నకిలీ విత్తులతో రైతు చిత్తు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నకిలీ విత్తులతో రైతు చిత్తు: వైఎస్ జగన్

నకిలీ విత్తులతో రైతు చిత్తు: వైఎస్ జగన్

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

అయినా ఈ సర్కారుకు పట్టడం లేదు 
విత్తన నాణ్యతను నిర్ధారించాల్సిన వ్యవసాయ వర్సిటీకి ఏడాదిగా వైస్ చాన్స్‌లర్ లేని అధ్వాన పరిస్థితి
మిర్చి రైతులకు మిగిలింది కన్నీళ్లే..
క్వింటాలుకు రూ.5వేలు కూడా గిట్టుబాటు కావడం లేదని ధ్వజం

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి:ఇవాళ మార్కెట్‌లోకి విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు వచ్చి రైతన్నల వెన్ను విరుస్తున్నా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నవారికి పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విత్తన నాణ్యతను నిర్ధారించి సర్టిఫై చేయాల్సిన వ్యవసాయ యూని వర్సిటీకి గత ఏడాది కాలంగా వైస్ చాన్స్‌లర్‌ను కూడా నియమించని అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శిం చారు. ‘రైతులు పంటలు కోసే సమయంలోనేమో.. ధాన్యం రేట్లు తగ్గిస్తారు. కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు. ఇదే పంట మూడు నెలల తరువాత డీలర్ల చేతికి వెళ్లిన తరువాత మళ్లీ రేట్లు పెంచుతున్నారు’ అని ధ్వజమెత్తారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 71వ రోజు గురువారం జగన్‌మోహన్‌రెడ్డి.. వినుకొండ, బొల్లాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. గురువారం మొత్తం 46 కిలోమీటర్లు ప్రయాణించిన జగన్ ఏడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు చోట్ల ప్రసంగించారు. సారాంశం ఆయన మాటల్లోనే..

నేను వస్తుండగా కొందరు రైతన్నలు మిరప పంటను నాకు చూపించారు. ‘అన్నా చాలా రకాల మందులు కొట్టామన్నా, అయినా కూడా పంట తేరుకోలేదు.. నకిలీ విత్తనాలున్నట్టున్నాయి.. మాకు ఇవేం బాధలన్నా!’ అంటూ నాతో చెప్పి ఆవేదన చెందారు. ఇవాళ చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ‘మిర్చి వేసుకున్న రైతన్నకు 30 నుంచి 40% పంట తాలుకాయ రూపంలో పోయింది.. మరికొంత పంట బొబ్బర వైరస్ సోకి పోయింది. ఎకరాకు కనీసం 25 క్వింటాళ్లు పండాల్సిన మిరప ఈ ఏడాది 15 క్వింటాళ్లు కూడా పండలేదన్నా’ అని ఆ రైతులు చెప్పినప్పుడు బాధనిపించింది. ఈ మిరపను తీసుకొని మార్కెట్‌కు వెళితే క్వింటాలుకు రూ.5 వేలకు ఒక రవ్వ అటో ఇటో ధర కూడా రావడం లేదన్నా అని వారు చెప్పినప్పుడు చాలా చాలా బాధనిపించింది. ఇవాళ ఒక్క మిర్చి రైతు పరిస్థితి మాత్రమే కాదు పసుపు రైతు.. పత్తి.. టమోటా.. ఉల్లి వేసుకున్న ప్రతి రైతు కూడా అధ్వానమైన పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నాడు.

ఆ సానుభూతి పాలకులకు లేదు...

గ్రామాలకు వెళుతున్నప్పుడు పొలాల్లో కూలి పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మలు కనిపించారు. వాళ్లు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నాతో ఆప్యాయంగా మాట్లాడారు. నేను వాళ్లను అడిగా..! ఎంత కూలి గిడుతోంది తల్లీ అని. ‘రూ.100 కూడా గిట్టడంలేదన్నా. ఇవాళ రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మిర్చి పంటలను మార్కెట్‌లోకి తీసుకుని పోయి అమ్మితే రూ.5 వేలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితులలో ఇవాళ రైతులు ఉన్నారన్నా.. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లు ఇంతకంటే ఎక్కువ మాకు ఏమిస్తారన్నా’ అని ఆ అక్కా చెల్లెమ్మలు కూడా రైతన్నమీద సానుభూతి చూపిస్తున్నారు. బాధెక్కడనిపిస్తోందంటే.. తోటి మనిషి మీద ఇంకో మనిషి సానుభూతి చూపిస్తున్నాడు కానీ.. సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం మాత్రం తనకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితిలోనూ..

నాకు తెలుసు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మీది. పనికి వెళ్తేనే కడుపు నిండుతుందని నాకు తెలుసు. పేదవాళ్లు ఈ రోజు రూ.100 సంపాదిస్తే ఆ సొమ్ముతోనే రోజు ఎలా వెళ్లదీయాలా అని నా అక్కా చెల్లెమ్మలు ఆలోచనలు చేస్తారు. ఈ రోజు పనికి వెళ్లకపోతే కడుపు మాడుతుందని తెలిసి కూడా నా కోసం ఈ మండుతున్న ఎండలో నడిరోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తున్నారు. రావడానికి ఆలస్యమైనాఏమాత్రం అసంతృప్తి అనేదే లేకుండా నా మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూపిస్తున్న అక్కా చెల్లెమ్మలకు, అవ్వా తాతలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను.

‘వస్తారా? చావమంటారా?’

పట్టుబట్టి తమ ఊళ్లకు లాక్కెళ్లిన ఏడు గ్రామాల ప్రజలు


గురువారం ఓదార్పు యాత్ర షెడ్యూల్ ప్రకారమైతే జగన్‌మోహన్‌రెడ్డినూజెండ్ల మండలంలోని గ్రామాల్లో పర్యటించాలి. కానీ ఉదయం వినుకొండలోని అతిథి గృహం నుంచి ఆయన బయటకు రాగానే.. తమ గ్రామానికి రావాలంటూ వెంకుపాలెం గ్రామస్తులు జగన్ కాన్వాయ్‌కు అడ్డంపడ్డారు. కిరోసిన్ డబ్బాలు వెంట తెచ్చుకొని తమ గ్రామం రాకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ భీష్మిం చారు. దీంతో జగన్ వెంకుపాలెం వెళ్లారు. అక్కడకు వెళ్లగానే సరికొండపాలెం గ్రామస్తులు.. మా గ్రామానికి రావాలంటూ పట్టుబట్టారు. అనంతరం అక్కడికీ వెళ్లారు. అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి బయలుదేరేందుకు సిద్ధమవుతుండగానే తమ గ్రామం రావాలంటూ నాయుడుపాలెం గ్రామస్తులు పట్టుబట్టారు.. ఇలా ఏడు గ్రామాల ప్రజలు పట్టుబట్టి వెంటతీసుకొని వెళ్లడంతో గురువారం ఓదార్పు షెడ్యూల్ ప్రకారం జరగలేదు. కాగా సాయంత్రం బొల్లాపల్లి మండలం పేర్లపాడు గ్రామంలో వైఎస్ విగ్రహావిష్కరణతో ఓదార్పునకు విరామమిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.. తూర్పుగోదావరి జిల్లా పల్లంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించడానికి బయల్దేరి వెళ్లారు. పేర్లపాడు నుంచి గుంటూరు వచ్చి అక్కడి నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఆయన తూర్పుగోదావరికి వెళ్లారు.
Share this article :

0 comments: