టీడీపీ, కాంగ్రెస్‌లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ, కాంగ్రెస్‌లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి

టీడీపీ, కాంగ్రెస్‌లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012


* టీడీపీ, కాంగ్రెస్‌లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి
* సమాచార హక్కు కమిషనర్ పదవులు కలసి పంచుకున్నాయి
* ఈ ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోటీ
* రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా తీర్పు ఇవ్వాలి..

కోవూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ర్టంలో అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై కోర్టుల దాకా కలసి నడుస్తున్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కలసి పోటీ చేశాయని, సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవులు పంచుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి మద్దతుగా సోమవారం ఆయన ప్రచారం ప్రారంభించారు. కొడవలూరు, యల్లాయపాలెంలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీలపై మండిపడ్డారు. రాష్ర్టంలో రైతులు, పేదలు దీనస్థితిలో ఉన్నా.. వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం కుమ్మక్కయ్యాయని చెప్పారు. 

రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, రైతుకు అండగా ఉండి పోరాడాలన్న లక్ష్యంతోనే ఎమ్మెల్యేలు, ఎంపీ రాజీనామా చేశారన్నారు. కోవూరు నియోజకవర్గ ఓటర్లు ఇచ్చే తీర్పుతో ఢిల్లీ దిమ్మ తిరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా తీర్పు ఇవ్వాలని ఓటర్లను కోరారు. కోవూరు ఉపఎన్నికలో విశ్వసనీయత, విలువలు ఒకవైపు.. కుట్రలు, కుత్రంతాల రాజకీయం మరోవైపు నిలిచాయని చెప్పారు. పేదలు, రైతులు ఒకవైపు నిలబడగా.. అధికార ప్రతిపక్షాలు మరోవైపు నిలిచాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు చోటులేకుండా పోయిందన్నారు. 

‘‘రాష్ట్రంలో రైతులు, పేదల బాధల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఏడాదికి మూడు పంటలు పండించే కోస్తా ప్రాంతంలోని రైతులు.. లక్ష ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడింది. కూలీలకు రోజుకు రూ.70 నుంచి రూ.80కి మించి కూలీ గిట్టడం లేదు. ఫోన్ చేస్తే గ్రామాలకు 108 వాహనాలు రావడం లేదు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కాలర్ పట్టుకోవాల్సిన ప్రతిపక్షం నోరెత్త లేని దుస్థితిలో ఉంది’’ అని జగన్ మండిపడ్డారు.

మూడో పార్టీ ఉండకూడదని కుట్ర చేస్తున్నారు..
రాష్ట్రంలో తమ పార్టీలు తప్ప మూడో పార్టీగానీ, మూడో వ్యక్తిగానీ ఉండకూడదని కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు చేస్తున్నాయని జగన్ ధ్వజమెత్తారు. జనానికి ఒక పార్టీపై విసుగు పుడితే రెండో పార్టీకి మాత్రమే ఓటేయాలన్న ఆలోచనలో ఆ పార్టీలు ఉన్నాయని చెప్పారు. ‘‘ఉప ఎన్నికలు ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదని, మంత్రులు డబ్బుల సంచులు తీసుకొచ్చి కుమ్మరిస్తారని, పోలీసు యంత్రాంగాన్ని తమ అదుపులో ఉంచుకుని తప్పుడు కేసులు బనాయిస్తారని తెలుసు. అయినా రాజకీయాల్లో విలువలకు అద్దం పట్టి, విశ్వసనీయతకు అర్థం చెప్పాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికలకు సిద్ధమయ్యాం. పేదల కోసం, రైతుల కోసం రాజీనామా చేయాలని నేను చెప్పిన వెంటనే కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి పదవిని త్యజించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆయనను మళ్లీ గెలిపించి అసెంబ్లీకి పంపండి..’’ అని ప్రజలను కోరారు. 

నెల్లూరు లోక్‌సభ స్థానానికి, కోవూరు అసెంబ్లీ స్థానానికి ఒకేసారి ఉప ఎన్నికలు జరపకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని, రెండుసార్లు ఓట్లు వేయాలంటే జనం విసిగిపోయి ఓటింగ్‌కు దూరమవుతారన్న నీచమైన ఆలోచనలు చేసిందని జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. త్వరలో జరగనున్న నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ వ్యవస్థను మార్చే రోజు త్వరలోనే వస్తుంది.. 
ప్రజల మీద తనకు నమ్మకం ఉందనీ, విలువలు లేని రాజకీయ వ్యవస్థను మార్చే రోజు త్వరలోనే వస్తుందని జగన్ చెప్పారు. త్వరలోనే ప్రతి పేదవాడు.. ‘ఇది మన ప్రభుత్వం..’ అని కాలర్ ఎగరేసుకుని తిరిగే స్వర్ణయుగం రావడం తథ్యమని పేర్కొన్నారు. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదనీ, ఎలా బతికామన్నదే ముఖ్యమని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పేవారన్నారు. ఆ నాయకుడి మరణంతో రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందనీ, అధికార, ప్రతిపక్షాలు ఒక్కటై తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను గాలికొదిలేశాయని మండిపడ్డారు. 

ప్రచారంలో జగన్ వెంట... పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవ ర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ నేతలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, జిల్లా పరిశీలకుడు విశ్వేశ్వర్‌రెడ్డి, రాయలసీమ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.

అభిమాన నేతను చూసేందుకు..
కోవూరు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. వెళ్లిన ప్రతిచోటా ఆయనను చూడడానికి, చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు. జనం ఉన్న ప్రతి చోట జగన్ తన ప్రచార వాహనం నుంచి కిందకు వచ్చి వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ముందుకు సాగారు.

జగన్ పర్యటన మరోరోజు పొడిగింపు
నెల్లూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు ఉప ఎన్నికల ప్రచారాన్ని మరోరోజు పొడిగించారు. ఆయన 5,6,7 తేదీల్లో పర్యటించాల్సి ఉండగా సోమవారం కొడవలూరు మండలంలో ప్రచారం సందర్భంగా.. ప్రజలు పోటెత్తడం, ప్రతిచోటా మాట్లాడాలని కోరడంతో పర్యటన ఆలస్యంగా సాగింది. దీంతో కొన్ని గ్రామాలు మిగిలిపోయాయి. ఆ గ్రామాల్లో 8న జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం కోవూరులో జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొంటారు. మంగళ, బుధవారాల్లో ముందుగా ప్రకటించిన మేరకే ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లో జగన్ ప్రచారం నిర్వహిస్తారు.
Share this article :

0 comments: