అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణే

అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణే

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012

బాబు కేసులో నిర్లిప్తం...
నాడు డబ్బా కంపెనీకి 850 ఎకరాలిచ్చిన చంద్రబాబు
అది ఐఎంజీ ఫ్లోరిడాకు అనుబంధమంటూ అబద్ధాలు
ఐఎంజీ అధికారుల పేరుతో దొంగ ఈమెయిల్స్ సృష్టి
ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ ఎకరా రూ.50 వేలకే ధారాదత్తం
దీనిపై సీబీఐ దర్యాప్తు కోసం 2007లోనే ప్రభుత్వం జీవో
ఆధారాలతో సహా దొంగలు దొరికినా సీబీఐ అనాసక్తి
వనరులు లేవంటూ చేతులు దులుపుకున్న దర్యాప్తు సంస్థ
అప్పుడు కూడా రాష్ట్రంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణే 


ఎమ్మార్ కేసులో అత్యుత్సాహం...
కనిపిస్తున్న దోషుల్ని వదిలేసి వైఎస్సార్ పేరు ప్రతిష్టలే టార్గెట్
ఎమ్మార్ ప్రాజెక్టుకు తొలుత కేటాయించింది 250 ఎకరాలే
తరవాత బాబు జోక్యంతో విల్లాల కోసం మరో 250 ఎకరాలు
ఈ మొత్తం వ్యవహారాన్ని నోట్ ఫైల్స్‌తో సహా బయటపెట్టిన ‘సాక్షి’
అయినా పట్టించుకోని సీబీఐ... పెపైచ్చు సుప్రీంకోర్టుకూ అబద్ధాలు
టీడీపీకి చెందిన సీబీఐ మాజీ ఉన్నతాధికారి దర్శకత్వంలో డ్రామా! 


గత ఎన్నికల్లో తన భార్యకు టీడీపీ టికెట్ కోసం లక్ష్మీనారాయణ యత్నించారని వదంతులు... నిజమనుకునేలా వ్యవహారశైలి

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఒకే అధికారి. కేసుకొక రకంగా మారిపోతున్నారు. మనిషినో రకంగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే ఒకలా... కాంగ్రెస్ పార్టీ అయితే మరొకలా...! చంద్రబాబునాయుడైతే ఒకలా... వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డయితే ఇంకొకలా..! డబ్బా కంపెనీని సృష్టించి... దాన్లో బినామీల్ని పెట్టి దానికి ఏకంగా 850 ఎకరాలను కేటాయించిన ‘ఐఎంజీ భారత’ కేసులో దొంగల్ని పట్టుకోవటానికి తన వద్ద సిబ్బంది లేరన్నారాయన. ఎకరా రూ.3 కోట్లు విలువైన భూమిని కేవలం రూ.50 వేలకే దోచిపెట్టేస్తే దొంగల్ని పట్టుకోవటానికి తన వద్ద తగిన వనరులు లేవన్నారాయన. చంద్రబాబునాయుడి అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు ఆదేశిస్తే... రెండు వారాలు గడిచేదాకా ఆ పత్రాల్ని కోర్టుకెళ్లి తీసుకోవటానికే ముందుకు రాలేదాయన. ‘స్టే వస్తుందేమో చూద్దాం! విచారణ ఆగిపోతుందేమో చూద్దాం!’ అనే రీతిలో తీరని జాప్యం చేశారు. ఇక ఎమ్మార్ కేసులో 2002లోనే అక్రమాలు జరిగాయని, భూమిని కారు చౌకగా కావాల్సిన కంపెనీకి కట్టబెట్టేశారని ఆరోపణలొస్తే... 2004 కన్నా ముందు ఏం జరిగినా పట్టించుకోకూడదన్న రీతిలో తనకుతానే గిరి గీసేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే.. ‘‘మేం దర్యాప్తు చేశాం! కానీ ఏమీ తేలలేదు’’ అన్న రీతిలో కళ్లుమూసుకుని జవాబు చెప్పేశారు. ఆఖరికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో మరణిస్తే... దానిపై విదేశీ మీడియాతో సహా ఎందరెందరో ఎన్నెన్నో సందేహాలు లేవనెత్తితే... ఇదే సీబీఐ అధికారి నేతృత్వంలో జరిగిన విచారణ ఏ అనుమానాన్నీ నివృత్తి చేయకుండానే ముగిసిపోయింది. కుట్ర కోణాన్ని శోధించకుండానే దర్యాప్తు ముగిసిపోయింది.

మరి జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ఏం చేశారో తెలుసా...? కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి, మంత్రుల్నీ - ప్రభుత్వ యంత్రాంగాన్నీ వదిలిపెట్టి... కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేయటానికి వేసిన కేసులో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కోర్టు విచారణకు ఆదేశించి 24 గంటలు తిరక్కముందే వెళ్లి పత్రాలు తీసుకున్నారు. మరో 24 గంటలు గడవకముందే ఏక కాలంలో సోదాలతో ఇన్వెస్టర్లను భయభ్రాంతుల్ని చేశారు. కాంగ్రెస్ అధిష్టానం, టీడీపీల ఎజెండాను తన ఎజెండాను కూడా జోడించి టై సృష్టించారు. జాతీయ మీడియాలో సైతం హోరెత్తించేశారు. 
2004 తరవాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కోర్టు విచారణకు ఆదేశిస్తే... 2004కు ముందు జరిగిన వ్యవహారాల్నీ ‘శోధించటం’, వాటిపై మీడియాకు లీకులివ్వటం మొదలెట్టారు.అదేమంటే... ‘‘అవసరమనుకుంటే ఆయన పుట్టినప్పటి నుంచీ దర్యాప్తు చేస్తాం. ఎంత లోతుకైనా వెళతాం’’ అన్నారు. అన్నట్టే విజయసాయిరెడ్డి విషయంలో లైడిటెక్టర్, నార్కో టెస్టులు కూడా చేస్తామంటూ రెచ్చిపోయారు. ఎమ్మార్ కేసులో సంబంధం లేకున్నా వైఎస్సార్ సన్నిహితుల్ని, అభిమానుల్ని టార్గెట్ చేశారు. అరెస్టులకూ దిగారు. అసలు సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ ఎందుకిలా చేస్తున్నారు? టీడీపీకి ఆయన సన్నిహితుడంటూ గతంలో వచ్చిన ఆరోపణలు నిజమేనా..? తన భార్యను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయించటానికి గత ఎన్నికల్లో ప్రయత్నాలు సాగించారంటూ వచ్చిన వదంతులు నమ్మాల్సిందేనా? తాజా సంఘటనలు, దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ అనుమానాలన్నీ నిజమనుకునేందుకే ఎక్కువ ఆస్కారముందన్న వాదన వినిపిస్తోంది. ఆయా దర్యాప్తుల విషయంలో సీబీఐ తీరుతెన్నులు వివరంగా ఇదిగో... 

‘ఐఎంజీ భారత’ పక్కా డబ్బా కంపెనీ. ఫక్తు బ్రీఫ్‌కేస్ కంపెనీ. కేవలం కాగితపు కంపెనీ. అధికారాంతంలో హడావుడిగా... హైదరాబాద్ ఐటీ హబ్‌లో 850 ఎకరాల్ని కాజేయటానికి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సృష్టించిన దొంగల కంపెనీ. అలాంటి కంపెనీని ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీకి అనుబంధమని నమ్మించటానికి నానా నాటకాలు ఆడారు. దీని పేరులోనూ ఐఎంజీని చేర్చి.. ‘ఐఎంజీ భారత’గా రిజిస్టర్ చేశారు. 

బాబు ఎంత అడ్డగోలుగా బినామీ కంపెనీకి భూమిని కట్టబెట్టారంటే... ఐఎంజీ భారత రిజిస్టరైంది 2003 ఆగస్టు 5న. కేవలం లక్ష రూపాయల మూలధనంతో. అలాంటి కంపెనీతో అదే నెల 9న ఎంఓయూ కుదిర్చేసుకున్నారు. దానికి 850 ఎకరాలు దోచిపెట్టటానికి ఓకే అనేశారు. అది కూడా ఎకరా కేవలం యాభై వేల రూపాయలకు. పోనీ ఆ భూమికి విలువ లేదా అంటే... అదెంత విలువైన భూమో అందరికన్నా బాగా తెలిసింది చంద్రబాబుకే. ఎందుకంటే అక్కడే తన భార్య పేరిట ఉన్న భూమిని ఎకరా కోటి రూపాయల చొప్పున బాబు విక్రయించి అప్పటికి మూడేళ్లయింది. ఐఎంజీకి భూమి అప్పగించేనాటికి అక్కడ విలువ ఎకరా రూ.3 కోట్లపైనే పలుకుతోంది. కాబట్టే ఆయన ఎకరా రూ. 50 వేల చొప్పున తన ఆత్మ బిల్లీరావుకు అప్పగించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దొంగ కంపెనీలు సృష్టించి.. దాని పేరిట భూముల్ని కారు చౌకగా కేటాయించేసి.. ఆ మొత్తాన్ని తనే దిగమింగే ప్లాను వేయటం బహుశా.. దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. ఇక్కడ ఇంకో అంశం గమనించాలి. ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీకి అక్కడే పెద్దగా సీన్ లేదు. అక్కడ దాని చేతిలో ఉన్న మొత్తం భూమి 120 ఎకరాలు. పైగా ఆ సంస్థ కూడా బిల్లీ కంపెనీతో తనకెలాంటి సంబంధమూ లేదని స్వయంగా ప్రకటించింది. దీంతో చంద్రబాబు మరో ఎత్తు వేశారు. ఐఎంజీ అకాడెమీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టెడ్ మీక్మా తమకు ఈ-మెయిల్ పంపారంటూ ఒక లేఖ విడుదల చేశారు. ఐఎంజీ భారతతో తమకు సంబంధాలున్నాయని దాంట్లో ఆయన పేర్కొన్నట్లుగా చూపించారు. కానీ ఆ తరవాత తేలిందేమిటంటే.. అది జీ-మెయిల్ వంటి పబ్లిక్ మెయిల్ నుంచి టీడీపీ నేతలు సృష్టించి పంపిన నకిలీ లేఖ అని. ఆ తరవాత ఐఎంజీ సంస్థ.. తమకు బిల్లీ కంపెనీతో ఎలాంటి బంధాలూ లేవని స్పష్టంగా ప్రకటించింది కూడా. అంటే జనాన్ని మోసం చేయటానికి నకిలీ మెయిల్స్‌తోనూ బాబు తతంగం నడిపారంటే ఎంతకు దిగజారిపోయారో తేలిగ్గానే అర్థమవుతుంది. 

ప్రభుత్వం ఆదేశించినా విచారణకు సీబీఐ నో!

ఈ దారుణమంతా వెలుగుచూడటంతో 2007లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. కానీ సీబీఐ విచారణ జరపనే లేదు. చంద్రబాబును దోషిగా రుజువు చేసే సకల సాక్ష్యాలూ కళ్ల ముందు కనిపిస్తున్నా... ఆయన్ను విచారించటానికి కానీ, అరెస్టు చెయ్యటానికి కానీ సీబీఐ ఉత్సాహం చూపలేదు. ఎందుకని? ఇదే సందేహం వచ్చిన ఓ న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద కేంద్రాన్ని ఇదే ప్రశ్న అడిగారు. ‘‘తన వద్ద తగిన వనరులు లేవు కాబట్టి విచారణ జరపలేనని సీబీఐ నిస్సహాయత వ్యక్తం చేసింది’’ అంటే ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఆయనకు సమాధానమిచ్చింది. విచిత్రమేంటంటే ఈ ఉదంతం జరిగినపుడు కూడా రాష్ట్రంలో సీబీఐ ఇన్‌చార్జిగా ఉన్నది వి.వి.లక్ష్మీనారాయణే! మరి బాబుపై ఆయనకు ఎందుకంత ప్రేమ? నేరం స్పష్టంగా కనిపిస్తున్నా.. దొంగలెవరో ఆధారాలతో సహా తేలినా పట్టుకోవటానికి ఎందుకు తాత్సారం? తగిన వనరులు లేవన్న కారణంతో విచారణ జరపలేమని చెప్పటం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? దొంగల్ని పట్టుకోవటానికి పోలీసులు లేరంటే.. ఈ వ్యవస్థెందుకు? ఈ దర్యాప్తు సంస్థలెందుకు? 

ఎమ్మార్ కేసులోనైతే పూర్తి రివర్స్! డబ్బా కంపెనీతో ప్రభుత్వ భూమిని దోచుకున్న దొంగల్ని వదిలేసిన సీబీఐ.. ఎమ్మార్ వ్యవహారంలో మాత్రం పూర్తి రివర్స్‌గేర్‌లో వెళుతుండటమే కుట్రలకు పరాకాష్ట. ఈ కేసులో అసలు అక్రమమేదైనా ఉంటే అది 2002లో భూమిని కట్టబెట్టటం దగ్గరే జరిగింది. ఎందుకంటే తన భార్య పేరుతో ఉన్న భూమిని 2000 సంవత్సరంలోనే ఎకరా రూ. కోటి ధరకు విక్రయించిన చంద్రబాబు.. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఎమ్మార్‌కు ఎకరా కేవలం రూ. 29 లక్షలకే అప్పగించటం ఈ మొత్తం కుంభకోణానికి మూలం. అంతేకాదు... తొలుత ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించింది గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్ సెంటర్, హోటల్ మాత్రమే. దానికి కేటాయిద్దామనుకున్నది కూడా 250 ఎకరాలే. కానీ ఎమ్మార్‌ను రంగంలోకి దించాలని భావించిన బాబు.. దానికోసమని తాను స్వయంగా జోక్యం చేసుకుని మరీ, అధికారులను ఆదేశించి మరీ మరో 250 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టులోకి విల్లాలను చొప్పించారు. దీన్ని ఇటీవల ‘సాక్షి’ నోట్ ఫైల్స్‌తో సహా బయటపెట్టింది. దొంగలెవరో ఆధారాలతో సహా చూపించింది. ఈ ప్రాజెక్టును ఎమ్మార్‌కు కట్టబెట్టటానికి టెండర్ల దశలో మిగతా కంపెనీల్ని బాబు ఎలా తప్పించిందీ.. సింగిల్ టెండరు దాఖలయ్యేలా చక్రం తిప్పి.. దాన్ని రద్దు చేయకుండా దానికే ఓకే చేసిన తీరును అటు విజిలెన్స్ నివేదిక కూడా స్పష్టంగా తేల్చింది. కానీ సీబీఐ ఏం చేస్తోందో తెలుసా? అసలు చంద్రబాబు ఎన్ని నేరాలు చేసినా మేం పట్టించుకోబోమన్న తీరులో వ్యవహరిస్తోంది. అటువైపు చూడటం లేదు సరికదా.. ‘‘మేం 2000 నుంచి దర్యాప్తు చేశాం. మాకెలాంటి తప్పులూ కనిపించలేదు’’ అన్న రీతిలో సుప్రీంకోర్టుకు సైతం నిస్సిగ్గుగా ఒక నివేదిక ఇచ్చేసింది. 

ప్రతిష్ట దిగజార్చటానికే లీకులు... 

ఎమ్మార్ కేసుతో ఏమాత్రం సంబంధం లేకపోయినా... దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్టను దిగజార్చటానికి కాంగ్రెస్- టీడీపీలు కలిసి ఎన్ని కుయత్నాలు చేస్తున్నాయన్నది బహిరంగమే. వీరికి సీబీఐ జేడీ వ్యవహార శైలి పూర్తిస్థాయిలో కలిసివచ్చిందనే భావించాలి. ఎందుకంటే ఈ కేసులో వైఎస్సార్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల పేర్లను ఇరికిస్తూ కొన్ని మీడియా సంస్థలకు సీబీఐ భారీ స్థాయిలో లీకులిచ్చింది. మీడియా ప్రతినిధులతో జేడీ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడారని, కొందరికి తనే ఫోన్లు చేస్తూ, మెసేజిలిస్తూ వివరాలన్నీ చెప్పారంటూ కోర్టులో కేసు కూడా దాఖలైంది. ఈ కథనాలను సీబీఐ జాయింట్ డెరైక్టర్ కానీ, వేరొకరు కానీ ఖండించకపోవటమే ఈ కుమ్మక్కుకు ప్రత్యక్ష నిదర్శనమనుకోవాలి. నిజానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసీ కేసు... ఈ మూడింట్లోనూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీబీఐ మాజీ ఉన్నతాధికారి ఒకరు దర్యాప్తు సంస్థలకు మార్గదర్శనం చేస్తున్నారని, ఎప్పుడు ఎవరిని ఏం చెయ్యాలన్నది ఆయనే సూచిస్తున్నారని గతంలోనే పలు మీడియా వార్తల్లో వెల్లడయింది. కోర్టు విచారణకు ఆదేశించిన వెంటనే ఆయన బాగా యాక్టివ్ అయ్యారని, తనకున్న పరిచయాల ఆధారంగా రాష్ట్రంలో సీబీఐకి తనే డిఫాక్టో అధిపతిగా మారారనే విమర్శలూ వచ్చాయి. వీటన్నిటికీ తోడు.. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన భార్యను గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయించటానికి కూడా ప్రయత్నాలు సాగించారనే వదంతులు వినిపించాయి. ఇవన్నీ నిజమా! కాదా! అనేది పక్కనపెడితే... ప్రస్తుత పరిణామాలు, ఐఎంజీ - ఎమ్మార్ కేసుల్లో సీబీఐ వ్యవహార శైలి చూస్తే నిజమనుకోవటానికే ఎక్కువ ఆస్కారముందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమై రాజకీయ బంధాలు న్యాయస్థానాల్లోకి, దర్యాప్తు సంస్థల్లోకి లోతుగా చొచ్చుకుపోతే... ఇక ధర్మానికి ఆ దేవుడే దిక్కు!!

కేబినెట్‌కు తెలియకుండానే...

ఐంఎజీకి భూమి కేటయిస్తూ ఫైల్‌పై బాబు సంతకం చేయగానే.. బిల్లీరావు 2005 ఆగస్టు 9న ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అంటే కంపెనీ రిజిస్టర్ కావటం.. ఫైల్ సిద్ధమవటం.. నలుగురు మంత్రులు ఆమోదించటం.. బాబు సంతకాలు చేయటం... అన్నీ కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో జరిగిపోయాయి. నాలుగురోజుల కంపెనీకి.. లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి.. రూ.20,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని, క్రీడా మైదానాల్ని అప్పగిస్తూ ప్రభుత్వం అతి కీలకమైన ఒప్పందం కుదిర్చేసుకుంది. ఓ అనామక కంపెనీతో ఇంతటి విలువైన ఒప్పందం కుదుర్చుకోవటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఒప్పందం కుదిరిన మరుక్షణం.. భూమి అప్పగింతకు సంబంధించిన ఫైళ్లు శరవేగంగా కదిలాయి. బాబు హయాంలో ఆయన ముఖ్య కారద్యదర్శిగా ఉన్న ఉమామహేశ్వరరావు ఈ బాధ్యతలన్నీ భుజాన వేసుకున్నారు. గచ్చిబౌలిలో 400 ఎకరాలు, మామిడిపల్లిలో 450 ఎకరాలు ఐఎంజీకి కట్టబెట్టాలన్నది ఎంఓయూ ముఖ్యోద్దేశం. ఇది మంత్రివర్గ సమష్టి నిర్ణయమని నాటి సమాచార మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2003 సెప్టెంబర్ 1న విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ ఫైలును కేబినెట్ ముందు పెట్టకుండానే భూముల్ని కేటాయించారన్నది రికార్డులు పరిశీలిస్తే స్పష్టమయింది. తరవాత ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కూడా ఈ విషయం స్పష్టం చేసింది. 
Share this article :

0 comments: