సీఎం మార్పు ఖాయమేనంటూ రాష్ట్ర నేతలకు ఇప్పటికే సంకేతాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం మార్పు ఖాయమేనంటూ రాష్ట్ర నేతలకు ఇప్పటికే సంకేతాలు

సీఎం మార్పు ఖాయమేనంటూ రాష్ట్ర నేతలకు ఇప్పటికే సంకేతాలు

Written By ysrcongress on Sunday, March 25, 2012 | 3/25/2012

* ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల ఎన్నికలయ్యాక తొలగింపు
* ముందుగానే మార్చితే ఆ ఓటమికి కొత్త సీఎంను బలి పెట్టాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం జంక
* అందుకే కిరణ్‌పై విమర్శల దాడిని మరింత పెంచిన అసమ్మతులు!
* తెలంగాణ వ్యక్తికే సీఎం పగ్గాలు.. రేసులో దామోదర, డీఎస్!
* రాష్ట్రంలో పరిస్థితులు ‘చే’జారాయి
* హస్తినకు రాష్ట్ర నేతల నివేదికల హోరు
* ఇప్పటికిప్పుడే వేలు పెట్టబోమంటూవారికి సర్దిచెబుతున్న పెద్దలు
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఉప ఫలితాల సెగ.. రాష్ట్ర కాంగ్రెస్ నేతల అసంతృప్తి, ధిక్కార స్వరాలు హస్తినను గట్టిగా తాకాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం గట్టి నిర్ణయానికి వచ్చింది! ముఖ్యంగా కోవూరు అసెంబ్లీ స్థానంలో దారుణ పరాజయం నేపథ్యంలో కిరణ్‌ను మార్చడం ఖాయమైపోయింది. అయితే రాష్ట్రపతి ఎన్నిక, జాతీయ స్థాయిలో యూపీఏ సర్కారు ముందున్న అనేకానేక సవాళ్లకు తోడు రాష్ట్రంలో మలి విడత ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నిర్ణయం కొంతకాలం వాయిదా పడింది. ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో జరగనున్న ఆ ఎన్నికల్లోనూ దారుణ పరాభవం తప్పదని పలు నివేదికలు, సర్వేల ఆధారంగా అధిష్టానం ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. కాబట్టి ఇప్పటికిప్పుడు సీఎంను మార్చేస్తే వచ్చే ఉప ఎన్నికల ఓటమికి కొత్త సీఎంను బలి పెట్టాల్సి వస్తుందని అభిప్రాయపడుతోంది. 

ఈ నేపథ్యంలో ఆ ఫలితాలు వచ్చి, రాష్ట్రపతి ఎన్నిక కూడా పూర్తయ్యాక, అంటే మరో మూడు నెలల తర్వాత కిరణ్‌ను మార్చాలని నిర్ణయించింది. పలువురు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులకు అధిష్టానం నుంచి ఈ మేరకు స్పష్టమైన సంకేతాలందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కిరణ్‌పై వారంతా విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారని, ఆయనకు వ్యతిరేకంగా వ్యూహాలకూ పదును పెట్టారని తెలుస్తోంది. సీఎం అవకాశం తెలంగాణ నేతకే దక్కుతుందన్న వార్తల నేపథ్యంలో ఆశావహులంతా ఇప్పటినుంచే రంగంలోకి దిగినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ రేసులో ముందున్నట్టు చెబుతున్నారు.

18 స్థానాల ఉప ఎన్నికలే కీలకం
రాష్ట్రంలో ‘చేయి’ దాటిపోయిన పరిస్థితుల పట్ల కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా తీవ్ర ఆందోళనతో ఉంది. ఇటీవలి 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర కాంగ్రెస్‌లో తలెత్తిన తీవ్ర గందరగోళ పరిస్థితులను లోతుగా విశ్లేషించుకున్నాక, సీఎంను మార్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అధిష్టానం నుంచి పలువురు రాష్ట్ర పార్టీ నేతలకు సంకేతాలు కూడా అందాయి. ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిపై అధిష్టానం పలు నివేదికలు తెప్పించుకోవడమే గాక, రాష్ట్రం నుంచి పుంఖానుపుంఖాలుగా అందుతున్న ఫిర్యాదులు, వస్తున్న ఒత్తిళ్లపై తీవ్రంగా మల్లగుల్లాలు పడింది. తక్షణ చర్యలు తప్పవన్న నిర్ధారణకు వచ్చి ఆ దిశగా కొంత కసరత్తు కూడా చేసింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చాలన్న నిర్ణయం అందులో భాగమేనంటూ పీసీసీ వర్గాల్లో గుప్పుమంటోంది. సవాలుగా నిలిచిన మలి విడత ఉప ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నిక కాగానే సీఎంను మార్చడంతో పాటు పార్టీని, ప్రభుత్వాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాలు, చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో తిరుపతి అసెంబ్లీ స్థానం, వాటితో పాటు మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా చేసిన నెల్లూరు లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం చాలా కీలకంగా భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ భవితవ్యాన్ని అవి పూర్తిగా నిర్దేశిస్తాయని అంచనా వేస్తోంది. అవన్నీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలేనన్నది తెలిసిందే. తాజా ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి ప్రభావం వాటిపైనా పడి తీరుతుందని అధిష్టానం ఆందోళనతో ఉంది. అంగ, అర్థ బలాలను పూర్తిగా ఒడ్డే అధికార పార్టీకే ఉప ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటం పరిపాటి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులేవీ కన్పించడం లేదు. 

ఇటీవలి ఉప ఎన్నికల ఓటమితో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. కాబట్టి మలి విడతలోని 18 స్థానాల్లో కాంగ్రెస్ నేతలే దేనిపైనా ఆశలు పెట్టుకోవడం లేదు. పైగా వాటిలోనూ ఆ పార్టీకి గడ్డు పరిస్థితి తప్పదని సర్వే నివేదికలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి. ‘‘ఇలాంటప్పుడు కిర ణ్‌ను ఇప్పటికిప్పుడే మారిస్తే, రానున్న ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలన్నది పెద్ద సమస్య అవుతుందని అధిష్టానం ఆలోచిస్తోంది. 7 స్థానాల్లో ఓటమికే కిరణ్‌ను మార్చినప్పుడు, ఏకంగా 18 స్థానాల్లో మట్టికరిస్తే కొత్త సీఎంనూ బలి పెట్టాల్సి రావచ్చని మల్లగుల్లాలు పడుతోంది. వరుసగా సీఎంలను మారిస్తే ప్రజలకూ తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి కిరణ్‌నే మరో మూడు నెలలు కొనసాగనిచ్చి, ఉప ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నిక తర్వాత నాలుగో కృష్ణున్ని తీసుకొస్తే పోతుందని భావిస్తోంది’’ అని పీసీసీ సీనియర్ నేత ఒకరు వివరించారు. ఏఐసీసీ ముఖ్య నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. 

‘‘అధికారాన్ని, అంగ, అర్థ బలాలను పూర్తిగా వాడుకోవడం ద్వారా చచ్చీచెడీ రెండు మూడో చోట్ల గెలిచినా మేం బావుకునేదేమీ ఉండబోదు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట ఇప్పటికే బాగా దిగజారింది. సీఎంను ఇప్పుడే మారిస్తే, వచ్చే ఉప ఎన్నికల్లోనూ ఓడితే పరిస్థితేమిటి? మళ్లీ గందరగోళం తప్పదు. అందుకే మార్పుచేర్పులన్నిటినీ మరో మూడు నెలల దాకా వాయిదా వేశాం’’ అని ఆయన వివరించారు. రాష్ట్ర పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయని ఆయన అంగీకరించారు. ‘‘తాజా ఉప ఎన్నికల ఫలితాలతో అవి మరింత ముదిరాయి. కఠిన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కానీ పై సమస్యతో పాటు మాకు కేంద్ర స్థాయిలోనూ కొన్ని సమస్యలున్నాయి. అవన్నీ పరిష్కారమయ్యాక రాష్ట్రంపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తాం’’ అని ఆ నాయకుడు చెప్పారు.

తదుపరి కృష్ణుడెవరో..!?
సీఎం కిరణ్‌కుమార్‌ను మారిస్తే వచ్చేదెవరన్న దానిపై పీసీసీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర లేచింది. ప్రత్యేక తెలంగాణపై ఇప్పటికిప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకొనే పరిస్థితి లేదు గనుక తెలంగాణ సీనియర్ల నుంచి ఒకరికి పీఠం దక్కవచ్చని భావిస్తున్నారు. తద్వారా తెలంగాణవాసులతో పాటు కార్యకర్తల్లోనూ పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతుందని అధిష్టానం అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. తెలంగాణతో పాటు దళిత నేపథ్యమూ ఉన్న దామోదర రాజనర్సింహకే ఎక్కువగా అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిలతో కలసి దామోదర కూడా అసమ్మతి కార్యకలాపాల్లో చురుగ్గా ఉండటం తెలిసిందే. ఆయనతో పాటు పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డీఎస్ పేరూ వినబడుతోంది. ఆయన ఇప్పటికే ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ నెరపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Share this article :

0 comments: