17 స్థానాలకూ ఉప ఎన్నికలు రాకుండా ఇంత కాలం తాత్సారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 17 స్థానాలకూ ఉప ఎన్నికలు రాకుండా ఇంత కాలం తాత్సారం

17 స్థానాలకూ ఉప ఎన్నికలు రాకుండా ఇంత కాలం తాత్సారం

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012

అంతా కాంగ్రెస్ కనుసన్నల్లోనే...
స్పీకర్ సమక్షంలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసినా అనర్హతపై జాప్యం
వేటుకు అభ్యర్థించినా, వైఎస్సార్ కాంగ్రెస్ కండువాలతో అసెంబ్లీకొచ్చినా తాత్సారం
ఇప్పటివరకూ దింపుడు కల్లం ఆశలతో నెట్టుకొచ్చిన కాంగ్రెస్ నాయకత్వం 
17 స్థానాల్లో ఉప ఎన్నికలకు భయపడి ఇంతకాలం సాగదీసిన వైనం 
తెలంగాణ ప్రాంత ఉపఎన్నికలతో కలిసి రాకుండా జాగ్రత్తలు 
ఏడు స్థానాల నోటిఫికేషన్ తరువాత నిర్ణయం వెలువడేలా పథకం 
ఇంకా ఆలస్యం చేద్దామనుకున్నా అడ్డొచ్చిన రాజ్యసభ ఎన్నికలు 
ఆ ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో విధిలేక అనర్హత నిర్ణయం ప్రకటన
అసెంబ్లీలో సీఎం వెల్లడించిన మరునాడే అనర్హత నిర్ణయం ప్రకటించిన స్పీకర్
స్పీకర్ నిర్ణయంపై వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల హర్షం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతుల సమస్యలను గాలికొదిలేసిన సర్కారు తీరుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో.. ఆద్యంతం కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్‌లోనే కథను నడిపించిన పెద్దలు ఎట్టకేలకు దానికి ముగింపు పలికారు. 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల విషయంలో అంతా ఊహించినట్లే.. ప్రజలందరూ అనుమానించినట్లే జరిగింది. మాజీ మంత్రి శంకర్రావు లేఖ ఆధారంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేయటం, ఎఫ్‌ఐఆర్‌లో దివంగత వై.ఎస్. పేరును చేర్చటం మొదలు.. దేనికైనా తెగించినట్లు వ్యవహరించిన కాంగ్రెస్ నాయకత్వం.. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వంపై అసెంబ్లీ సాక్షిగా ‘అవిశ్వాసం’ ప్రకటించటంతో ఖంగుతిన్నది. విప్‌ను ధిక్కరించిన వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయటానికి కూడా వారం రోజుల సమయం తీసుకుంది. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా.. అనర్హతపై నిర్ణయం తీసుకోకుండా దింపుడు కళ్లం ఆశతో ఇన్నాళ్లూ సాగదీస్తూ వచ్చింది. ఆ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినా.. తాము విప్‌ను ధిక్కరించామని, తమను అనర్హులుగా ప్రకటించాలని వారంతా స్పీకర్‌ను బహిరంగంగానూ, వ్యక్తిగతంగానూ కోరినా.. చివరికి తమను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ ఆ పార్టీ కండువాలతో అసెంబ్లీకి హాజరైనా కూడా నిర్ణయం తీసుకోలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు.. వారి మనసు మారా వచ్చు.. అని కాంగ్రెస్ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. వారిని లొంగదీసుకునేందుకు సామ దాన బేధ దండోపాయాలనూ ప్రయోగించారు. వారిలో గందరగోళం సృష్టించేందుకు అనేక రకాల దుష్ర్పచారాలకూ తెరతీశారు. అయినా వారి ఆశలు ఫలించలేదు.
ఇతరత్రా కారణాలతో ఖాళీ అయిన ఏడు నియోజకవర్గాలతో కలిసి వారి 17 స్థానాలకూ ఉప ఎన్నికలు రాకుండా ఇంత కాలం తాత్సారం చేసింది. అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలను, వాటి ప్రభావాన్ని ఊహించుకుని భయపడుతూ నిర్ణయం ప్రకటించకుండా ఉంది. కానీ.. రాజ్యసభ స్థానాలకు అతి త్వరలో ఎన్నికలు రానుండటం వంటి కారణాలతో.. ఇక వేటు వేయక తప్పలేదు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు ప్రకటించగా ఒక ఎమ్మెల్యే సమర్పించిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో రూపొందిన కథ, స్క్రీన్‌ప్లే ప్రకారం సాగిన అనర్హత విచారణకు తెరపడినట్లయింది.

ఎన్నెన్ని కుట్రలో... 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తెరవెనుక నుంచి అనేక కుయుక్తులు పన్నారు. దివంగత మహానేత వైఎస్, ఆయన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయటానికి చేయని ప్రయత్నమంటూ లేదు. సీబీఐ విచారణ పేరిట సాగిన తంతులో మహానేత పేరును ఉద్దేశపూర్వకంగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించి కాంగ్రెస్ తెరవెనుక రాజకీయ డ్రామాకు తెరలేపింది. సీబీఐ వేసిన కేసులకు సంబంధించి ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్నతన్యాయ స్థానం పలుమార్లు ఆదేశాలు జారీచేసినా సర్కారు పెద్దలు మౌనం దాల్చారు. కేసు విచారణ సమయంలో న్యాయస్థానంలో హాజరు కావలసిన అడ్వొకేట్ జనరల్ కూడా ఆ దరిదాపులకూ వెళ్లలేదు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లుగా కాంగ్రెస్‌లోనే విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్‌ఆర్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా ఆయన అభిమాన ఎమ్మెల్యేలు స్పీకర్‌కు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. ఈ రాజీనామాలన్నిటినీ భావోద్వేగాల నేపథ్యంలో చేసినవిగా ప్రకటిస్తూ స్పీకర్ వాటిని తిరస్కరించారు. 

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు కూడా అందించారు. అప్పట్నుంచి పార్టీ ఎమ్మెల్యేలు జగన్ వెంట వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అనేకరకాల ప్రలోభాలకు తెరతీశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో పదవులు సహా అనేక ఆశలు ఎరచూపారు. కొంతమందిని నయానో భయానో లొంగ దీసుకొనే ప్రయత్నాలూ చేశారు. జగన్‌కు ప్రజల్లో ఆదరణ లేదని పార్టీలోని ఎమ్మెల్యేల్లో దురభిప్రాయం కల్పించేందుకు టీడీపీతో కుమ్మక్కై అనేక తెరవెనుక వ్యూహాలను నడిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో టీడీపీతో కలసి వైఎస్ అభిమాన అభ్యర్థులను ఓడించేందుకు ఆ రెండు పార్టీలూ శతథా ప్రయత్నించాయి. ఎన్ని ప్రయత్నాలు సాగించినా వైఎస్ పేరుతో బరిలోకి దిగిన అభ్యర్థులు విజయపథాన నిలిచి కాంగ్రెస్, టీడీపీలకు షాక్ ఇచ్చారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు జగన్ వైపే మొగ్గుచూపుతుండటం పార్టీ అధిష్టానానికీ మింగుడుపడనిదిగా మారింది. ప్రభుత్వం వైఎస్ ఆశయాలను విస్మరించి ఆయన ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కేప్రయత్నమూ కాంగ్రెస్ నేతలు చేశారు. దీనికి నిరసనగా వైఎస్ జగన్ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు భాగస్వాములు అయ్యారు. 

చిరంజీవిని కలుపుకుని... 

వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందన్న భయంతో కాంగ్రెస్ పెద్దలు.. చివరకు ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవికి తాయిలాలు ఆశచూపి తమవైపు తిప్పుకున్నారు. అప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా టీడీపీ కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా సహకారం అందిస్తూ వచ్చింది. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసినా అవిశ్వాసం పెట్టాలన్న డిమాండ్లు వచ్చినా తప్పించుకుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సవాల్‌తో తీర్మానాన్ని ప్రతిపాదించింది. చిరంజీవి వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో కలవటంతో అవిశ్వాసం పెట్టినా.. ప్రభుత్వానికి ముప్పు ఉండదన్న అభిప్రాయానికి వచ్చాకనే చంద్రబాబు అవిశ్వాసానికి తెరతీశారు. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు రైతు సంక్షేమం దృష్ట్యా ఈ అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని విస్మరించి రైతు వ్యతిరేకిగా మారినందుకే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. వీరిని అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలు అనేక ప్రయత్నాలు సాగించినా ఎమ్మెల్యేలెవరూ లొంగలేదు. కొందరు ఎమ్మెల్యేలకు భారీ ఆశలు చూపి ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా చేయబోయారు. చివరకు కిరణ్ తన సొంత జిల్లాకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యేను ఓటింగ్‌కు రాకుండా చూసుకోగలిగారు. అవిశ్వాసానికి మద్దతు పలికితే సభలోనే అనర్హత వేటు పడుతుందనీ ఎమ్మెల్యేలను భయపెట్టినా 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంపై ఓటు వేశారు. 

పరాజయ భయం... 

ఇన్ని ప్రయత్నాలు సాగించినా చివరకు కాంగ్రెస్‌కు దిమ్మతిరిగింది. ఉప ఎన్నికలు వస్తే ఘోర పరాజయం తప్పదన్న భయం ఆ పార్టీకి పట్టుకుంది. ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు ఇవ్వటానికే పది రోజులు సమయం తీసుకుంది. ఫిర్యాదు ఇవ్వకున్నా పరువుపోతుందన్న భయంతో చివరకు స్పీకర్‌కు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా అనర్హత ఫిర్యాదులు ఇచ్చింది. వాటిపై కూడా స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోకుండా తెరవెనుక డ్రామాను నడిపించింది. నెల తరువాత స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వాటికి ఎమ్మెల్యేలు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. తనకు నోటీసులు అందకపోవ టంతో కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) అదే విషయాన్ని వివరించారు. శోభానాగిరెడ్డి తన వివరణతో పాటు రాజీనామా లేఖనూ అందించారు. స్పీకర్ సమక్షంలోనే అవిశ్వాసాన్ని ప్రకటించినందున తమపై వెంటనే వేటు వేయాలని కోరుతూ వారంతా లిఖితపూర్వకంగా లేఖలు అందజేశారు. అయినా స్పీకర్ వారిపై చర్యలు తీసుకునే బదులు న్యాయ ప్రక్రియ అంటూ కొత్త తతంగానికి తెరతీశారు. కోర్టుకు హాజరుకావాలని నోటీసులు పంపగా తాము ఇప్పటికే స్పష్టంచేసినందున రాలేమని, అనర్హత ప్రకటించాలని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రకటించారు. తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు కోవూరు ఎమ్మెల్యే రాజీనామాలు స్పీకర్ ఆమోదించినప్పటికీ.. ఆ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై నిర్ణయం వెలువరించకుండా కాంగ్రెస్ మోకాలడ్డుతూ వచ్చింది. చివరకు ఏడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా ఆలస్యం జరిగేలా ఎత్తుగడ వేసింది. 


ఇప్పట్లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పదన్న భయంతో వెనుకడుగు వేయించింది. కానీ త్వరలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగనుండటంతో నిర్ణయం ప్రకటించక తప్పలేదు. అనర్హతపై స్పీక ర్ నిర్ణయం ప్రకటించటానికి ముందు రోజు గురువారమే సీఎం అసెంబ్లీలో అనర్హత నిర్ణయంపై ప్రకటించటం గమనార్హం. శుక్రవారం అనర్హతపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు అసెంబ్లీలో చర్చించారు. ఢిల్లీ నేతలతోనూ సంప్రదింపులు చేపట్టారు. స్పీకర్ మీరాకుమార్ పర్యటనలో భాగంగా రాజ్‌భవన్‌కు రాగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమెతో చర్చించారు. ఆ తరువాత అనర్హత నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయంపై సదరు ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: