వైఎస్ కుటుంబంపై కక్ష ఉంటే మామీదే తీర్చుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ కుటుంబంపై కక్ష ఉంటే మామీదే తీర్చుకోండి

వైఎస్ కుటుంబంపై కక్ష ఉంటే మామీదే తీర్చుకోండి

Written By ysrcongress on Thursday, March 1, 2012 | 3/01/2012



దివంగత నేతపై కోపాన్ని ఆయన పథకాలపై చూపకండి
ప్రజలను ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయకండి
బడ్జెట్‌పై సాధారణ చర్చలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు
బడుగు రైతులు, నేత కార్మికులు, రోగులు, విద్యార్థులపై ఎందుకు మీకంత కక్ష?
చనిపోయి రెండేళ్లవుతున్నా వైఎస్‌ను అభిమానిస్తున్నందుకేగా..
పన్నుల పెంపుతో రాబడి భారీగా ఉన్నా సంక్షేమ పథకాలను 
ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదు?.. 
పన్నులు, ధరల పెంపుతో ప్రజల జీవితాలను దుర్భరం చేయడంలో
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి..
వైఎస్ సర్కారు ఐదేళ్లలో పైసా పన్ను వేయలేదు..


హైదరాబాద్, న్యూస్‌లైన్: కేవలం 26 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయి దీనావస్థలో ఉన్న కాంగ్రెస్‌ను కష్టపడి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై కోపం ఉంటే.. తమపై తీర్చుకోవాలేగానీ ఆయనను అభిమానించే ప్రజలను ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఐదేళ్లపాటు రూపాయి కూడా పన్ను పెంచకుండానే ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఉచిత వైద్యసేవలు అందించిన విషయం ఆమె గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా అదనంగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పారు. రకరకాల పన్నులు పెంచి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెంచుకుని కూడా సంక్షేమ పథకాలను ఎందుకు సక్రమంగా అమలు చేయలేకపోతున్నారంటూ సర్కారును నిలదీశారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో విజయమ్మ పాల్గొన్నారు. ‘‘రాజశేఖరరెడ్డిగారి మీద కసి ఉంటే మా మీద ఎటువంటి చర్యలు అయినా తీసుకోండి. కానీ బడుగు రైతులు, నిరుపేదలు, చేనేత కార్మికులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రోగులపై మీకెందుకంత కక్ష? చనిపోయి రెండేళు ్లదాటినా వైఎస్‌ఆర్‌ను ఇంకా అభిమానిస్తున్నారనేగా? ైవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీకు చేసే వినతి ఒక్కటే. ఆయనమీద ఉన్న కోపాన్ని ఆయన పథకాల మీద, ఆయనను అభిమానించే పేదల మీద చూపించకండి’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.


కేంద్రం గ్యాస్ ధరలు ఎన్నిసార్లు పెంచినా వైఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆ భారాన్ని ప్రజలపై పడనీయని విషయాన్ని గుర్తు చేశారు. గత మూడేళ్లలో ఏ ఏడాదీ ప్రభుత్వ ఆదాయ వృద్ధి రేటు 20% కూడా తగ్గకపోయినా పన్నులు పెంచాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను విజయమ్మ ప్రధానంగా ప్రస్తావించారు. 15 నిమిషాలకు పైగా సాగిన విజయమ్మ ప్రసంగాన్ని సభ్యులంతా నిశ్శబ్దంగా శ్రద్ధగా ఆలకించారు. ఒక సందర్భంలో టీడీపీ సభ్యులు అడ్డుకోబోగా.. మిగతా సభ్యులు గట్టిగా వారించడంతో వారు మిన్నకుండిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ సమయంలో సభలో లేరు.


విజయమ్మ ప్రసంగపాఠం ఆమె మాటల్లోనే... 


‘‘దశాబ్దాలుగా శాసనసభ్యులుగా, సుదీర్ఘకాలం మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించి రాజకీయాల్లో ఉద్ధండులైన ఇంతమంది సభ్యుల మధ్య.. ఇంతకాలం సాధారణ గృహిణిగా ఉండి తొలిసారిగా ఎమ్మెల్యే అయిన నేను బడ్జెట్ మీద మాట్లాడే సాహసం చేస్తున్నాను. గౌరవ ఆర్థిక మంత్రివర్యులు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల ప్రకారం 2012- 2013 సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం రూ.1,16,786 కోట్లు. 2011- 12 ఆదాయం రూ.97,194 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20% ఎక్కువ. 2009-10లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ. 64,678 కోట్లు. 2010-11 నాటికి 25% వృద్ధితో ఇది రూ.80,996 కోట్లకు పెరిగింది. అంటే గత మూడేళ్లలో ఏ ఏడాది కూడా ప్రభుత్వ ఆదాయంలో వృద్ధి 20 శాతానికి తగ్గింది లేదు. అదే 1995 నుంచి 2005 మధ్యకాలంలో రాష్ట్ర ఆదాయ సగటు వార్షిక వృద్ధి రేటు కేవలం 13% మాత్రమే. (ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు ఏదో మాట్లాడబోయినా ఇతరపక్షాల సభ్యుల ఆగ్రహంతో మిన్నకుండిపోయారు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి పెరిగింది కేవలం 9% మాత్రమే. ఆదాయాన్ని పెంచుకోవటంలో కేంద్రాన్ని మించి దూసుకుపోతున్న ప్రభుత్వాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకున్నా, సాగు గుదిబండగా మారి పల్లె కన్నీరెడుతున్నా ... అడ్డూఅదుపూలేని కరెంటు కోతలతో పారిశ్రామిక రంగం నీరసిస్తున్నా ఈ స్థాయిలో పెరుగుదల సాధించటం నిస్సందేహంగా విజయమనే చెప్పాలి. 


కానీ 2010-2011లో ఆదాయం 25% పెరిగినా, వ్యాట్ విపరీతంగా ఎందుకు పెంచారో నాకు అర్థం కాలేదు. వ్యాట్ పెంచకపోయినా ఇంత వృద్ధి సాధించినప్పుడు వ్యాట్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఏ ఒక్కరినీ వదలకుండా కరెంటు చార్జీల పెంపుతో షాక్ ఇచ్చారు. ఆర్టీసీ చార్జీలనూ పెంచుతూనే ఉన్నారు. మునిసిపాలిటీల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఇంటి పన్నును మూడు నుంచి పది రెట్లు పెంచేశారు. చివరకు మంచి నీటి చార్జీలను కూడా వదల్లేదు. పన్నులూ, ధరలూ పెంచేస్తూ ప్రజల జీవితాలను దుర్భరం చేయటంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. పెట్రోలు, గ్యాసు ధరలు ఎన్నిసార్లు పెంచారో కేంద్రానికే గుర్తున్నట్లు లేదు. ఇదేవిధంగా ఎరువుల ధరలనూ భగ్గుమనిపిస్తోంది. 


ఎందుకీ భిన్న విధానం


పన్ను రేట్లు తక్కువగా ఉంటే వసూళ్లు పెరుగుతాయన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. ఎన్నో ఏళ్ల నుంచి మనం పాటిస్తున్న నూతన ఆర్థిక విధానం ఇదే. కానీ ఇప్పుడీ ప్రభుత్వం దీనికి భిన్నమైన, కాలం చెల్లిన విధానానికి ఎందుకు మొగ్గు చూపిస్తోందో చెప్పాలి. 2004-09 మధ్యకాలంలో ఆనాటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పన్ను పెంచింది లేదు. పైగా చాలా వస్తువులపై పన్నులు తగ్గించిన దాఖలాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరవాత ఏ ఐదేళ్ల కాలంలోనూ ఏ ప్రభుత్వానికీ లేని ప్రత్యేకత ఇది. భారతదేశంలోనే ఐదేళ్ల కాలంలో రూపాయి కూడా పన్ను పెంచని రాష్ట్రం లేదు. ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలా సాధ్యమైందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌గారే అడిగారని రాజశేఖరరెడ్డిగారు నాతో అన్నారు. 


ఆ అయిదేళ్ల కాలంలో...


సంవత్సరానికి 1600 కోట్ల యూనిట్ల మేరకు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ కూడా ఏ ఒక్కరికీ కరెంటు చార్జీలు పెంచింది లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పరిశ్రమలకు యూనిట్‌కు 75 పైసలు తగ్గించారు. 
నీటి చార్జీలు పెంచలేదు. డీజిల్ ధరలు ఎంతగా పెరిగినా ఆర్టీసీ చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదు. 
గ్యాస్ ధర కేంద్రం పెంచినా ఆ భారాన్ని ప్రజలమీద పడనివ్వలేదు.
మునిసిపల్ పన్నులూ పెరగలేదు... పెరిగిందల్లా సంక్షేమమే 
ఆనాడు 55 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చారు... 46 లక్షల కొత్త ఇళ్లు కట్టారు.
దాదాపుగా అయిదారు కోట్ల మందికి రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు.
26 లక్షల మంది రైతులకు ఉచితంగా విద్యుత్ అందించారు. 
25 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశారు. ఇదికాక కనీసం రెండుసార్లు భారీగా స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలు పెంచారు.


కొత్తగా 18 లక్షల ఎకరాలకు నీటి పారుదల వసతి కల్పించారు.
పెద్ద రోగాలతో బాధపడుతున్నా.. డాక్టర్ దగ్గరకు వెళ్లినా.. క్రోసిన్ లాంటి మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న 11 లక్షల మంది నిరుపేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అపోలో లాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చారు.


పిలిస్తే చాలు.. పలికే 104, 108 వంటి పథకాలు అమలు చేశారు... లక్షల ప్రాణాలు కాపాడారు. 
ఇవేకాక పావలా వడ్డీ రుణాలు, రుణమాఫీలు, కరెంటు సర్‌చార్జీ మాఫీలు... మరెన్నో! అసాధ్యమనిపించే పనులన్నీ ఒక్క శాతం కూడా పన్ను పెంచకుండానే సుసాధ్యం చేశారు. దీంట్లో ఇక్కడున్నవారిలో ఎంతోమంది భాగస్వాములే. ఆనాటి కేబినెట్లో మంత్రులుగా ఉన్న వారెందరో నేడూ మంత్రులుగా ఉన్నారు. నాడు కేబినెట్ సహచరులుగా... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మీ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది.
ఆదాయం ఉన్నా నాటి పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?


మరిప్పుడు ఇబ్బడిముబ్బడిగా ఆదాయమున్నా సంక్షేమంపై మనసెందుకు పెట్టడం లేదు? ఆనాటి పథకాలను ఇప్పుడు ఎందుకు సరిగా అమలు చేయలేకపోతున్నారు? వ్యవసాయాన్ని సంక్షోభంలోకి ఎందుకు నెట్టేస్తున్నారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్షా. అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న పేద కుటుంబాలకు పనికొచ్చేటువంటి 104 స్కీమును దయనీయ పరిస్థితిలోకి ఎందుకు నెట్టారు? 15 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రతిరోజూ చెప్పుకొనేవాళ్లు వందల్లో ఉండే 104 ఉద్యోగులకు జీతాలెందుకు ఇవ్వటం లేదు? వారిని ఉద్యోగాల్లోంచి ఎందుకు తీసేశారు? 108 అంబులెన్సులకు డీజిల్‌కు కూడా డబ్బులివ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? చాలా ఊళ్లలో 108 అంబులెన్సులెందుకు మూలపడ్డాయి? అసలుకే ఎందుకు కనబడటం లేదు. రకరకాల మార్పులతో ఆరోగ్యశ్రీలో కొన్ని వ్యాధులను కుదించారు. ఎందుకు ఈ పథకాన్ని సరిగా జరపలేకపోతున్నారు? ట్రిపుల్ ఐటీ సీట్లు ఎందుకు తగ్గించారు? ఈ ఏడాదైనా ట్రిపుల్ ఐటీ సీట్లను ప్రభుత్వం పెంచగలుగుతుందా? రీయింబర్స్‌మెంట్ కింద ఇంకా రూ.4వేల కోట్లకు ఎందుకు బకాయి పెట్టాల్సి వచ్చింది? కేవలం రూ.325 కోట్ల చేనేత కార్మికుల రుణమాఫీ స్కీముకు నిధులను ఇప్పటికీ పూర్తిగా ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతున్నా. జలయజ్ఞానికి పది వేల కోట్లయినా ఖర్చుపెట్టేలా లేదు.


ఆ రెండు హామీలూ ఎందుకు అమలు చేయలేదు?


2009 ఎన్నికల మానిఫెస్టోలో రెండే రెండు హామీలు ఇస్తే వాటిని ఎందుకు అమలు చేయలేదు? తెల్లరేషన్‌కార్డు కుటుంబంలోని ఒక్కొక్కరికి ఇచ్చే నెలకు నాలుగు కిలోల బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచుతామని, వ్యవసాయానికి ఏడు గంటల స్థానే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ రెండు హామీలను అమలు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పటి ప్రభుత్వం కిలో బియ్యం రూపాయికే ఇస్తుందంటే సంతోషమేగానీ.. ఆరోజు రాజశేఖరరెడ్డి ప్రతి మనిషికీ రెండు కిలోల బియ్యం అదనంగా ఇస్తే ప్రతి కుటుంబానికీ అవి పూర్తిగా సరిపోతాయనుకున్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం ద్వారా ఒక్కొక్కరిపై అదనంగా వెచ్చించేది నాలుగు రూపాయలు మాత్రమే. 


వ్యవసాయరంగంపై నిర్లక్ష్యం బాధాకరం


మీకందరికీ తెలుసు... రాజశేఖరరెడ్డిగారు ప్రతిపేదవాని కన్నీరు తుడవాలనే ఉద్దేశంతో కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా అవసరం, అర్హత ఉన్న ప్రతి పేదవానికీ సంక్షేమ పథకాలు శాచురేషన్ స్థాయిలో అమలు చేశారు. దురదృష్టం ఏంటంటే... మళ్లీ కోటా విధానాన్ని పునరావృతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తోంది. రాష్ట్రంలో 62 శాతం ప్రజానీకం ఆధారపడిన వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత బాధాకరం. 2009-10లో ఒకపక్క కరువుతో, మరోపక్క వరదల కారణంగా వ్యవసాయ దిగుబడులు సుమారుగా 20% పడిపోయాయి. రైతులకు సుమారు రూ.18 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం నేటికీ పది శాతం మందికి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 2010-11లో పండించిన ధాన్యాన్ని, పసుపును, మిర్చిని, పత్తిని కొనేవారు కూడా లేకపోయారు. కొన్నాళ్లు గోడౌన్లు ఖాళీగా లేవని, మరికొన్నాళ్లు టార్పాలిన్లు లేవని, మరోసారి సంచులే లేవని.. మిల్లర్లు కొనలేదని కుంటిసాకులు చెబుతూ బాధ్యతలను సంపూర్ణంగా విస్మరించారు. దేశ చరిత్రలో కనీవినీ లేనిరీతిలో రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించుకున్నారు. 


ప్రజా జీవితంలో ఉండే మనందరికీ కూడా ఇది తలవంపని చెబుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము క్వింటాలు వరికి రూ.200 బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజు బడ్జెట్లో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. వడ్డీ లేని రుణాలు రూ.54 వేల కోట్లు ఇస్తామని చెప్పారు. దీనికి సుమారుగా రూ.2వేల కోట్లైనా సబ్సిడీగా బడ్జెట్లో పెట్టాల్సి ఉంది. కేవలం రూ.600 కోట్లే ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నా. రైతుకి ఎంఎస్‌పీ లభించకపోవటమనే దుస్థితి మళ్లీ పునరావృతం కాకూడదంటే ప్రభుత్వం తక్కువలో తక్కువ రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి పెట్టాలని మా పార్టీ తరఫున ఎన్నో ఉద్యమాలు చేసి డిమాండ్ చేశాం. బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు... దీన్నిబట్టి రాబోయే కాలంలో కూడా పంటలు అధికంగా పండినా పండకపోయినా రైతుల జీవితాలు ఎప్పటికీ గాల్లో దీపంలానే ఉండిపోతాయేమోననిపిస్తోంది. 


రాజకీయాల కోసం కాదు.. ప్రజల బాధలు వివరించేందుకే వచ్చా


అధ్యక్షా! నేను ఇక్కడకు వచ్చింది రాజకీయాలు చేయటానికి కాదు. ప్రజల తర ఫున వాళ్ల ప్రతినిధిగా వాళ్ల బాధలు వివరించటానికి మాత్రమే ఇక్కడకు వచ్చాను. కాంగ్రెస్ వాళ్లకు రాజశేఖరరెడ్డి గారంటే కోపం ఉండటానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఈ సందర్భంగా మహానేత టంగుటూరి ప్రకాశం గారి జీవితంలోని ఒక ఘట్టాన్ని మీకు మనవి చేయదల్చుకున్నాను. ఆయన నాటి మద్రాసు రాష్ట్రంలోని హార్బర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఆయన సహచరుడు ఒకరు వచ్చి ఫలానా రామకృష్ణ గారు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఆయన్ని మందలించండి అని అభ్యర్థించారట. దాన్ని ప్రకాశం గారు విననట్లుగా వదిలేశారు. కానీ ఆ సహచరుడు పదేపదే ఆ విషయం ప్రస్తావించసాగారు. అయినా పట్టించుకోకపోవటంతో ఆయన ప్రకాశంగారిని గట్టిగా నిలదీశారు. దీనికి ప్రకాశంగారు తనదైన శైలిలో ‘‘ఓరి పిచ్చివాడా... ఆ రామకృష్ణ నాకెందుకు వ్యతిరేకంగా చేస్తాడు? నా జీవితంలో అతనికెప్పుడూ సహాయం చేయలేదు కదా? నా నుంచి ఏ ఉపకారం పొందని వ్యక్తి నాకు అపకారం ఎందుకు చేస్తాడు?’’ అని అన్నారట. మహానేత రాజశేఖరరెడ్డిగారి మీద, ఆయన కుటుంబం మీద కోపం ఉండటం నాకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే 26 సీట్లకు పడిపోయి ప్రతిపక్షంగా కూడా గుర్తింపు లేదప్పుడు. అలాంటి పార్టీని తన కాయకష్టంతో, ఎండనకా వాననకా అహర్నిశలు కష్టించి ఒకసారి కాదు... రెండుసార్లు వరుసగా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు 33 మంది ఎంపీలతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా దోహదపడ్డారు. 


దేన్నైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..


ఆనాటి ప్రభుత్వం 26 జీవోలు ఇల్లీగల్‌గా ఇచ్చిందని శంకర్రావు హైకోర్టుకు లేఖ ఇచ్చారు. హైకోర్టు అవి ఇల్లీగలా? కాదా అని చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఆనాటి కేబినెట్‌లోని మంత్రులే ఈనాటి కేబినెట్‌లో ఉన్నారు. అయినా కౌంటర్ దాఖలుపై ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. నాటి ప్రభుత్వం ఇచ్చిన జీవోలు లీగలా? ఇల్లీగలా? చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? నాటి కేబినెట్ మంత్రులే నేడూ ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నా. ఎవరినీ బలవంతం చేయడం లేదు. ఒకవేళ రాజశేఖరరెడ్డి ప్రతిఒక్కరినీ అన్నలుగా, తమ్ముళ్లుగా, అక్కలుగా, చెల్లెళ్లుగా అనుకున్నందుకే కౌంటర్ దాఖలు చేయలేదా? అని అడుగుతున్నా. పైగా మా కుటుంబం మీద సీబీఐ కేసులు పెట్టిస్తారు, ఇన్‌కంట్యాక్స్ కేసులు బనాయిస్తారు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ను ఉసిగొల్పుతారు, సభా సంఘాన్ని వేస్తారు, లక్షల కోట్లు సంపాదించారని ప్రచారం చేయిస్తారు. ఆఖరికి ఇవన్నీ చాలవన్నట్లు నేరపూరిత కుట్రదారుగా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన (వైఎస్) పేరు చేరుస్తారు. ఏం చేసినా భగవంతుని దయవల్ల, మాకు రాజశేఖరరెడ్డి గారిచ్చిన స్ఫూర్తితో దేన్నయినా ఎదుర్కోటానికి మేం సిద్ధంగా ఉన్నామని మీద్వారా తెలుపుతున్నా. 


నా అభ్యర్థన ఒక్కటే.. జనాన్ని ఇబ్బంది పెట్టకండి


చివరి మాటగా ైవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీకు చేసే వినతి ఒక్కటే. రాజశేఖరరెడ్డిగారి మీద కసి ఉంటే మా మీద ఎటువంటి చర్యలు అయినా తీసుకోండి. ఆయనమీద ఉన్న కోపాన్ని ఆయన పథకాల మీద, ఆయనను అభిమానించే పేదల మీద చూపించకండి. ఒవైసీ బ్రదర్‌గారు రాజశేఖరరెడ్డి గారిని గుర్తు పెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా...
Share this article :

0 comments: