CM Kiran Plan Workout - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » CM Kiran Plan Workout

CM Kiran Plan Workout

Written By ysrcongress on Friday, February 17, 2012 | 2/17/2012

*17 స్థానాల్లో ఉప ఎన్నికలు రాకుండా చేయడంలో సక్సెస్
* వాటికి ఎన్నికలు నిర్వహిస్తే డిపాజిట్లు గల్లంతవుతాయన్న దడ
* నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై నిర్ణయం
* ఎన్నికల వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయిన పార్టీలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ఆశించినట్టే జరిగింది. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు రాకూడదని గట్టిగా కోరుకున్న ఆ పార్టీ కల నెరవేరింది. రాష్ట్రంలోని ఏడు (కోవూరు, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, స్టేషన్‌ఘన్‌పూర్, కొల్లాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి) నియోకజవర్గాలకు మాత్రమే ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై ఇక వేటు వేసినా ఇప్పట్లో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు రావన్న ధీమా కాంగ్రెస్ పెద్దల్లో వ్యక్తమవుతోంది. తద్వారా మరికొంతకాలం ఎన్నికల్లేకుండా కాలం నెట్టుకురావచ్చని భావిస్తున్నారు.

ఏడు స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వెంటనే 17 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే అలా చేస్తే.. వచ్చే ఉప ఎన్నికలను ఎదుర్కొనే సాహసం చేయలేక వెనుకంజ వేశారు. ఒకవేళ ఆయా స్థానాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతవుతాయని ముందస్తు సర్వేలు వెల్లడించడమే అందుకు కారణమని చెబుతున్నారు.

మహబూబ్‌నగర్‌పై నిర్ణయించని టీఆర్‌ఎస్..
ప్రస్తుత ఉప ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలకు టీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. నాగర్‌కర్నూలులో తెలంగాణ ఎజెండాగా రాజీనామా చేసిన నాగం జనార్దనరెడ్డికే టీఆర్‌ఎస్ మద్దతునిచ్చే అవకాశం ఉంది. టీడీపీకి రాజీనామా చేసిన జోగు రామన్న (ఆదిలాబాద్), గంపా గోవర్ధన్ (కామారెడ్డి).. ఆ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయనున్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ మోసపూరిత తీరును నిరసిస్తూ జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రి పదవికి, ఆ తర్వాత కొంతకాలానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కే చెందిన ఎమ్మెల్యే టి.రాజయ్య (స్టేషన్ ఘన్‌పూర్) కూడా రాజీనామా చేశారు.

మహబూబ్‌నగర్‌లో మాత్రం రాజేశ్వర్‌రెడ్డి అకాలమరణం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంపై పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో పోటీచేయడానికి బీజేపీ సమాయత్తమవుతోంది. అదే పార్లమెంటు స్థానానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేఏసీలో బీజేపీ, టీఆర్‌ఎస్ కీలక భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రెండుపార్టీల అభ్యర్థులు పోటీచేస్తే తెలంగాణ అనుకూల ఓట్లు చీలిపోతాయి. ఈ రెండు పార్టీల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై జేఏసీ కూడా సంశయంలోనే ఉంది. తెలంగాణవాద ఓటు చీలితే కాంగ్రెస్ లేదా టీడీపీ లాభపడే అవకాశాలున్నాయని, తెలంగాణ వాదుల మధ్య విభేదాలు రావొచ్చని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకని బీజేపీ, టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు కూర్చుని మహబూబ్‌నగర్ స్థానంపై ఏకాభిప్రాయానికి రావాలని సూచిస్తున్నారు.

టీడీపీ అభ్యర్థులు వీరే..
ఉప ఎన్నిక ల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను రెండు మూడు రోజుల్లో ప్రకటించాలని టీడీపీ భావిస్తోంది. ఈ నియోజకవర్గాల నుంచి పోటీచేసేవారిని అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. సీఆర్ జగదీశ్వరరావు (కొల్లాపూర్), సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (కోవూరు), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), మెట్టు వేణుగోపాల్ (కామారెడ్డి), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), మర్రి జనార్దనరెడ్డి (నాగర్‌క ర్నూల్), పొడపాటి చంద్రశేఖర్ (మహబూబ్‌నగర్) పోటీ చేయనున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం, వరంగల్ జిల్లాలో ఇటీవలి పోరుయాత్ర వంటి అంశాలు ఉప ఎన్నికలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో ఆ పార్టీ నేతలున్నారు.

అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు...
ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా అభ్యర్థుల జాబితా ప్రకటించాలన్న యోచనలో కాంగ్రెస్ ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లేనని జిల్లా నేతలు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మిని పోటీకి దింపాలని భావిస్తోంది. కొల్లాపూర్ నుంచి మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి పేర్లు విన్పిస్తుండగా చిన్నారెడ్డి పేరును మంత్రి డీకే అరుణ వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరుడైన చిన్నారెడ్డి అభ్యర్థిత్వంపట్ల సీఎం కూడా సుముఖంగా లేరని తెలుస్తోంది. అయితే బొత్స మద్దతున్న చిన్నారెడ్డి ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌లో పార్టీ అభ్యర్థిగా దామోదర్‌రెడ్డి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. స్థానిక నేత దిలీప్ పేరు కూడా విన్పిస్తున్నప్పటికీ డీకే అరుణ... దామోదర్‌రెడ్డికే ఇవ్వాలని పట్టుపడుతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ విషయానికొస్తే డాక్టర్ ఆరోగ్యం, రాజారపు ప్రతాప్‌లలో ప్రతాప్ పేరే ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కామారెడ్డి అభ్యర్థిగా షబ్బీర్‌అలీ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పోటీచేసే ప్రసక్తే లేదని షబ్బీర్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన సూచించే వ్యక్తికే టికెట్ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు దాదాపుగా ఖాయమైంది.

22, 26ల్లో సీఎం మహబూబ్‌నగర్ పర్యటన
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 22, 26 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉప ఎన్నికలు జరగనున్న మూడు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 22న కొల్లాపూర్‌లో పర్యటించి పార్టీ సభల్లో ప్రసంగిస్తారు. 26న నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగ ర్‌లలో పర్యటిస్తారు.

Share this article :

0 comments: