సెమీ ఫైనల్స్‌లో కాంగ్రెస్ ఖల్లాస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సెమీ ఫైనల్స్‌లో కాంగ్రెస్ ఖల్లాస్

సెమీ ఫైనల్స్‌లో కాంగ్రెస్ ఖల్లాస్

Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012


ఉత్తరప్రదేశ్: పనిచేయని రాహుల్ కరిష్మా.. ఎస్పీ జయభేరి 
పంజాబ్: అధికారం నిలుపుకున్న అకాలీదళ్-బీజేపీ కూటమి 
గోవా: అధికార కాంగ్రెస్‌కు పరాభవం... బీజేపీ విజయకేతనం 
మణిపూర్: కాంగ్రెస్ అధికారం పదిలం.. వరుసగా మూడో గెలుపు 
ఉత్తరాఖండ్: ఎవరికీ మెజారిటీ లేదు.. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ 

పిడుగుపాటు... కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌పై కాంగ్రెస్ పెట్టుకున్న కోటి ఆశలనూ సమూలంగా తుడిచిపెట్టిన పిడుగుపాటు. యువరాజు రాహుల్ భావి రాజకీయ ఆకాంక్షలకూ కోలుకోలేని ఎదురుదెబ్బ. 2014 లోక్‌సభ ఎన్నికలకు ‘సెమీ ఫైనల్స్’గా పరిగణించిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ సైకిల్ సునామీ ధాటికి కాంగ్రెస్ పూర్తిగా కుదేలైంది. పూర్వవైభవం దిశగా పార్టీని పరుగులు పెట్టిస్తాడనుకున్న రాహుల్, ఓటర్లను ఏమాత్రమూ ప్రభావితం చేయలేక ఉసూరుమనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ ట్రంప్ కార్డు అఖిలేష్ యాదవ్ ఆల్‌రౌండ్ షో ముందు ఆద్యంతం అన్ని విషయాల్లోనూ పూర్తిగా తేలిపోయారు. ఆహార్యం నుంచి హావభావాల దాకా అన్నింట్లోనూ పరాయి వ్యక్తిగానే తోచిన రాహుల్ బాబును యూపీ ఓటర్లు పూర్తిగా పక్కన పెట్టారు. అన్ని విషయాల్లోనూ తమలో ఒకడిగా కలిసిపోయిన అఖిలేష్‌నే తమ వాడనుకున్నారు. దాంతో ఎస్పీ ఏకంగా 225 స్థానాలతో విజయదుందుభి మోగించి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో మునిగిపోతే, కాంగ్రెస్ మాత్రం కనాకష్టంగా 28 సీట్లు దక్కించుకుని బిక్కముఖం వేసింది. 

2007లో కన్నా ఆరు స్థానాలు పెరిగినా.. అవన్నీ మిత్రపక్షం ఆర్‌ఎల్డీ పుణ్యమే కావడం కాంగ్రెస్ దుస్థితికి మరింతగా అద్దం పట్టింది! రాహుల్ సొంత లోక్‌సభ స్థానం అమేథీలో కాంగ్రెస్ కేవలం రెండు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవడాన్ని పార్టీ నేతలతో పాటు శ్రేణులు కూడా ఏమాత్రమూ జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీలోనైతే కాంగ్రెస్ పూర్తిగా సున్నా చుట్టి తెల్లముఖం వేసింది! రాహుల్ తర్వాత తమ తురుపుముక్కగా భావిస్తున్న సోనియా తనయ ప్రియాంక కూడా పిసరంతైనా ప్రభావం చూపలేకపోయారు. ఇక అన్ని వర్గాలనూ దూరం చేసుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి యూపీ ఓటర్ల తిరస్కారానికి గురై అధికారాన్ని కోల్పోయారు. 

మరోవైపు ఈ ఫలితాలు రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రశ్నార్థకం చేశాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలపైనా ఇవి పెను ప్రభావం చూపడం ఖాయమని, ముఖ్యంగా రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా పేర్కొనే సాహసం కూడా కాంగ్రెస్ చేయకపోవచ్చని చెబుతున్నారు. యూపీఏ-2 ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఈ ఫలితాలు భారీ దెబ్బేనని, 2014 నాటికి మెజారిటీ మిత్రులు పార్టీకి దూరం కావచ్చని అంచనా వేస్తున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దారుణ ఓటమి చవిచూసి అధికారం కోల్పోయింది. పంజాబ్‌లో కూడా మరోసారి భంగపడి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కాగా, ఉత్తరాఖండ్‌లోనూ మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయి ఆపసోపాలు పడుతోంది. మణిపూర్‌లో హ్యాట్రిక్ కొట్టడం ఒక్కటే పార్టీకి కాస్తలో కాస్త ఊరట...!
Share this article :

0 comments: