యూపీఏ గుండెల్లో రైళ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యూపీఏ గుండెల్లో రైళ్లు

యూపీఏ గుండెల్లో రైళ్లు

Written By ysrcongress on Thursday, March 15, 2012 | 3/15/2012రైల్వే మంత్రి పదవికి త్రివేది రాజీనామా , ప్రధాని ఆమోదం!

చార్జీల పెంపుపై దీదీ ఆగ్రహాగ్ని ఫలితం
కొత్త రైల్వే మంత్రిగా ముకుల్ రాయ్!
చార్జీల పెంపు నిర్ణయం కూడా వెనక్కు?
అంతకుముందు రోజంతా హస్తినలో హైడ్రామా
చార్జీల పెంపు వద్దన్న మమత ఆదేశాలకు దినేశ్ ససేమిరా
పదవి కంటే దేశ, రైల్వే ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటన
దాంతో ఆయన్ను మార్చాలంటూ ప్రధానికి దీదీ లేఖాస్త్రం
{పధానిని కలుస్తాం, కోత తీర్మానం పెడతాం: తృణమూల్
బిత్తరపోయిన కాంగ్రెస్, హుటాహుటిన కోర్ కమిటీ భేటీ
తీవ్ర మల్లగుల్లాల అనంతరం దీదీ సూచనకు ఓకే!


దశాబ్ద కాలం తర్వాత రైలు ప్రయాణికులపై చార్జీల పిడుగు పడింది. బడ్జెట్‌కు ముందే భారీగా సరుకు రవాణా చార్జీలు వడ్డించిన రైల్వే శాఖ.. బుధవారం నాటి బడ్జెట్‌లో ప్రయాణికులపైనా రూ.4,000 కోట్ల మేర భారం మోపింది. ప్లాట్‌ఫామ్ టికెట్ మొదలు.. సెకండ్ క్లాస్ నుంచి ఏసీ ఫస్ట్ క్లాస్ దాకా అన్ని తరగతుల ప్రయాణ చార్జీలనూ కిలోమీటరుకు 2 పైసల నుంచి 30 పైసల దాకా పెంచింది. కానీ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్త రైల్వే మంత్రి దినేశ్ త్రివేది తీసుకున్న ఈ నిర్ణయం బుధవారం రోజంతా యూపీఏ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. చార్జీల పెంపుపై తృణమూల్ అధినేత్రి మమత మండిపాటు దెబ్బకు తొలి రైల్వే బడ్జెటే ఆయనకు చివరిదిగా మారడం దాదాపుగా ఖాయమైంది! దినేశ్‌ను తొలగించి రైల్వే బాధ్యతలను ముకుల్ రాయ్‌కు కట్టబెట్టాలంటూ ప్రధానికి దీదీ లేఖాస్త్రం సంధించడంతో.. అసలే అంతంతమాత్రంగా నెట్టుకొస్తున్న యూపీఏ సర్కారుపై ఒక్కసారిగా తాటిపండు పడింది. అవసరమైతే కోత తీర్మానానికీ సిద్ధమన్న తృణమూల్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. పరిస్థితి మధ్యంతరం దిశగా సాగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ అనూహ్య రాజకీయ సంక్షోభంతో కాంగ్రెస్ ఒక్కసారిగా బిత్తరపోయింది. పార్టీ కోర్ కమిటీ పెద్దలు హుటాహుటిన ప్రధాని ఇంట సమావేశమై తీవ్రంగా మల్లగుల్లాలు పడ్డారు. చివరికి మమత డిమాండ్‌కు తలొగ్గి ఆమెను ప్రసన్నం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దినేశ్ రాజీనామా చేశారని, దాన్ని ప్రధాని ఆమోదించారని బుధవారం అర్ధరాత్రి దాటాక చానళ్లలో వార్తలు వచ్చాయి. చార్జీల పెంపు నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకోవచ్చంటున్నారు.
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి


చార్జీల పెంపు రూపంలో ప్రయాణికులపై రైల్వేమంత్రి దినేశ్ త్రివేది విసిరిన బాంబు కాస్తా బూమరాంగ్ అయ్యి ఏకంగా ఆయన పదవికే ఎసరు పెట్టింది! చార్జీల పెంపు ప్రజా వ్యతిరేక నిర్ణయమంటూ ఆయన సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మండిపడ్డారు. దీన్ని తానెంతమాత్రమూ అంగీకరించబోనని, పెంపును తక్షణం ఉపసంహరించాల్సిందేనని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీల బృందం కూడా దినేశ్‌ను ఈ మేరకు డిమాండ్ చేయడమే గాక, దీనిపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలుస్తామని, గురువారం ఉదయం పార్లమెంటులో ధర్నాకు కూడా దిగుతామని ప్రకటించింది. అవసరమైతే పెంపు రద్దు కోరుతూ కోత తీర్మానం ప్రవేశపెట్టేందుకూ వెనకాడబోమని హెచ్చరించింది. ఇలా బుధవారం రోజంతా హస్తినలో హైడ్రామా కొనసాగినా దినేశ్ మాత్రం చార్జీల పెంపు రద్దుకు ససేమిరా అన్నారు. పదవి పోయినా బాధలేదని, దానికంటే దేశ, రైల్వేల ప్రయోజనాలే తనకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. దాంతో దీదీ ఒక్కసారిగా కన్నెర్రజేశారు. దినేశ్‌ను మార్చి, తృణమూల్ సీనియర్ నేత ముకుల్ రాయ్‌ని రైల్వే మంత్రిగా నియమించాలంటూ బుధవారం రాత్రి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు! కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అందుకు అంగీకరించారని, శుక్రవారం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక దినేశ్‌ను మారుస్తామని మమతకు హామీ ఇచ్చారని సమాచారం. అయితే.. బుధవారం అర్థరాత్రి దాటాక త్రివేది రాజీనామా చేశారని.. దానిని ప్రధాని వెంటనే ఆమోదించారని వార్తలు వచ్చాయి. అదే జరిగితే రెల్వే బడ్జెట్ ప్రవేశపెట్టగానే పదవి పోగొట్టుకున్న తొలి మంత్రిగా దినేశ్ చరిత్రకెక్కుతారు! రైల్వే బడ్జెట్ కనీసం పార్లమెంటు పరిశీలనకు కూడా రాకముందే మంత్రిని మార్చాల్సిన అసాధారణ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొన్నట్టు అయింది. శుక్రవారం గానీ, ఆ తర్వాత గానీ ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపడతారని తృణమూల్ వర్గాల సమాచారం. ప్రస్తుతం నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్న ముకుల్, 2011 జూలై దాకా రెండేళ్లు రైల్వే శాఖ సహాయమంత్రిగా పని చేశారు.


కోర్‌కమిటీ మల్లగుల్లాలు


అంతకుమందు మమత లేఖాస్త్రం కాంగ్రెస్ పెద్దల గుండెల్లో ఒక్కసారిగా గుబులు రేకెత్తించింది. దినేశ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుందంటూ ప్రశంసించిన ప్రధానికి ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ గురువారం రాత్రి పొద్దుపోయాక హుటాహుటిన ప్రధాని నివాసంలో సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. 19 మంది ఎంపీల బలమున్న మమత డిమాండ్‌ను తోసిపుచ్చితే ఆమె యూపీఏ నుంచి వైదొలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. అప్పుడు ఏకంగా యూపీఏ మనుగడే ప్రమాదంలో పడుతుందని, సమాజ్‌వాదీ, బీఎస్పీ వంటి ‘బయటి మద్దతుదారుల’ దయాదాక్షిణ్యాల మీదే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పైగా శుక్రవారం సాధారణ బడ్జెట్ విషయంలోనూ మమత ఏదో రాద్ధాంతం చేయక మానరని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేశారు. అది ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఆందోళన చెందారు. దీదీ తదుపరి చర్య ఎలా ఉంటుందా విపక్షాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పరిస్థితి మధ్యంతరం దిశగా సాగినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కనీసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకైనా దినేశ్‌ను కొనసాగించేలా మమతను బుజ్జగించాలని, ఆ బాధ్యతను ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీకి అప్పగించాలని ఒక దశలో నిర్ణయించినా, కాంగ్రెస్ ‘అగ్ర నేత’కు మమత ఫోన్ చేయడంతో పరిస్థితి మారిపోయిందని, దినేశ్‌ను మార్చేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం. సదరు అగ్రనేత ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. అంతకుముందు ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, తన ప్రభుత్వం పూర్తి సంఖ్యాబలంతో స్థిరంగా ఉందని, దానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. దినేశ్ రాజీనామాపై ప్రశ్నించగా, అలాంటిదేమీ తనకు అందలేదన్నారు.


రోజంతా హైడ్రామా


బుధవారం మధ్యాహ్నం పార్లమెంటులో దినేశ్ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే తృణమూల్‌లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. దినేశ్ తీరుపై మమత తీవ్రంగా ఆగ్రహించారు. తనను మాటమాత్రంగానైనా సంప్రదించకుండా.. పూర్తిగా ప్రధాని, ప్రణబ్‌ల సూచనల మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేశారంటూ రగిలిపోయారు. అధినేత్రి నుంచి సంకేతాలందుకున్న తృణమూల్ ఎంపీలంతా చార్జీల పెంపుపై మూకుమ్మడిగా మండిపడ్డారు. వాటిని వెనక్కు తీసుకోవాలంటూ పట్టుబట్టారు. మరోవైపు మమత కూడా చార్జీల పెంపును తాను అనుమతించబోనంటూ నందిగ్రాంలో బహిరంగ సభలోనే ప్రకటించారు. ఈ విషయమై దినేశ్ తనను కనీసం సంప్రదించనే లేదంటూ ఆగ్రహించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడిన దినేశ్ కూడా దాన్ని ధ్రువీకరించారు. రైల్వే శాఖ రైటర్స్ బిల్డింగ్ (బెంగాల్ సచివాలయం) నుంచి నడుస్తుందన్నది భ్రమేనని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తృణమూల్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సుల్తాన్ అహ్మద్ కూడా చార్జీల పెంపును సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. దాంతో తృణమూల్ ముందుగా అనుకున్న ప్రకారమే ఇదంతా చేస్తోందని, దిగువ శ్రేణి చార్జీల పెంపును దినేశ్ వెనక్కు తీసుకుంటారని, తద్వార మమత ప్రజానుకూల ఇమేజీకి భంగం వాటిల్లని రీతిలో ‘సమస్య’ సమసిపోతుందని ఒకదశలో భావించారు. కానీ అది నిజం కాదని విలేకరుల భేటీలో దినేశ్ వ్యాఖ్యలతో తేలిపోయింది. చార్జీల పెంపును వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.


‘‘నాపై ఎవరి ఒత్తిళ్లూ లేవు. పలువురు ఎంపీలు నా వద్దకు వచ్చి మరీ మెచ్చుకున్నారు. పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలు ఏ అంతరాయమూ లేకుండా పూర్తయ్యాయి. దేశం కోసం, రైల్వే కోసం నా బాధ్యత నేను నెరవేర్చాను. నాకు దేశమే ముందు. నా కుటుంబమైనా, పార్టీ అయినా ఆ తర్వాతే. భారత పౌరుడినని నేను సగర్వంగా చెప్పుకుంటాను. నాది ఆర్థిక బడ్జెటే తప్ప రాజకీయ బడ్జెట్ కాదు. రైల్వేలు కూడా ఎయిరిండియా మాదిరిగా కారాదన్నదే నా తపన. చార్జీల పెంపు ద్వారా రైల్వేలను నేను ఐసీయూ నుంచి గట్టెక్కించాను. దేశ పౌరుడినని చెప్పుకునే అర్హత ఉన్న ఏ రైల్వే మంత్రి అయినా ఇదే చేసేవాడు. పదవి పోతుందని నాకు భయం లేదు. దేశం కోసం భగత్‌సింగ్ అమరుడయ్యాడు. మా నాయకురాలు కోరితే పదవిని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు. ఇది పార్టీపై తిరుగుబాటు కాదా అని ప్రశ్నించగా, ‘రైల్వేల ప్రయోజనాల కోసం పని చేయడం తిరుగుబాటే అయితే, అలాగే కానివ్వండి’ అని వ్యాఖ్యానించారు. పైగా, ‘రైల్వేలకు ఏది అత్యుత్తమమో నేనదే చేశాను. ప్రధానే కెప్టెన్ ఆఫ్ ద టీమ్. చార్జీ పెంపు రద్దుపై ఆయనే నిర్ణయిస్తారు’ అని కూడా చెప్పుకొచ్చారు. దాంతో బుధవారం రాత్రికల్లా సమస్య కాస్తా ముదురుపాకాన పడింది. తృణమూల్ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ నేరుగా దినేశ్‌తో మాట్లాడారు. చార్జీల పెంపును రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేసినట్టు విలేకరులకు ఆయన చెప్పారు.


‘‘మా పార్టీ ఎంపీల బృందం గురువారం ప్రధానిని కూడా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తుంది. చార్జీల పెంపుపై రాజీకి తృణమూల్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా లేదు. వాటి రద్దు కోసం గురువారం పార్లమెంటులో ధర్నాకు కూడా దిగుతాం. అవసరమైతే సభలో కోత తీర్మానం కూడా ప్రవేశపెట్టడంతో పాటు రైల్వే మంత్రినీ మారుస్తాం. మమత ఆదేశాలను పాటించని వారు పార్టీని వీడవచ్చు’’ అంటూ కటువైన పదజాలంతో మాట్లాడారు. మరోవైపు ఇదంతా తృణమూల్ అంతర్గత వ్యవహారమని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు.
Share this article :

0 comments: