రూ. 4 వేల కోట్ల బాదుడు! విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ. 4 వేల కోట్ల బాదుడు! విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్

రూ. 4 వేల కోట్ల బాదుడు! విద్యుత్ చార్జీల పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్

Written By ysrcongress on Friday, March 23, 2012 | 3/23/2012

* ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
* రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి భారీ బాదుడు
* గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50 పైసల నుంచి రూపాయి అదనపు భారం
* పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపైనా భారం
* టెలిస్కోపిక్ విధానం ఎత్తివేత
* 50 యూనిట్లు దాటితే గృహాలకు వాతలే
* బిల్లులు సకాలంలో కట్టకపోతే ఆలస్య రుసుం
* చార్జీల పెంపునకు రేపు సర్కారు ఆమోదముద్ర!
* అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ నెల 30న ఈఆర్‌సీ ఆదేశాలు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: షడ్రుచుల కలయికకు ప్రతీక ఉగాది. కానీ ఉగాది రోజున రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా చేదు వార్తే. ఒకపక్క ఎండలు మండిపోతున్నాయి. ఎడాపెడా కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున విద్యుత్ చార్జీల మోత మోగించేందుకు సిద్ధమైంది. గృహ వినియోగదారులతో పాటు పరిశ్రమలు, వాణిజ్యసంస్థలపై రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఏకంగా రూ.4 వేల కోట్ల మేర భారం మోపేందుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గృహ వినియోగదారులపై యూనిట్‌కు 55 పైసల నుంచి రూపాయి వరకు అదనపు చార్జీల భారం పడనుంది. పరిశ్రమలపై 62 పైసల నుంచి రూ.1.23 మేరకు షాక్ తగలనుంది. 

వాణిజ్య సంస్థలకు 50 పైసల నుంచి రూపాయి వరకు రెగ్యులర్ చార్జీల భారంతో పాటు సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు వినియోగించే విద్యుత్‌కు టైమ్ ఆఫ్ ది డే (టీవోడీ) పేరుతో యూనిట్‌కు రూపాయి చొప్పున అదనపు భారం పడనుంది. అంతేకాదు ఇప్పటివరకు అమల్లో ఉన్న టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తివేయనున్నారు. తద్వారా 50 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులందరిపైనా మరింత భారం మోపేందుకు రంగం సిద్ధమయ్యింది. మొత్తం మీద గృహ వినియోగదారులపై ఏకంగా రూ.900 కోట్ల భారం పడనుండగా, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై మరో రూ.3,100 కోట్ల భారం పడనుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. కాగా గతంలో లేనివిధంగా విద్యుత్ చార్జీలు సకాలంలో చెల్లించకపోతే ఆలస్య రుసుం వసూలు చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం.

2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ సంస్థలు గత ఏడాది డిసెంబర్‌లోనే విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సమర్పించాయి. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చార్జీల పెంపుపై ఈఆర్‌సీ కసరత్తు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాత్రి ఇటు ఇంధనశాఖ అధికారులతోను, అటు ఈఆర్‌సీ వర్గాలతోనూ సమావేశమైన సందర్భంగా విద్యుత్ చార్జీల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. 

గ్యాసు లభ్యత తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ మేరకు అదనపు విద్యుత్ కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని, అదనపు విద్యుత్ కొనుగోలుకు, ఉచిత విద్యుత్ సబ్సిడీకి గాను రూ.5,500 కోట్ల మేరకు ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు మార్పు చేసి చార్జీల పెంపుపై తుది ప్రతిపాదనలను ఈఆర్‌సీ శనివారం ప్రభుత్వానికి ఇవ్వనుంది. అదే రోజు ప్రభుత్వం ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నట్టు సమాచారం. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 30న వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల టారిఫ్ ఆర్డర్‌ను ఈఆర్‌సీ జారీ చేయనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వచ్చే నెల ఒకటి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయి. 

50 యూనిట్లు దాటితే డబుల్ షాక్!
ప్రస్తుతం గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ పద్ధతిలో విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నారు. అంటే స్లాబుల వారీ విద్యుత్ చార్జీల విధానం అమల్లో ఉంది. ఉదాహరణకు నెలకు 120 యూనిట్లు వాడితే మొదటి 50 యూనిట్లకు (0-50 శ్లాబు) యూనిట్‌కు రూ.1.45 చొప్పున, 51-100 యూనిట్లకు యూని ట్‌కు రూ.2.80 చొప్పున, మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ. 3.05 చొప్పున చార్జీలను వసూలు చేస్తున్నారు. దీనినే టెలిస్కోపిక్ పద్ధతిగా వ్యవహరిస్తారు. ఇప్పుడీ టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయనున్నారు. 51-100 శ్లాబు స్థానంలో 0-100 శ్లాబు రానుంది. అంటే 50 యూనిట్లు దాటితే ప్రతి యూనిట్‌కు రూ. 2.60 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 

వాస్తవానికి 0-50 శ్లాబును 0-30లా మార్చాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదించాయి. 31 యూనిట్లు దాటితే టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తివేయాలని కోరాయి. డిస్కంల వాదనతో ఈఆర్‌సీ ఏకీభవించలేదని తెలిసింది. ప్రస్తుతం ఉన్నట్టుగానే 0-50 శ్లాబును అలాగే ఉంచి 51-100 శ్లాబును ఎత్తివేసి 0-100 శ్లాబుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈఆర్‌సీ నిర్ణయం వల్ల 31 నుంచి 50 యూనిట్లులోపు వినియోగించే 75 లక్షల మంది వినియోగదారులపై భారం తప్పిందనే చెప్పాలి. 

పరిశ్రమలపై పిడుగు!
రాష్ట్రంలో పరిశ్రమలు ప్రస్తుతం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. నెలలో ఏకంగా 12 రోజుల పాటు కోతల బారినపడుతున్నాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల షాక్‌లూ పరిశ్రమలు ఎదుర్కోవాల్సి రానుంది. చిన్నతరహా పరిశ్రమలు, పౌల్ట్రీ ఫామ్‌లు, పుట్టగొడుగుల పెంపకందార్లతోపాటు భారీ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల మోత మోగనుంది. యూనిట్‌కు ఏకంగా 62 పైసల నుంచి రూ. 1.23 వరకూ అదనపు భారం పడనుంది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకైతే ఏకంగా రూ. 1.10 నుంచి 2.10 దాకా విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. మొత్తం మీద పరిశ్రమలపై ఏకంగా రూ.2,100 కోట్ల మేరకు విద్యుత్ చార్జీల భారం పడనుంది. 

‘టెలిస్కోపిక్’ ఎత్తివేత షాక్ ఇలా..
టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయడం వల్ల గృహవినియోగదారులపై చార్జీల భారం భారీగా పెరగనుంది. ఉదాహరణకు నెలకు 70 యూనిట్లు వాడితే.. ఇప్పటివరకు మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున రూ. 72.5 అవుతుంది. మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.80 చొప్పున రూ. 56 అవుతుంది. మొత్తం రూ. 128.50 (వీటికి సర్వీసు చార్జీలు అదనం) అవుతుంది. ఈ విధానం ఎత్తివేయడం వల్ల మొత్తం 70 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.60 చొప్పున రూ. 182 (వీటికి సర్వీసు చార్జీలు అదనం) అవుతుంది. అంటే అదనంగా రూ.53.50 భారం పడుతుందన్న మాట. 

ఒకవేళ నెలకు 120 యూనిట్లు వినియోగిస్తే.. ప్రస్తుత టెలిస్కోపిక్ పద్ధతిలో మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున రూ. 72.50 అవుతుంది. 51 నుంచి 100 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.80 చొప్పున రూ.140, మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ. 3.05 చొప్పున రూ. 61 అవుతుంది. మొత్తం విద్యుత్ బిల్లు రూ.273.50 (సర్వీసు చార్జీ అదనం) అవుతుంది. 

టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయడం వల్ల మొదటి 100 యూనిట్లకు యూనిట్‌కు 2.60 చొప్పున రూ.260 అవుతుంది. మిగిలిన 20 యూనిట్లకు యూనిట్‌కు రూ.3.60 చొప్పున రూ.72 అవుతుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి కరెంటు బిల్లు రూ.332 (సర్వీసు చార్జీ అదనం) వస్తుంది. అంటే 120 యూనిట్లు వినియోగించే వినియోగదారులపై అదనంగా రూ.58.50 భారం పడనుందన్నమాట. ఇక 51 యూనిట్లు వాడితే కరెంటు బిల్లు ఏకంగా రూ. 75.30 నుంచి రూ. 132.60కి పెరగనుంది.
Share this article :

0 comments: