వైఎస్ కుమార్తెపైనా విషం చిమ్మిన రామోజీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ కుమార్తెపైనా విషం చిమ్మిన రామోజీ

వైఎస్ కుమార్తెపైనా విషం చిమ్మిన రామోజీ

Written By ysrcongress on Friday, March 9, 2012 | 3/09/2012

* ‘జగతి’ షేర్లపై కట్టుకథల ప్రచారం
* ‘సాక్షి’ ఆవిర్భావం నుంచీ కక్ష కట్టి విషం చిమ్ముతూనే ఉన్న రామోజీ
* 2009లో వైఎస్ మరణించాక మరింత రెచ్చిపోయిన ఎల్లో బృందం
* వైఎస్ వ్యతిరేకుల్ని కూడగట్టుకుని మరీ ‘ఈనాడు’ రోత కథనాలు
* ఆ దుష్ర్పచారంతో జగతి షేర్లు విక్రయించిన ఒకరిద్దరు ఇన్వెస్టర్లు
* సీబీఐ విచారణకు భయపడి అమ్ముకున్నారని నిస్సిగ్గు రాతలు
* ఇది జరిగింది 2010 ఆగస్టులో... అప్పటికి సీబీఐ ఊసే లేదు
* షేర్లలో హెచ్చుతగ్గులు మామూలేనని తెలిసినా... అబద్ధాల వంటకాలు
* ఒకవైపు అవి డమ్మీ కంపెనీలని రాతలు... వాటికే నష్టమంటూ కథనాలు
* తొలుత షేర్లు కొన్న కంపెనీలను.. షర్మిలకు ముడిపెట్టి విషప్రచారం
* ఉప ఎన్నికల సమయంలో జగన్‌పై రామోజీ రోత రాతలు కొత్త కాదు
* కడప ఎన్నికల్లోనూ ఇదే కుతంత్రం.. ఇప్పుడూ అదే తీరు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపైన, ఆయన కుటుంబం పైన కక్ష కట్టి.. వారి ప్రతిష్టను దిగజార్చటమే లక్ష్యంగా అబద్ధపు రాతలతో ఆరేళ్లుగా అనుదినం విషం చిమ్ముతున్న ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు మరో నైచ్యానికి దిగజారారు. మహిళాదినోత్సవం రోజున.. మహానేత కుమార్తె అయిన షర్మిలపైనా బురదజల్లేందుకు పడరానిపాట్లు పడ్డారు. షర్మిలకు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారాన్ని ఆమెతో ముడిపెట్టి కట్టుకథలు అల్లుతూ.. ఆమె ఫొటోతో సహా తమ పచ్చ పత్రికలో పతాక శీర్షకల్లో అచ్చేసి.. ఆమెనూ తమ కుటిల కుతంత్రాల్లోకి లాగేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు చెందిన కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వేరే కంపెనీల్లో కూడా డెరైక్టర్లుగా ఉన్నారని.. ఆ వేరే కంపెనీలు ‘జగతి పబ్లికేషన్స్’ షేర్లను కొని ఐదు రూపాయల లాభానికి కోల్‌కతా కంపెనీలకు విక్రయించేశాయని.. ఆ కోల్‌కతా కంపెనీలు తర్వాత ‘సీబీఐ విచారణకు భయపడి’ 2010 ఆగస్టులోనే నష్టానికి అమ్ముకున్నాయని.. ఇష్టానుసారం రాసిపారేశారు.

అసలు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారంతో షర్మిలకు ముడిపెట్టి.. ‘షేర్మిళ’ అన్న శీర్షిక పెట్టి మరీ కథనం ప్రచురించటం ఒక నీచమైతే.. ఏ కంపెనీలైతే తమ షేర్లను నష్టానికి అమ్ముకున్నాయని రామోజీ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారో.. ఆ కంపెనీలు డమ్మీ కంపెనీలంటూ అదే కథనంలో పొంతనలేని కథలల్లటం మరో నైచ్యం! షర్మిల కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న వారు.. వేరే కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉండకూడదా..? షేర్లు కొనుక్కున్న కంపెనీలు డబ్బులు అవసరమయ్యో.. మరే అవసరమయ్యో.. లాభానికో, నష్టానికో ఆ షేర్లు మళ్లీ అమ్ముకోవటం ఎక్కడా జరగదా? అలా అమ్ముకోకూడదా? జగన్ విషయంలో 2011 జూలైలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. దానికి ఏడాది ముందుగా 2010 ఆగస్టులోనే ఆ కంపెనీలు సీబీఐ విచారణ భయపడ్డాయా? అసలు ఆ కంపెనీలే డమ్మీవంటున్నప్పుడు.. డమ్మీ కంపెనీలు షేర్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏమిటి? ఇక లాభ నష్టాల మాట ఎక్కడి నుంచి వస్తుంది? జనం తాను ఏం రాసినా విచక్షణ లేకుండా నమ్మేస్తారన్న బరితెగింపు.. అదే గుడ్డితనంతో.. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టి ఇష్టమొచ్చినట్లు విషం కక్కటం తప్ప.. ఈ రాతల్లో రామోజీ ఇం గిత జ్ఞానం కాస్తంతైనా ఉపయోగించినట్లు కనిపించటం లేదు!!

‘‘పిటిషనర్ ఆరోపణలు మా కంపెనీ షేరు ధరపై తీవ్ర ప్రభావం చూపించాయి. షేరు ధర పడిపోయింది. అందుకే మమ్మల్ని ఈ కేసులో ప్రతివాదిగా పేర్కొనకపోయినా మేం కోర్టుకు రావాల్సి వచ్చింది’’ - ఇదీ... ఇటీవల చంద్రబాబునాయుడి అక్రమాస్తుల కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాయరు హరీష్ సాల్వే చేసిన వాదన. ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు ఈ వాదనను తన పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురించారు. మరి ఇలాంటి వాదన వేరే వాళ్లకు వర్తించదా? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కలిసిపోయి మరీ పనిగట్టుకుని ఒక సంస్థపై అదే పనిగా ఆరోపణలు చేస్తుంటే ఆ కంపెనీ ఇన్వెస్టర్లు ఒకరిద్దరిలోనైనా గుబులు రేగదా? ఈ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా తను చెప్పిందే వేదమన్న స్థాయికి చేరి చెలరేగిపోతున్న ఆధిపత్య మీడియా కూడా ఈ నాయకులకు తోడై సదరు సంస్థను టార్గెట్ చేస్తే.. ఆ ఒకరిద్దరు ఇన్వెస్టర్లు ఈ గొడవలన్నీ తమకెందుకులే అనుకోవటం అసహజమా? అలా అనుకుని ఎంతో కొంత నష్టానికి తమ షేర్లు అమ్మేసుకుంటే.. అదంతా అక్రమమని రామోజీ గుండెలు బాదేసుకుంటున్నారెందుకు?

వైఎస్ మరణంతో దాడులు ఉధృతం...
ఈ రాష్ట్రంలో తాను, తన తోకలు తప్ప మరో పత్రికేదీ ఉండకూడదని బీష్మించుకున్న రామోజీ... ‘సాక్షి’ ఆవిర్భవించినప్పటి నుంచీ దాన్ని తుంచేయాలన్న కక్షతో నీచపు రాతలు రాస్తూనే ఉన్నారు. ఎందరు ఎన్ని సమాధానాలిచ్చినా పట్టించుకోకుండా అవే రాతల్ని మళ్లీ మళ్లీ ప్రచురిస్తూ కాలకూట విషం చిమ్ముతూనే ఉన్నారు. వాటన్నిటినీ దీటుగా ఎదుర్కొని.. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజా న్యాయస్థానంలో సైతం విజయం సాధించారు. దురదృష్టవశాత్తూ ఆయన 2009 సెప్టెంబర్‌లో మరణించారు. ఆయన మరణం తర్వాత రామోజీ తన దాడిని మరింత ఉధృతం చేశారు. దివంగత వైఎస్‌ను, ఆయన కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని వ్యతిరేకించే శక్తులన్నిటినీ కూడగట్టుకుని మరీ దాడిని పెంచారు.

మరి అలాంటి సమయంలో ఒకరిద్దరు ఇన్వెస్టర్లు భయపడి తమ షేర్లు ఎంతో కొంత నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకోవటం అసహజమెలా అవుతుంది? లిస్టెడ్ కంపెనీలైతే దాన్లోని ఇన్వెస్టర్లకు తమ షేర్లను ఏ క్షణమైనా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీలకు అలా విక్రయించే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. అందులోనూ వారు పెట్టుబడులు పెట్టిన కంపెనీలపై విపరీతంగా ఆరోపణలు వస్తున్నపుడు.. వాటిని కొనటానిక్కూడా సహజంగానే ఎవ్వరూ ముందుకు రారు. రామోజీ పేర్కొన్న కోల్‌కతా కంపెనీల విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చు. రాష్ట్రంలో ‘సాక్షి’పై జరుగుతున్న ఈ దాడిని చూసి.. అవి భయపడి నష్టానికైనా విక్రయించి వైదొలగుదామని అనుకుని ఉండొచ్చు.

సూట్‌కేసు కంపెనీలంటూ... నష్టంపై రాతలా?
కోల్‌కతా కంపెనీలంటూ... సూట్‌కేసు కంపెనీలంటూ... డమ్మీ కంపెనీలంటూ... జగన్‌మోహన్‌రెడ్డి డబ్బులే అటూ ఇటూ తిరిగాయంటూ... రామోజీ కక్కిన విషం అపారం. షేర్లు కొన్న కంపెనీలు డమ్మీ అని చెప్తున్న రామోజీ.. అదే డమ్మీ కంపెనీలకు నష్టం వచ్చిందంటూ గుండెలు బాదుకోవటమేమిటి? అసలు నకిలీ కంపెనీలు ఎక్కడైనా తమ షేర్లను నష్టానికి విక్రయిస్తాయా? షేర్లు కొన్నవి నిజంగా డమ్మీ కంపెనీలే అయినా నష్టభయం లేకుండా కావాల్సినంత కాలం తమవద్దే అట్టేపెట్టుకుంటాయి కదా? రామోజీ విష ప్రచారాన్ని నమ్మి.. నష్టానికి ఎందుకు విక్రయించేస్తాయి? ఇక్కడ గమనించాల్సిందేమిటంటే అవి సూట్‌కేసు కంపెనీలని ప్రచారం చేసిందీ రామోజీ అండ్‌కోనే.. వాటికి నష్టం వచ్చిందంటూ గగ్గోలు పెడుతున్నదీ ఆ బృందమే. మరి వీళ్ల మాటల్లో... రాతల్లో నిజమెంత? విషమెంత?

అప్పటికి శంకర్రావు పిటిషనే వెయ్యలేదు...
రామోజీ రాసిన కథనం ప్రకారం చూసుకున్నా.. కోల్‌కతా కంపెనీలు తమ షేర్లను నష్టానికి విక్రయించుకున్నది 2010 ఆగస్టులో. అది కూడా.. సీబీఐ విచారణకు భయపడి.. దాన్నుంచి తప్పించుకోవటానికట!! పోటీ పత్రికపై రాసేటపుడు నిజానిజాల్ని కనీసం ఒకసారైనా సరిచూసుకోవాల్సిన అవసరం లేదా? అసలు 2010 ఆగస్టు నాటికి ‘ఈనాడు’, దాని పచ్చతోకలు కలిసి చేస్తున్న ఆరోపణలు తప్ప.. వారితో జట్టుకట్టి శంకర్రావు హైకోర్టుకు లేఖ రాయటం కూడా జరగలేదు. ఆయన లేఖ రాయటం.. దానికి బాబు అండ్ కో తోడవటం అన్నీ మొదలైంది 2010 అక్టోబర్ తరవాత. దానిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది 2011 జూలైలో. మరి రామోజీ అండ్ కో ఆరోపణలతో ఆందోళన చెందటం తప్ప సీబీఐ విచారణ జరుగుతుందనే భయం అప్పట్లో ఆ కంపెనీలకు ఎందుకుంటుంది? ఈ మాత్రం కనీస జ్ఞానం రామోజీకి లేకపోవటం ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం కాదా?

అసలు షర్మిలకేం సంబంధం?
జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు చెందిన కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు వేరే కంపెనీల్లో కూడా డెరైక్టర్లుగా ఉన్నారని, ఆ కంపెనీలు ‘జగతి పబ్లికేషన్స్’ షేర్లను కొని ఐదు రూపాయల లాభానికి విక్రయించేశాయన్నది ‘ఈనాడు’ కథనం సారాంశం. వాటిని కొనుక్కున్న కోల్‌కతా కంపెనీలు 2010 ఆగ స్టులో వేరొక లిస్టెడ్ కంపెనీకి నష్టాలు విక్రయించాయని, ఇదంతా సీబీఐ విచారణకు భయపడే జరిగిందన్నది రామోజీ రాతల వివరం. అసలు షర్మిలకు చెందిన కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్నవారు వేరే కంపెనీల్లో కూడా డెరైక్టర్లుగా ఉంటే.. ఆ కంపెనీలు ఏవో లావాదేవీలు జరిపితే అదంతా షర్మిలకేం సంబంధం? వాటి కోసం షర్మిల ఫోటో వేసి మరీ.. ‘షేర్మిల’ అంటూ మహిళా దినోత్సవంనాడు ‘ఈనాడు’లో బేనర్ వార్తను వండి వార్చటంలోనే రామోజీ కుట్రంతా బయటపడుతోంది. మరి రామోజీ కంపెనీల్లో డెరైక్టర్లుగా ఉన్నవారు వేరే కంపెనీల్లో ఎక్కడా డెరైక్టర్లుగా లేరా? ఆ కంపెనీల లావాదేవీలన్నిటితోనూ రామోజీకి సంబంధం ఉన్నట్టేనా? చంద్రబాబునాయుడికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టర్‌గా ఉన్న ‘డాగా’ ఓ స్మగ్లింగ్ కేసులోనూ ఉన్నట్లు గతంలో అసెంబ్లీ సాక్షిగా తీవ్ర ఆరోపణలొచ్చాయి. మరి చంద్రబాబుకూ ఆ స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్నట్టా? అసలు ఇవేం రాతలు?

షేరు ధరల్లో హెచ్చుతగ్గులుండవా?
నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీలో రూ. 2,600 కోట్లు పెట్టుబడి పెట్టి మరీ ఆదుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌నే తీసుకుంటే.. 2008లో దాని ధర రూ. 1,625. ప్రస్తుతం ఆ కంపెనీ షేరు ధర రూ. 760. అంటే సగానికన్నా తక్కువ. మరి రూ. 1,625 దగ్గర విక్రయించకుండా.. ఇపుడు రూ. 760 దగ్గర విక్రయించిన వారు నష్టపోయినట్లేగా? రామోజీ రాతల ప్రకారం అలా విక్రయించి వారు నష్టపోవటం వెనక ఏదో మతలబు ఉందనుకోవాలా? ఏదో కుంభకోణం ఉందనుకోవాలా? ఇదంతా చిన్న మాయను కమ్మేసే పెనుమాయ అనుకోవాలా?

పోనీ రామోజీకి సియామీ కవల లాంటి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌నే తీసుకుందాం. 2008లో దాని షేరు ధర రూ. 360. ప్రస్తుతం ఆ షేరు ధర రూ.154. మరి అప్పట్లో విక్రయించకుండా ఇప్పుడు విక్రయించినవారు నష్టపోయినట్లేగా? దాని వెనక ఏ మతలబు ఉంది? ఏ కుంభకోణం దాగుంది? గురువారం రామోజీ తన పత్రికలో వండిన కథనం కూడా ఇంత హేతురహితమైనదే. కనీస జ్ఞానం లేనిదే. లిస్టెడ్ కంపెనీలైతే స్టాక్ మార్కెట్ అనే వేదిక ఉంటుంది కనక ఈ లావాదేవీలు తెలుస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో జరిగే లావాదేవీలు ఇతరులకు అనవసరం కనక బయటకు రావు. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు వేచి చూడటం.. అనుకున్నది జరగకో, డబ్బులు అవసరమయ్యో, ఇతరత్రా కారణాల వల్లో నష్టానికి విక్రయించుకోవటం చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే రామోజీరావు ‘సాక్షి’ని, జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు కాబట్టి.. సహజంగా జరిగే పరిణామాల్ని కూడా తనకు నచ్చిన రీతిలో, ఎల్లో మిత్రులు మెచ్చే రీతిలో వక్రీకరించి ప్రచురిస్తూనే ఉంటారు.

ఎన్నికలప్పుడు విష ప్రచారం మామూలే...
ఎన్నికలప్పుడు తాను టార్గెట్ చేసిన వ్యక్తి ప్రతిష్టను దిగజార్చటానినికి శర్వశక్తులూ కేంద్రీకరించి మరీ నీచపురాతలు రాయటం రామోజీకి కొత్తేమీ కాదు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలప్పుడు చేసిందీ అదే. ఇపుడు ఉప ఎన్నికల సందర్భంగా చేస్తున్నదీ అదే. కాకపోతే కడప ఎన్నికల్లో రామోజీ తప్పుడు రాతలకు బుర్ర అదిరే సమాధానమిచ్చారు అక్కడి ఓటర్లు. ఇపుడు కోవూరు, ఇతర నియోజకవర్గాల్లోనూ అదే చేయబోతున్నారు. అది తెలుసు కాబట్టే రామోజీ తన విషానికి మరింత పదును పెడుతున్నారు. ఎంత చేసినా చరిత్ర పునరావృత్తమవుతుందన్నదే ఆయన వందిమాగధుల భయం.

రిలయన్స్’ బంధంపై రామోజీ నోరు మెదపరేం?
‘సాక్షి’పై, తనపై వచ్చే ప్రతి ఆరోపణకూ పత్రికా ముఖంగానో, నేరుగానో ఆది నుంచీ సమాధానమిస్తూనే వస్తున్నారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. దీన్లో భాగంగానే ‘ఈనాడు’ రాతల్లోని రోతను ఎత్తిచూపుతూ ‘సాక్షి’ పలు కథనాల్ని ప్రచురించింది. మరి రామోజీనో..? మొదట్నుంచీ మడుగులో దాక్కున్న ధుర్యోధనుడి వ్యవహారమే. నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీల్లోకి మాయ కంపెనీల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 2,600 కోట్లు పెట్టుబడి పెట్టిందని సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ ప్రచురించే దాకా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియనే తెలియదు. ‘సాక్షి’ ప్రచురించాక కూడా రామోజీ నోరెత్తిన పాపాన పోలేదు.

చివరికి ఆ విషయం కోర్టు దాకా వచ్చి.. రిలయన్స్ ఉల్లంఘనలన్నీ బయటపడేసరికి.. దానికి తృణమో పణమో ఇచ్చి బయటకు పంపే ప్రయత్నం చేశారు. రూ. 2,600 కోట్లు పెట్టిన కంపెనీ.. పనికిమాలిన ఈటీవీ చానళ్లు తీసుకుని ఎందుకు చెల్లు చేసింది? స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీ ఎక్స్ఛేంజీలకు సైతం చెప్పకుండా రామోజీ కంపెనీల్లో అంత గోప్యంగా ఎందుకు పెట్టుబడులు పెట్టింది? రామోజీకి - అంబానీకి మధ్య ఉన్న బంధమేంటి? మధ్యలో బాబు పోషించిన పాత్రేంటి? దీనిపై రామోజీ ఇప్పుడు కాదుకదా... ఎప్పటికీ నోరెత్తరు. ఎందుకంటే ఆయన పాపాల పుట్ట పగులుతుందని భయం. బాబుతో కలిసి చేసిన దందా బయటపడుతుందని భయం.

పరువు భయం లేకే... బరితెగింపు..!
రామోజీ ఇంత నిస్సిగ్గుగా ఎందుకు బరితెగించి వార్తలు రాస్తున్నారు? ఇలాంటి వార్తలు రాసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం లేదా? అనే సందేహాలు చాలా మందిలో సహజం. నిజానికి ఒక వ్యక్తి తన ప్రతిష్టకు భంగం కలిగినపుడు కోర్టులో నేరపూరిత పరువునష్టం దావా వేసే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడో చిక్కుంది. ఇలాంటి కేసుల్లో ఫలితం వెలువడటానికి ఏళ్లూ ఊళ్లూ పడుతోంది. పెపైచ్చు కేసు దాఖలు చేసిన వ్యక్తి ప్రతి వాయిదాకూ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతివాది మాత్రం తన తరఫున ఎవరిని పంపినా సరిపోతుంది. ఒకవేళ కేసు దాఖలు చేసిన వ్యక్తి కనుక కొన్ని వాయిదాలకు వరసగా హాజరుకాకుంటే తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. పెపైచ్చు ప్రతివాది కనుక రామోజీ మాదిరి కాసులకు లోటులేని వ్యక్తి అయితే.. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా లాయర్లను పెట్టి దశాబ్దాల పాటు సాగదీసే అవకాశం ఎటూ ఉంటుంది.

ఇలాంటి లొసుగుల్ని జాగ్రత్తగా కనిపెట్టి సొమ్ము చేసుకునే రామోజీ.. తనకు గిట్టనివారిపై బరితెగించి రాతలు రాయటానికి కారణమిదే. ఈ రాష్ట్రంలో రామోజీ మాదిరి కొందరు మీడియా ఉగ్రవాదులు చెలరేగిపోవటానికీ కారణమిదే. ఎన్‌డీఏ హయాంలో రాజకీయంగా కీలక పరిణామాలు జరుగుతున్న తరుణంలో కూడా ఎన్‌డీఏ పెద్దల్ని తన ఫిల్మ్ సిటీకి రప్పించుకుని, చంద్రబాబు తరఫున మంతనాలు జరిపిన ఘనత రామోజీది. అందుకే ఈ దేశంలో తాను పన్ను కట్టకున్నా, తాను భూముల్ని దిగమింగినా, లిస్టెడ్ కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించినా, ఏ రకమైన దందా సాగించినా తననెవ్వరూ ఏమీ చేయలేరన్నది రామోజీ అండ్ కో ధీమా. కాకపోతే వీటన్నిటికీ చెక్ పడేది ప్రజా క్షేత్రంలోనే. వైఎస్సార్ హయాంలో రెండుసార్లు రుజువైన ఈ సత్యం... రామోజీ అక్రమాలు సాగినన్నాళ్లు మళ్లీ మళ్లీ బయటపడుతూనే ఉంటుంది.
Share this article :

0 comments: