ముఖ్యమంత్రే వచ్చి ఉంటే ఆనందించేవాణ్ణి.. చేతులు జోడించి అర్థిస్తున్నా.. స్పందించండి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముఖ్యమంత్రే వచ్చి ఉంటే ఆనందించేవాణ్ణి.. చేతులు జోడించి అర్థిస్తున్నా.. స్పందించండి!

ముఖ్యమంత్రే వచ్చి ఉంటే ఆనందించేవాణ్ణి.. చేతులు జోడించి అర్థిస్తున్నా.. స్పందించండి!

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012


పల్లం అగ్నిప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
ముఖ్యమంత్రే వచ్చి ఉంటే ఆనందించేవాణ్ణి.. చేతులు జోడించి అర్థిస్తున్నా.. స్పందించండి!
మత్స్యకారుల పాత రుణాలు మాఫీ చేయాలి.. యుద్ధప్రాతిపదికన పక్కా ఇళ్లు కట్టించాలి
వారికి సాయాన్ని ఐదు నెలలు కొనసాగించాలి.. చేపల వలలు, స్మోకింగ్ బిన్స్ అందించాలి
గంటిపెదపూడి వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరామర్శ
ఏ అవసరానికైనా తానున్నానంటూ భరోసా...

కాట్రేనికోన/పి.గన్నవరం (తూర్పు గోదావరి), న్యూస్‌లైన్: ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ భరోసానిచ్చే మానవత్వమున్న ముఖ్యమంత్రి అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘రాష్ర్టంలో ఇటీవల విషాద ఘటనలు, ఘోర ప్రమాదాలు సంభవించాయి. వేలాదిమంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. అయినా ప్రభుత్వానికి పట్టడంలేదు. సీఎం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. బాధితులను ఆదుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల ఘోర అగ్నిప్రమాదం సంభవించిన కాట్రేనికోన మండలం పల్లం గ్రామాన్ని జగన్ శుక్రవారం సందర్శించారు. అగ్నికి ఆహుతైన పూరిళ్లను పరిశీలించారు. కట్టుబట్టలతో నిరాశ్రయులైన బాధితులను ఓదార్చారు. బాధాకరమైన సన్నివేశాల మధ్య పల్లం గ్రామానికి రావాల్సి వచ్చిందన్నారు. ‘‘400 ఇళ్లు కాలిపోయి 750 కుటుంబాలు వీధిన పడ్డాయంటే మాటలు కాదు. ఇలాంటివి జరిగినప్పుడు ఎలా స్పందించాలో చూపడానికి నేనిక్కడికి వచ్చా. ఈ గ్రామంలో పూరిళ్లకు బదులు పక్కా ఇళ్లుండి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.50 వేలు మంజూరు చేస్తున్నారు. అది చాలదని, రెట్టింపు చేయాలని నాన్న ఆలోచించేవారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే రూ.లక్షతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి.

ప్రభుత్వం రూ.8,000, 50 కిలోల బియ్యం, రెండు చీరలు, రెండు దుప్పట్లు ఇచ్చిందని అక్కాచెల్లెళ్లు నాతో చెప్పారు. దాన్ని తక్షణ సాయంగా మాత్రమే పరిగణించాలి. చేపల వేటపైనే ఆధారపడ్డ ఈ మత్స్యకార గ్రామం కోలుకునే వరకు కనీసం ఐదు నెలల పాటు బాధితులను నిరాశ్రయులుగా భావించి ఈ సాయాన్ని కొనసాగించాలి. తరచు ముంపు సమస్య ఎదుర్కొంటున్న ఈ తీర గ్రామస్తులకు రూ.లక్షన్నరతో ఎత్తయిన పునాదులపై పక్కా ఇళ్లను యుద్ధప్రాతిపదికన నిర్మించివ్వాలి. ప్రస్తుతానికి చేపల వేటకు వెళ్లే పరిస్థితి లేనందున వారి పాత రుణాలను మాఫీ చేస్తూ కొత్త వలలు పంపిణీ చేయాలి. చేపలు ఎండ బెట్టుకోవడానికి స్మోకింగ్ బిన్స్ ఇవ్వాలి. మానవతా దృక్పథంతో స్పందించాలని ఈ ప్రభుత్వాన్ని చేతులు జోడించి మరీ అర్థిస్తున్నా. ఇలాంటివి జరిగినప్పుడు ముఖ్యమంత్రే స్పందించి స్వయంగా ఇక్కడి వచ్చి ఉంటే బాగుండేది. అదే జరిగితే ఆనందపడేవాళ్లలో మొదటి వ్యక్తిని నేనే. జగన్ వచ్చాడు కదాని స్పందించకపోవడం సరికాదు. అది మానవతా దృక్పథం అనిపించుకోదు. ఇప్పటికైనా సీఎం కళ్లు తెరిచి చూడాల్సిన అవసరముంది’’ అని అన్నారు.

సమయం లేకున్నా చిన్నారుల ఇళ్లకు...

గంటిపెదపూడి వద్ద పి.గన్నవరం పంట కాల్వలో స్కూల్ బస్సు బోల్తాపడి దుర్మరణం పాలైన విద్యార్థులు అడ్డాల రోహిత్(9), చినమిల్లి బిందుమాధవి (9) కుటుంబాలను సమయాభావాన్ని పక్కన పెట్టి మరీ జగన్ పరామర్శించారు. ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణం ఆలస్యమవుతుందని జిల్లా నేతలు తొలుత ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అప్పటికే రావులపాలెం వెళ్లిపోయిన జగన్.. ‘ప్రయాణం ఆలస్యమైనా పర్లేదు, చిన్నారుల కుటుంబాలను చూడాల్సిందే’ అంటూ గోదావరి లంకల్లోని గంటిపెదపూడి, బూరుగులంక వెళ్లి రెండు కుటుంబాలనూ పరామర్శించారు. బిందుమాధవి తండ్రి సత్యనారాయణ హైదరాబాద్‌లో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న విషయం తెలుసుకుని, ఏ అవసరానికైనా అక్కడ తనను కలుసుకోవాల్సిందిగా చెప్పారు. ప్రమాదం నుంచి కూతురు దుర్గ బయటపడ్డా చిన్న కొడుకు బలయ్యాడంటూ విలపించిన రోహిత్ తల్లిదండ్రులు శ్రీను, వెంకటల క్ష్మిలను ఓదార్చారు. ‘‘ఉన్న పిల్లల్లో రోహిత్‌ను చూసుకోండి. వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దండి’’ అంటూ ధైర్యం చెప్పారు. దుర్గను ఆప్యాయంగా పలకరించారు. ఎలాంటి సాయం కావాలన్నా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి హైదరాబాద్ రండని వారికి చెప్పారు. రామచంద్రపురం, నర్సాపురం ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, కేంద్రపాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పర్యటనలో జగన్ వెంట ఉన్నారు.

రూ.5,000 సాయం ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు: ఆపదలో ఉన్న వారికి ‘నేనున్నా’నంటూ భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. సముద్రతీర ప్రాంత మత్స్యకార గ్రామమైన పల్లం, గోదావరి తీరాన పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో ఆయన పర్యటన సాగింది. పల్లంలో ఘోర అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిర్వాసితులైన 750 బాధిత కుటుంబాలను పరామర్శించారు. తమను పలకరించి సాంత్వన చేకూర్చేందుకు తొలిసారి వచ్చిన జన నేతతో మత్స్యకారులు, ప్రధానంగా మహిళలు, వృద్ధులు గోడు వెళ్లబోసుకున్నారు. బూడిద కుప్పలు, మంటల్లో మాడి మసైన వంట సామగ్రి తదితరాలను చూపుతూ భోరున విలపించారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా పల్లం ఊరు ఊరంతా ఒక్కటై జగన్ వెన్నంటి సాగింది. రాళ్లురప్పలతో కాలు తీసి కాలువేసే వీలు కూడా లేని ఇరుకు సందుల్లో జనం ఆద్యంతం ఆయనను అనుసరించారు. తమ ఇళ్లకు రావాలంటూ పట్టుబట్టి మరీ తీసుకెళ్లారు. గ్రామానికి గ్రామం కదలివచ్చి పొలిమేర నుంచే సాదరంగా ఆహ్వానించిన తీరుకు జగన్ కళ్లు చెమర్చాయి. వయోభారంతో బాధపడుతున్న మహిళలు కూడా తాత్కాలిక గుడారాల నుంచి బయటికొచ్చి జగన్‌తో చేయి కలిపేందుకు పోటీపడ్డారు. ప్రతి ఒక్కరికీ చేయందిస్తూ, వృద్ధులను, పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి కుటుంబానికీ రూ.5,000 చొప్పున సాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ నేతలు ప్రకటించారు. ముమ్మిడివరం, యానాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీశ్, మల్లాడి కృష్ణారావు పల్లంలో జగన్‌ను కలిశారు.

హైదరాబాద్ చేరుకున్న జగన్

హైదరాబాద్/గన్నవరం (కృష్ణా), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం ఆయన నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల ప్రచారానికి బయల్దేరి వెళ్తారు. 4, 5, 6 తేదీల్లో అక్కడ ప్రచారంలో పాల్గొంటారు.
Share this article :

0 comments: