ఓటరు దెబ్బకు మట్టికరచిన కాంగ్రెస్, టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటరు దెబ్బకు మట్టికరచిన కాంగ్రెస్, టీడీపీ

ఓటరు దెబ్బకు మట్టికరచిన కాంగ్రెస్, టీడీపీ

Written By ysrcongress on Thursday, March 22, 2012 | 3/22/2012


టీఆర్‌ఎస్, వైఎస్సార్ సీపీ, బీజేపీ, నాగం జయకేతనం
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, కామారెడ్డిల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతు..
4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ది 2వ స్థానం.. రెండు చోట్ల స్వల్ప తేడాతో డిపాజిట్లు
మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీ అనూహ్య విజయం.. 

హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలను ఉప పోరులో ఓటర్లు ఉతికి ఆరేశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారంలో కొనసాగుతూ వస్తున్న ఆ రెండు పార్టీలనూ మూకుమ్మడిగా తిరస్కరించారు. తెలంగాణలో కారు, ఆటో దెబ్బకు చేయి చితికిపోయింది. సైకిల్ నుజ్జునుజ్జయింది. నెల్లూరులో ఫ్యాన్ గాలి హోరులో ఆ రెండు పార్టీలూ కొట్టుకుపోయాయి. ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దనరెడ్డి కొట్టిన చావుదెబ్బలకు టీడీపీ, కాంగ్రెస్ ఆగమయ్యాయి. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రవాదం, సీమాంధ్రలోని కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు పూర్తిగా కుదేలయ్యాయి. టీఆర్‌ఎస్ నాలుగు స్థానాలను దక్కించుకోగా.. బీజేపీ, వైఎస్సార్‌సీపీలతో పాటు నాగం ఒక్కో స్థానంలో విజయబావుటా ఎగరేశారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కొల్లాపూర్, స్టేషన్ ఘన్‌పూర్ సీట్లు టీఆర్‌ఎస్ కైవసమయ్యాయి. మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి షాకిస్తూ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. నాగర్‌కర్నూలులో నాగం దెబ్బకు సైకిల్ చిత్తయింది. రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్షించిన కోవూరులో టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలన్నింటినీ బదాబదలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఘన విజయం సాధించారు.

అటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను, ఇటు తెలంగాణవాద ప్రభావాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్, టీడీపీ ఎంతగా ‘ఇచ్చిపుచ్చుకొనే’ ధోరణి ప్రదర్శించినా ప్రజలు తిరస్కరించారు. విచ్చలవిడిగా డబ్బులు పంచినా, మద్యం వరదలు పారించినా ఆ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోయాయి. నాలుగు చోట్ల కాంగ్రెస్ కనాకష్టంగా రెండో స్థానంలో నిలవగా, మిగతా చోట్ల అది టీడీపీ వంతయింది. మరో మూడు చోట్ల టీడీపీ ఏకంగా డిపాజిట్లు కూడా కోల్పోయింది! ఒకచోటైతే నాలుగో స్థానానికి దిగజారిపోయింది!!

బుధవారం వెలువడ్డ ఉప ఎన్నికల ఫలితాల్లో కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 23,494 మెజారిటీతో కాంగ్రెస్, టీడీపీలను మట్టికరిపించింది. పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఓడించేందుకు ఎన్నికలకు ఎన్నో నెలల ముందుగానే కాంగ్రెస్, టీడీపీలు జట్టుకట్టాయి. ఒక ప్రణాళిక ప్రకారం దుష్ర్పచారం సాగించాయి. అయినా ప్రజ లు వాటిని విశ్వసించలేదు. విశ్వసనీయతకు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వానికే పెద్దపీట వేస్తామని నిరూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు గుణపాఠంగా తీర్పు వెలువరించారు. కోవూరులో పైకి కాంగ్రెస్, టీడీపీ వేర్వేరుగా పోటీ చేసినట్టు కన్పించినా.. లోలోన మాత్రం అవి పరస్పరం పూర్తి సహకారంతో పని చేశాయని వాటికి వచ్చిన ఓట్లే స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసన్న గెలుపు ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన ఆ రెండు పార్టీల అగ్ర నేతలు.. ఆయనకు భారీ మెజారిటీ రాకుండా అడ్డుకునే కుట్రలకు కూడా తెర తీశారు. ఉప ఎన్నికల్లో ముఖ్యంగా కోవూరు స్థానంపై దృష్టి సారించిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా సర్వేలు తదితర మార్గంలో ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరించుకుంటూ, రాష్ట్ర నేతలకు ‘సూచనలు’ చేస్తూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని తేలడంతో కనీసం మెజారిటీని సాధ్యమైనంతగా తగ్గించేందుకు కుట్రలు పన్నారు. 

కోట్ల కొద్దీ డబ్బు సంచులు కుమ్మరించారు. లారీల కొద్దీ మద్యం లాట్లను దించారు. ఇలా రెండు పార్టీలు కుమ్మక్కై ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా ప్రజలు మాత్రం వారి ప్రలోభాలకు లొంగకుండా తమదైన తీర్పును వెలువరించారు. కోవూరులో మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని అన్ని హంగు ఆర్భాటాలు కల్పించి మరీ టీడీపీ రంగంలోకి దింపింది. కాంగ్రెస్ కూడా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని బరిలో నిలిపి అంగ, అర్థ బలాలన్నీ సమకూర్చింది. వైఎస్సార్‌సీపీకి 73,876 రాగా టీడీపీకి 50,382, కాంగ్రెస్‌కు 41,397 ఓట్లు దక్కాయి.


తెలంగాణాలో చిత్తుచిత్తు: తెలంగాణలో ప్రత్యేకవాదం ముందు కాంగ్రెస్, టీడీపీ చిత్తుచిత్తుగా ఓడాయి. ఉప ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లో నాలుగింటిని టీఆర్‌ఎస్ దక్కించుకోగా, బీజేపీ ఒక్క స్థానాన్ని, స్వతంత్రునిగా బరిలో నిలిచిన నాగం మరో స్థానాన్ని చేజిక్కిం చుకున్నారు. ఇవన్నీ ఇప్పటిదాకా టీడీపీ (4), కాంగ్రెస్(2)ల స్థానాలే కావడం విశేషం! మహబూబ్‌నగర్ మినహా మిగతా ఐదు స్థానాల్లోనూ తాజా మాజీ ఎమ్మెల్యేలే గెలుపొందారు. 3స్థానాల్లో టీడీపీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. టీడీపీని వీడిన నాగం జనార్దన్‌రెడ్డి నాగర్‌క ర్నూలులో స్వతంత్రునిగా బరిలోకి దిగా రు. ఆయన గెలుపును అడ్డుకునేందుకు చంద్రబాబు ఎన్నికుట్రలు పన్నినా నియోజకవర్గ ప్రజలు వాటిని పటాపంచలు చేశారు. ఒంటరి పోరులో నాగం కాంగ్రెస్‌పై ఏకంగా 27,325 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగరేశారు. ఆయనకు 71,001 ఓట్లు రాగా, కాంగ్రెస్ 43,676, టీడీపీ 18,608 ఓట్లతో సరిపెట్టుకున్నాయి. 


కామారెడ్డిలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన గంప గోవర్ధన్ కు అత్యధికంగా 44,465 ఓట్ల మెజారిటీ లభించింది. అక్కడ టీడీపీ డిపాజిట్ గల్లంతు కాగా, కాంగ్రెస్ కొద్దిలో పరువు దక్కించుకుంది. గోవర్ధన్‌కు 75,699 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 31,234, టీడీపీకి 17,839 దక్కాయి. తెలంగాణ విషయంలో బాబు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసిన జోగురామన్నకు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు 31,396 ఓట్ల మెజారిటీతో పట్టం కట్టారు. ఆయనకు 59,452, కాంగ్రెస్‌కు 28,056, టీడీపీకి 24,288 ఓట్లు లభించాయి. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్ తరఫున బరిలో దిగిన టి.రాజయ్య 32,638 ఓట్ల మెజారిటీ సాధించారు. టీడీపీ నేత కడియం శ్రీహరి 48,641, కాంగ్రెస్ అభ్యర్థి రాజరపు ప్రతాప్‌కు 28,965 ఓట్లు లభించాయి. ఇక మంత్రి పదవినీ, శాసనసభ్యత్వాన్నీ వదులుకున్న జూపల్లి కృష్ణారావును కొల్లాపూర్ ప్రజలు 15,024 ఓట్లతో గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 43,083, టీడీపీకి 35,287 ఓట్లు లభించాయి.

ఆగమైంది బాబే: నాగం

నాగర్‌కర్నూల్ (మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: ‘చంద్రబాబు నన్ను ఆగం చేస్తనన్నడు. కానీ తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన టీడీపీయే ఆగమైంది. నాకు డిపాజిట్ రాకుండా చేస్తామన్న ఆ పార్టీకే డిపాజిట్ గల్లంతైంది. నేను తెగిన గాలిపటాన్ని కాదని, తెలంగాణ తెచ్చేవాడినని సీఎం కిరణ్‌కు ప్రజలు తేల్చిచెప్పిండ్రు. మహబూబ్‌నగర్‌లో అధికార కాంగ్రెస్‌కు మూడో స్థానం దక్కడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నది. నా గెలుపు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది’ అని తెలంగాణ నగారా సమితి (టీఎన్‌ఎస్) అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి నాగర్ కర్నూల్‌లో అన్నారు. టీడీపీలో త్వరలో ముసలం పుట్టనుందని, మధ్యంతర ఎన్నికలు కూడా రాబోతున్నాయని జోస్యం చెప్పారు.

దూకుడు కొనసాగిస్తాం: యెన్నం

హైదరాబాద్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్‌లో తన గెలుపు బీజేపీ శ్రేణులకు కొత్త ఊపునిచ్చిందని యెన్నం శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. నగరంలోని రాంనగర్‌లో ఉంటున్న పార్టీ సీనియర్‌నేత దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసి, ఆయన నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది తెలంగాణ ప్రజల విజయమని చెప్పారు. బీజేపీ భవిష్యత్తులోనూ ఇదే దూకుడును కొనసాగిస్తుందన్నారు.
Share this article :

0 comments: