ఉప ఎన్నికలు జాప్యం జరిగేలా వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై మరో కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికలు జాప్యం జరిగేలా వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై మరో కుట్ర

ఉప ఎన్నికలు జాప్యం జరిగేలా వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై మరో కుట్ర

Written By ysrcongress on Saturday, March 10, 2012 | 3/10/2012

* ఈ నెల 2న స్పీకర్ అనర్హత వేటు... 5వ తేదీన అసెంబ్లీలో ప్రకటన
* వారం దాటినా ఎన్నికల సంఘానికి అందని ఖాళీల వివరాలు
* స్పీకర్ ప్రకటన వెంటనే ఈసీకి వివరాలు పంపామన్న అసెంబ్లీ కార్యదర్శి
* ఇంతవరకూ తమకు అందలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
* రాష్ట్రపతి ఎన్నికల లోగా ఉప ఎన్నికలు రాకూడదని కాంగ్రెస్ ఎత్తుగడ

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానిస్తున్న ఎమ్మెల్యేలను మాజీలను చేసిన తర్వాత కూడా వారిపై కుట్రలు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. కోవూరుతో పాటు తెలంగాణలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలతో పాటు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే స్థానాలకు ఎన్నికలు జరగకుండా వ్యూహం అమలు చేసిన కాంగ్రెస్.. తాజాగా మరో కుట్రను అమలు చేస్తోంది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఖాళీ అయిన స్థానాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ద్వారా ఆ సమాచారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుతుంది. ఖాళీల సమాచారం అందాకే ఆ స్థానాల్లో ఉప ఎన్నికల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి, నిర్ణయం ప్రకటిస్తుంది. కానీ ఆ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎంత వీలైతే అంత ఆలస్యం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార కాంగ్రెస్.. ఖాళీల సమాచారం ఈసీకి వెంటనే అందకుండా తెరవెనుక అనేక వ్యూహాలు రచిస్తోంది.

అనర్హత నిర్ణయానికే మూడు నెలలు
రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా 17 మంది ఎమ్మెల్యేలు పార్టీల విప్‌లను ధిక్కరించి డిసెంబర్ 5వ తేదీన జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. విప్ ధిక్కరించటం వల్ల అనర్హతకు గురవుతామని తెలిసినా వారు రైతులు, రైతు కూలీల పక్కన నిలిచారు. ఇలా విప్ ధిక్కరించిన వారిపై కాంగ్రెస్ శాసనసభా పక్షం స్పీకర్‌కు ఫిర్యాదు చేయటానికి కూడా వారం పాటు కాలయాపన చేసింది. ఉపఎన్నికలను ఎదుర్కోవటానికి భయపడి కాంగ్రెస్ జాప్యం చేయగా.. స్పీకర్ కూడా సత్వరం నిర్ణయం తీసుకోకపోవటం పట్ల విమర్శలు వచ్చాయి. పైగా 17 మంది ఎమ్మెల్యేలు స్వయంగా స్పీకర్‌ను కలిసి అనర్హత వేటు వేయాల్సిందిగా లిఖితపూర్వకంగా లేఖలు అందజేశారు. అయినప్పటికీ అంతా ఊహించినట్టే.. ఒక పథకం ప్రకారమే జరిగింది.

ప్రస్తుతం ఉపఎన్నికలు జరుగుతున్న 7 స్థానాలతో పాటే ఈ 17 స్థానాలకు కలిపి మొత్తం 24 సెగ్మెంట్లలో ప్రతికూల ఫలితాలు తప్పవని ఆయా పార్టీలు చేయించుకున్న సర్వేలు తేల్చటంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 7 స్థానాల ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాకే 17 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రకటించారు. అది కూడా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు రోజు రాత్రి అనర్హత నిర్ణయం వెలువడింది. రాజ్యసభ ఎన్నికల్లో అసెంబ్లీలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి వస్తుందని.. రాత్రికి రాత్రి అనర్హత నిర్ణయం వెలువడేలా చేశారు. మార్చి 2న 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి.. శోభా నాగిరెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటన జారీ చేశారు. మార్చి 5న అసెంబ్లీలో ప్రకటన చేశారు.

ఇదీ సంప్రదాయం..
సాధారణంగా ఒక నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడితే శాసనసభ సచివాలయం వెనువెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సమాచారం తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం 190 ప్రకరణ మేరకు రాజీనామా ఆమోదించినట్లు కానీ లేదా అనర్హత వేటు వేసినట్లుగా కానీ స్పీకర్ ప్రకటించిన రోజునే ఆ స్థానం ఖాళీగా ఉన్నట్టు. అయితే దానిపై శాసనసభ సచివాలయం సమాచారం ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని కానీ రాజ్యాంగంలో స్పష్టత లేదు. అయినప్పటికీ పార్లమెంటరీ సంప్రదాయాల మేరకు అటు లోక్‌సభలోనూ ఇటు అసెంబ్లీలోనూ ఈ రకంగా ఖాళీలు ఏర్పడిన వెంటనే ఎన్నికల సంఘానికి సంబంధిత సమాచారం ఇస్తున్నారు.

తాజాగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించిన వెంటనే.. ఆ స్థానం ఖాళీ అయినట్లు తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (రాష్ట్ర పరిధిలోని లోక్‌సభ స్థానం అయినందున)కి సమాచారం పంపించారు. అంతెందుకు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన వెంటనే శాసనసభ సచివాలయం ఆ ఖాళీల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలియజేసింది.

ఉప ఎన్నికల భయంతోనే..
ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఈ 17 స్థానాలకు ఉపఎన్నికలు రాకుండా చేయాలన్న కాంగ్రెస్ ఎత్తుగడ ఇప్పటికే ఫలించింది. అలాగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కాంగ్రెస్ నాయకత్వం 17 మంది ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రకటించటంతో ఆ ప్రమాదం నుంచి కూడా బయటపడింది. అయితే రాబోయే రాష్ట్రపతి ఎన్నిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. వచ్చే జూలై 24 నాటికి ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పదవీ కాలం ముగుస్తోంది. నిబంధన ప్రకారం కాలపరిమితి ముగిసే సమయానికి 60 రోజుల ముందు ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తారు. అంటే మే నెల మూడో వారం లోగా రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలు విడుదల చేయటానికి వీలుంది.

రాష్ట్రపతి ఎన్నికలో దేశ పౌరులందరి అభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో దేశంలోని ఏ ఒక్క అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ స్థానం ఖాళీ ఉంచకూడదన్న సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే దేశంలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. పైగా త్వరలోనే రాజ్యసభ ఖాళీలకు కూడా షెడ్యూలు ప్రకటించనున్నారు. ఈ తరుణంలో రాష్ట్రం నుంచి మరో 17 అసెంబ్లీ స్థానాల వివరాలు పంపిస్తే వాటికి ఎక్కడ వెంటనే ఉప ఎన్నికలు నిర్వహిస్తారోనన్న ఆందోళన కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. ఉప ఎన్నికలు జరిగి ప్రతికూల ఫలితాలొస్తే కాంగ్రెస్ సంక్షోభంలో కూరుకుపోవటం ఖాయమన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆ కారణంగానే ఈ స్థానాలకు ఉపఎన్నికలను గరిష్ట కాలపరిమితి వరకు జరక్కుండా సాగదీయాలని కుట్ర చేస్తున్నారు.

నెల్లూరు లోక్‌సభ స్థానం సమాచారమే అందింది: ఎన్నికల సంఘం
రాష్ట్రంలో ఖాళీ అయిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల సమాచారం శుక్రవారం వరకు తమకు అందలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారవర్గాలు ధ్రువీకరించాయి. నెల్లూరు లోక్‌సభ స్థానం ఖాళీ అయినట్లు లోక్‌సభ సచివాలయం నుంచి సమాచారం అందిందని స్పష్టం చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్ రాజసదారాంను ఇదే విషయంపై ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా.. శాసనసభ స్పీకర్ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపామని పేర్కొన్నారు. బహుశా ఎన్నికల సంఘం వద్ద ఇంకా రిజిస్టర్ కాకపోయి ఉండొచ్చని అన్నారు.
Share this article :

0 comments: