బాబు పాత్రను విస్మరించిన సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు పాత్రను విస్మరించిన సీబీఐ

బాబు పాత్రను విస్మరించిన సీబీఐ

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం మూలాల్లోకి సీబీఐ అసలు వెళ్లడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఇరికించి అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే సీబీఐ దర్యాప్తును సాగిస్తోందని విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడుతూ ఎమ్మార్ కుంభకోణం 2000లోనే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేళ్లూనుకుందని, సీబీఐ మాత్రం ఆ దిశగా దృష్టి సారిండచంలేదని చెప్పారు. ‘‘2000లో హైదరాబాద్‌లో దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన సదస్సులోనే ఎమ్మార్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకు రావడానికి అవగాహన కుదిరింది. 

చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఆ కంపెనీ ఇక్కడ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు అంకురార్పణ చేసింది. గోల్ఫ్ కోర్సు, హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి బాబు ప్రభుత్వం తొలుత 250 ఎకరాలను ఎమ్మార్‌కు ధారాదత్తం చేసింది. ఆ తరువాత బాబుకు విల్లాల నిర్మాణంపై ఉన్న మోజుతో ఎవరి ప్రతిపాదనలు, సిఫార్సులుగానీ లేకుండా మరో 250 ఎకరాలు కేవలం ఒక నోట్‌ఫైల్ ద్వారా, నోటి మాట ద్వారా కేటాయించారు. ఎమ్మార్ ప్రతినిధులు కూడా అడక్కుండానే, మంత్రివర్గం ఆమోదం లేకుండానే, అధికారులెవ్వరూ ప్రతిపాదనలు చేయకుండానే చంద్రబాబు అదనంగా 250 ఎకరాలు కేటాయించడానికి ఎందుకు ఆమోదం తెలిపారు? ఎమ్మార్ ప్రతినిధి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు మేలు చేయాలనే ఉద్దేశంతోనే బాబు ఇలా చేశారు. సీబీఐ వారికి ఈ ఉల్లంఘన ఎందుకు కనిపించలేదు? నోట్‌ఫైల్‌పై రాయడం ద్వారా 250 ఎకరాల భూమిని ఎమ్మార్‌కు ధారాదత్తం చేశారని కొన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చే వరకూ తెలుసుకోలేని దుస్థితిలో సీబీఐ ఉందా? సీబీఐకి, చంద్రబాబుకు ఉన్న బంధం ఏమిటి? ఆయనపై ఎందుకు విచారణ జరపడంలేదు? పైగా ఎమ్మార్ విషయంలో 2001 నుంచీ దర్యాప్తు చేస్తున్నట్లు సుప్రీం కోర్టుకు సీబీఐ నిస్సిగ్గుగా వివరణ ఇచ్చింది. నిజంగా మీరు పరిశోధించి ఉంటే 2000లో చేసుకున్న ఒప్పందం వెనుకనున్న నిజాలేమిటనేది నిగ్గు తేల్చారా? సీబీఐ ఈ అంశం మూలాల్లోకి వెళ్లడంలేదనడానికి ఇంతకంటే ఉదాహరణ, నిదర్శనం, తార్కాణం ఏంకావాలి’’ అని ప్రశ్నించారు. 

నోట్‌ఫైల్ ద్వారా 250 ఎకరాలు ఎమ్మార్‌కు కేటాయించిన విషయంపై చంద్రబాబు నోరు విప్పాలని పద్మ డిమాండ్ చేశారు. ఏమాశించి ఈ నిర్ణయం తీసుకున్నారో ఆయన చెప్పి తీరాలని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడిన చంద్రబాబే కాలర్ ఎత్తుకుని అసెంబ్లీలో అందరినీ అవినీతిపరులుగా నిందిస్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బాబు వైఖరి చూస్తే దొంగే... దొంగ.. దొంగ అని అరిచినట్లుగా ఉందని అన్నారు. ఎమ్మార్‌కు టెండర్లు కట్టబెట్టిన తీరే అనుమానాలకు తావిస్తున్నదని గతంలో కూడా చెప్పామన్నారు. ఐదు కంపెనీలు పోటీ పడితే ప్రభుత్వమే రెండింటిని తిరస్కరించిందని, మిగిలిన మూడింటి నుంచి కూడా రెండు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గేలా చేశారని తెలిపారు. గ్లోబల్ టెండర్లలో ఒక్క కంపెనీయే ఉన్నప్పుడు వాటిని రద్దు చేసి మళ్లీ టెండర్లు ఎందుకు పిలవలేదనే విషయం సీబీఐకి పట్టదా? అని ప్రశ్నించారు. ఎమ్మార్ కుంభకోణం మూలాలను వదలివేసి విల్లాలు అమ్మిన సొమ్ము సాక్షిలోకి ఏమైనా వెళ్లిందా అని అనుమానిస్తూ వైఎస్‌ఆర్ కుటుంబీకులను ఇరికించి అరెస్టు చేయాలని చూస్తున్నారని పద్మ విమర్శించారు.
Share this article :

0 comments: