మంత్రి ‘గల్లా’ ఫ్యామిలీ భూ దాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి ‘గల్లా’ ఫ్యామిలీ భూ దాహం

మంత్రి ‘గల్లా’ ఫ్యామిలీ భూ దాహం

Written By ysrcongress on Sunday, March 25, 2012 | 3/25/2012

శ్మశానస్థలాన్నీ వదలని వైనం 
అరాచకాలపై నిరసనల వెల్లువ

చిత్తూరు, న్యూస్‌లైన్: పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన పేరిట పేదల భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటూ ఓ మంత్రి కుటుంబం పాల్పడుతున్న అరాచకాలపై నిరసన వెల్లువెత్తుతోంది. చివరకు శ్మశానం నిమిత్తం కేటాయించిన స్థలాన్నీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాధితులు న్యాయం కోసం సంబంధిత అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలో లక్ష్మీపురం, రంగంపేట, పేట అగ్రహారం గ్రామాల పరిధిలో కోట్లాది రూపాయల విలువచేసే వ్యవసాయ భూములున్నాయి. ఈ గ్రామాలకు ఆనుకునే మంత్రి గల్లా అరుణకుమారి భర్త గల్లా రామచంద్రనాయుడు యాజమాన్యంలోని గల్లా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. 6, 7 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామికవాడ వందల ఎకరాలకుపైగా విస్తరించి ఉంది. ఆ భూములను కొన్నింటిని రైతులను ఒప్పించి కొనుగోలు చేస్తే, మరి కొన్నింటిని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి స్వాధీనం చేసుకున్నవేనని స్థానికులు చెబుతున్నారు.

అసైన్డ్‌గా మారిన పట్టా భూములు: లక్ష్మీపురం, రంగంపేట, పేట అగ్రహారం గ్రామాల పరిధిల్లో సుమారు 300 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని 281/4, 336, 1204, 1240,1246,1247, 1266,1267, ఇతర సర్వే నంబర్లలో దాదాపు వందెకరాలు గల్లా రామచంద్రనాయుడు ఆధ్వర్యంలో ఉన్నట్లు రికార్డులు చెపుతున్నాయి. గ్రామం ఏర్పడినప్పటి నుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూములు రైతులకు తెలియకుండానే అసైన్డ్ భూములుగా మార్చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అలా అసైన్డ్‌గా మార్చిన పట్టా భూములను ఏపీఐఐసీ అధికారులు గల్లా రామచంద్రనాయుడుపేరున రిజిస్టర్ చేశారు. ఈ తతంగం అంతా 2010-2011 మధ్య కాలంలో జరిగినట్లు తెలుస్తోంది.

కనుమరుగవనున్న లక్ష్మీపురం: గల్లా ఫుడ్స్ పారిశ్రామికవాడకు ఆనుకుని ఉన్న లక్ష్మీపురం గ్రామం కనుమరుగుకానుంది. గ్రామానికి చుట్టూ ఉన్న రెండు రహదారులను, తేనేపల్లి పంచాయతీ పరిధిలోని శ్మశానానికి కేటాయించిన 4 ఎకరాల స్థలాన్ని కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం స్వాధీనం చేసుకున్నట్లు గ్రామస్తుల ఆరోపణ. దీన్ని నిరసిస్తూ గ్రామస్తులు మంగళవారం రాత్రి ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. 

విషయం వెలుగుచూసిందిలా: లక్ష్మీపురం గ్రామానికి చెందిన మునిరత్నం బ్యాంకులో రుణం పొందేందుకు ఐదెకరాలకు సంబంధించిన ‘టెన్‌వన్ అడంగల్’ కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. రెవెన్యూ రికార్డుల్లో గ్రామానికి చెందిన సర్వే నంబర్లన్నీ రెడ్ ఇంక్‌తో రౌండ్ చేసి ఉండడాన్ని గమనించాడు. ఎందుకు రెడ్ ఇంక్‌తో రౌండ్ చేశారని అధికారులను అడిగాడు. ఈ భూములన్నీ ఏపీఐఐసీ స్వాధీనంలో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. నల్లగట్లపల్లెకు చెందిన జి.పురుషోత్తం నాయుడు ఫ్యాక్టరీకి సమీపంలో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు, అందుకు సబంధించి నగదును కూడా బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు గల్లా ఫుడ్స్ యాజమాన్యం రికార్డులు చూపించింది. దాంతో పురుషోత్తం నాయుడు ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. 

రహదార్లనూ వదల్లేదు..?

గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన రోడ్లను సైతం గల్లా ఫుడ్ యాజమాన్యం ఆక్రమించేందుకు యత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి-కడప క్రాస్ రోడ్డు సమీపంలో లక్ష్మీపురం, రాగాలకుంట, మద్దలయ్యగారి పల్లెకు వెళ్లేందుకు 1.25 కిలోమీటర్ల రోడ్డుతో పాటు, రంగంపేట సమీపంలో శ్మశానవాటికను ఆనుకుని ఉన్న 1.25 కిలోమీటర్ల రహదారిని స్వాధీనం చేసుకునేందుకు సదరు యాజమాన్యం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో వీటిని స్వాధీనం చేసుకుని ప్రత్యామ్నాయంగా 4 కిలోమీటర్ల దూరంలో రోడ్డు ఏర్పాటు చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. పైగా, ఈ రోడ్లను ఫ్యాక్టరీకి ఉపయోగించుకోవచ్చని రాష్ర్ట కేబినెట్ ఆమోదం తెలిపిందన్న ప్రచారం కూడా సాగుతోంది. పోలీసుల ఆధ్వర్యంలోనే వీటిని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదపగా.. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఇదిలా ఉండగా, ఫ్యాక్టరీకి వెళ్లే 1.25 కిలోమీటర్ల రోడ్డుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మరమ్మతులు చేశారు. ఇందుకు గానూ రూ. 2.85 లక్షలు కేటాయించాల్సి ఉండగా ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో ఏకంగా రూ.4.80 లక్షలు మంజూరు చేసినట్లు తెలిసింది. రెండింతలు నిధులు ఖర్చు చేసినా రోడ్డు మాత్రం కంకర తేలి దర్శనమిస్తోంది.

పట్టా భూమిని డీకేటీగా మార్చారు

తాతల కాలం నుంచి 4.95 ఎకరాలను సాగు చేసుకుంటున్నాను. పక్కా పట్టాభూమి. అయితే ఇటీవల బ్యాంకులో రుణం కోసం వెళితే రెడ్ ఇంక్‌తో రౌండ్ చేసి ఉంది. ఇదే విషయమై తహశీల్దార్‌ని అడిగితే విచారిస్తామని చెప్పారు. చివరకు ఏపీఐఐసీ అధికారులు గల్లా రామచంద్రనాయుడి పేరున రిజిస్టర్ చేసి ఉన్నారు. ఇదెక్కడి న్యాయం.
- మునిరత్నం (లక్ష్మీపురం)

పుట్టినప్పటినుంచి మేమేవ్యవసాయం చేస్తున్నాం

మేం పుట్టినప్పటి నుంచి ఎకరా భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాం. అదేమో తెలియదు. మా భూములు, ఇళ్ల స్థలాలు ఫ్యాక్టరీ వారి సొంతమయ్యాయని తెలిసింది. మేము అమ్మకనే మా భూములు, ఇళ్లు వారు ఎలా తీసుకుంటారు. మాకు న్యాయం చేయాలి.
- మీనాక్షమ్మ (ల క్ష్మీపురం)
Share this article :

0 comments: