గత ఎన్నికల్లో కాంగ్రెస్ + పీఆర్పీ ఓట్లు 88,392 కాగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 41,343.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గత ఎన్నికల్లో కాంగ్రెస్ + పీఆర్పీ ఓట్లు 88,392 కాగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 41,343..

గత ఎన్నికల్లో కాంగ్రెస్ + పీఆర్పీ ఓట్లు 88,392 కాగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 41,343..

Written By ysrcongress on Thursday, March 22, 2012 | 3/22/2012

కుమ్మక్కైనా బోల్తా
అధికార - ప్రతిపక్షాల మ్యాచ్ ఫిక్సింగ్ ఎత్తుగడ విఫలం 
తీవ్రస్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. లెక్కకు మిక్కిలి డబ్బు, మద్యం పారించినా పారని పాచిక 
గత ఎన్నికల్లో కాంగ్రెస్ + పీఆర్పీ ఓట్లు 88,392 కాగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 41,343..
పీఆర్పీ లీడర్లు విలీనమైనా కాంగ్రెస్‌తో కలవని ఓటర్లు 
2009 ఎన్నికతో పోలిస్తే టీడీపీకి 22,832 ఓట్లు తగ్గాయి 

హైదరాబాద్, న్యూస్‌లైన్: నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు గట్టి షాకిచ్చారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పనిచేయటం లేదని గ్రహించిన జనం.. ప్రత్యామ్నాయ శక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్, టీడీపీలు తమ సర్వశక్తులు ఒడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని దెబ్బతీయటానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చెరోవైపు నుంచి నోట్ల కట్టలు కుమ్మరించినా మద్యాన్ని ఏరులుగా పారించినా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను తమ ఉమ్మడి శత్రువుగా భావించిన కాంగ్రెస్, టీడీపీలు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగూ ఫలించలేదు. చివరకు ‘మాకు ఓటేయకున్నా ఫర్వాలేదు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం ఓట్లేయొద్దు’ అన్న కుట్రలకు కూడా ఆ పార్టీలు దిగజారాయి. కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను మొహరింప జేసి ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రయత్నించింది. టీడీపీ తీసి పోకుండా అధికార పార్టీతో పోటీ పడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ అర్థ, అంగ బలాలను రంగంలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది. మితిమీరిన అధికార దుర్వినియోగానికి పాల్పడిన కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై దుష్ర్పచారం సాగించిన టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రెండో స్థానంలోనే మిగిలారు. 

తొలి పోరులోనే ఘన విజయం... 

ఎన్ని కుయుక్తులు పన్నినా కాంగ్రెస్, టీడీపీలకు గత ఎన్నికల్లో (2009 సాధారణ ఎన్నికలు) వచ్చిన ఓట్ల కంటే బాగా తక్కువగా వచ్చాయి. రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డికి 73,876 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి 50,380 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి 41,343 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికలతో పోలిస్తే టీడీపీకి 22,832 ఓట్లు తగ్గాయి. కాంగ్రెస్‌కు 24,424 ఓట్లు తక్కువగా వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతిలో 7,444 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇపుడు ఆయనకూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపరెడ్డికీ మధ్య 32,533 ఓట్ల భారీ తేడా ఉంది. గత ఎన్నికల్లో 22,624 ఓట్లు సాధించిన పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమైనప్పటికీ.. ఓటర్లు మాత్రం కాంగ్రెస్ కాకుండా కొత్త ప్రత్యామ్నాయం వైపు మొగ్గారని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, పీఆర్పీ రెండు పార్టీలు రెండింటికీ కలిపి 88,392 ఓట్లు రాగా.. విలీనం అనంతరం జరిగిన ఈ నియోజకవర్గం తొలి ఎన్నికలో కాంగ్రెస్‌కు 41,343 ఓట్లే రావటం గమనార్హం. 

వైఎస్సార్ కాంగ్రెస్సే బలమైన ప్రత్యామ్నాయం: గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను ఇప్పుడొచ్చిన ఓట్ల సరళిని పరిశీలిస్తే ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించారని తేటతెల్లమైందని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు అంగీకరిస్తున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలు రెండూ.. తమ బాధ్యతలు నిర్వర్తించటంలో ఘోరంగా విఫలమవుతుండటంతో.. ఆ రెండు పార్టీలపై వ్యతిరేకత వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిందని చెప్తున్నారు. ఇకపోతే.. ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డితో పాటుగా మంత్రులు పితాని సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, రఘువీరారెడ్డి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వంటి ముఖ్య నేతలు కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహించినా.. ఆ పార్టీ అభ్యర్థిని మూడో స్థానం నుంచి పైకి తేలేక పోయారు. వీరు చాలదన్నట్లు సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, చిరంజీవి వంటి నేతలు విసృ్తతంగా నిర్వహించిన ప్రచారం ఫలించలేదు. చంద్రబాబు రెండు సార్లు ప్రచారం నిర్వహించటమే కాకుండా 40 మంది నాయకులను దాదాపు 20 రోజులుగా నియోజకవర్గంలో ఉంచి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
Share this article :

0 comments: