కుప్పకూలుతున్న చేతివృత్తులు.. తలకిందులవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుప్పకూలుతున్న చేతివృత్తులు.. తలకిందులవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ

కుప్పకూలుతున్న చేతివృత్తులు.. తలకిందులవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012

అధికారికంగా 10 గంటలు.. అనధికారికంగా మరో 2 గంటలు
పగటిపూట కోతలతో ఎక్కడికక్కడ ఆగిపోతున్న పనులు
ఉపాధికి దూరమై కష్టాలపాలవుతున్న కార్మికులు, కూలీలు
కుప్పకూలుతున్న చేతివృత్తులు.. తలకిందులవుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
వ్యవసాయానికి ‘ఏడు’పే.. నాలుగు గంటలు కూడా అందని కరెంటు
రెండు మూడ్రోజుల్లో మరింత పెరగనున్న కోతలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: చీకట్లు.. చిమ్మచీకట్లు.. పగలూరాత్రీ తేడా లేకుండా.. ఎడాపెడా విధిస్తున్న కరెంటు కోతలతో గ్రామాలను అంధకారం కమ్ముకుంటోంది. అధికారికంగానే 10 గంటలపాటు విద్యుత్‌ను నిలిపేస్తుండటంతో పల్లెసీమలు విలవిల్లాడుతున్నాయి. సాంకేతిక కారణాలు చూపుతూ అనధికారికంగా మరో 2 గంటలు కోత పెడుతున్నారు. అంటే మొత్తమ్మీద 12 గంటలపాటు కోతలు అమలవుతుండటంతో జనం అల్లాడుతున్నారు. పగటిపూట కోతలతో ఎక్కడి పనులక్కడే ఆగిపోతున్నాయి. కూలీనాలీ చేసుకుని పొట్టబోసుకునేవారికి పనులు కరువయ్యాయి. సమీప పట్టణాల్లోని చిన్నాచితకా పరిశ్రమలపై ఆధారపడి బతుకు బండిని లాగే పేద కార్మికులు రోడ్డున పడుతున్నారు. విద్యుత్‌తో సంబంధం ఉన్న చేతి వృత్తులు కూలిపోతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోతోంది. పల్లెలే కాదు.. మండలాలు, జిల్లా కేంద్రాల్లోనూ కోతల రాజ్యమే నడుస్తోంది. రాష్ట్ర సర్కారు అడ్డగోలు కరెంటు కోతలు సమస్త రంగాలను సంక్షోభం వైపు నెడుతున్నాయి.

ఇక వ్యవసాయానికి ఏడు గంటలు కాదు కదా.. నాలుగు గంటలు కూడా గగనంగా మారింది. ఇచ్చే ఆ కొద్ది గంటలైనా సక్రమంగా ఇవ్వడం లేదు. కాలువల్లో నీళ్లు ముందుకుసాగక పొట్ట దశకు వచ్చిన వరి కంకులు ముఖం వేలాడేస్తున్నాయి. పరిశ్రమల కష్టాలకు అయితే అంతే లేదు. చిన్న, కుటీర పరిశ్రమలన్నీ మూత దిశగా సాగుతున్నాయి. లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు గణనీయంగా పడిపోతున్నాయి. పెద్ద పరిశ్రమలు దిక్కులేని పరిస్థితుల్లో యూనిట్‌కు ఏకంగా రూ.15 దాకా వెచ్చించి కరెంటును సొంతంగా కొనుక్కుంటున్నాయి. మండల కేంద్రాల్లో 6 గంటలు, జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, రాష్ట్ర రాజధానిలో 2 గంటల కోతలు అధికారికంగానే అమలవుతున్నాయి. అనధికారికంగా మరో 2 గంటలు కట్ చేస్తున్నారు. ప్రస్తుతం పరీక్షల కాలం కావడంతో ఈ కరెంటు కోతలతో విద్యార్థులు కూడా నానా ఇబ్బందులపాలవుతున్నారు. గ్రామాల్లో విద్యార్థులకు రాత్రిపూట దీపాలే దిక్కవుతున్నాయి.

రైతన్న నెత్తిన కరెంటు పిడుగు..

ఖరీఫ్‌లో కష్టాల సాగును దాటుకుని వచ్చిన రైతన్నకు రబీలో కరెంటు కోతలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా వరి పంట సాగైంది. పంటకు ఈ సమయంలోనే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడే అడ్డోగోలుగా కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండుతున్నాయి. ముఖ్యంగా ఆరుతడి పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది. వ్యవసాయానికి ఇవ్వాల్సిన ఏడు గంటల కరెంటులో కోతలు విధిస్తూ రెండు విడతలుగా రాత్రి సమయాల్లో ఇస్తున్నారు. కరెంటు కోతల కారణంగా ఒక్క వరంగల్ జిల్లాలో సుమారు 46 వేల హెక్టార్లలో పంటలు ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి పంటే ఎక్కువగా దెబ్బతింది. అత్యధికంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో 15 వేల ఎకరాలు, హసన్‌పర్తి మండలంలో 8 వేల ఎకరాలు, జనగామ ప్రాంతంలో 5 వేల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి. కర్నూలు జిల్లాలో సుమారు 34 వేల ఎకరాల్లో సాగు అవుతున్న వరి, జొన్న, మొక్కజొన్న, చోడి, ఉలవలు, పెసర, మినుములు, మిర్చి, ఉల్లి, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, చెరకు పంటలకు సరిపడా నీరందడం లేదు.

విజయనగరం జిల్లాలో 8 వేల హెక్టార్లలో వేసిన మొక్కజొన్న, 10 వేల హెక్టార్లలో పండిస్తున్న చెరకుపై కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఖరీఫ్‌లో కరువు పరిస్థితుల వల్ల నల్లగొండ జిల్లాలో రబీ విస్తీర్ణం పడిపోయింది. వరి పొలాలు, పండ్ల తోటలు ఎండిపోతున్నాయి. ఆయకట్టేతర ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. విద్యుత్ మోటార్లను నమ్మకుని వ్యవసాయం చేస్తున్న దాదాపు 2.88 లక్షల మంది రైతులు కరెంటు కోతలతో తలలుపట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో లోవోల్టేజీ కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. మోటార్లు బాగుచేసుకునేందుకు కష్టాలు పడుతున్న రైతన్న నెత్తిన ట్రాన్స్‌ఫార్మర్ల భారం కూడా పడుతోంది. విద్యుత్ సిబ్బంది వాటిని సకాలంలో మార్చకపోవడంతో రైతులే మార్చుకోవాల్సి వస్తోంది. బీర్కూరు, వర్ని, ఆర్మూరు, ప్రాంతాల్లో లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో కూరగాయల పంటలు ఎండిపోతున్నాయి.

చిన్న ఫ్యాక్టరీలు కుదేలు..: కరెంటు కోతలు ఉభయగోదావరి జిల్లాల్లోని కుటీర, చిన్న తరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తూర్పుగోదావరిలో ఐస్ ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, కొబ్బరిపీచు తదితర 10 వేల చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిపై 4 లక్షల మంది కార్మికులు ఆధారపడ్డారు. ఒక రోజుకు ఒక్కో కొబ్బరి పీచు పరిశ్రమ 120 కేజీల కొబ్బరి తాడును ఉత్పత్తి చేయాల్సి ఉన్నా.. 45 కేజీల తాడు త యారీకి కూడా కరెంటు చాలడం లేదు. రాజమండ్రి తాడితోటలో అల్యూమినియం ఫ్యాక్టరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. కరెంటు కోతలతో ఇందులో అల్యూమినియం పాత్రల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల లక్షలాది కార్మికులు రోడ్డున పడుతున్నారు. చేపల ఎగుమతులకు ఐస్ కొరత ఏర్పడింది. టన్నుకు రూ.500 పైగా ధర పెరగడంతో ఆక్వా ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడుతోంది. సీఎం సొంత జిల్లా చిత్తూరులో పుత్తూరు, నగరి ప్రాంతాల్లో ఆధారపడిన ఐదు వేల కుటుంబాల్లో అధికశాతం మంది సమీపంలోని చెన్నైకి కూలీలుగా వలసపోతున్నారు.

కోతల్లోనూ రాజకీయమే..: ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్.. కరెంటు కోతల్లోనూ రాజకీయం చేస్తోంది! ఎన్నికలు జరిగే నియోజకవర్గాలను కోతల నుంచి మినహాయిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో.. ఉప ఎన్నిక జరిగే ఆదిలాబాద్‌పై మాత్రం ‘కరుణ’ ప్రదర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఆదిలాబాద్ పట్టణం, ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్ మండలాల్లో రోజువారీ కోతలను సడలించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కూడా అధికారిక కోతల్లో ఒక గంట మినహాయింపు ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. జిల్లాలోని 11 నియోజకవర్గాల పరిధిలో రోజుకు 9 గంటల కోత విధిస్తుండగా.. ఉప ఎన్నికలు జరగనున్న మహబూబ్‌నగర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో మాత్రం నామమాత్రంగా కరెంటు కట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పట్నుంచీ ఈ మూడు నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం 3 గంటలకు మించి కోతలు లేకపోవడం గమనార్హం!

మరింత పెరగనున్న కోతలు..

రాష్ర్టంలో విద్యుత్ కోతలు మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఈనెల 10న రాష్ట్రంలో 295.4 మిలియన్ యూనిట్ల (ఎంయూ) డిమాండ్ నమోదుకాగా.. సరఫరా కేవలం 247.8 ఎంయూలకే పరిమితమయ్యింది. 47.6 ఎంయూల మేర లోటు ఏర్పడింది. ఈ లోటు మేరకు విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. ఇంతభారీ స్థాయిలో విద్యుత్ కోతలను అమలు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఈ కోతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. లోటు మరో రెండుమూడ్రోజుల్లో 50 ఎంయూలకు చేరవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది గరిష్టంగా 33 ఎంయూల లోటు మాత్రమే నమోదైంది.

శనివారం వ్యవసాయ విద్యుత్ (7 గంటలు) సరఫరా వివరాలు (అధికారిక లెక్కల ప్రకారం)....

మొత్తం వ్యవసాయ ఫీడర్లు- 9,257
ఒకే విడతలో సరఫరా-2,920
రెండు విడతలు-4,163
2 కంటే ఎక్కువ-1,969
7 గంటలు సరఫరాకాని ఫీడర్లు-205

కోతలతో మిల్లు మూసేశా..

కరెంటు కోతల కారణంగా పనులు నడవక చాలా నష్టాలు వచ్చాయి. దీంతో చేసేది లేక ధాన్యం మిల్లును మూసివేశాం. 4 గంటలు కూడా సరిగ్గా కరెంటు రావడం లేదు. అయినా ప్రతినెలా కరెంటు బిల్లు రూ.2 వేల దాకా వస్తోంది.
-పి.అంబికేశ్వరరావు (మిల్లు యజమాని), కూర్మనాథపురం, శ్రీకాకుళం జిల్లా

పంట ఎండిపోతోంది..

నాకు 2.5 ఎకరాల పొలముంది. ఖరీఫ్‌లో వరి వేసి నష్టపోయా. రబీలో మొక్కజొన్న వేశా. ప్రస్తుతం ఎండలకు కరెంటు కోతలు తోడవడంతో పంట ఎండిపోతోంది. ఇంజన్‌తో నీరు తోడించుకుంటున్నా. ఆ నీరు కూడా ఇంకిపోతే పంట పోయినట్లే..
-పి.అప్పలనాయుడు, మలిచర్ల, విజయనగరం జిల్లా
Share this article :

0 comments: