సీఎం వచ్చుంటే బాగుండేది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం వచ్చుంటే బాగుండేది

సీఎం వచ్చుంటే బాగుండేది

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012



సీఎం ఇక్కడకు రావడానికి అరగంట మాత్రమే పడుతుంది
హైదరాబాద్‌లోనే ఉన్నా ఆయన రాకపోవడం బాధాకరం
బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
సీఎం ఇప్పటికైనా స్పందించి బాధితులను ఆదుకోవాలి
650 కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి
అదే స్థలంలో ఐదు నెలల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
అప్పటిదాకా ప్రభుత్వమే అన్ని వసతులూ కల్పించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున కుటుంబానికి రూ.5 వేల చొప్పున సాయం
చనిపోయిన బాలిక కుటుంబానికి రూ. లక్ష సాయం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధానిలోని నాగోలులో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 650 కుటుంబాలు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాయని, ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా.. కనీసం ముఖ్యమంత్రి వచ్చి పరామర్శించకపోవడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజధాని నడిబొడ్డున దారుణం చోటు చేసుకున్న ఈ ప్రాంతానికి ఈ రోజు నేను రావడం కన్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి బాధితులను పరామర్శించి ఉంటే బాగుండేది. నగరంలోనే ఉన్న ముఖ్యమంత్రి సంఘటనా స్థలానికి రావడానికి అరగంట మాత్రమే పడుతుంది. అయినప్పటికీ రాకపోవడం బాధాకరం’ అని ఆయన అన్నారు. నాగోలు సాయినగర్‌లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో కూతుర్ని పోగొట్టుకున్న యాదగిరి, జయమ్మను, పూర్తిగా నిరాశ్రయులైన కుటుంబాలను ఆదివారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. సుమారు రెండు గంటలపాటు అక్కడే ఉండి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఇన్ని వందల కుటుంబాలు అన్నీ కోల్పోయి రోడ్డున పడితే.. వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యతను తప్పించుకోవడం సమంజసం కాదన్నారు. ‘సర్కారు స్పందించినా స్పందించకున్నా... అగ్నిప్రమాద బాధితులకు వైఎస్సార్ పార్టీ అండగా ఉంటుంది. అధైర్యపడొద్దు’ అని ఆయన భరోసా ఇచ్చారు.


పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి..

అగ్ని ప్రమాదంలో అన్నీ కోల్పోయిన అభాగ్యులకు అదే స్థలంలో ఐదు నెలల్లోగా పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వటంతో పాటు ఆ ఐదు నెలల పాటు అన్ని వసతులతో ప్రభుత్వమే పునరావాసం కల్పించాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమకంటే ముందు జగన్ సంఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాడని, తాము వెళ్లడం ఏమిటని అనుకోకుండా ముఖ్యమంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించాలని ఆయన కోరారు. జగన్‌ను కూడా ఒక మామూలు మనిషిగా భావించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రమాదంలో గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డులు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. ప్రభుత్వం వద్ద సాఫ్ట్‌వేర్‌లో సమాచారం ఉంటుంది కాబట్టి బాధితులందరినీ వెంటనే గుర్తించి ఆదుకోవాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నానన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి తామున్నామనే భరోసా ఇవ్వాలన్నారు.

ఒక్కరూ రాలేదయ్యా..!: అగ్నిప్రమాదం జరిగి కట్టుబట్టలతో మిగిలిన తమవైపు ప్రభుత్వ అధికారులు ఇంతవరకు కన్నెత్తి చూడలేదని, రాత్రి నుంచీ తిండీ, నిద్ర లేవని, సర్వం కోల్పోయామని బాధితులు జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే తమకు సత్వర సాయం అందేదని, ఈ ప్రభుత్వంలో పేదలను పట్టించుకునే వారే లేరని దుయ్యబట్టారు. గతంలో ఏ ప్రభుత్వ పథకమైనా తమ వరకు వచ్చేదని, ఇప్పుడు రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నామని చెప్పుకుంటున్నా అవి దళారులకే మేలు చేస్తున్నాయని బాధితులు జగన్ వద్ద ఏకరువు పెట్టారు. రెండు గంటల పాటు ఇక్కడే గడిపిన జగన్ సావధానంగా బాధితుల ఆక్రందనను విని సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, రహమాన్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బి.జనార్దన్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, రాజ్‌ఠాకూర్, కె.శివకుమార్ తదితరులున్నారు.

బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ ఆర్థిక సాయం

అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన సంధ్య కుటుంబానికి లక్ష రూపాయలు, మిగిలిన బాధిత కుటుంబాలకు ఐదువేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

జగన్ పర్యటన తర్వాత కదిలిన సర్కార్

నాగోలు సాయినగర్ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఆదివారం ఉదయం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టిన నేపథ్యంలో సాయంత్రానికి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శేషాద్రి ఘటనా స్థలాన్ని సందర్శించి 507 కుటుంబాలకు కుటుంబానికి 20 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, రూ.8 వేల నగదు చొప్పున అందజేశారు. అంతకు ముందు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు టి.దేవేందర్‌గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ బాధితులను పరామర్శించారు.
Share this article :

0 comments: