ధీరూభాయ్ అంబానీ మొదట్లో ఒక పెట్రోల్‌బంక్‌లో గుమస్తాగా పనిచేసిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధీరూభాయ్ అంబానీ మొదట్లో ఒక పెట్రోల్‌బంక్‌లో గుమస్తాగా పనిచేసిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు

ధీరూభాయ్ అంబానీ మొదట్లో ఒక పెట్రోల్‌బంక్‌లో గుమస్తాగా పనిచేసిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012

జగన్ ఆస్తుల కేసుకు, జీవోలకు సంబంధం లేదని సీఎం చెప్పడం విడ్డూరం
శంకర్రావు, మంత్రులు, టీడీపీ నేతలు కేసు వేసిందే ఆ జీవోలపై..
శంకర్రావుకు మంత్రి పదవే క్విడ్ ప్రో కో
జీవోలన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయా.. లేదా? అనే ది ప్రభుత్వమే తేల్చాలి
స్టేలు కావాలంటూ కాలయాపన చేయొద్దు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మంత్రులకు, అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనైనా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు చట్టబద్ధమైనవేనా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ జీవోల వ్యవహారాన్ని సీబీఐ విచారించాల్సి ఉందని, అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు, మంత్రులకిచ్చిన నోటీసులకు సంబంధం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోల వల్లే జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయంటూ మాజీ మంత్రి శంకర్రావుతో కలిసి టీడీపీ నేతలు కేసులు వేసిన విషయం సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు గుర్తించాలని సూచించారు. 

ఇప్పటికైనా ఆ 26 జీవోలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనేది వెల్లడించాలని సోమయాజులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు నోటీసులు విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే వారికి కేసు అర్థం కాలేదనుకోవాలా? లేదా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా? కొందరు మంత్రులు.. జీవోలతో సంబంధం ఉంది కానీ దాని వెనుక జరిగిన లాలూచీతో సంబంధం లేదంటున్నారు. అయితే హైకోర్టు అడిగింది జీవోలు కరెక్టా? కాదా? అన్నదే తప్ప దాని వెనుక ఏం జరిగిందని కాదు. దానిపై వివరణ ఇవ్వకుండా డొంకతిరుగుడు వ్యాఖ్యలు సరికాదు’’ అని అన్నారు. ‘‘టీడీపీ నేతల మాదిరిగా మేం ఎవర్నీ రాజీనామా చేయమని కోరడం లేదు. కానీ ఆ 26 జీవోలు కరెక్టా.. కాదా అనేది త్వరగా చెప్పండి. సుప్రీం నోటీసులపై ‘స్టే’ లు, సమయం కావాలంటూ కాలయాపన చేయవద్దు’’ అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

టీడీపీది సరికొత్త డ్రామా!: జీవోలకు సంబంధించి కోర్టులో నెలలపాటు వాదనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురిచేస్తే, సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యం టీడీపీ నేతల ప్రవర్తన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోందని సోమయాజులు పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ నేత శంకర్రావుతో కలిసి కోర్టును ఆశ్రయించింది టీడీపీ నేతలేనన్న విషయం ప్రజలకు గుర్తుంది. జీవోలకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే టీడీపీ నాయకులు కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. ప్రతి విషయంలో గొడవ చేసే టీడీపీ నేతలు.. విచారణ సందర్భంగా సీబీఐ.. నియమ, నిబంధనలను అతిక్రమిస్తున్నప్పటికీ ఏనాడు ప్రశ్నించలేదు. తీరా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చాక మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం చాలా చిత్రంగా ఉంది’’ అని అన్నారు.

కోర్టే పర్యవేక్షించి ఉంటే.. ఆ రోజే నిలదీసేది..: సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో తాజాగా టీడీపీ నేతలు.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను స్పీకర్ ముందు పెట్టాలని డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని సోమయాజులు అన్నారు. అధికార పక్షంతో కుమ్మక్కై కేసులు వేసి, తిరిగి అవే జీవోలను స్పీకర్ ముందు పెట్టాలంటున్న టీడీపీ నేతల తీరు ప్రజలు గమనించాలన్నారు. జగన్‌ను ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలీ, ఎలా బలిపశువును చేయాలీ అనే ఏకైక ఎజెండాతోనే కాంగ్రెస్-టీడీపీలు ముందుకెళ్తున్నాయని, అందుకే సీబీఐ బరితెగింపును ప్రశ్నించలేదని ఆయన విమర్శించారు. జగన్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐని కోర్టు పర్యవేక్షించి ఉంటే జీవోల విషయమై ప్రభుత్వాన్ని ఆ రోజే నిలదీసేదని, అందుకే వీళ్లు కావాలని తెలివిగా కాంగ్రెస్ ప్రభుత్వ అదుపాజ్ఞలో పనిచేసేటట్లు జాగ్రత్త పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్-టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు క్విడ్ ప్రో కో జగన్ విషయంలో జరగలేదని, అసలు జరిగింది హైకోర్టుకు లేఖ రాసిన శంకర్రావు విషయంలోనని సోమయాజులు తెలిపారు. శంకర్రావు హైకోర్టుకు 2009 నవంబర్ 25న లేఖ రాసిన తర్వాత డిసెంబర్ 1న మంత్రి పదవి వచ్చిందని, దీన్ని ఎలా భావించాలని ప్రశ్నించారు.

వైఎస్ హయాంలో అన్నీ చట్టబద్ధమే..: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన అంతా చట్టబద్ధంగానే సాగిందని సోమయాజులు చెప్పారు. కానీ టీడీపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ‘‘సిమెంట్ కర్మాగారాలకు రాయితీలిచ్చే పద్ధతిని 1950 నుంచే రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. ఇదేమీ వైఎస్ కొత్తగా ప్రవేశపెట్టలేదు. వైఎస్‌కు ముందున్న ప్రభుత్వాలు కూడా రాశి సిమెంట్, డెక్కన్ లాంటి ఎన్నో కంపెనీలకు మైనింగ్, నీళ్లు, విద్యుత్‌లను రాయితీకి అందించాయి. కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీ ఇవ్వకపోతే అవి ఎలా మనుగడ సాగిస్తాయి? అవేమీ పై నుంచి ఊడిపడలేదు కదా?’’ అని అన్నారు.

కోర్టుకు సీబీఐ తప్పుడు సమాచారం..: ‘‘పెన్నా సిమెంట్‌కు వైఎస్ లబ్ధి చేకూర్చారని ఒక పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోంది. సీబీఐ కూడా కోర్టుల్లో తప్పుడు సమాచారం ఇచ్చింది. పెన్నా సిమెంట్‌కు వైఎస్ లబ్ధి చేకూర్చారని, ఆ కంపెనీకి 13 టీఎంసీల నీరిచ్చి లబ్ధి చేకూర్చారని ఒక వర్గం మీడియాలో వచ్చే కథనాలనే చెప్పింది. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో సీబీఐ ఉంది. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చింది 0.013 టీఎంసీలు. అంతెందుకు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం రాజమండ్రి నుంచి కిలో లీటరు నీటిని రూ.40 ఖర్చు చేసి కంపెనీకి కేవలం రూ.8కే అందజేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి’’ అని సోమయాజులు అన్నారు. ‘‘హైదరాబాద్‌లో హోటళ్ల నిర్మాణానికి, అంతస్తు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీని వల్ల హోటళ్ల రంగం ఊపందుకొని చాలా మంది నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఒకరు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, దీన్ని కూడా జగన్‌కు ముడిపెట్టడం ఎంత వరకు సమంజసం? కంపెనీలకు ఇచ్చే రాయితీలను టీడీపీ నేతలు భూతద్దంలో చూడటం సరికాదు. అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇదే పద్ధతిని అనుసరించారు కదా?’’ అని నిలదీశారు.

అన్ని రాష్ట్రాలూ రాయితీలిస్తున్నాయి..: కంపెనీలకు రాయితీలనేవి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అందిస్తున్నాయని సోమయాజులు గుర్తుచేశారు. ‘‘గుజరాత్ ప్రభుత్వం టాటా కంపెనీ కోసం భూమి పూర్తి రాయితీకి ఇచ్చింది. చంద్రబాబు కూడా కాకినాడ సీ పోర్టు, గన్నవరం, హైటెక్ సిటీ తదితర సంస్థలకు వేలాది ఎకరాలు కేటాయించారు కదా? బాబు చేస్తే తప్పులేనిది వైఎస్ చేస్తే తప్పా?’’ అని నిలదీశారు. ప్రభుత్వ సెజ్ పాలసీ ప్రకారం వైఎస్ నడుచుకుంటే కంపెనీలకు దోచిపెట్టారని ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారు.

వీరిపై సీబీఐ దర్యాప్తు జరపలేదేం?

జగన్ ఆస్తులు స్వల్ప కాలంలోనే పెరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్-టీడీపీ నేతలకు దేశంలోని అతి తక్కువ సమయంలో కోటీశ్వరులైన వ్యాపారస్తులు కనిపించడంలేదా? అని సోమయాజులు నిలదీశారు. ‘‘రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మొదట్లో ఒక పెట్రోల్‌బంక్‌లో గుమస్తాగా పనిచేసిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన అన తికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు కాగలిగాడు. ల్యాంకో లగడపాటి 3 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌తో అతి తక్కువ సమయంలో రూ.22 వేల కోట్లు సంపాదించారు. అంతెందుకు టీడీపీ నేత నామా నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి? వీరందరిపై జగన్ మాదిరిగానే సీబీఐ విచారణ చేశారా?’’ అని నిలదీశారు. జగన్ కంటే అతి తక్కువ సమయంలో వంద రెట్లు ఎక్కువ ఆస్తులు సంపాదించిన వారిని తాను చూపిస్తానని, పేర్లు ఇస్తానని అలాంటి వారిపై ప్రభుత్వం విచారణ సిద్ధంగా ఉందా అని సవాలు విసిరారు.

చంద్రబాబుకు చేతనైతే ‘స్టే’ ఎత్తేయించుకోవాలి!

టీడీపీ అధినేత చంద్రబాబుకు చేతనైతే ‘స్టే’ ఎత్తేయించుకొని తనపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్రంగా దర్యాప్తు చేయించుకోవాలని సోమయాజులు సవాలు చేశారు. ఐఎంజీ అనే పేరు, ఊరులేని సంస్థకు రాజధాని నడిబొడ్డున 850 ఎకరాలు కట్టబెట్టారని, అది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తే చంద్రబాబు బాగోతాలు బయటకొస్తాయన్నారు. ఆర్థికంగా స్తోమత లేని సమయంలో చంద్రబాబుకు తిరుపతిలో హోటళ్లు, ఇతర ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. జగన్ ఏనాడూ కంపెనీలు పెట్టి నష్టపోలేదని, ఆయన స్థాపించినవన్నీ లాభాలు గడించిన విషయాన్ని చంద్రబాబు, ఇతర కాంగ్రెస్ నేతలు గుర్తించాలని సూచించారు. 
Share this article :

0 comments: