాలను అమలు చేస్తే వారిని ఏ విధంగా తప్పుపడతారనే విషయాలపై గంటకు పైగా సీఎంకు వివరించింది. సీబీఐపై ఐఏఎస్‌ల సంఘం నిరసన గళం విప్పడం, ఏకంగా సీఎంను కలిసి ఫిర్యాదు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. 


‘అధికారుల పాత్ర ఉంటే వెంటనే అరెస్ట్ చేయమనండి. ఇలా విచారణల పేరుతో పిలవడమేంటి? పత్రికల్లో ఫొటోలు రావడం ఏమిటి? మాకు కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఉండరా? వారెంత మనోవేదనకు గురవుతారు? బిజినెస్ రూల్స్ ప్రకారమే ప్రభుత్వంలో అన్నీ జరుగుతాయి. కేబినెట్ నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తారు. అలాంటిది కేబినెట్‌ను వదిలేసి సీబీఐ.. అధికారులను టార్గెట్ చేయడంలోని ఆంతర్యం ఏమిటి’ అని పలువురు ఐఏఎస్‌లు సీఎంను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటుందని, ప్రజా తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని, ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా సీబీఐ విచారణ జరుగుతోందని వివరించారు. బిజినెస్ రూల్స్ ఎలా ఉంటాయో కూడా అవగాహన లేకుండా సీబీఐ దర్యాప్తు సాగుతోందని వారు పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టులు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకేనని.. సీబీఐ తీరు చూస్తుంటే దీనిపై కూడా అవగాహన లేనట్టుగా ఉందనిచెప్పారు. సీఎంను కలిసిన అనంతరం ఐఏఎస్‌ల సంఘం ఉపాధ్యక్షుడు ప్రశాంత మహాపాత్ర మీడియాతో మాట్లాడారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ కేవలం అధికారులనే వేధిస్తోందన్నారు. ‘సీనియర్ అధికారులను సాక్షిగా విచారిస్తున్నారు. విచారణ తీరులో కూడా సరైన గౌరవ మర్యాదలుండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి, ఇవేవీ ఇక్కడ జరగడం లేదు’ అని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఏ విధంగా పనిచేయగలరని ప్రశ్నించారు. వెంటనే జోక్యం చేసుకుని అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరామని, పరిశీలిస్తామని సీఎం చెప్పారని మహాపాత్ర వివరించారు. 

సరిగా స్పందించని సీఎం! 

తమ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించిన తీరు ఐఏఎస్‌లను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు సాగుతున్న తీరుపై ఐఏఎస్‌లు ఫిర్యాదు చేసినప్పుడు... అరెస్ట్ చేయడమంటే శిక్షకాదని, బెయిల్ తీసుకోవచ్చునని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తప్పు చేయని అధికారులకు అన్యాయం జరగనీయబోమని పేర్కొన్నట్లు సమాచారం. కేబినెట్ నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తున్నారని, ఆ నిర్ణయాలు తప్పంటే రద్దు చేయాలని ఐఏఎస్‌లు కోరడంపై సీఎం స్పందిస్తూ న్యాయపరమైన సలహా తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిసింది. సీఎం స్పందన పట్ల అసంతృప్తితో ఉన్న ఐఏఎస్ అధికారుల సంఘం ఆదివారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.

సహాయ నిరాకరణ...సామూహిక సెలవు! 

సీఎం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో తమ నిరసనను ఉధృతం చేయాలని ఐఏఎస్‌లు భావిస్తున్నట్టు సమాచారం. సర్వీసులో ఎంతోకాలంగా కాపాడుకున్న పరుపు ప్రతిష్టలను మంటగలుపుతున్న సీబీఐ విషయంలో ముఖ్యమంత్రి నుంచి కనీస మద్దతు లభించకపోవడంతో.. అవసరమైతే సహాయ నిరాకరణకు దిగాలన్న ఆలోచనలో ఐఏఎస్‌ల సంఘం ఉన్నట్టు సమాచారం. సామూహికంగా క్యాజువల్ సెలవు పెట్టాలనే యోచనలో కూడా ఐఏఎస్‌ల సంఘం ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయాలపై ఆదివారం జరిగే సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం తమకు సహకరించనప్పుడు మంత్రులు చెప్పే పనులకు తామెందుకు సహకరించాలని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

సుప్రీం తీర్పే ఆదర్శంగా...

సీబీఐ విచారణ చేస్తున్న 2 జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో 122 లెసైన్సులను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. ఆ తీర్పును స్ఫూర్తిగా చేసుకునే ఐఏఎస్‌లు ‘ప్రాజెక్టులను రద్దు చేయండి లేదా సమర్థించండి’ అంటూ సీఎంను డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలన్నీ తమ వల్లే జరిగినట్టుగా సీబీఐ చిత్రీకరించడంపై ఐఏఎస్‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు ఒప్పందాలు, ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు జరిగినట్టుగా సీబీఐ భావిస్తున్నందున వీటిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావలసిన అవసరం ఉందని వారంటున్నారు. 

సీఎంను కలిసిన వారిలో సీనియర్ ఐఏఎస్‌లు

సీఎంను కలిసినవారిలో సీనియర్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, వసుధా మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా, కృష్ణయ్య, ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆదిత్యనాథ్ దాస్, అజయ్ మిశ్రా, పూనమ్ మాలకొండయ్య, అజయ్ జైన్, మహాపాత్ర, వినయ్‌కుమార్, శేఖర్‌బాబు, కృష్ణబాబు, శాలినీమిశ్రా, వినోద్‌కుమార్ అగర్వాల్, రేమాండ్ పీటర్, గుల్జార్, సునీల్‌శర్మ, పీషీ జోషి, ప్రవీణ్‌ప్రకాశ్, శ్యాంబాబు, జయలక్ష్మి, రాజేశ్వర్ తివారీ, సీవీఎస్‌కే శర్మ, శామ్యూల్, విజయకుమార్, అనంతరాము, నీరబ్ కుమార్ ప్రసాద్, ఎంజీ గోపాల్, నవీన్ మిట్టల్, చంద్రవదన్, కాడ్మియల్, శివశంకర్, హీరాలాల్ సమారియా, రమేష్‌కుమార్ తదితరులు ఉన్నారు. 

ఐఏఎస్‌ల ఆరు డిమాండ్లు... 

* ప్రభుత్వం తీసుకున్న కీలకమైన ఆర్థిక అంశాలతో కూడిన నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నిర్ణయాలు సంబంధిత రాజకీయ నిర్వాహకులకు తెలియకుండా తీసుకున్నవి కాదు. సంబంధిత మంత్రులను కాదని అధికారులు ఏ నిర్ణయాలూ తీసుకుని అమలు చేయలేరు. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మంత్రిమండలి, మంత్రుల ఆమోదంతోనే అమలు చేశాం. వారికి తెలియకుండా ఏదీ చేయలేదు. అయినప్పటికీ సీబీఐ రాజకీయ నేతలను వదిలిపెట్టి.. అధికారులనే బలిపశువులను చేస్తోంది.

* ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో అక్రమాలు జరిగాయని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ నిర్ణయాలకు సంబంధించిన పత్రాలను ప్రాసెస్ చేసిన అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే అక్రమ నిర్ణయాలని భావిస్తున్న సంబంధిత ప్రతిపాదనలను మాత్రం ఇప్పటివరకు వెనక్కు తీసుకోలేదు. అక్రమం అంటున్న నిర్ణయాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు.. ఇంకా లబ్ధి పొందుతూనే ఉన్నారు. కానీ ఆ పత్రాలను ప్రాసెస్ చేసిన ఐఏఎస్ అధికారులను నేర విచారణ, ప్రాసిక్యూషన్‌లతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక పక్క అక్రమం అంటూ దర్యాప్తు చేస్తున్న నిర్ణయాలనే అమలు చేస్తూ ఉండటం తగదు. ప్రభుత్వం అత్యవసరంగా వాటిని సమీక్షించి ఆ నిర్ణయాలను రద్దు చేయడమో లేదా వాటిని సమర్థించడమో చేయాలి.

*విధి నిర్వహణలో భాగంగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు ఇప్పుడు నేర విచారణ ఎదుర్కొంటున్నారు. అటువంటి వారిని ప్రభుత్వమే న్యాయపరంగా బలపరచాలి. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగంగానే అధికారులు పని చేసినందున న్యాయసేవల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి.

ఐఏఎస్ అధికారులపై నేర విచారణ చేయడానికి ముందు వారు పనిచేస్తున్న ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందిగా సీబీఐకి సూచించాలి. ప్రాసిక్యూషన్‌కు ముందే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్, కేంద్ర ప్రభుత్వం అనుమతులను అదనంగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక అనుమతి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదు. 

* సీబీఐ విచారణ బృందంలో బిజినెస్ రూల్స్, ప్రభుత్వం ఏ విధంగా విధాన నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాలు తెలిసిన అనుభవ జ్ఞులైన అధికారులను సభ్యులుగా చేర్చాలి. ఆ నిర్ణయాల్లో అధికారులకు ఉన్న దురుద్దేశాలు, వారి పాత్ర ఎంతవరకు ఉందనే విషయాల ఆధారంగా క్రమశిక్షణ లేదా కఠిన చర్యలను విభజించాలి. 

* సాక్షులుగా మంత్రులను వారి ఇళ్లకు వెళ్లి సీబీఐ గౌరవంగా ఎలా విచారిస్తోందో.. అదే తరహాలోనే సీనియర్ అధికారులను, సంబంధిత అధికారులను వారి చాంబర్లలోనే విచారించాలి.
Share this article :

0 comments: