రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు.. ఒకరికొకరు సహకరించుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు.. ఒకరికొకరు సహకరించుకుంటున్నారు

రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు.. ఒకరికొకరు సహకరించుకుంటున్నారు

Written By ysrcongress on Tuesday, March 20, 2012 | 3/20/2012


మీ అవసరాల కోసం సభనువాడుకుంటూ మమ్మల్ని వెర్రోళ్లను చేస్తున్నారు
ఉప ఎన్నికల ప్రచారంలో ఉంటూ.. 
సభ వాయిదాపడేలా చేశారు
సుప్రీం నోటీసుల పేరుతో గత వారం సభను నడవనీయలేదు..
ఇప్పుడేమో పది నిమిషాలు నిరసన తెలుపుతామంటారా?
ఏ నిబంధన కింద నిరసనకు స్పీకర్ అనుమతించారు?

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలపై మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని, వారిద్దరూ కూడబలుక్కుని శాసనసభను స్తంభింపజేస్తున్నారని సోమవారం శాసనసభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘వారనుకుంటే సభ నడవాలి.. లేదంటే వాయిదా పడాలి. మమ్మల్నంతా వెర్రోళ్లను చేస్తున్నారు’ అని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అవసరాన్ని బట్టి ఆ రెండు పార్టీలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. వారికి అవినీతిపై పోరాటం విషయంలో చిత్తశుద్ధి లేదు.. వారిది కేవలం రాజకీయ దృష్టి’ అని ఆయన విరుచుకుపడ్డారు. ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన అంశంపై వారం రోజులపాటు సభ నడవనీయకుండా స్తంభింపజేసిన ప్రతిపక్షం ఈ రోజు పది నిమిషాల్లోనే నిరసన తెలిపి కూర్చుంటామనడం చూస్తే వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పక్షం కూడా అందుకు సరేననడం వారిద్దరి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. ‘టీడీపీ వారం రోజులు సభను స్తంభింపజేసినా ఇప్పుడు ఆ అంశంపై చర్చలేదు. కనీసం ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. అయినా ప్రతిపక్షానికి నిరసన తెలపడానికి సమయం ఇవ్వడం ఎక్కడి సంప్రదాయం’ అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం బాధాకరమని అన్నారు. ఏ నిబంధన ప్రకారం అనుమతినిచ్చారో తెలియజేయాలని ఆయన స్పీకర్‌ను డి మాండ్ చేశారు.

దేనిపై నిరసన?

మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన అంశంలో వారు రాజీనామా చేయాలని, లేదంటే వారిని ముఖ్యమంత్రి తప్పించాలంటూ గత వారమంతా సభను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ సోమవారం నాడు స్పీకర్ వద్ద జరిగిన సమావేశంలో వ్యూహాన్ని మార్చుకుంది. సభలో నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వాలని కోరడంతో స్పీకర్ అందుకు అవకాశం ఇస్తూ సమయం కేటాయించారు. దీనిపై చంద్రబాబు నాయుడు మంత్రులకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతుండగా.. అక్బరుద్దీన్ లేచి ఏ అంశం కింద నిరసన తెలపడానికి అవకాశం ఇచ్చారో తెలియజేయాలని పట్టుపట్టారు. ‘ఈ అంశంపై చర్చ లేదు. ప్రభుత్వం ప్రకటన చేయలేదు. ఇదివరకు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. 

అలాంటప్పుడు దేనిపై నిరసన వ్యక్తం చేస్తారు? రెండు పార్టీల నాయకులు ఉప ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల సభకు హాజరు కాలేదు. దీనితో గత వారం సభ నడవనీయకుండా అడ్డుపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇలాంటి అంశంపై సీరియస్‌గా ఉంటే చర్చ చేపట్టాలి, చర్చ లేకుండా నిరసనతో పక్కదారి పట్టించడం ఏమిటి? స్పీకర్ అవకాశం కల్పించడం కూడా విచారకరం. ఇది అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్మక్కును బహిర్గతం చేస్తోంది. అవినీతిపై చర్చించాల్సిందే. మీ రెండు పార్టీలు కుమ్మక్కై సభను నడిపించుకుంటున్నాయి. మీకు ఇష్టం ఉంటే సభ నడుస్తుంది. లే దంటే లేదు. సభలో ఇతర పక్షాలను వెర్రోళ్లను చేస్తున్నారు’ అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో తెలుగుదేశం సభ్యులు ఏదో గట్టిగా అరవడానికి ప్రయత్నించారు. సభ అదుపు తప్పుతుందని భావించిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మంగళవారానికి సభను వాయిదా వేశారు.
Share this article :

0 comments: