సుప్రీంకోర్టు జోక్యంతో మలుపు తిరగనున్న విచారణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టు జోక్యంతో మలుపు తిరగనున్న విచారణ

సుప్రీంకోర్టు జోక్యంతో మలుపు తిరగనున్న విచారణ

Written By ysrcongress on Tuesday, March 13, 2012 | 3/13/2012

సాక్షిలో పెట్టుబడుల కేసు... 
8 మంది ఐఏఎస్‌లకు, సీబీఐకి కూడా నోటీసులు
రంగంలోకి దిగిన సర్వోన్నత న్యాయస్థానం
26 జీవోలకు సంబంధించి సమాధానమివ్వాలని ఆదేశాలు
ఆ జీవోల ఆధారంగానే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన హైకోర్టు 
అవన్నీ అక్రమంగా ఇచ్చారని ఆరోపించిన శంకర్రావు, టీడీపీ నేతలు
దానికి బాధ్యుడిగా జగన్‌మోహన్‌రెడ్డినే టార్గెట్ చేసిన దర్యాప్తు సంస్థ
ఇది సరికాదంటూ న్యాయపోరాటానికి దిగిన లాయర్ సుధాకర్‌రెడ్డి
ఆది నుంచీ ఈ కేసులో మౌనాన్నే ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
తాము సమాధానమిస్తే కేసు వీగిపోతుందేమోననే భయం
హైకోర్టు నోటీసులిచ్చినా స్పందన నో; సీబీఐ ‘చూసుకుంటుందనే’ ధీమా
దానికి తగ్గట్టే... మీడియాతో కలిసి మరీ రెచ్చిపోయిన సీబీఐ
లీకులిస్తూ... వైఎస్సార్ ప్రతిష్టను దెబ్బతీయటానికి శక్తికి మించి యత్నాలు
సుప్రీంకోర్టు జోక్యంతో మలుపు తిరగనున్న విచారణ

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ సాగిస్తున్న ఏకపక్ష దర్యాప్తును సరిదిద్దటానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ‘‘జరిగింది తప్పో కాదో ముందు తేల్చండి. తప్పు అని తేలితే కారకుల్ని దోషుల్ని చేయండి. అంతే తప్ప దోషులుగా ఎవరిని చూపించాలో ముందే నిర్ణయించేసుకుని.. ఆనక వారి వ్యవహారాలన్నీ తప్పులేనని చూపించే ప్రయత్నాలు మానండి’’ అంటూ జగతి పబ్లికేషన్స్, జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచీ చేస్తున్న వాదనల్ని సర్వోన్నత న్యాయస్థానం తన చర్యల ద్వారా సమర్థించింది. కేసులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన సీబీఐ.. ఉద్దేశపూర్వకంగానే ఆ ఎఫ్‌ఐఆర్‌లో నాటి కేబినెట్ మంత్రులు, ఐఏఎస్ అధికారులను చేర్చలేదంటూ నెల్లూరు జిల్లా కనుపర్తిపాడుకు చెందిన న్యాయవాది పి.సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్‌మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం దీనిని విచారణకు స్వీకరించటంతో పాటు.. పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్న నాటి మంత్రులు ఆరుగురికి (వారు ఇప్పుడూ మంత్రులే), ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు.. సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది. 

కేసు వీగిపోతుందనే భయంతోనే...? 

ఎవరైనా ఏదైనా ఒక జీవోను కోర్టులో సవాల్ చేస్తే..? ఒక కార్యదర్శినో, మరొక అధికారినో ప్రతివాదిగా చేరిస్తే..? వెంటనే సంబంధిత యంత్రాంగమంతా అప్రమత్తమవుతుంది. ఏకంగా అడ్వొకేట్ జనరల్‌నే కోర్టుకు పంపిస్తుంది. అన్ని దశల్లోనూ తమ వాదన వినిపిస్తుంది. కానీ చిత్రమేంటంటే వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన 26 జీవోలను ఎమ్మెల్యే శంకర్రావు, ముగ్గురు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు ఏకంగా హైకోర్టులో సవాల్ చేశారు. ఆ జీవోల ద్వారా ప్రభుత్వ ఆస్తుల్ని అక్రమంగా కట్టబెట్టేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ జీవోల్ని జారీ చేసిన అధికారుల్లో ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులూ ఉన్నారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాక రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. 


కానీ చిత్రంగా... రాష్ట్ర ప్రభుత్వం దీనిపై గప్‌చుప్‌గా ఉండిపోయింది. ఆ జీవోలు అక్రమమనో, సక్రమమనో ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితుల్లో కూడా మౌనాన్నే ఆశ్రయించింది. అసలు ఏ అధికారీ, ఏ ప్రభుత్వ న్యాయవాదీ, ఏ అడ్వొకేట్ జనరలూ ఈ కేసులో కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. కారణం ఒక్కటే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సీబీఐ వారి చెప్పుచేతల్లో ఉంది. సీబీఐ ద్వారా తాము ఏం కావాలంటే అది చేయొచ్చు. ఎవరిని కావాలంటే వారిని టార్గెట్ చేయొచ్చు. పెపైచ్చు ఇదేమీ 2జీ కుంభకోణం మాదిరిగా కోర్టు స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్న విచారణ కాదు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జరుపుతున్న విచారణ. అంతే! కోర్టు పర్యవేక్షణలో గనక విచారణ జరిగితే.. అన్యాయం జరిగిందని భావించిన వారు ప్రభుత్వం ఎందుకు కౌంటర్లు దాఖలు చేయలేదంటూ కోర్టులో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. తమను కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ కోర్టుకు విన్నవించే వెసులుబాటు ఉంటుంది. అందుకే పిటిషనర్లు కూడా ఈ కేసులో ‘కోర్టు పర్యవేక్షణలో’ విచారణ జరగాలని డిమాండ్ చేయలేదు. సీబీఐ తనంత తాను చేస్తే చాలన్నారు. కాంగ్రెస్ - టీడీపీ కుమ్మక్కయి జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశాయనటానికి ఇంతకన్నా మరో ఉదాహరణ అక్కర్లేదు కూడా. 

సర్కారుకు తగ్గట్టే సీబీఐ కూడా...

ఆ జీవోలన్నీ నిబంధనల ప్రకారమే ఇచ్చామని, ఎక్కడా నిబంధనల్ని ఉల్లంఘించలేదని గనక చెప్తే.. జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పూర్తిగా వీగిపోతుందని ప్రభుత్వం భయపడింది. ఒకవేళ దివంగత వైఎస్‌ఆర్‌ను దోషిగా చూపాలన్న లక్ష్యంతో తమకు తెలియకుండానే జీవోలు వచ్చాయని చెప్తే అంతా నవ్విపోతారని, మంత్రులంతా ఇరుక్కుంటారని భయపడింది. అందుకే కామ్‌గా ఊరుకుంటే.. కోర్టులో కేసు తేలేదాకా సీబీఐ తన పని తాను చేసుకుపోతుందని, జగన్‌మోహన్‌రెడ్డిని తీవ్ర స్థాయిలో వేధించి, భయపెట్టి అణచివేయటం సాధ్యమవుతుందని ఆశించింది. ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లే సీబీఐ కూడా రెచ్చిపోయింది. ‘‘నా మార్గదర్శకాలు నాకున్నాయి. నేనేం చేయాలో నాకు తెలుసు’’ అన్నట్లుగా సీబీఐ బరితెగించేసింది. సాక్షి గ్రూపు ఇన్వెస్టర్లంతా భయభ్రాంతులయ్యేలా ఏక కాలంలో సోదాలు జరిపి.. టై సృష్టించింది. మీడియాకు లీకులు ఇస్తూ వైఎస్సార్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేసింది. మొత్తమ్మీద డ్రామా ఇప్పటి దాకా అనుకున్నది అనుకున్నట్లుగా సాగిపోయింది. కాకుంటే తాజా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో దీనికి బ్రేక్ పడనుంది. 

అసలు ఉల్లంఘనలు జరిగాయా?

శంకర్రావు, టీడీపీ నేతలు తమ పిటిషన్లలో పేర్కొన్న అన్ని జీవోలనూ ఈ ఎస్‌ఎల్‌పీలో సుధాకర్‌రెడ్డి కూడా ప్రస్తావించారు. ఈ జీవోల్లో ఏదీ కొత్తగా, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చింది లేదని ఉదాహరణలతో సహా స్పష్టం చేశారు. ‘‘సిమెంటు కంపెనీలకు సున్నపురాయి గనుల్ని లీజుకివ్వటాన్ని కూడా అక్రమంగా పేర్కొన్నారు. ఏం? రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఒక్కటే సున్నపురాయి గనుల్ని సిమెంట్ కంపెనీలకు లీజుకిచ్చిందా? అంతకు ముందటి ప్రభుత్వాలు, ఆ మాటకొస్తే దేశంలోని అన్ని ప్రభుత్వాలూ సిమెంటు కంపెనీల్ని అనుమతించేటపుడు వాటికి సున్నపురాయి గనుల్ని లీజుకిస్తూనే ఉన్నాయిగా? రాష్ట్రంలో ఇప్పటిదాకా దాదాపు 55 సిమెంట్ కంపెనీలు వచ్చాయి. వాటన్నిటికీ మైనింగ్ లీజుల్ని ఆయా ప్రభుత్వాలు ఇస్తూనే వచ్చాయిగా? ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ పెడితే ఇక్కడి ప్రభుత్వమే మైనింగ్ లీజు ఇస్తుంది. అంతే తప్ప పక్క రాష్ట్ర ప్రభుత్వం కాదు. జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేయాలని, వైఎస్సార్ ప్రతిష్టను దిగజార్చాలన్న ఏకైక లక్ష్యంతో వాటన్నిటినీ తప్పులుగా చూపిస్తూ.. ఆయనొక్కడినే వేధించటం తగదు’’ అని పిటిషనర్ స్పష్టం చేశారు. ఇలాగే కంపెనీలకు భూ కేటాయింపులు, నీరు, కరెంటు కేటాయింపుల్ని కూడా తప్పులుగా చూపిస్తూ దర్యాప్తు సాగిస్తుండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఏ రాష్ట్రమైనా తన దగ్గర ఏర్పాటయ్యే కంపెనీలకు నీరు, కరెంటు వంటి కనీస అవసరాలను తప్పకుండా కల్పిస్తుంది. అది దాని బాధ్యత. దాన్నే తప్పుగా చూపిస్తూ.. అలా కల్పించినందుకే వారు జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనటం అరాచకానికి పరాకాష్ట’’ అని పేర్కొన్నారాయన. 

ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్సారే టార్గెట్...

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులకు ప్రయోజనాలు చేకూర్చేలా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, అందుకు ప్రతిగా ఆయా సంస్థలు, వ్యక్తులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు లేఖ రాశారు. దానికి టీడీపీ నాయకులు బెరైడ్డి రాజశేఖరరెడ్డి, అశోక్ గజపతిరాజు తదితరులు తోడై ఇంప్లీడ్ అయ్యారు. కేసులో ప్రధానంగా వారు 26 జీవోలను ఉదహరించారు. ఆయా జీవోల ద్వారా పలు సంస్థలు, వ్యక్తులకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. శంకర్రావు లేఖను టేకెన్ అప్ రిట్‌గా విచారణకు స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు.. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ తరవాత సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తూ అవినీతి నిరోధక చట్టం కింద 71 మంది వ్యక్తుల్ని నిందితులుగా పేర్కొంది. పిటిషన్‌లో 52వ నిందితుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని.. ఎఫ్‌ఐఆర్‌లో ప్రథమ నిందితుడిగా పేర్కొంది. అంతేకాదు. ‘ప్రభుత్వం’ అని చేర్చాల్సిన చోట ఎఫ్‌ఐఆర్‌లో సీఎం.. అని చే ర్చింది. తద్వారా కేసులో అందరినీ వదలిపెట్టి వైఎస్సార్‌ను, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసింది. 

తొలుత ప్రత్యేక కోర్టుకు ఫిర్యాదు...

20 ఏళ్లకు పైగా క్రిమినల్ లాయరుగా అనుభవమున్న సుధాకర్‌రెడ్డి.. హైకోర్టు తీర్పును, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 26 జీవోల ద్వారా వివిధ సంస్థలు, వ్యక్తులకు ప్రయోజనం కలిగించటం, ఆ సంస్థలు జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటమనేదే హైకోర్టు ఆదేశాలకు ప్రాతిపదిక అని గుర్తించారు. ఆరోపణలకు ఆధారమైన 26 జీవోలనూ పరిశీలించారు. ఈ జీవోల జారీకి ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, కార్యదర్శులు బాధ్యులని గుర్తించారు. దీన్ని తొలుత క్రిమినల్ ఫిర్యాదు రూపంలో ప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకొస్తూ, చర్యలు చేపట్టాలని కోరారు. ‘‘ఆ మంత్రుల్ని, ఐఏఎస్‌లను విచారించకపోవటానికి రాజకీయాలే కారణం. తమకు రాజకీయ ప్రత్యర్థిగా మారిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీబీఐని పావులా వాడుకునే ప్రయత్నంలో ఇదొక భాగం. అందుకే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారిని, జీవోలకు కారకులైన వారిని వదిలిపెట్టారు’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 6న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయగా.. అదే నెల 27న కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘‘దీన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా లేదు.. మీకేమన్నా బాధ ఉంటే వెళ్లి సీబీఐకే చెప్పుకోండంటూ వింత కామెంట్ చేస్తూ నా పిటిషన్‌ను తోసిపుచ్చింది’’ అని సుధాకర్‌రెడ్డి వాపోయారు. 

హైకోర్టుకు... ఆపై సుప్రీంకోర్టుకు... 

‘‘నేను ఇరవై ఏళ్లుగా లా ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రత్యేక కోర్టు తప్పు చేసిందని భావించి హైకోర్టుకు వెళ్లా. హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టు వాదననే మన్నించింది. మరో మార్గం లేక.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న అచంచలమైన విశ్వాసంతో ఈ రోజు నా వాదన వినిపించాను. కోర్టువారు దీన్ని మన్నించారు. పిటిషన్‌లో పేర్కొన్న వాదనలో సత్తా ఉందని భావించి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలిచ్చారు’’ అంటూ ఆయన తన న్యాయపోరాటాన్ని వివరించారు. 

శ్రీకృష్ణుడి మాటలే ప్రేరణ: సుధాకరరెడ్డి 

తన న్యాయ పోరాటంతో ఎవరికీ సంబంధం లేదని, ముఖ్యంగా జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఒక న్యూస్ చానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సుధాకరరెడ్డి స్పష్టం చేశారు. కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సత్యానికి, ధర్మానికి అపచారం జరుగుతున్నపుడు దాన్ని నిరోధించగల శక్తి గలవారు నిరోధించాలి. లేకుంటే వారు ఇబ్బంది పడతారు’ అని మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశమే నా పోరాటానికి స్ఫూర్తి. వాస్తవానికి వివాదాస్పద జీవోలన్నింటికీ కర్తలు, కారకులు.. ఏడుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్‌లు. అయితే నాడు మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు చనిపోయినందున ఆయనను ప్రతివాదిగా చేర్చలేదు. జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేయటం తగదు. అప్పటికి ఆయన ఎంపీ కాదు. ఏ రకంగానూ పబ్లిక్ సర్వెంట్ కాదు’’ అని వివరించారు. 


బొత్సకు చట్టంపై అవగాహనలేదు... 

గవర్నర్ జారీచేసిన రూల్స్ ఆఫ్ బిజినెస్ ప్రకారం ప్రతి జీవోకు సంబంధిత సంబంధిత శాఖ కార్యదర్శి, మంత్రి బాధ్యత వహించాలని, మంత్రివర్గ నిర్ణయాలకు సమష్టి బాధ్యత ఉందని, ఏ మంత్రీ తప్పించుకోవటానికి లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ నిర్ణయాలకు తాము బాధ్యత వహిస్తామని, అయితే ఇతరత్రా లాలూచీలకు తమది బాధ్యత ఎలా అవుతుందని అంటున్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తీరును ప్రస్తావించినపుడు ఆయన స్పందిస్తూ.. బొత్సకు చట్టంపై అవగాహన లేదని చెప్పటానికి సంకోచించటం లేదని, వారు చెప్తున్న మాటలు చట్టంపై అవగాహన లేని సంగతిని వెల్లడిస్తున్నాయని, క్రిమినల్ లా ఇన్‌ఫ్లుయెన్స్ థియరీ ఆయనకు తెలియదేమోనని ఆయనన్నారు. క్రిమినల్ లా ప్రకారం ఎవరు చేస్తే వారే బాధ్యులని, కుట్రలో వారే భాగస్తులన్నారు. 26 జీవోల వల్ల కొన్ని కంపెనీలు లబ్ధిపొందాయన్నది ఆరోపణగా ఉందని, ఈ జీవోలన్నీ సాధారణంగా జారీ చేసినవా లేక అతిక్రమించి ఇచ్చినవా అని ప్రశ్నిస్తూ, మంత్రులను ప్రభావితం చేసి జీవోలను ఇప్పించారని బొత్స కనుక చెప్పినట్టయితే, ఇదే థియరీని ఒప్పుకున్నట్టయితే.. ముంబైలో మారణహోమానికి పాల్పడిన కసబ్ కూడా తాను ఒత్తిడి వల్ల చేశానని చెప్పడాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.

నోటీసులు అందుకుంటున్న ప్రతివాదుల జాబితా...

మంత్రులు: 
జె.గీతారెడ్డి: గతంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి. ఇపుడు అదనంగా ఎగుమతుల ప్రోత్సాహ శాఖనూ చూస్తున్నారు. 
ధర్మాన ప్రసాదరావు: అప్పుడు రెవెన్యూ, ఇప్పుడు రోడ్లు, భవనాల శాఖను చూస్తున్నారు.
సబితా రెడ్డి: గతంలో గనులు, జియాలజీ శాఖలు. ప్రస్తుతం హోం, జైళ్లు, అగ్నిమాపక సర్వీసులు, సైనిక సంక్షేమ శాఖల మంత్రి.
పొన్నాల లక్ష్మయ్య: గతంలో భారీ నీటిపారుదల శాఖ. ఇప్పుడు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ.
కన్నా లక్ష్మీనారాయణ: గతంలో పరిశ్రమలు, వాణిజ్య, గృహ నిర్మాణ శాఖలు. ప్రస్తుతం వ్యవసాయశాఖ.
మోపిదేవి వెంకటరమణ: గతంలో మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖలు. ఇప్పుడు ఎక్సయిజ్.

సీనియర్ ఐఏఎస్‌లు: 

డాక్టర్ మన్మోహన్ సింగ్: గతంలో మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి. ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి
వై.శ్రీలక్ష్మి: గతంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖల కార్యదర్శి, తాజాగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
ఎం.శామ్యూల్: గతంలో రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి. ప్రస్తుతం పర్యావరణ, అటవీశాఖలు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఆదిత్యనాథ్ దాస్: గతంలోనూ, ఇప్పుడూ నీటిపారుదల శాఖ కార్యదర్శి.
ఎస్.వి.ప్రసాద్: గతంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్
కె.రత్నప్రభ: గతంలో రెవెన్యూ (రిజిస్ట్రేషన్-2) శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, ప్రస్తుతం సొంత కేడర్ అయిన కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. అక్కడి రెవెన్యూశాఖలో గుల్బర్గా రీజినల్ కమిషనర్‌గా ఉన్నారు.
సి.వి.ఎస్.కె.శర్మ: గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి, ఇప్పుడు హార్టీకల్చర్, సెరీకల్చర్ శాఖల ప్రిన్సిపల్ 
కార్యదర్శి
బి.శ్యాంబాబు: గతంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి

సంస్థ: 
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)
Share this article :

0 comments: