సునీల్‌ను ఎంత కాలం జైల్లో పెడతారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సునీల్‌ను ఎంత కాలం జైల్లో పెడతారు?

సునీల్‌ను ఎంత కాలం జైల్లో పెడతారు?

Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012

ఎమ్మార్ కేసులో అందరూ నిందితులే అయినప్పుడు, 13వ నిందితునిగా ఉన్న రంగారావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న సీబీఐ.. మరో నిందితుడు సునీల్‌రెడ్డికి మాత్రం బెయిల్ ఇవ్వొద్దనడంపై ప్రత్యేక కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. బెయిల్ మంజూరు చేయాలంటూ సునీల్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి బి.నాగమారుతి శర్మ మంగళవారం మరోసారి విచారించారు. ‘‘సునీల్‌రెడ్డిని ఎంత కాలం జైల్లో పెడతారు. ఆయన మీదున్న అభియోగాలు ఏంటి? దర్యాప్తు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుంది’’ అని న్యాయమూర్తి సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్‌ను ప్రశ్నించారు. 

ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో విల్లాలను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బును సునీల్‌రెడ్డికి రంగారావు ఇచ్చారని.. ఆ డబ్బు ఎక్కడ దాచిందీ కనిపెట్టాల్సి ఉందని రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ‘‘ఎవరి సూచన మేరకు సునీల్‌రెడ్డి డబ్బు తీసుకున్నారు? తీసుకున్న డబ్బు ఆయన వాడుకున్నారా? ఎవరికైనా ఇచ్చేందుకు తీసుకున్నారా’’ అని జడ్జి ప్రశ్నించారు. కోనేరు ప్రసాద్ సూచన మేరకు సునీల్‌రెడ్డికి రంగారావు డబ్బు ఇచ్చారని రవీంద్రనాథ్ బదులిచ్చారు. వైఎస్ జగన్‌కు సునీల్ అత్యంత సన్నిహితుడని చెప్పారు. ‘‘ఎమ్మార్ కేసులో జగన్ నిందితునిగా ఉన్నారా? ఈ కేసుతో ఆయనకున్న సంబంధమేంటి? ఐపీసీ 409 (ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత నమ్మకద్రోహానికి పాల్పడడం) సునీల్‌రెడ్డికి ఎలా వర్తిస్తుంది’’ అని మరోసారి జడ్జి ప్రశ్నించారు. 

ఎమ్మార్ కేసులో జగన్ నిందితునిగా లేరని.. ఐపీసీ 409 సునీల్‌రెడ్డికి వర్తిస్తుందని సీబీఐ లీగల్ అడ్వయిజర్ తెలిపారు. సునీల్‌రెడ్డి ఆదాయం అనూహ్యంగా పెరిగిందని.. ఆయనకు ఎక్కడ నుంచి డబ్బు వచ్చిందీ కనిపెట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునీల్‌కు బెయిల్ ఇస్తే ఆధారాలను మాయం చేస్తారని నివేదించారు. సునీల్‌రెడ్డికి జగన్‌తో సంబంధం ఉందని ఇప్పుడే చెబుతున్నారని, ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేసిందీ సీబీఐ అధికారులు చెప్పలేదని సునీల్‌రెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. 40 రోజులుగా సునీల్‌తో జగన్ పేరు చెప్పించాలని సీబీఐ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
Share this article :

0 comments: