జగన్ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లారా? ఏ అధికారికైనా ఫోన్ చేశారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లారా? ఏ అధికారికైనా ఫోన్ చేశారా?

జగన్ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లారా? ఏ అధికారికైనా ఫోన్ చేశారా?

Written By ysrcongress on Monday, March 5, 2012 | 3/05/2012


అసలు ఎందుకు అరెస్టు చేస్తారు? సీబీఐ వద్ద ఆధారాలేవీ?
జగన్ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లారా? ఏ అధికారికైనా ఫోన్ చేశారా?
దివంగత వైఎస్‌కో న్యాయం... బతికున్న బాబు, మంత్రులకో న్యాయమా?
వైఎస్ జగన్‌ను తాకితే లక్షల, కోట్ల చేతులు సమాధానం చెబుతాయి
అరెస్ట్ వదంతులు.. టీడీపీ, కాంగ్రెస్, ఓ వర్గం మీడియా కుట్రలో భాగం 
రాజకీయంగా ఎదుర్కోలేకే ఇటువంటి ప్రచారాలు... కుటుంబంతో గడిపేందుకే వైఎస్ జగన్ ఆదివారం పర్యటనను రద్దు చేసుకున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన్ను అరెస్ట్ చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. వారికేమీ లభ్యం కాలేదు. ఎందుకంటే, దివంగత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ఎలాంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదు. అందుకే వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు?’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. అసలు జగన్ అధికార దుర్విని యోగానికి పాల్పడ్డారని ఎలా చెప్తారని ప్రశ్నించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారయినా జగన్ సచివాలయానికి వచ్చారా? ఏ అధికారికయినా ఫోను చేశారా అని ప్రశ్నించారు. జగన్ ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడనందువల్లే సీబీఐకి ఒక్క ఆధారం కూడా లభించలేదని చెప్పారు. అయినా ఒకవేళ కాంగ్రెస్, టీడీపీలు ప్రచారం చేస్తున్నట్లుగా ‘ఆధారాలు లేకపోయినప్పటికీ జగన్‌ను సీబీఐ తాకినా... ఆయనపై ఒక్క చేయిపడినా రాష్ట్రంలోని లక్షల, కోట్ల చేతులు సమాధానం చెబుతాయి..’ అని గట్టిగా హెచ్చరించారు. జగన్‌ను అరెస్టు చేస్తారంటూ శనివారం అర్ధరాత్రి నుంచీ ఓ వర్గం మీడియా, టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు చేసిన దుష్ర్పచారంపై రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ వ్యక్తిగత కారణాలవల్ల కోవూరు ఎన్నికల ప్రచారం ఒకరోజు వాయిదా పడిందని, సోమవారం నుంచి మూడు రోజులపాటు యధావిధిగా ఆయన నెల్లూరు జిల్లాకు వెళ్లి ప్రచార సభల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మల పుత్రుడైన జగన్‌ను.. ఈ రాష్ట్రంలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి సైతం తమ కుమారునిగానే భావిస్తున్నారు. ప్రతి చెల్లీ, ప్రతి అక్క జగన్‌ను తమ సోదరునిగా భావిస్తున్నారు. ప్రతి అవ్వ, తాత జగన్‌ను తమ మనవడిగా చూసుకుంటున్నారు. సీబీఐకి ఇదే హెచ్చరిక చేస్తున్నాను... సీబీఐ..! జగన్‌పై ఒక్క చెయ్యి వేస్తే కోట్లాది చేతులు లేస్తాయి..’’ అని ఆయన తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. ఏ ఆధారాలూ లేకున్నా కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెబుతున్నట్లుగా ఆయన్ను అరెస్టు చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో... చూస్తారు’ అని వ్యాఖ్యానించారు. ‘‘జగన్‌నూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా... బహిరంగంగా ఎదుర్కోలేక అరెస్టు చేస్తారనే ప్రచారాలు చేస్తున్నారు. జగన్‌పై చేయిపడితే అది ఆయనపై కాదు, తెలుగు గడ్డపై పడిన చేయిగా ప్రజలు భావిస్తారు’’ అని అన్నారు. సీబీఐ విచారణ జరుపుతున్న తీరుపైనా అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీబీఐ విచారణల విషయంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక న్యాయము, బతికున్న చంద్రబాబుకొక న్యాయమా? వైఎస్ కేబినెట్‌లో పని చేసిన మంత్రులకు మరో న్యాయమా? వీటన్నింటినీ చూస్తుంటే మహానేతను, ఆయన కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది’’ అని అన్నారు.

కుటుంబంతో గడిపేందుకే...

ఉప ఎన్నికల ప్రచారం ఒకరోజు వాయిదా పడటంపై అంబటి వివరణ ఇస్తూ... ‘తూర్పుగోదావరి జిల్లా పల్లం అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన దరిమిలా ఈ నెల 2న జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. 3న తన కుటుంబంతో గడిపి, 4 నుంచి కోవూరు ప్రచారంలో పాల్గొనాలనుకున్నారు. అయితే అదేరోజు రాత్రి.. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి 24 గంటల ముందుగా, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హడావుడిగా 16 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతోపాటు మరో ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించారు. దాంతో 3వ తేదీన జగన్ వారితో సమావేశమవ్వాల్సి వచ్చింది. అందువల్ల ఆరోజు కుటుంబంతో గడపలేకపోయారు. జగన్‌కూ ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒకరికి 12, మరొకరికి పదేళ్లు... వారితో గడిపేందుకు వీలుగా ఆదివారం పర్యటనను రద్దు చేసుకుని ఆ మరుసటిరోజు నుంచీ అంటే.. ఐదో తేదీ నుంచి మూడు రోజులపాటు(5, 6, 7 తేదీలు) ప్రచారం చేయాలని భావించారు. అంతేతప్ప వాయిదాకు మరో కారణం లేదు. కానీ ఓ టీవీ చానల్ పనిగట్టుకుని జగన్‌ను అరెస్టు చేస్తారని ప్రచారం చేసింది. ఆ చానల్ ఏదో.. ఎందుకిలా ప్రచారం చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోటీలో తామెక్కడ వెనుకబడి పోతామోనని మిగతా చానళ్లూ ఇదే వార్తను ప్రచారం చేశాయి. వాటిని తప్పుపట్టను’’ అని తెలిపారు. ఇలాంటి ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. 

పథకం ప్రకారమే...: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకున్న ప్రజాదరణను దెబ్బతీయడానికి ఓ పథకం ప్రకారమే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వ్యవహరిస్తున్నాయని, ఓ వర్గం మీడియా కూడా ఇలాగే చేస్తోందని అంబటి ధ్వజమెత్తారు. గత డిసెంబర్ 5న వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేస్తే మూడునెలల తరువాత వారిపై వేటేయడం, అదీ రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడటానికి సరిగ్గా ఒకరోజు ముందు జర గడం, ఆ మరుసటి క్షణం నుంచే జగన్‌ను అరెస్టు చేస్తారని వదంతులు, హడావుడి... ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని అంబటి దుయ్యబట్టారు. ధైర్యముంటే కోవూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలని ఆయన సవాలు విసిరారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో ఈ నెల 21న తేలుతుందన్నారు. 

మంత్రులకు సిగ్గూ శరం ఉందా!
వైఎస్ రాజశేఖరరెడ్డిని మావాడే అని ఒకవైపు చెబుతూ మరోవైపు ఆయన కుమారుడిని చెడ్డవాడని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెబుతుండటం పట్ల అంబటి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాల్లో తమకూ బాధ్యత ఉందని ఓ వైపు చెబుతూ బయట జరిగే వాటితో తమకు బాధ్యత లేదనడం సిగ్గు మాలిన చర్య అని విమర్శించారు. రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొన్నపుడు ఆయనతోపాటు పనిచేసిన మంత్రులకు ఇంకా అధికారంలో కొనసాగే నైతిక అర్హత ఉందా? అని అంబటి ప్రశ్నించారు. అసలు ఈ మంత్రులందరికీ సిగ్గూ, శరం ఉందా? అని దుయ్యబట్టారు. ‘‘వైఎస్ జీవించి ఉన్నపుడు బొత్స ఏ విధంగా ఆయన ప్రాపకం కోసం పాకులాడారో అందరికీ గుర్తుంది. బొత్స పదవికోసం నానా గడ్డీ కరిచే రకం’’ అని ఆయన మండిపడ్డారు.
Share this article :

0 comments: