నాలో కుళ్లు, కల్మషం లేదు కాబట్టీ, ఢిల్లీ పెద్దల దగ్గర నేను శిరస్సు వంచలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలో కుళ్లు, కల్మషం లేదు కాబట్టీ, ఢిల్లీ పెద్దల దగ్గర నేను శిరస్సు వంచలేదు

నాలో కుళ్లు, కల్మషం లేదు కాబట్టీ, ఢిల్లీ పెద్దల దగ్గర నేను శిరస్సు వంచలేదు

Written By ysrcongress on Thursday, March 22, 2012 | 3/22/2012

అవినీతి ఆరోపణలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్
ఏ పనైనా చేసి పెట్టమని నేను ఒక్క ఐఏఎస్‌కైనా ఫోన్ చేసినట్లు రుజువు చేయగలవా?
ఒక్కరోజైనా నేను సెక్రటేరియట్‌లో అడుగుపెట్టినట్లు రుజువు చేయగలవా?
తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబూ.. నీలా నేను అవినీతి గురించి మాట్లాడను
నేను సీఎం స్థానంలో ఉన్నప్పుడు అవినీతి అనేదే లేకుండా చేసి చూపిస్తా
కోవూరు ప్రజలు అవినీతికి ఓటేశారని చంద్రబాబు అన్నారట..
అయ్యా.. నీకు బుద్ధెపుడొస్తుందయ్యా అని అడుగుతున్నా
తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబూ నీలా నేను అవినీతి గురించి మాట్లాడను
కోవూరులో ఓటుకు రూ. 500 పంచింది నువ్వే కదా బాబూ!
రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు సంపాదించింది నువ్వే కదా
రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో ఎడాపెడా హెరిటేజ్ షాపులు పెట్టింది నువ్వే కదా
రూ.నాలుగు కోట్ల భూమిని ఎమ్మార్‌కు రూ.29 లక్షలకే కట్టబెట్టింది నువ్వే కదా
నీలా నేను సీబీఐని, కోర్టులను మేనేజ్ చేయలేనయ్యా.. 
కారణం నాకు కుళ్లు, కుతంత్రాలు తెలియవయ్యా
నీ మాదిరిగా ఢిల్లీకి పోయి చీకట్లో చిదంబరాన్ని కలవలేనయ్యా! 
చంద్రబాబూ నువ్వు తప్పు చేసినా కూడా మేనేజ్ చేయగలుగుతున్నావు
నాలో కుళ్లు, కల్మషం లేదు కాబట్టి, ఢిల్లీ పెద్దల దగ్గర శిరస్సు వంచలేదు కాబట్టి 
నీ మాదిరిగా మేనేజ్ చేయలేను
వచ్చే ఎన్నికల్లో 42 ఎంపీ స్థానాలకు కనీసం 35 స్థానాలు నేను గెలుచుకుంటా
కేంద్ర వ్యవసాయ మంత్రి పదవి, దేవుడు కరుణిస్తే రైల్వే మంత్రి పదవి తెస్తా
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ఓటేసిన కోవూరు ప్రజలకు 
శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్తున్నా
రాష్ట్రంలో మళ్లీ ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. కోవూరు ఫలితాలే 

ఓదార్పుయాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన మీద చేస్తున్న అవినీతి ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఘాటుగా స్పందించారు. మాటలొద్దని, ఆరోపణల్లో వాస్తవముంటే రుజువు చేసి చూపించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలో 73వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా బుధవారం వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆరు వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. చిలకలూరిపేట వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. కోవూరు ప్రజలు అవినీతికి ఓటేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఓటరుకు రూ.500 చొప్పున పంచింది నువ్వే కదా అని బాబును నిలదీశారు. జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

అవినీతి లేకుండా చేసి చూపిస్తా..

అయ్యా.. చంద్రబాబు నాయుడూ.. నువ్వు మాట మాటకీ అవినీతి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఈ రోజు సవాల్ విసురుతున్నా.. ఏ రోజైనా నేను ఒక్క పని చేసిపెట్టమని చెప్పి ఒక్క ఐఏఎస్‌కైనా ఫోన్ చేసినట్లు నువ్వు రుజువు చేయగలుగుతావా? కనీసం ఒక్కరోజైనా సెక్రటేరియట్‌లో నేను కాలుపెట్టానని నువ్వు రుజువు చేయగలుగుతావా? చంద్రబాబూ! నీ మాదిరిగా నేను పైరవీలు చేయలేదు. నీ మాదిరిగా ఐఏఎస్‌లకు ఫోన్ చేయలేదు.. సెక్రటేరియట్ చుట్టూ తిరగలేదు. మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో మీరు చేసిందల్లా ఈ వ్యవస్థను నాశనం చేయడమే. మీరు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి.. ఇవాళ నేను చెప్తున్నా.. ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చొని ఉన్నప్పుడు అవినీతి గురించి నీ మాదిరిగా మాట్లాడను... ఈ రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తా!

బాబూ నీకు బుద్ధెపుడొస్తుంది?

బాధెక్కడనిపిస్తోందీ అంటే.. కొద్దిసేపటి కిందనే చంద్రబాబునాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్‌పెట్టారట. పెట్టి చెప్పారట.. కోవూరు ప్రజలు అవినీతికి ఓటేశారని అన్నారట. వాళ్ల కంటికి అభివృద్ధి కనబడడం లేదు అన్నారట. అయ్యా! చంద్రబాబు నాయుడూ.. నిజంగా ఎప్పుడయ్యా నీకు బుద్ధొస్తుందీ అని అడుగుతున్నా.

అది నువ్వేనయ్యా చంద్రబాబూ..

చంద్రబాబూ కోవూరులో నేను కాదయ్యా ఓటుకు రూ.500 పంచింది. అది నువ్వేనయ్యా! నేను కాదయ్యా... బెల్టు దుకాణాలు పెట్టి మద్యాన్ని బెల్టు షాపుల ద్వారా ప్రతి గ్రామానికీ తీసుకొని పోయింది.. అది నువ్వేనయ్యా. 1978లో రెండెకరాల భూమితో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి.. ఇవాళ వేల కోట్లు సంపాదించింది, ఈ రాష్ట్రంలోనే కాదు.. చుట్టపక్కల రాష్ట్రాల్లో కూడా ఎడా పెడా హెరిటేజ్ షాపులు తెరిచింది, రాజకీయాల కోసం విశ్వసనీయతను తాకట్టు పెట్టింది, ఇంజనీరింగ్ పిల్లల దగ్గరకు పోయి వాళ్లకు అవినీతిపై పాఠాలు చెప్పింది... నేను కాదయ్యా.. ఒక్కసారైనా నువ్వు నిజం చెప్పయ్యా! తొమ్మిది సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పని చేశావు. ఏ ఒక్కరోజన్నా.. నీకు అనిపించిందా? ఆ కాలేజీ పిల్లల దగ్గరకు వెళ్లాలని, ఆ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలని, ఆ చదువులు చదివించడం కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాలని? రైతు కూలీలకు ఇది చేశానని, పేదవానికి ఇది చేశానని, ప్రతి పిల్లాడికి ఇది చేశానని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని విధంగా తొమ్మిదేళ్లు పరిపాలన చేసింది నేను కాదయ్యా.. ఆ ఘనత నీదే కదయ్యా చంద్రబాబూ!

నీలా.. చీకట్లో చిదంబరాన్ని కలవలేను

అయ్యా.. చంద్రబాబు నాయుడూ నేను నీ మాదిరిగా కోర్టులను మేనేజ్ చేయ లేనయ్యా. నేను నీలా సీబీఐని మేనేజ్ చేయలేనయ్యా.. కారణం నాకు కుళ్లు, కుతంత్రాలు తెలియవయ్యా. నేను నీ మాదిరి ఢిల్లీకి పోలేనయ్యా.. పోయి చీకట్లో చిదంబరాన్ని కలవలేనయ్యా! చంద్రబాబూ.. ఇవాళ సీబీఐ అధికారులు చేస్తున్న దర్యాప్తు ఎలా ఉంది అంటే.. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. బతికి ఉన్న చంద్రబాబు నాయుడుకు ఒక న్యాయమట.. అదే చనిపోయిన వైఎస్సార్‌కు వేరొక న్యాయమట. సీబీఐ అధికారులు ఎమ్మార్ కేసు మీద దర్యాప్తు చేస్తున్నారు. అదే ఎమ్మార్‌లో... ఐదు కంపెనీల నుంచి ఒకే కంపెనీకి టెండర్ వచ్చేటట్టు చేసింది నువ్వు కాదా బాబూ? నీ భార్య మూడు సంవత్సరాల కిందట ఎకరా రూ. కోటికి అమ్మిన అదే ప్రాంతంలో భూమి రేటు రూ. మూడు కోట్లకో.. నాలుగు కోట్లకో వెళ్లిపోయిన తరువాత కూడా.. ఎకరా రూ.29 లక్షలకు కేటాయింపు చేసింది నువ్వు కాదా?

35 ఎంపీ స్థానాలు నేను గెలుచుకుంటా

అయ్యా..! చంద్రబాబునాయుడు నువ్వు తప్పు చేసినా కూడా మేనేజ్ చేయగలుగుతున్నావు కాబట్టి బతికి బయటపడుతున్నావు. నాలో కుళ్లు, కల్మషం లేదు కాబట్టీ, ఢిల్లీ పెద్దల దగ్గర నేను శిరస్సు వంచలేదు కాబట్టీ నీ మాదిరిగా మేనేజ్ చేయలేను. కానీ నేను ఒక్కటైతే చెప్తున్నా చంద్రబాబునాయుడూ.. గుర్తు పెట్టుకోండి. నేను దేవుడిని నమ్ముతా.. ఆ నమ్మకం మీదనే చెప్తున్నా.. త్వరలోనే ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు 42 ఎంపీ స్థానాలకు కనీసం 35 స్థానాలు నేను గెలుచుకుంటా. వరదలొచ్చినప్పుడు, కరువొచ్చినప్పుడు చేతులు ముడుచుకొని ఢిల్లీ పెద్దల దగ్గరకు పోయి మోకరిల్లే పరిస్థితిలోకి నా రాష్టాన్ని పోనివ్వను. వ్యవసాయ శాఖ మంత్రి పదవిని మన రాష్టానికే తీసుకొస్తా.. ఆ దేవుడు నన్ను కనికరిస్తే.. రైల్వే మంత్రి పదవిని కూడా మనరాష్ట్రానికే తీసుకొని వస్తా. ఈ రోజు ఆ దివంగత నేత చనిపోయాడు కాబట్టి రెండు పార్టీలు కూడా ఒక్కటై, మూడో పార్టీ రాకుండా చేయాలి అని కుతంత్రాలు చేస్తున్నాయి. మీ నీచ రాజకీయాలకు ఆ దేవుడు బుద్ధి చెప్తాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రోజు కోవూరులో జరిగిందే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందీ అని ఇద్దరికీ చెప్తున్నా.

విలువలకు అండగా నిలిచారు
కోవూరు ప్రజలకు జగన్ కృతజ్ఞతలు 

నీతిమాలిన రాజకీయాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు 
కోవూరు నియోజకవర్గం ప్రజలు ఉప ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు అండగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మా పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్‌ను దాదాపు 24 వేల ఓట్ల మెజార్టీతో రెండోఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వా, ప్రతి తాతకు, ప్రతిసోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. హృదయపూర్వకంగా శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో, నీతి మాలిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం వారు ఓటు వేశారు. విలువలు నిలబెట్టడానికి, విశ్వసనీయత అనే పదానికి అర్థం చెప్పేలా వాళ్లు తీర్పునిచ్చారు. సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో కూడా ఇదే విధమైన మద్దతు ఇవ్వాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: