దీదీ దెబ్బకు కాంగ్రెస్ సంకీర్ణం విలవిల.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీదీ దెబ్బకు కాంగ్రెస్ సంకీర్ణం విలవిల..

దీదీ దెబ్బకు కాంగ్రెస్ సంకీర్ణం విలవిల..

Written By ysrcongress on Friday, March 16, 2012 | 3/16/2012

దీదీ దెబ్బకు కాంగ్రెస్ సంకీర్ణం విలవిల..

దినేశ్‌ను తప్పించాలన్న మమత అల్టిమేటంపై యూపీఏ మల్లగుల్లాలు
నేటి సాధారణ బడ్జెట్‌పైనా దీదీ రాద్ధాంతం చేయొచ్చంటూ ఆందోళన
తృణమూల్‌ను వదిలించుకుని ఎస్పీని చేరదీసే యోచనలో కాంగ్రెస్
ములాయంతో ఇప్పటికే చర్చలు... స్వయంగా సోనియా లేఖ
అఖిలేశ్ ప్రమాణానికి కాంగ్రెస్ సీనియర్ల హాజరు
జోరందుకున్న కొత్త రాజకీయ సమీకరణాలు
హస్తినలో ‘మధ్యంతర’ చర్చలు.. సిద్ధమంటున్న బీజేపీ

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బెదిరింపులు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రైలు ప్రయాణికుల చార్జీల పెంపుపై దీదీ ఆగ్రహం, రైల్వే మంత్రి దినేశ్ త్రివేదిని తొలగించాలంటూ ప్రధానికి ఆమె సంధించిన లేఖాస్త్రం తాలూకు ప్రకంపనలు సంకీర్ణ సారథి కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నాయి. వరుస కుంభకోణాలు, కేంద్ర మంత్రులపై తీవ్ర అవినీతి ఆరోపణలతో ఇప్పటికే తీరని అప్రదిష్టను మూటగట్టుకున్న యూపీఏ విశ్వసనీయత కాస్తా బుధవారం నాటి రైల్వే బడ్జెట్ రభసతో అథఃపాతాళానికి దిగజారింది. ఈ ఉదంతంతో ఇప్పటికే పరువును పూర్తిగా పోగొట్టుకున్న కాంగ్రెస్ సంకీర్ణం, మైనారిటీలో పడి మధ్యంతరాన్ని ఎదుర్కోవాల్సిన ప్రమాదాన్ని తప్పించుకునేందుకు తాజాగా ఆపసోపాలు పడుతోంది. తృణమూల్‌తో సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టేలా కన్పిస్తున్న నేపథ్యంలో సమాజ్‌వాదీని అక్కున చేర్చుకునే ప్రయత్నాల్లో పడింది. 

కాంగ్రెస్ పెద్దలు గురువారమంతా దీనిపైనే మల్లగుల్లాలు పడ్డారు. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌కు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ మేరకు స్వయంగా లేఖ కూడా రాసినట్టు కొన్ని చానళ్లలో వార్తలు వచ్చాయి. శుక్రవారం సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో, బుధవారం మమత ఇచ్చిన షాక్‌కు కాంగ్రెస్‌కు దిమ్మతిరిగింది. త్రివేదిని తొలగింపుకు పట్టుబట్టడం ద్వారా కాంగ్రెస్‌తో సంబంధాలను మమత తెగేదాకా లాగుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య దూరం పూడ్చలేనంతగా పెరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. తాజా సంక్షోభమంతా కాంగ్రెస్ సృష్టేనని గురువారం కోల్‌కతాలో మమత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నారు. రైల్వేల మనుగడ దృష్ట్యా పదేళ్ల తర్వాత చార్జీలను నామమాత్రంగా పెంచినందుకే ఇంతటి గందరగోళం సృష్టించిన ఆమె, మూడేళ్లుగా మందగించిన ఆర్థిక ప్రగతిని తిరిగి పట్టాలకెక్కించేందుకు భారీ సంస్కరణలు అనివార్యమైన నేపథ్యంలో, సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలపై మరింత రాద్ధాంతం చేయడం ఖాయమని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకు తీవ్ర వ్యతిరేకి అయిన ఆమె, రిటైల్‌లోకి ఎఫ్‌డీఐలకు అనుమతి సహా పలు కీలక విధాన నిర్ణయాలను అడ్డుకున్న వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

మమత కోరినట్టు రైల్వే మంత్రిని మార్చి, చార్జీల పెంపునూ రద్దు చేస్తే ఇటు ప్రజల్లోనూ, అటు పారిశ్రామిక వర్గాల్లోనూ యూపీఏకు విశ్వసనీయత పూర్తిగా అడుగంటడం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు. సంస్కరణలను అమలు చేయలేని అసమర్థ సర్కారుగా ముద్రపడిపోవాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నారు. అలాగని.. అరకొర మెజారిటీతో కొనసాగుతున్న యూపీఏ, 19 మంది ఎంపీలున్న తృణమూల్ అధినేత్రి అల్టిమేటాన్ని తోసిపుచ్చే పరిస్థితిలో కూడా లేదు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్య 541. కాబట్టి సాధారణ మెజారిటీకి 271 మంది అవసరం కాగా, యూపీఏ బలం 276. తృణమూల్ వైదొలగితే అది 257కు పడిపోతుంది. అప్పుడు ప్రస్తుతం సంకీర్ణానికి బయటి నుంచి మద్దతిస్తున్న ఎస్పీ (22 మంది ఎంపీలు), బీఎస్పీ (21 ఎంపీలు) దయాదాక్షిణ్యాలపైనే యూపీఏ పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది. 18 మంది ఎంపీలున్న మరో భాగస్వామి డీఎంకే కూడా కాంగ్రెస్‌పై చాలాకాలంగా గుర్రుగా ఉంది. 

బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉన్న కీలక తరుణంలో.. డీఎంకేను, ఎప్పుడెలా మారుతుందో తెలియని తృణమూల్‌ను నమ్ముకోలేమని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు మధ్యంతరానికి తాము సిద్ధమంటూ బీజేపీ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. మమతను తామే సాగనంపి, సమాజ్‌వాదీని సంకీర్ణంలోకి చేర్చుకుంటే ఎలా ఉంటుందని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. బీఎస్పీ బయటి నుంచి మద్దతు ఎటూ కొనసాగుతుందని గనుక యూపీఏ సర్కారు స్థిరత్వానికి కూడా ఢోకా ఉండదని భావిస్తున్నట్టు చెబుతున్నారు. లౌకికవాద పార్టీగా పేరున్న సమాజ్‌వాదీ పార్టీ, గతంలోనూ పలు బిల్లులపై ఓటింగ్ సందర్భంగా సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా అవి ఆమోదం పొందేందుకు సహకరించి కాంగ్రెస్ సంకీర్ణాన్ని ఎన్నోసార్లు ఆదుకుంది. ఏఐసీసీ తరఫున ఇప్పటికే కొందరు ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌తో గురువారం చర్చలు మొదలు పెట్టారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలోనూ, యూపీఏ సంకీర్ణంలోనూ చేరాల్సిందిగా ఆయనను కోరినట్టు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం లక్నోలో ములాయం తనయుడు అఖిలేశ్ ప్రమాణస్వీకారానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు పవన్‌కుమార్ బన్సల్, మోతీలాల్ వోరా హాజరవడం కూడా సరికొత్త రాజకీయ సమీకరణాలకు సూచికేనంటున్నారు. కేంద్రానికి మద్దతు విషయమై ములాయమే నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా అఖిలేశ్ కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు, ప్రభుత్వం నుంచి తృణమూల్ వైదొలగబోదని ఆ పార్టీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ గురువారం పేర్కొనడం విశేషం.
Share this article :

0 comments: