సీఎం అవినీతితో 500 కోట్లు నష్టం ,హైకోర్టులో శంకర్రావు పిల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం అవినీతితో 500 కోట్లు నష్టం ,హైకోర్టులో శంకర్రావు పిల్

సీఎం అవినీతితో 500 కోట్లు నష్టం ,హైకోర్టులో శంకర్రావు పిల్

Written By ysrcongress on Friday, March 23, 2012 | 3/23/2012

* కిరణ్, మంత్రి శత్రుచర్లలు ఎర్రచందనాన్ని నామమాత్రపు ధరకు అమ్మేశారు
* తమ సొంత ప్రయోజనాల కోసం నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు
* ఎర్రచందనం ఎగుమతులకు కేంద్రం అభ్యంతరపెట్టినా పట్టించుకోలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మాజీ మంత్రి, కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ పి.శంకర్రావు మళ్లీ హైకోర్టుకెక్కారు. అయితే, ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినే టార్గెట్ చేశారు. సీఎం కిరణ్, అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజులు కలిసి నేరపూరిత కుట్రతో వందల కోట్ల రూపాయలు చేసే 2,022 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని తమకు కావాల్సిన వ్యక్తులకు నామమాత్రపు ధరకు కట్టబెట్టారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గురువారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం వారు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. 

ఎర్ర చందనం అమ్మకాలపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని శంకర్రావు కోర్టును కోరారు. ఈ పిల్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అటవీ పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి జానకి ఆర్.కొండపి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, హైదరాబాద్‌కు చెందిన జితన్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఆంధ్ర పొగాకు ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్‌కు చెందిన పవర్ గ్రిప్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ ఎర్ర చందనం అమ్మకాల వల్ల ఖజానాకు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు.

ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి..
తాను మంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల పర్యటనలకు వెళ్లానని.. ఆ సందర్భంగా ఎర్రచందనం అమ్మకాలకు సంబంధించి ప్రజల నుంచి తనకు పలు ఫిర్యాదులు వచ్చాయని శంకర్రావు పిల్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరుడు విజయరామరాజులు వారి సొంత ప్రయోజనాల కోసం గుర్తు తెలియని స్మగ్లింగ్ గ్యాంగులతో కలిసి.. ఎర్రచందనాన్ని నామమాత్రపు ధరకు విక్రయించడం ద్వారా భారీ కుట్రకు పాల్పడ్డారని శంకర్రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం ఎగుమతులకు అభ్యంతరం చెప్పినా.. కిరణ్, విజయరామరాజులు నేరపూరిత కుట్రతో 2,022 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని నామమాత్రపు ధరకు అమ్మేశారు. గ్లోబల్ టెండర్లను పిలవాలన్న నిబంధనను సైతం కాలరాసి, ఏకపక్షంగా ఎర్రచందనం నిల్వలను తమకు కావాల్సిన కంపెనీలకు మూడు జీవోల ద్వారా కట్టబెట్టారు. 

ఇక్కడ అతి తక్కువ ధర(మెట్రిక్ టన్ను దాదాపు రూ.2 లక్షలు)కు కొన్న ఆ వ్యక్తులు ఒక్కో మెట్రిక్ టన్నును రూ.20 లక్షల చొప్పున చైనాకు అమ్ముతారు’ అని తెలిపారు. మన రాష్ట్రంలో మాత్రమే లభించే ఈ ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య, అటవీశాఖ మంత్రిగా పి.రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు అటవీశాఖ వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులను ఇవ్వలేదన్నారు. అయితే, సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిస్థితి మొత్తం మారిపోయిందని, ఎర్ర చందనం నిల్వల విక్రయం మళ్లీ తెరపైకి వచ్చి.. ఆ మేరకు జీవోలూ జారీ అయ్యాయని తెలిపారు. ఇందుకు అటవీశాఖకు చెందిన ఉన్నతాధికారులు సైతం అడ్డు చెప్పలేదన్నారు. 

పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారింది..
ఈ మొత్తం విక్రయాల్లో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని శంకర్రావు ఆరోపించారు. తక్కువ మొత్తాలకు కోట్ చేసిన వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా ఎర్ర చందనాన్ని అమ్మారని తెలిపారు. ‘తక్కువ నాణ్యత కలిగిన ఎర్ర చందనాన్నే అమ్మామని కేంద్ర ప్రభుత్వాన్ని అధికారులు తప్పుదోవ పట్టించారు. ఈ మొత్తం వ్యవహారమంతా కిరణ్‌కుమార్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. తమ సొంత లబ్ధి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి, విజయరామరాజు అవినీతికి పాల్పడి.. కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే అన్ని విధాన నిర్ణయాలకు సీఎందే బాధ్యతని, కాబట్టి ఎర్ర చందనం అమ్మకాలకు సంబంధించి జారీ అయిన జీవోలకు సైతం ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. ఎర్ర చందనం అమ్మకాలకు సంబంధించిన జీవోలు జారీ కావడంలో కిరణ్, విజయరామరాజులు ప్రధాన భాగస్వాములని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద వీరిని విచారించాలని ఆయన కోర్టును కోరారు. 

2022 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయించిన తరువాత.. మరో 9 వేల మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారని, గతంలో జారీ చేసిన జీవోల ఆధారంగా దీనిని కూడా అమ్మేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి, విజయరామరాజులు వ్యూహరచన చేశారని ఆరోపించారు. ఈ 9 వేల మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం విలువ రూ.1,800 కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు ఈ మేరకు నష్టం కలుగుతోంది కాబట్టే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతున్నామని.. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూ.. ఆ మేరకు ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీంతోపాటు ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించేలా సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఆయన కోర్టును కోరారు.

ఇది మూడో పిటిషన్...
శంకర్రావు గతంలోనూ సీబీఐ దర్యాప్తుపై కోర్టును ఆశ్రయించారు. గతంలో తెల్లకాగితంపై తేదీ కూడా లేకుండానే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ లేఖ రాశారు. సాంకేతికంగా దానిని పరిగణనలోకి తీసుకోవచ్చా లేదా అన్నది పట్టించుకోకుండానే హైకోర్టు దానిని పిల్‌గా పరిగణించి విచారణ జరిపింది. ఈ లేఖ ఆధారంగానే అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. రాజకీయ కారణాలతోనే శంకర్రావు పిటిషన్ వేశారన్న ప్రతివాదుల అభ్యర్థనను కక్రూ తోసిపుచ్చారు. ఆ తరువాత కొంత కాలానికే మంత్రులు సబితారెడ్డి, మోపిదేవి వెంకటరమణలు పోస్టింగ్‌ల్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ పత్రికాముఖంగా ఆరోపణలు చేశారు. 

ఈ ఆరోపణలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి వాటిని సుమోటోగా పరిగణించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. దీనిని సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయగా.. జస్టిస్ నర్సింహారెడ్డి ఉత్తర్వులను జస్టిస్ కక్రూ కొట్టివేశారు. విశ్వసనీయత లేని వ్యక్తులు చేసే ఆరోపణలకు విలువ లేదని కూడా వ్యాఖ్యానించారు. తాజా వ్యాజ్యంపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Share this article :

0 comments: