నా పాలమూరు, కర్నూలు, నల్లగొండ అక్కాచెల్లెమ్మలు మళ్లీ వలసబాట పట్టారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా పాలమూరు, కర్నూలు, నల్లగొండ అక్కాచెల్లెమ్మలు మళ్లీ వలసబాట పట్టారు

నా పాలమూరు, కర్నూలు, నల్లగొండ అక్కాచెల్లెమ్మలు మళ్లీ వలసబాట పట్టారు

Written By ysrcongress on Thursday, March 29, 2012 | 3/29/2012

* సర్కారు నిర్లక్ష్యంతో పల్లెలపై మళ్లీ కరువు దాడి చేస్తోంది
* నా పాలమూరు, కర్నూలు, నల్లగొండ అక్కాచెల్లెమ్మలు మళ్లీ వలసబాట పట్టారు
* ఈ చేతగాని పాలకులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘ఈ పాలకుల నిర్లక్ష్యం పల్లెలకు శాపమై చుట్టుకుంది.. పల్లెలన్నీ మళ్లీ కరువుతో అల్లాడుతున్నాయి. సొంత ఊరిలో ఉపాధి దొరకక నా పాలమూరు, నల్లగొండ, కర్నూలు అక్కాచెల్లెమ్మలు మళ్లీ వలస బాటపట్టారు. కనీస కూలీ గిట్టుబాటు కాని పరిస్థితుల్లో నా అక్కాచెల్లెళ్లు పిల్లాజెల్లలను వెంటబెట్టుకొని ఇక్కడికి(గుంటూరు జిల్లా) వచ్చి పత్తి, మిరప తోటల్లో పనులు చేసుకుంటున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటే.. ఈ చేతగాని పాలకులకు ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 79వ రోజు బుధవారం ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. ప్రత్తిపాడు రూరల్ మండలం కొత్తమల్లాయపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర పూర్తిగా గ్రామాల మీదుగా సాగింది. యాత్రలో మొత్తం ఆరు వైఎస్సార్ విగ్రహాలను, ఒక అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. గ్రామాల మీదుగా వెళుతున్నప్పుడు అక్కడి తోటల్లో మిరప కాయలు కోస్తున్న కూలీలు జగన్‌ను చూసేందుకు పరుగు పరుగున వచ్చారు. కాన్వాయ్‌ను ఆపి ఆయన వారితో మాట్లాడారు. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. కూలీల్లో చాలా మంది వేరే జిల్లాల నుంచి వలస వచ్చిన వారని తెలుసుకున్న ఆయన తల్లడిల్లిపోయారు. 

అనంతరం తిమ్మాపూరం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత ప్రసంగిస్తూ.. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఆ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

కనీస కూలీ దొరక్క
ఇవాళ నేను ఇక్కడకు (తిమ్మాపురం) రాకముందు చాలా గ్రామాలు తిరుగుతూ వచ్చా.. మన గ్రామంలోనే వేరే జిల్లాల నుంచి పనుల కోసం వలస వచ్చిన అక్కచెల్లెమ్మలు ఉన్నారు. ఊళ్లలో వారికి రూ.50 కూడా కూలీ రాని పరిస్థితి. వారిలో కర్నూలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన అక్కా చెల్లెమ్మలు కూడా ఉన్నారు. కర్నూలు జిల్లాలో రూ.60 వరకు మాత్రమే గిట్టుబాటు అవుతోందట. ఇక్కడైనా కనీసం రూ.120 కూలి గిట్టుతుందేమోననే ఆశతో వచ్చి ఆ మిరప తోటల్లో పనులు చేస్తున్నారు.

ఈ పాలకులకు బుద్ధి రావాలి
రాష్ట్రం ఇంత అధ్వాన పరిస్థితుల్లో ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సోనియా గాంధీని ఎలా మెప్పించాలనే ఆలోచనతోనే ఉన్నారు. త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రైతులకు అండగా నిలబడి, పేదవాడికి తోడు నిలిచి అవిశ్వాసానికి మద్దతు తెలిపి, అనర్హత వేటు పడిన 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. వాటిలో మీరిచ్చే తీర్పుతోనైనా రాష్ట్రాన్ని పాలిస్తున్న ఇటువంటి పాలకులకు బుద్ధి వస్తుందేమో! ఇవాళ ఈ ఎన్నికల్లో మనం వేసే ప్రతి ఓటు కూడా పేదవానికి మద్దతుగా... రైతన్నకు అండగా నిలబడేటట్లు ఉండాలి. మనం వేసే ఓటుతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న నాయకులకే కాదు.. ఈ రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్‌తో పాలిస్తున్న ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కావాలి. మన రాష్ట్రంలో పేదవాడు, రైతన్న ఏవిధంగా బాధలు పడుతున్నాడో ఢిల్లీ పెద్దలకు తెలిసిరావాలి.

రోజుకు రూ.50 కూడా రావడం లేదన్నా..
తిమ్మాపురం గ్రామ శివారులోని మిరప తోటల్లో పని చేస్తున్న కూలీలను జగన్ పలకరిస్తుండగా పసిపాప ఏడుపు వినిపించడంతో ‘పనులకొస్తూ.. పసిబిడ్డనూ తీసుకొని వచ్చారా తల్లీ!’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు అతినార భారతమ్మ అనే కూలీ బదులిస్తూ ‘పాలమూరు నుంచి పిల్లాపాపతో కలిసి వచ్చామన్నా’ అని చెప్పడంతో తల్లడిల్లిపోయారు. ‘పాలమూరుకు మళ్లీ కరువొచ్చిందా?’ అని ఆయన అనగా.. ‘ఉపాధి పనులు లేవన్నా.. కూలికి పోతే రోజుకు కనీసం రూ. 50 కూడా గిట్టుబాటు కావడం లేదన్నా’ అని చెప్పింది. ‘మేమే కాదన్నా... విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి గుంపులుగా(మూఠాలుగా) వచ్చిన వ్యవసాయ కూలీలు ఇక్కడి తోటల్లో పని చేస్తున్నారన్నా..’ అని చెప్పడంతో జగన్ ఉద్వేగానికి లోనయ్యారు.
Share this article :

0 comments: