26 జీవోలపై ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 26 జీవోలపై ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు

26 జీవోలపై ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు

Written By ysrcongress on Saturday, March 31, 2012 | 3/31/2012


30 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ ఆదేశం
నేడు సీఎంతో మంత్రుల భేటీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇటీవల జారీచేసిన నోటీసులు.. ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్ అధికారులకు శుక్రవారం అందాయి. ఈ కేసుకు సంబంధించి 26 జీవోలపై మిమ్మల్ని ఎందుకు విచారించ కూడదో స్పష్టంచేయాల్సిందిగా సుప్రీంకోర్టు తన నోటీసుల్లో పేర్కొంది. ఇందుకు 30 రోజుల్లోగా సమాధానం చెప్పాలని వారిని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, జె. గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణ, అలాగే ఐఏఎస్ అధికారులు ఎస్.వి.ప్రసాద్, శ్రీలక్ష్మి, ఎం.శామ్యూల్, శ్యాంబాబు, ఆధిత్యనాథ్ దాస్, మన్మోహన్ సింగ్, సి.వి.ఎస్.కె. శర్మ, కె.రత్నప్రభ ఉన్నారు. 

జగన్ ఆస్తుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరపడం లేదని, 26 జీవోలు జారీ చేయడంలో ప్రమేయం ఉన్న ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌ల పేర్లను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోవడాన్ని సవాల్ చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది పి.సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మార్చి 12నజస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది సుధాకర్‌రెడ్డి పిటిషన్‌కు సుప్రీంకోర్టు ఒక పేజీ నోటీసును జత చేసి మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు వేర్వేరుగా వ్యక్తిగతంగా నోటీసులను పంపించింది. జీవోల జారీతో ప్రమేయం ఉన్న మంత్రులకు, ఐఏఎస్‌లకు పంపిన నోటీసుల్లో ఆయా జీవోల నంబర్లను పేర్కొంటూ మిమ్మల్ని ఎందుకు విచారించరాదంటూ అందులో ప్రశ్నించింది. 

సీఎంతో మంత్రులు, సీఎస్‌తో ఐఏఎస్‌ల భేటీ

సుప్రీంకోర్టు నోటీసుల విషయాన్ని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణలు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. నోటీసులు అందుకున్న ఐఏఎస్‌లు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి పరిస్థితిని వివరించారు. మంత్రులు, ఐఏఎస్‌ల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులైన అల్తాఫ్ అహ్మద్ లేదా ఎస్.ఎస్.ప్రసాద్‌లను ప్రభుత్వ వ్యయంతో నియమించేందుకు ఉద్దేశించిన ఫైలు ఇప్పటికే సీఎం దగ్గర ఉంది. దీనిపై నోటీసులందుకున్న మంత్రులందరూ శనివారం ముఖ్యమంత్రితో సమావేశమై చర్చించనున్నారు. అనంతరం సీనియర్ న్యాయవాది నియామకంపై శనివారం లేదంటే ఆదివారం సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎంతో సమావేశం అనంతరం మంత్రి కన్నా మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నోటీసులు అందిన విషయాన్ని నిర్ధారించారు. న్యాయనిపుణులతో సంప్రదించిన తరువాత ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలా..? లేదంటే వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలా..? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. 

వ్యక్తిగతంగానే సమాధానం: ఐఏఎస్‌లు

నోటీసులు అందుకున్న 8మంది ఐఏఎస్‌లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఢిల్లీలోని ప్రభుత్వ అడ్వొకేట్‌ను సంప్రదించి సుప్రీంకోర్టుకు సమాధానం పంపించాలని నిర్ణయించారు. వ్యక్తిగతంగానే సుప్రీంకోర్టుకు సమాధానం పంపించాలని ఐఏఎస్‌లు భావిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాల మేరకే జీవోలు జారీ చేసినందున ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ కార్యకలాపాలుగానే పరిగణించాలని, ఈ నేపథ్యంలో సుప్రీం నోటీసులు, కేసు విచారణలకయ్యే న్యాయపరమైన వ్యయాన్ని ప్రభుత్వమే భరించాల్సిందిగా ఐఏఎస్ అధికారుల సంఘం కోరిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: