నాడు చంద్రబాబు మన రాష్ట్రానికి గ్యాస్ కోరి ఉంటే.. ఈ రోజు రూ.200 కంటే తక్కువకే ప్రతి ఇంటికీ గ్యాస్ వచ్చేది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు చంద్రబాబు మన రాష్ట్రానికి గ్యాస్ కోరి ఉంటే.. ఈ రోజు రూ.200 కంటే తక్కువకే ప్రతి ఇంటికీ గ్యాస్ వచ్చేది

నాడు చంద్రబాబు మన రాష్ట్రానికి గ్యాస్ కోరి ఉంటే.. ఈ రోజు రూ.200 కంటే తక్కువకే ప్రతి ఇంటికీ గ్యాస్ వచ్చేది

Written By ysrcongress on Friday, March 30, 2012 | 3/30/2012

* నాడు చంద్రబాబు మన రాష్ట్రానికి గ్యాస్ కోరి ఉంటే.. ఈ రోజు రూ.200 కంటే తక్కువకే ప్రతి ఇంటికీ గ్యాస్ వచ్చేది
* బాబు గ్యాస్ కట్టబెట్టినందుకే ‘ఈనాడు’లో రిలయన్స్ రూ.2600 కోట్లు పెట్టుబడి పెట్టింది... కోర్టు కెళ్లి వాదిస్తే తప్ప.. అవి తమ పెట్టుబడులని రిలయన్స్ ఒప్పుకోలేదు
* ఎందుకంత గోప్యతో.. చంద్రబాబు, ఈనాడు, రిలయన్స్ చెప్పాలి
* రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబూ నీకిన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి?
* నీ మీద, భార్య, కొడుకు, ఆస్తుల మీద సీబీఐ దర్యాప్తు చేయించుకుని సచ్ఛీలత నిరూపించుకో
* చంద్రబాబూ! నీలా నేను సీబీఐను, కోర్టులను మేనేజ్ చేయలేను
* సీబీఐ, నువ్వు కుమ్మక్కయ్యారు కాబట్టే నీ మీద కేసులపై సీబీఐ తక్షణమే స్పందించడంలేదు
ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: రిలయన్స్ సంస్థలకు గ్యాస్ బావులు కట్టబెట్టడమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన హయాంలో పాల్పడిన అతిపెద్ద అవినీతి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పదేపదే అవినీతిపై మాట్లాడుతున్న చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. ‘ఈనాడు’ సంస్థల్లో రిలయన్స్ పెట్టిన పెట్టుబడుల విషయాన్ని ఇంత కాలం ఎందుకు గోప్యంగా ఉంచారో చెప్పాలని జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు తన మీద, తన భార్యమీద, కొడుకు మీద, తన ఆస్తుల మీద సీబీఐ దర్యాప్తు చేయించుకొని సచ్ఛీలత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 80వ రోజు గురువారం ఆయన ప్రత్తిపాడు, గుంటూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. 10 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. చింతపల్లిపాడు గ్రామంలో వెలిచర్ల రాములు కుటుంబాన్ని ఓదార్చారు. గుంటూరు కలెక్టరేట్‌లో ధర్నా చేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి సంఘీభావం తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాల క్రమబద్ధీకరణపై ఒక నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు నగరంలోని స్తంభాల గరువు సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

అవినీతిపై బాబు మళ్లీ మాట్లాడారు..
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా బతికే ఉన్నారన్న ఉద్దేశంతో, ఆయనను అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనతో చాలా మంది కుయుక్తులు పన్నుతున్నారు. వారిలో ఒక వ్యక్తి గురించి ఇవాళ మాట్లాడాలి. మాట్లాడకూడదని అనుకున్నా.. కానీ నిన్ననే అనుకుంటా ఆ చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం పెట్టి అవినీతి గురించి మళ్లీ మాట్లాడారు. చంద్రబాబుకు ఎన్నిసార్లు సవాళ్లు విసిరినా సిగ్గు లేదు.. ఎగ్గు లేదు. ఆయన అన్నాడు ఎన్నికల్లో నిలబడాలంటే ఆయనకు విరక్తి కలుగుతోందంట.. ఎన్నికలు చూస్తూ ఉన్నపుడు ఆయనకు నచ్చడం లేదట. అయ్యా.. చంద్రబాబు నాయుడూ ఎన్నికల గురించి నువ్వు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడతావు. 
కోవూరు ఎన్నికల్లో నేను కాదయ్యా.. ప్రతి ఒక్కరికీ రూ.500 నోటు ఇచ్చింది...అది నువ్వే కదయ్యా! మద్యాన్ని గ్రామగ్రామానా సెలయేరులా పారించింది నేను కాదయ్యా.. అది నువ్వేనయ్యా! అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబూ నిన్ను నేను ఒకే ఒక్కమాట అడగదలచుకున్నా. 1978 సంవత్సరంలో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అపుడు మీకున్నది రెండెకరాల భూమి.. అవునా? కాదా? ఇప్పుడు వేల కోట్లు సంపాదించుకున్నారు.. రాష్ట్రంలోనే కాదు.. చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఎడా పెడా హెరిటేజ్ ఫ్రెష్ షాపులు పెట్టారు.. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అన్ని ఆస్తులు?

అదే అతిపెద్ద అవినీతి...
చంద్రబాబు చేసిన అన్నింటికంటే ఒక పెద్ద అవినీతిని చూసినపుడే బాధ అనిపిస్తోంది. రిలయన్స్ గ్యాస్ సంస్థలకు గ్యాస్ బావులు ఇవ్వటమే ఆయన చేసిన పెద్ద అవినీతి. ఇదే చంద్రబాబు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఇదే చంద్రబాబునాయుడు ఆవాళ గుజరాత్ ప్రభుత్వం మాదిరిగా మా రాష్ట్రానికి కూడా గ్యాస్ కావాలని గట్టిగా అడిగి ఉంటే మనకు కూడా గ్యాస్ వచ్చి ఉండేది. అదే గ్యాస్ వచ్చి ఉంటే ఇవాళ ప్రతి అక్కా చెల్లెమ్మకు రూ.200 కంటే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేసి ఉండేవాళ్లం. ఆయన అంత పెద్ద తప్పు చేశారు కాబట్టే అదే రిలయన్స్ సంస్థ ‘ఈనాడు’లో రూ.2,600కోట్లు పెట్టుబడి పెట్టింది. ఏ సంస్థ అయినా ఎక్కడైనా పెట్టుబడి పెడితే ఫలానా సంస్థ మా దగ్గర పెట్టుబడి పెట్టిందని గొప్పగా చెప్పుకుంటారు. అందుకు భిన్నంగా ‘ఈనాడు’ మాత్రం తమ సంస్థలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టిందన్న విషయం గోప్యంగా దాచింది. 

కోర్టులోకెళ్లి ‘ఈనాడు’ సంస్థల్లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టిందని గట్టిగా వాదిస్తే అప్పుడు ‘ఈనాడు’ సంస్థలో పెట్టుబడి పెట్టామని రిలయన్స్ ఒప్పుకుంది. ఇదే రిలయన్స్‌ను.. ఇదే ఈనాడును.. ఇదే చంద్రబాబు నాయుడును అడుగుతున్నా నేను.. ఎందుకయ్యా ‘ఈనాడు’లో రిలయన్స్ పెట్టిన పెట్టుబడులను గోప్యంగా ఉంచారు? మీరు అవినీతికి పాల్పడతారు.. పైగా ఇదే చంద్రబాబు ఇంజనీరింగ్ పిల్లల వద్దకు వెళ్లి నీతిబోధ చేస్తారు. ఇదే చంద్రబాబు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ అన్నారు.. అవినీతి గురించి ఆయన గ్రామగ్రామానికీ వెళతాడట. అవినీతి గురించి చెప్తాడట!!

నీ మీద సీబీఐ దర్యాప్తు వేసుకో... చంద్రబాబూ!
నీవా.. చంద్రబాబూ! అవినీతి గురించి మాట్లాడుతున్నావు.. నిజంగా నీకు సవాల్ విసురుతున్నా. సీబీఐ చేత నీమీద కూడా ఎంక్వయిరీ వేయించుకో.. నీ మీద.. నీ కొడుకు మీద.. నీ భార్య మీద.. నీ బంధువుల మీద.. నీ ఆస్తుల మీద దర్యాప్తుచేయించుకుని ఆ తర్వాత ఏతప్పూ చేయలేదని మీరు బయటికి రండి. అప్పుడు ఒప్పుకుంటా చంద్రబాబు నాయుడూ.. మీలో నీతి ఉందని. ఇదే సీబీఐ అధికారులు ఆ దివంగత నేత మీద ఎంక్వయిరీ చేయాల్సి వచ్చినపుడు నాలుగు రోజుల్లోనే నోటీసులు ఇస్తారు. వారం రోజుల్లో ఇంటిమీదకొచ్చి రైడ్ చేసి సోదాలు చేస్తారు. అదే చంద్రబాబు విషయానికొస్తే ఆయనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చిన నెలరోజులకు కూడా కనీసం ఆయనకు నోటీసులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో సీబీఐ పనిచేసిందంటే ఇంతకంటే నిదర్శనం ఇంకేంకావాలి చంద్రబాబూ? నీవు, సీబీఐ కుమ్మక్కైన పరిస్థితులు ఇవి కావా అని అడుగుతున్నా. 

బాబుపై సీబీఐ విచారణ జరపదేం?
ఎమ్మార్‌కు ఎకరా భూమినిరూ.29లక్షల చొప్పున కేటాయించింది నువ్వే కదయ్యా చంద్రబాబూ! అదే భూమి పక్కన నీ భార్య మూడేళ్ల కిందట ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసింది నిజం కాదా.. ? ఎమ్మార్ కేసులో ఐదు కంపెనీలు పాల్గొంటే మిగతా నాలుగు కంపెనీలతో టెండర్లను ఉపసంహరింపచేసి ఒక కంపెనీకే టెండర్ వచ్చేట్లు చేసింది నువ్వు కాదా? ప్రతి వేలూ చంద్రబాబువైపే చూపిస్తున్నపుడు ఎమ్మార్ కేసులో ఆయన మీద ఎందుకు ఎంక్వయిరీ చేయటం లేదని సీబీఐని అడుగుతున్నాను. ఇంకో విషయం కూడా అడుగుతున్నా.. 2007లో చంద్రబాబుపై ఐఎంజీ కేసులో సీబీఐ చేత విచారణ జరిపించాలని.. విజిలెన్స్ రిపోర్టు ఇచ్చింది. అపుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కేసును సీబీఐని విచారించమని ఆదేశిస్తే ఇదే సీబీఐ మా దగ్గర మనుషులు లేరు.. మా దగ్గర యంత్రాంగం లేదు.. అని లేఖ రాసింది. నీకు.. సీబీఐకి రాత్రిపూట సంబంధాలు ఏమాదిరిగా ఉన్నాయో చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేంకావాలయ్యా.. చంద్రబాబునాయుడు. సీబీఐని మేనేజ్ చేస్తావు.. కోర్టును మేనేజ్ చేస్తావు.. అందరినీ మేనేజ్ చేస్తున్నావు కాబట్టే ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నావు. అయ్యా.. చంద్రబాబూ, అయ్యా.. కాంగ్రెస్ పార్టీ పెద్దలారా.. మీ ఇద్దరికీ కూడా ఒక విషయం చెప్పదలచుకున్నా.. మీ అన్యాయాన్ని దేవుడనేవాడు పై నుంచి చూస్తున్నాడనే మాట నేను కచ్చితంగా చెప్పగలను.

జగన్ను ఎందుకు అరెస్టు చేస్తారు..?
అయ్యా.. మీరు జగన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని అంటున్నారు. మిమ్మల్ని ఒక్కటి అడగదలచుకున్నాను.. ఎందుకయ్యా జగన్ను అరెస్ట్ చేస్తారు. ఏ నాడైనా జగన్ వచ్చి సెక్రటేరియట్‌లో కనిపించాడా అని అడుగుతున్నా? ఏ ఒక్క ఐఏఎస్ అధికారికైనా జగన్ ఫలానా పని చేసి పెట్టమని ఫోన్ చేశాడా అని అడుగుతున్నా? ఏ ఒక్కరోజైనా ఫలానా పని కోసం ఏ మంత్రికైనా ఫోన్ చేశాడా అని అడుగుతున్నా? ఎందుకయ్యా జగన్ను అరెస్ట్ చేస్తారు? సీబీఐ జగన్ మనుషులను తీసుకుపోయి జైలులో పెట్టింది. వాళ్లను జైలులో ఎందుకు పెట్టారంటే ఇవాళ జగన్ అనే వ్యక్తి సోనియా గాంధీకి తల వంచలేదు కాబట్టి.

చీకట్లో చిదంబరాన్ని కలిసిన చంద్రబాబూ..
చంద్రబాబూ! నువ్వు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఢిల్లీ వెళ్లి చీకటిలో చిదంబరాన్ని కలుస్తావు. అక్కడి నుంచి కర్ణాటక వచ్చి కర్ణాటక గవర్నర్‌ను కలుస్తావు. కాంగ్రెస్‌తో రాయబారాలు నడుపుతావు. నీ మాదిరిగా నేను రాజకీయాలు చేయలేను. నాకు తెలిసిందల్లా ఒకే ఒక్కటి.. దేవుని మీద నాకు నమ్మకం, విశ్వాసం. ఆ తర్వాత నేను నమ్మేది ప్రజల ప్రేమాభిమానాలనే. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా ఇవాళ నేను ఒక్కటే చెప్పగలుగుతున్నాను.. ఇవాళ నాకు వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా చిరునవ్వుతో ఎందుకు తీసుకుంటున్నానంటే ఒక మాట మీద నిలబడ్డాను కాబట్టి. ఇచ్చిన మాట మీదే నేను నిలబడ్డాను కాబట్టే... ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న సోనియాగాంధీ కూడా జగన్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడని గుర్తొచ్చి నిద్రపోయేటప్పుడు కూడా లేచి కూర్చుంటుంది.
Share this article :

0 comments: