ఏ ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం కొనసాగాలని అనుకోవడం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం కొనసాగాలని అనుకోవడం లేదు

ఏ ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం కొనసాగాలని అనుకోవడం లేదు

Written By ysrcongress on Tuesday, February 7, 2012 | 2/07/2012

 ‘‘రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం కొనసాగాలని అనుకోవడం లేదు. రైతులపై, రైతు కూలీలపై, పేదలపై దయలేని ఈ సర్కారు ఎప్పుడెప్పుడు బంగాళాఖాతంలో పడిపోతుందా అని అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నోటా ఇదే మాట వినపడుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక.. రాష్ట్రంలో ఆయనలా ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే కనిపించకుండా పోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ జిల్లాలో రెండోరోజు రోడ్డుషోలో భాగంగా సోమవారం సాయంత్రం సత్యవరంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘వైఎస్ కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ వైఎస్‌లా ఆలోచన చేయలేదు. వైఎస్ వచ్చాకే కాలువల్లో నీళ్లు కనబడ్డాయి. ఇప్పుడు రైతు ముఖాన కన్నీళ్లే కనబడుతున్నాయి’’ అని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

సానుభూతి లేని సర్కారిది

ఇవాళ చేతికొచ్చిన వరి పంట కోయాలంటేనే రైతు భయపడుతున్నాడు. బస్తా వడ్లు రూ.750కు కూడా అమ్ముడుపోవడం లేదని ఆవేదన చెందుతున్నాడు. టన్నుకు రూ.1,800 కూడా రాని దుస్థితిలో చెరకు రైతన్న ఉన్నాడు. పసుపు రైతు పరిస్థితీ అంతే. ఎకరానికి లక్షా 20 వేల రూపాయలు పెట్టుబడి పెడితే వర్షాల్లేక 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. క్వింటాలును నాలుగు వేలకు కూడా అమ్ముకోలేక ఎకరానికి 60-70 వేల రూపాయలు నష్టపోతున్నాడు. పత్తి రైతు పరిస్థితి ఇంకా ఘోరం. క్వింటాలు రూ.3,500 కూడా దక్కడం లేదు. మిర్చి రైతుకు దిగుబడి దారుణంగా తగ్గిపోయి క్వింటాలుకు కనీసం ఐదారు వేలు కూడా రాని పరిస్థితి. ఇక కూలి చేసుకుంటున్న అక్కా చెల్లెమ్మలదీ అదే పరిస్థితి. వారు తమకు రోజుకు 50-70 రూపాయలకు మించి రావడం లేదంటున్నారు. ఒక అవ్వయితే ‘రైతన్నల పరిస్థితే బాగులేదు.. ఇక మాకేమిస్తారన్నా అంటూ’ రైతన్నలపై సానుభూతి చూపింది. తోటి కూలీలకు రైతన్నలపై సానుభూతి కలుగుతోందికానీ.. సానుభూతి చూపించాల్సిన సర్కారు మాత్రం వీరిని గాలికొదిలేసింది.

హాల్‌టికెట్లు ఇవ్వబోమంటే వారి గతేంకావాలి?

రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థి పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. విద్యా సంవత్సరం ముగిసిపోతోంది. మరో పది రోజుల్లో కొత్త బడ్జెట్ పెట్టే పరిస్థితి. పిల్లలకేమో తుది పరీక్షలు దగ్గరపడుతున్నాయి. సర్కారు మాత్రం ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదు. సర్కారుగాని, పిల్లలుగాని మా డబ్బులు కడితేనే పరీక్షలు రాయడానికి హాల్‌టికెట్లిస్తామని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే పిల్లల బతుకులు ఏమవుతాయన్న ఆలోచన కూడా చేయని ఈ పాలకులను చూస్తుంటే బాధనిపిస్తోంది. మరికొన్నాళ్లలో కొత్త బడ్జెట్ వస్తున్నా ప్రభుత్వం ఈ ఏడాది ఫీజు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం దారుణం. దివంగత నేత వైఎస్ బతికుంటే ఈ పరిస్థితి ఉండేదా అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.

వచ్చే ఎన్నికల్లోనూ కుమ్మక్కు..

ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్షం, అధికార పక్షం కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న చంద్రబాబునాయుడు అవిశ్వాసం పెట్టింది కూడా నన్ను, నాకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడదామనే. అయితే ఈ కుళ్లు, కుతంత్రాల రాజకీయాల్లో విలువలకు, విశ్వసనీయతకు నిదర్శనంగా నిలబడాలన్న నా మాటకు కట్టుబడి 17 మంది ఎమ్మెల్యేలు తమ పదవుల త్యాగానికి సైతం సిద్ధమయ్యారు. వారందరికీ సగర్వంగా సెల్యూట్ చేస్తున్నాను. ఆ 17 మందిలో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు కూడా ఒకరు. బాబూరావు చూపినకలేజా చాలా మందిలో అరుదుగా ఉంటుంది. 

ఆయనను చూసి గర్వపడుతున్నా. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు మళ్లీ ఒక్కటయ్యి రాజకీయాలు చేస్తాయి. మంత్రులొస్తారు... కుల, మతాల చిచ్చుపెట్టి.. అనురాగాలను, ఆప్యాయతలను వేలం వేసి కొనాలని చూస్తారు. పోలీసులొస్తారు... కార్యకర్తలపై కేసులు పెడతారు. దౌర్జన్యాలకు దిగుతారు. అయితే ఆ ఎన్నికల్లో ఒకవైపు కుళ్లు, కుతంత్రాల రాజకీయాలు.. మరోవైపు రైతులు, రైతు కూలీలు నిలబడి పోటీ పడుతున్నారన్న సంగతి గుర్తుంచుకుని ప్రజలు ఓటేయాలి.
Share this article :

0 comments: