నిద్రావస్థలో సర్కారు... చిమ్మచీకట్లో రాష్ట్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిద్రావస్థలో సర్కారు... చిమ్మచీకట్లో రాష్ట్రం

నిద్రావస్థలో సర్కారు... చిమ్మచీకట్లో రాష్ట్రం

Written By ysrcongress on Tuesday, March 27, 2012 | 3/27/2012

* విద్యుత్ కోతలతో ప్రజలు విలవిల
* డిమాండ్ 300 మిలియన్ యూనిట్లు.. సరఫరా 250 ఎంయూలే..
* గ్రామాలకు 9-10 గంటలపాటు కోత.. మండల కేంద్రాల్లో 6-8 గంటలు, జిల్లా, మున్సిపాలిటీల్లో 4-6 గంటలు కట్
* వ్యవసాయానికి కనీసం 3-4 గంటలు కరెంటు రాని దుస్థితి
* అదనపు విద్యుత్ కొనుగోలుకు అనుమతివ్వని సర్కారు
* ఏకంగా యూనిట్‌కు రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్న పరిశ్రమలు
* విద్యుత్ కోత ఎత్తివేస్తామని చిన్నతరహా పరిశ్రమలకు ఇచ్చిన హామీని మరచిన సర్కారు 
* విద్యార్థులకు పరీక్షా కాలం.. బుడ్డి దీపాలు, కొవ్వొత్తులే దిక్కు..
* నెలాఖరుకు శ్రీశైలంలో జలవిద్యుత్ కేంద్రం మూత!

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రం అంధకారమయమైంది. కరెంటు కోతలతో అల్లాడుతోంది. కొవ్వొత్తులు, బుడ్డిదీపాల వెలుగులో ఆంధ్రప్రదేశ్ కాస్తా.. ‘అంధ’ప్రదేశ్‌గా మారింది. ముందు చూపులేని పాలకుల విధానాలు, ప్రజాశ్రేయస్సు పట్టని పెద్దల చర్యలతో రాష్ట్రం చీకట్లో మగ్గుతోంది. పల్లె..పట్టణం తేడాలేకుండా.. వేళలతో నిమిత్తం లేకుండా.. విచ్చలవిడిగా సర్కారు విధిస్తున్న కోతలతో ప్రజలు ఉక్కపోతలతో విలవిల్లాడుతున్నారు. డిమాండ్ చుక్కల్ని తాకుతున్నా.. సరఫరా మాత్రం సబ్‌స్టేషన్లను దాటడం లేదు. అదనపు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజల కష్టాలను తీర్చాల్సిన సర్కారు మొద్దునిద్ర పోతోంది. పైగా అదనపు విద్యుత్ కొనుగోలు చేయొద్దంటూ విద్యుత్ సంస్థలకు ఆదేశాలు జారీచేయడం ఏలినవారి నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పల్లెలో రోజుకు 9నుంచి 10 గంటలవరకు కోతలు అమలవుతున్నాయి. ఇక మండల కేంద్రాల్లో 6-8 గంటలు, జిల్లా, మున్సిపాలిటీల్లో 4-6 గంటలపాటు కరెంటు ఉండడంలేదు. రాష్ట్ర రాజధానిలోనూ 2-3 గంటలపాటు కోతలు విధిస్తున్నారు. 

పరిశ్రమల పరిస్థితి దుర్భరంగా తయారైంది. నెలలో ఏకంగా 12 రోజులపాటు కోతలు అమలవుతుండగా.. భారీ వాణిజ్య సంస్థలకు మాత్రం డిమాండ్‌లో కేవలం 60 శాతమే సరఫరా చేస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమలకు ‘చిన్నచూపే’ ఎదురవుతోంది. వీటికి కోతలు ఎత్తివేస్తామని ప్రకటించి 20 రోజులవుతున్నా ఇప్పటికీ సర్కారు హామీ అమలుకు నోచుకోలేదు. ఫలితంగా 20 లక్షల మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు కరెంటు ఎప్పుడు ఇస్తారో.. ఎప్పుడు తీస్తారో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక అన్నదాతలపై సర్కారు కత్తిగట్టింది. వ్యవసాయానికి కనీసం 3-4 గంటలపాటు విద్యుత్ సరఫరా కాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే ఓ వైపు కరువు, మరోవైపు కోతలతో రైతన్న పరిస్థితి దుర్భరంగా మారింది. నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో చేలోకి పశువుల తోలే ధైన్య పరిస్థితి అన్నదాతది.

పరిశ్రమలకు సై.. సర్కారు మాత్రం ‘నై’..
రాష్ట్రంలో పరిశ్రమలకు నెలకు 12 రోజుల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో అధిక ధర చెల్లించి పరిశ్రమలు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం తమకు ఓపెన్ యాక్సెస్‌కు అనుమతి ఇవ్వాలంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా 60కిపైగా పరిశ్రమలు... విద్యుత్ సంస్థలకు దరఖాస్తు చేసుకున్నాయి. సుమారు 150 మెగావాట్ల మేరకు ఈ పరిశ్రమలు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం ఏకంగా ఒక్కో యూనిట్‌కు రూ.20ని పరిశ్రమలు వెచ్చిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఓ వైపు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా.. అదనపు విద్యుత్ కొనుగోలు దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పైగా అదనంగా విద్యుత్ కొనవద్దని విద్యుత్ సంస్థలకు స్పష్టంగా ఆదేశాలిచ్చింది!దీంతో అదనపు విద్యుత్ మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ కొనేందుకు సంస్థలు ముందుకురావడం లేదు. కానీ, మార్కెట్లో విద్యుత్ లేదంటూ సర్కారు బుకాయిస్తోంది. 

విద్యార్థులకు నిజంగా ‘పరీక్షా’ కాలమే..
సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అసలు పరీక్షల కంటే కోతల పరీక్షలే లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారాయి. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కోతలొద్దని సీఎం నుంచి ఇంధనశాఖ ఉన్నతాధికారుల దాకా ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాత్రి పూట గంటల తరబడి కరెంటు పోతోంది.

‘చిన్న’బోతున్న పరిశ్రమలు..
చిన్నతరహా పరిశ్రమలకు విద్యుత్ కోతలను ఎత్తివేస్తామని ఈ నెల 5న ప్రభుత్వం హామీనిచ్చింది. దీంతో అప్పటివరకూ ఆందోళన చేసిన ఆంధ్రప్రదేశ్ చిన్నతరహా పరిశ్రమల సంఘాల సమాఖ్య నేతలు నిరసనను విరమించారు. సర్కారు హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు ద్వారా అదనంగా 250 మెగావాట్లు ఉత్పత్తి చేస్తామని... తద్వారా చిన్నతరహా పరిశ్రమలకు కోతలు ఎత్తివేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్-ఎల్‌ఎన్‌జీ సరఫరాకు తొలుత మొండికేసిన రిలయన్స్ సంస్థ ఎట్టకేలకు తాజాగా అంగీకరించింది. అయితే సర్కారు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల అదిప్పటికీ సరఫరాకు నోచుకోలేదు. ఫలితంగా చిన్నతరహా పరిశ్రమలకు ఇప్పటికీ కోతలు అమలవుతున్నాయి. దాంతో 20 లక్షల మంది కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. 

డిమాండ్ ఆకాశంలో.. సరఫరా పాతాళంలో... 
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. గత వారం రోజులుగా సగటున విద్యుత్ డిమాండ్ 300 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మేరకు నమోదవుతోంది. సరఫరా 250 ఎంయూలకు మించడం లేదు. సర్కారేమో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనేందుకు సిద్ధపడటం లేదు. దాంతో కోతలు పెరుగుతున్నాయి. మార్చి 24న డిమాండ్ 291 ఎంయూ కాగా సరఫరా 247 ఎంయూలే. దాంతో 44 ఎంయూల మేర విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. 

నెలాఖరుకు శ్రీశైలం మూత! 
రాష్ట్రంలో ప్రస్తుతం 14 ఎంయూల జల విద్యుదుత్పత్తే, అదీ ప్రధానంగా శ్రీశైలం ద్వారానే జరుగుతోంది. అక్కడ గతేడాది ఇదే సమయంలో 30 ఎంయూ ఉత్పత్తి చేయగా ప్రస్తుతం 7 టీఎంసీల నీరే విద్యుదుత్పత్తికి అందుబాటులో ఉంది. రోజుకు టీఎంసీ చొప్పున వాడినా ఈ నెలాఖరుకల్లా శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుందన్నమాట!
Share this article :

0 comments: