ఉప ఎన్నికల పోలింగ్ సరళితో కంగుతిన్న కాంగ్రెస్, టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికల పోలింగ్ సరళితో కంగుతిన్న కాంగ్రెస్, టీడీపీ

ఉప ఎన్నికల పోలింగ్ సరళితో కంగుతిన్న కాంగ్రెస్, టీడీపీ

Written By ysrcongress on Monday, March 19, 2012 | 3/19/2012

ద్వితీయ, తృతీయ స్థానాలకే పాలక, ప్రధాన ప్రతిపక్షం పరిమితం
క్షేత్రస్థాయి నుంచి నివేదికలతో షాక్
తెలంగాణలోని ఆరు స్థానాల్లో టీడీపీకి ఒక్కచోటే ద్వితీయ స్థానం
మహబూబ్‌నగర్‌లో డిపాజిట్ కూడా డౌటే
ఏడు స్థానాల్లో.. నాలుగు చోట్ల రెండోస్థానానికి పరిమితం కానున్న కాంగ్రెస్
తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే హవా.. నాగర్‌కర్నూలులో నాగంకే పట్టం!
కోవూరులో భారీ పోలింగ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మంచి మెజారిటీ వస్తుందంటున్న విశ్లేషకులు.. 
కోట్లు గుమ్మరించినా కాంగ్రెస్, టీడీపీలకు నిరాశే
గౌరవప్రదమైన ఓట్లు కూడా దక్కవేమోనని నేతల అంతర్మథనం



హైదరాబాద్, న్యూస్‌లైన్: గత కొద్దిరోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఉపఎన్నికల పోలింగ్.. ప్రధాన రాజకీయ పార్టీల అంచనాలను బోల్తా కొట్టించింది. ఏడు శాసనసభ స్థానాల్లో పోలింగ్ సరళిని బట్టి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అన్నిచోట్లా రెండు, మూడు స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. రాజకీయంగా జీవన్మరణ సమస్యగా భావించి కోట్లాది రూపాయలు గుమ్మరించినప్పటికీ ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవన్న అంచనాకు ఆ రెండు పార్టీలు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత, టీఆర్‌ఎస్‌పైన వ్యతిరేకత తీవ్రంగా ఉందని లెక్కలేసుకుని విజయం సాధిస్తామని ఆశించిన ప్రతిపక్ష టీడీపీకి ఈ ఎన్నికల ఫలితాలు గట్టి షాకే ఇస్తాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎలాగైనా తమ బలం చూపించుకోవాలని సర్వశక్తులు ఒడ్డినప్పటికీ పోలింగ్ సరళి ఆ పార్టీని మరింత గందరగోళంలోకి నెట్టింది. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్న ఆందోళన ఆ రెండు పార్టీల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

నెల్లూరు జిల్లా కోవూరుతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, స్టేషన్ ఘన్‌పూర్, కామారెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌పై ఆదివారం అన్ని పార్టీల నేతలు తమతమ అంచనాల్లో తలమునకలయ్యారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అంతర్గత నివేదికల మేరకు అన్ని నియోజకవర్గాల్లో జయాపజయాలపై విశ్లేషణలు సాగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలను ఈ ఫలితాల విశ్లేషణలు తీవ్ర నిరాశకు గురిచేసినట్టు సమాచారం. ఏడింటిలో ఒక్కస్థానంలో కూడా ఈ రెండు పార్టీల అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేవని ఆ నివేదికలు నిగ్గుతేల్చాయి. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. దాంతో ఆ రెండు పార్టీల్లో తీవ్ర నైరాశ్యం కనిపించింది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పట్నుంచీ సాయంత్రం వరకు ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ నియోజకవర్గ స్థాయి నాయకులను పురమాయించిన నేతలు... సాయంత్రం పోలింగ్ ముగియడానికి ముందే ఢీలా పడ్డారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా గత కొంతకాలంగా టీడీపీ అనేక రకాలుగా సాగించిన ప్రచారం ఏమాత్రం పనిచేయకపోగా జనం తిరిగి తమకే షాకిస్తున్నారని ఫలితాల అంచనాలను వివరించిన పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద తెలంగాణలో మహబూబ్‌నగర్ మినహా మిగతా అన్నిచోట్ల మంచి మెజారిటీ వస్తుందని టీఆర్‌ఎస్ విశ్లేషిస్తోంది. ఇక కోవూరులో రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైనందున వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి భారీ మెజారిటీ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీల అంచనాలు ఇవీ...

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్, టీడీపీలు అంతర్గతంగా తెప్పించుకున్న నివేదికలు, పలు సంస్థల ద్వారా చేయించుకున్న సర్వేలను విశ్లేషించుకున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరులో కాంగ్రెస్, టీడీపీలు విచ్చలవిడిగా డబ్బులు గుమ్మరించినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని ఆపలేకపోయామన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైంది. కనీసం ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ అయినా తగ్గించాలన్న లక్ష్యంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఎత్తుగడలు ఫలించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణలోని ఆరు స్థానాల్లో టీడీపీకి ఒక్కస్థానంలో మాత్రమే రెండో స్థానం సాధిస్తుందని, మిగిలినచోట కాంగ్రెస్‌కన్నా వెనుకబడి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఏడింటిలో కాంగ్రెస్ నాలుగు చోట్ల రెండో స్థానాన్ని సాధించుకునే అవకాశాలున్నాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. పార్టీలు తెప్పించుకున్న అంతర్గత నివేదికల మేరకు.. తెలంగాణలో నాలుగు స్థానాల్లో మంచి మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. నాగర్‌కర్నూలు నుంచి తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. కామారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో భారీ మెజారిటీ వస్తుందని టీఆర్‌ఎస్ అంచనా వేసింది.

మహబూబ్‌నగర్‌లో టీడీపీకి డిపాజిట్ డౌటే...

ఏడు నియోజకవర్గాలకుగాను మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫలితం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా మెజారిటీ రెండు నుంచి మూడు వేల మధ్యే ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. బొటాబోటీ మెజారిటీతోనైనా ఇక్కడ్నుంచి తమ పార్టీ అభ్యర్థి బయటపడుతారని టీఆర్‌ఎస్ గట్టి ధీమాతో ఉంది. అయితే బీజేపీ సైతం అదే స్థాయి అంచనాకు వచ్చింది. ఇక్కడ బలమైన కేడర్ ఉందని ఇంతకాలం లెక్కలేసుకున్న టీడీపీకి ప్రజలు గట్టి షాకిచ్చినట్టు ఆ పార్టీ భావిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తున్నట్టు అంచనా.

కోలుకోని స్థాయికి టీడీపీ..

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీడీపీ ఈసారి కొంతవరకైనా తన ప్రాబల్యం పెంచుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది. ప్రస్తుత ఉపఎన్నికలు జరిగిన ఏడింటిలో నాలుగు స్థానాలు గతంలో టీడీపీ ప్రాతినిధ్యం వహించిన స్థానాలే కావడం గమనార్హం. దాంతో ఈ సీట్లలో విజయం సాధించాలని చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డారు. కానీ ఫలితాలు తారుమారు అవడంతో పార్టీ నేతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

నివ్వెరపోయిన కాంగ్రెస్..: ఎన్నికలు కావడంతోనే కాంగ్రెస్ నేతలు పెద్ద భారం దిగిపోయినట్లుగా భావిస్తున్నారు. రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోరాడాలి కాబట్టి పోటీ చేశామని, గెలుపుపై ఆశలేమీ లేవనే విధంగానే విశ్లేషించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ నేతలెవరూ ఉప ఎన్నికలపై నోరు విప్పడం లేదు. ఇప్పటికే ఎన్నికలకు ముందు పలు సర్వేలు చేయించిన అధికార పార్టీ పెద్దలు.. తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎగ్జిట్ పోల్స్ సమాచారం కూడా తెప్పించుకుని పరిశీలించారు. నిన్నటివరకు మహబూబ్‌నగర్, కొల్లాపూర్, ఆదిలాబాద్ స్థానాల్లో పార్టీ కచ్చితంగా గెలుస్తుందని, మిగిలిన స్థానాల్లో రెండో స్థానంలో ఉంటామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు... తాజాగా పార్టీ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా కోవూరులో గౌరవప్రదమైన ఓట్లు రాని దుస్థితి నెలకొనడమేమిటని వారు తలపట్టుకుంటున్నారు.
Share this article :

0 comments: