శ్రీ రామనవమి కానుకగా రాష్ట్ర ప్రజలకు కిరణ్ సర్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శ్రీ రామనవమి కానుకగా రాష్ట్ర ప్రజలకు కిరణ్ సర్కారు

శ్రీ రామనవమి కానుకగా రాష్ట్ర ప్రజలకు కిరణ్ సర్కారు

Written By ysrcongress on Saturday, March 31, 2012 | 3/31/2012

కుటీర, చేతి వృత్తుల వారిపైనా దయలేదు.. 
పంచాయతీలు, మునిసిపాలిటీల్లో చీకట్లే 
చిన్న, భారీ పరిశ్రమలకూ బాదుడే...
ప్రార్థనా మందిరాలనూ వదల్లేదు..
ఉచిత కరెంటుకు కూడా చార్జీలు
నర్సరీలు, ఉప్పు కయ్యలకూ షాక్..
బిల్లు లేటుగా కడితే డబుల్ షాక్
ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమలు
ఎవర్నీ వదల్లేదు.. అందరికీ షాకులే
రూ. 4,442 కోట్ల బాదుడు.. సర్కారు శ్రీరామనవమి స్పెషల్

శ్రీ రామనవమి కానుకగా రాష్ట్ర ప్రజలకు కిరణ్ సర్కారు మర్చిపోలేని షాకిచ్చింది. కనీవినీ ఎరగని రీతిలో కరెంటు చార్జీలను వడ్డించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా ప్రజలపై రూ.4,442 కోట్ల భారం మోపింది. చివరికి ఉచిత కరెంటును కూడా వదల్లేదు. వారూ వీరని తేడా లేకుండా అన్ని వర్గాలకూ భారీగా వడ్డించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసీ ముగియగానే జనాల వీపును విమానం మోత మోగించింది! ఈఆర్‌సీ నుంచి ప్రతిపాదనలు వచ్చాక సబ్సిడీ భారాన్ని భరించడాన్ని పరిశీలిస్తామంటూ ఇంతకాలంగా మభ్యపెడుతూ వచ్చి, చివరికి శుక్రవారం ఒక్కసారిగా బాంబు పేల్చింది. ఆదివారం నుంచి కొత్త చార్జీలను అమలు చేస్తామని ప్రకటించి జనాన్ని ఏప్రిల్ ఫూల్స్ చేసింది.

2012-13కు నూతన కరెంటు టారిఫ్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈఆర్‌సీ నుంచి నాలుగు రోజుల క్రితమే వచ్చిన ఈ ప్రతిపాదనలకు ఎలాంటి మార్పులూ చేయకుండానే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. పైగా పంచాయతీలకు, కుటీర పరిశ్రమలకు, వ్యవసాయానికి లేని కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలు కూడా చివరి ఆదేశాల్లో వచ్చి చేరాయి. కరెంటు చార్జీలను మరో ఐదేళ్లు పెంచేది లేదన్న దివంగత సీఎం వైఎస్ హామీని కిరణ్ సర్కారు నిలువునా తుంగలో తొక్కింది. అన్ని వర్గాల ప్రజలకూ చార్జీలను పెంచింది. టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేసి గృహ వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సాగుకు ఏడు గంటలకు మించి కరెంటు వాడితే యూనిట్‌కు ఏకంగా రూ.3.25 వసూలు చేసే ఉచిత విద్యుత్‌కూ క్రమంగా మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా వైఎస్ ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్ హామీని తుంగలో తొక్కింది. 2012-13కు రూ.36,090 కోట్ల స్థూల వార్షికాదాయ వ్యయాన్ని డిస్కంలు ప్రతిపాదించగా, రూ.34,343.89 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. వ్యవసాయం, గృహ, ఎత్తిపోతల పథకాలకు రూ.5,358.67 కోట్ల సబ్సిడీని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తానికి మే నెలలో ఎండలతో పాటు కరెంటు బిల్లులు కూడా జనాలకు ముచ్చెమటలు పట్టించనున్నాయి. - న్యూస్‌లైన్, హైదరాబాద్

ఇంటికి షాక్....

మీ ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, ఫ్రిజ్, టీవీ ఉన్నాయా? ఉంటే ఇక మీ ఇల్లు గుల్లే! కరెంటు బిల్లుతో మీ గుండె గు‘బిల్లు’మనడం ఖాయం. 0-50 యూనిట్ల లోపు వినియోగించే వారికి తప్ప మిగతా వారందరికీ, అంటే కోటికి పైగా వినియోగదారులకు షాక్ కొట్టనుంది. యూనిట్ విద్యుత్ చార్జీలు ఏకంగా 55 పైసల నుంచి రూపాయి దాకా పెరిగాయి! కనెక్టెడ్ లోడ్ (ఇంట్లోని కరెంటు ఉపకరణాల సామర్థ్యం) 500 వాట్స్‌లోపు ఉన్న వారిని ఒక కేటగిరీగా పేర్కొనగా, దాటిన వారిని ప్రత్యేక కేటగిరీగా పేర్కొన్నారు. వినియోగదారుల్లో మెజారిటీ ఇలా 500 వాట్లు దాటినవారే. వారికి 100 యూనిట్ల దాకా అమలవుతున్న టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేశారు. ఫలితంగా 100 యూనిట్ల వరకు యూనిట్‌కు ఏకంగా రూ.2.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా వారిపై ఏకంగా 60 శాతం దాకా భారం పడనుంది.

చేతి వృత్తులు ఖలాస్...

గ్రామాల్లో కరెంటు కోతలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చిన్నాభిన్నమవుతుంటే.. గోరుచుట్టుపై రోకటిపోటులా చేతి, కుల వృత్తులకూ సర్కారు షాకిచ్చింది. మరమగ్గాలు, దోబీ ఘాట్లతో పాటు పౌల్ట్రీ ఫారాలు, విస్తర్ల తయారీ వంటి చేతి, కుల వృత్తులవారు వాడే కరెంటుకు చార్జీలను యూనిట్‌కు ప్రస్తుతమున్న రూ.1.80 నుంచి ఏకంగా రూ.2.67కు పెంచింది. విద్యుత్ సంస్థలు ఈ ప్రతిపాదనే చేయకపోవడం గమనార్హం. వ్యవసాయాధారిత చిన్న పరిశ్రమలకు కూడా చార్జీలను రూ.1.80 నుంచి రూ. 2.67కు పెంచారు. ఆత్మహత్యలతో కుదేలవుతున్న మరమగ్గ కార్మికులను పట్టించుకోకపోగా, వారిపైనా మరింతగా చార్జీల భారం మోపారు! 

ఉచిత కరెంటుకు మంగళం....

వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి క్రమంగా మంగళం పాడాలని ప్రభుత్వం భావిస్తోంది. 2009 ఎన్నికల హామీ అయిన 9 గంటల ఉచిత విద్యుత్‌ను కూడా అమలు చేయబోమని తాజా టారిఫ్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఉచిత విద్యుత్ పరిమితి 7 గంటలు దాటితే ప్రతి అదనపు యూనిట్‌కూ రూ.3.25 వసూలు చేయాలని ఈఆర్‌సీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చార్జీలను మున్ముందు క్రమంగా 7 గంటల కరెంటుకు కూడా వర్తింపజేస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎత్తిపోతల పథకాల కరెంటు భారాన్నీ జనం నెత్తినే రుద్దేందుకు రంగం సిద్ధమైంది. ఎత్తిపోతల కింది రైతులు 7 గంటలకు మించి వాడే ప్రతి యూనిట్‌కూ రూ.3.50 వసూలు చేయాలని నిర్ణయించారు. కార్పొరేట్, ఐటీ రైతులకు చార్జీలను రూ.1.50 నుంచి రూ.2.50కు పెంచారు. 2.5 ఎకరాలకు మించిన మాగాణి ఉన్న రైతులతో పాటు మూడుకు మించి కరెంటు కనెక్షన్లున్న మెట్ట రైతుల కరెంటు చార్జీలనూ పెంచేశారు.

చిన్న పరిశ్రమలకు చేదే..

ఇప్పటికే విద్యుత్ కోతలతో లక్షలాది చిన్నపరిశ్రమలు మూసివేతకు గురి అవుతున్నాయి. వీటిపై ఆధారపడిన 20 లక్షల మంది కార్మికుల జీవితాలు గాలిలో దీపాల మాదిరిగా వేలాడుతున్నాయి. వాటిపై కనికరం చూపాల్సింది పోయి, చార్జీలను యూనిట్‌కు రూ.4.13 నుంచి రూ.5కు పెంచారు. పుట్టగొడుగులు, కుందేళ్ల పెంపకంతో పాటు పౌల్ట్రీ ఫారాల చార్జీలను రూ.4.13 నుంచి 5కు పెంచారు. చెరకు క్రషింగ్ చార్జీలను 75 పైసల నుంచి ఏకంగా రూ.1.62కు పెంచారు. చేపల, రొయ్యల పెంపకానికి కరెంటు చార్జీలను రూ.1.25 నుంచి 2.12కు పెంచారు. చిన్నతరహా పరిశ్రమలతో పాటు చిన్నతరహా వాణిజ్య సంస్థలకు రూ.50 పైసల దాకా పెంచారు. కనెక్టెడ్ లోడు 500 వాట్లు దాటిన చిన్నతరహా వాణిజ్య సంస్థలకు కూడా టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేయడంతో వాటిపైనా భారం మరింతగా పడనుంది.

పంచాయతీల్లో ఇక చీకట్లే..

పంచాయతీలకు వచ్చే కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని వైఎస్ హామీనిచ్చారు. కానీ ఆయన మరణానంతరం ఈ ప్రభుత్వం ఆ భారాన్ని పంచాయతీలపైనే మోపింది. పంచాయతీలు ఇప్పటికే సుమారు రూ.600 కోట్ల దాకా బిల్లులు బకాయి పడ్డాయి. వాటిని తీర్చకపోవడంతో అనేక పంచాయతీల్లో చీకట్లు అలుముకున్నాయి. తాజాగా వాటికీ చార్జీలు పెంచారు. వీధి దీపాలు, మంచినీటి సరఫరా కరెంటు చార్జీలను 100 శాతానికిపైగా పెంచారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంచినీటి, వీధి దీపాల చార్జీలను 50 పైసల నుంచి 82 పైసల దాకా పెంచారు.

భారీ పరిశ్రమలకు బాదుడు..

భారీ పరిశ్రమలనూ ప్రభుత్వం భారీగా బాదేసింది. హెచ్‌టీ కేటగిరీ పరిశ్రమలకు యూనిట్‌కు రూపాయి నుంచి రూ.1.28 దాకా పెంచింది. వాటి ఫ్యాన్లు, లైట్ల వాడకం చార్జీలనూ భారీగా పెంచింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు యూనిట్‌కు రూ.2.65 ఉన్న చార్జీలను కేవీని బట్టి 3.65 నుంచి 4.48 దాకా పెంచింది.

ఇతర అంశాలు....
వైమానిక రంగానికి ప్రస్తుతం వాణిజ్య కేటగిరీ కింద విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా దాన్ని ప్రత్యేక కేటగిరీగా గుర్తించి, కేవీని బట్టి యూనిట్‌కు రూ.4.54 నుంచి రూ.5.39 దాకా బాదాలని నిర్ణయించారు.
ప్రార్థనా మందిరాలకు 200 యూనిట్ల వరకు ప్రస్తుతమున్న రూ.2 చార్జీని 2.60కి, ఆపైన రూ.4 నుంచి 4.60కి పెంచారు.
తాత్కాలిక విద్యుత్ సరఫరా చార్జీలను కూడా యూనిట్‌కు 68 పైసల నుంచి 70 పైసల వరకూ పెంచారు.
రైల్వే ట్రాక్షన్ విద్యుత్ చార్జీలు 4.45 నుంచి 5.43కు పెరిగాయి.
గ్రామీణ విద్యుత్ సహకార సంస్థల్లో అనకాపల్లి రెస్కోకు 0.83 నుంచి 1.20కు, చీపురుపల్లి రెస్కోకు 0.62 నుంచి 0.67కు, సిరిసిల్ల రెస్కోకు 0.47 నుంచి 0.66, కుప్పం రెస్కోకు 0.28 నుంచి 0.32కు చార్జీలను పెంచారు.
అడ్వర్‌టైజింగ్ హోర్డింగ్స్‌కు రూ.8.50 నుంచి రూ.9కు పెరిగాయి.
ఉప్పు కయ్యలు, గ్రామీణ నర్సరీలకు రూపాయి నుంచి రూ. 2.12కు పెరిగాయి.
Share this article :

0 comments: