నల్లకాలువ వద్ద ఇచ్చిన మాటను గాలికొదిలేయమన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నల్లకాలువ వద్ద ఇచ్చిన మాటను గాలికొదిలేయమన్నారు

నల్లకాలువ వద్ద ఇచ్చిన మాటను గాలికొదిలేయమన్నారు

Written By ysrcongress on Tuesday, March 13, 2012 | 3/13/2012

కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ.. 
ఏడాది కాలంలో ప్రతి పేదకూ, ప్రతి రైతుకూ చేరువయ్యాం 
నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రోజు ఇంకా గుర్తుంది 
నల్లకాలువ వద్ద ఇచ్చిన మాటను గాలికొదిలేయమన్నారు 
నేను, అమ్మ వెళ్లి సోనియాగాంధీని కలిసినా ఒప్పుకోలేదు 
కాంగ్రెస్‌లో కొనసాగితే మంత్రి పదవులు ఇస్తామన్నారు 
అలా కొనసాగితే.. ఇచ్చిన మాటను గాలికొదిలి మనసు చంపుకోవాలి 
అలా కాదని.. కాంగ్రెస్‌ను వీడితే రాజకీయంగా ఆత్మహత్యేనని చెప్పారు 
అందుకే ఏ ఒక్క సహచరుడ్నీ నాడు నాతో రావద్దన్నాను 
ఆ వేళ నేనా పని బుర్రతో చేయలేదు.. గుండెతో చేశాను 

హైదరాబాద్, న్యూస్‌లైన్: విశ్వసనీయతే ఊపిరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలోనే రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ, ప్రతి రైతన్నకూ ఆత్మీయంగా చేరువైందని ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. బతికినన్నాళ్లూ ఎలా బతికామన్నది ముఖ్యం అన్న దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో మనం అడుగులు ముందుకు వేశాం. ఇవాళ రాజకీయ వ్యవస్థలో మార్పు మన ద్వారానే వస్తుంది.. మనమే తీసుకురాగలుగుతాము అన్న నమ్మకం, విశ్వాసం ప్రతి పేదవాడిలో కలిగించగలిగాం. ఈ నమ్మకం, విశ్వాసమే మన పార్టీకి ఊపిరిగా కొనసాగాలి. విలువలు - విశ్వసనీయత అన్నవే మన పార్టీకి కళ్లు అన్న స్ఫూర్తితో ముందుకు సాగాలి’’ అని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు
పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వై.ఎస్.జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మహానేత వైఎస్ మరణం తర్వాత తను ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిందీ.. నల్లకాలువ సంతాప సభలో లక్షలాది మంది ఎదుట ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలా ముందుకు సాగిందీ.. ఆయన వివరించారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరినీ చూసి.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇలాంటి వాళ్లు ఉండాలి అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా పార్టీ ఉన్నదని సగర్వంగా చెప్తున్నానన్నారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

‘‘మన పార్టీని స్థాపించి దాదాపు సంవత్సరం కావస్తోంది. ఈ సంవత్సర కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. ఆ రోజు నాకు ఇవాళ్టికి కూడా బాగా గుర్తుంది. నేను కాంగ్రెస్‌ను వీడి బయటకు వచ్చిన ఆ దినం నాకు ఇవాళ్టికీ గుర్తుంది. నల్లకాలువలో ఆ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చనిపోయిన ప్రదేశం వద్దకు వెళ్లటం ఇవాళ్టికీ నాకు గుర్తుంది.. అది గుర్తొస్తే.. అక్కడి హెలికాప్టర్ శకలాలు ఇప్పటికీ నా కళ్లలో మెదులుతాయి. నాన్న చనిపోయి సరిగ్గా 20 రోజులు కూడా కాలేదు. ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లటం.. అక్కడే.. ఆ నల్లకాలువలో సంతాప సభలో లక్షలాది మంది సమక్షంలో మాట ఇచ్చాను. నాన్న మరణం తట్టుకోలేక దాదాపు 700 మంది చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు గుండె ఆగి చనిపోయారు. నేను కూడా నాన్నను పోగొట్టుకున్నా. ఆ బాధలోనే ఉన్నా. వాళ్లు కూడా పెద్ద దిక్కును కోల్పోయారు. వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి అని నా గుండెలో అలజడి రేగింది. ఆ సమయాన నేనా మాట ఇచ్చా. ఆ మాట ఎందుకు ఇచ్చారు అని అడిగితే సమాధానం ఉండదు. దేవుడు నా మనసులో ఎందుకు ఆ ఆలోచన పుట్టించాడో తెలియదు. నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను కలుస్తానని చెప్పా. ప్రతి ఇంటికీ వచ్చి పరామర్శిస్తానని చెప్పా. కానీ.. ఎందుకో నాకైతే తెలియదు కానీ.. నేను ఇచ్చిన మాటను గాలికొదిలేయాలని కాంగ్రెస్ పెద్దలు చాలా ఒత్తిడి తెచ్చారు. చాలా ఒత్తిడే తెచ్చారు. చివరి ప్రయత్నంగా నేను, అమ్మ కలిసి వెళ్లి సోనియాగాంధీకి చెప్పి ఒప్పించాలని ప్రయత్నం చేశాం. కానీ ప్రయోజనం లేకపోయింది. 


ఇక గత్యంతరం లేని పరిస్థితిల్లో వెళ్లిపోయా. ఆ పరిస్థితి ఏమిటీ అంటే.. కాంగ్రెస్‌లో కొనసాగాలి.. కొనసాగితే నాకు మంత్రి పదవులు కూడా ఇస్తారు. కానీ ఆ పదవుల కోసమో, కాంగ్రెస్‌లో కొనసాగటం కోసమో.. నా మాటను వదిలేయాలి. ఉన్నది ఒకే ఒక్క దారి. అదే పార్టీలో ఉండి.. మాటను గాలికి వదిలేసి.. మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండటం. రెండోదారి.. ఆ వేళ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. కాంగ్రెస్ నుంచి బయటకు వెళితే రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమేనని నాతో చాలా మంది చెప్పారు. ‘మీ నాన్న 30 ఏళ్లు కడపలో కాంగ్రెస్‌ను, ఒకే గుర్తును నేర్పించారు. ఆ ఒకే గుర్తును కాదని నువ్వు గెలవలేవు. టీడీపీ సైకిల్ గుర్తు 30 ఏళ్లుగా జనానికి అలవాటయింది. ఎన్నికల్లో నీకు కేవలం 14 రోజలే సమయం ఉంటుంది. నీకు వచ్చే గుర్తు కేవలం 14 రోజుల్లో ప్రజల్లోకి కూడా పోనే పోదు. నీకు ఓట్లు పడవు. పైగా మీ చిన్నాన్నను మంత్రిని చేశారు. ఆ మంత్రినే నీ మీద పోటీ పెడతారు. నీ కుటుంబాన్ని చీల్చుతారు. ఇక మీకు రాజకీయంగా ఆత్మహత్యే అవుతుంది’ అని చాలా చెప్పారు. అది విని నాకు కూడా సందేహం కలిగింది. బహుశా నేను తీసుకుంటున్న ఆ నిర్ణయం వల్ల రాజకీయంగా తెరమరుగు అయిపోతనేమో అనుకున్నా. నా గుర్తును అంత తక్కువ కాలంలో ప్రజల్లోకి తీసుకుపోగలగుతామా అన్న సంశయం కలిగింది. అందుకే.. నాతో పాటు ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా, ఏ ఒక్క సహచరుడిని కూడా నాతో రావద్దని పిలుపునిచ్చా. నా నిర్ణయంతో నేను రాజకీయంగా చనిపోతానని అంటున్నప్పుడు.. నాతో పాటు ఇంకా నలుగురిని తీసుకుపోయి.. వాళ్లకు కూడా ఆత్మహత్యా సదృశ్య పరిస్థితి కల్పించవద్దనే ఆలా చేశా. ఆ వేళ నేను చేయాలనుకున్నది నేను చేశా. ఆ వేళ చేసింది నేను బుర్రతో చేయలేదు. గుండెతో చేశాను. ఎందుకు చేశానూ అంటే.. నేను చేస్తున్నది దేవుని దృష్టిలో కరెక్టుగా ఉన్నప్పుడు.. ఆ దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆ దేవుడితో పాటు నాన్నను ప్రేమించే ప్రతి గుండె నా తోడుగా ఉంటుందన్న నమ్మకంతో, విశ్వాసంతో ఆ వేళ ఆ నిర్ణయం తీసుకున్నా. అది ఈ వేళ నిజమైంది. నాన్నను ప్రేమించే ప్రతి గుండె నిజంగానే నాకు తోడుగా ఉంటూ వచ్చారు. ఎంతగా తోడుగా ఉన్నారంటే.. ఇవాళ ఇన్ని కష్టాలు, ఇబ్బందులు సృష్టిస్తున్నా నేను చిరునవ్వుతో ఉన్నానంటే.. కేవలం ఇంత మంది గుండెల్లో దేవుడు ఇంత ప్రేమ పుట్టించినందుకేనని గర్వంగా చెప్తున్నా. 

ప్రతి పేదవాడిలో నమ్మకం తేగలిగాం... 

‘‘ఇవాళ ఒకే ఒక మాట ప్రతి కార్యకర్తకూ చెప్పదలచుకున్నా. ప్రతి సహచరుడికీ, నాన్నను ప్రేమించే ప్రతి గుండెకూ చెప్పదలచుకున్నా. అదేమిటంటే.. ‘ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. బతికనంత కాలం ఎలా బతికామన్నది ముఖ్యం’ అని. నాయకుడు ఎలా ఉండాలి అనంటే.. ఆ నాయకుడ్ని చూసి ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా తలెత్తుకొని చెప్పాలి.. ఫలానా వాడు మా నాయకుడు.. ఫలానా పార్టీ మాదని సగర్వంగా చెప్పుకోవాలి. ఇవాళ గర్వంగా ఒక మాట చెప్పగలుగుతా. ఆ వేళ నాన్న ఇచ్చిన ఆ స్ఫూర్తితో నేను అడుగులు వేశా. తర్వాత నాతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు.. పదవులు పోతాయని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం అదే స్ఫూర్తితో అడుగులు వేశారు. నిజంగా పేదవాడికి తోడుగా, రాజకీయాలలో నిజాయితీగా ఉండటం కోసం.. పేదవాడికి, రైతన్నకు నిజాయితీగా తోడుగా ఉండటం కోసం.. పదవులు పోతాయని, ఉప ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా 17 మంది ఎమ్మెల్యేలు అదే స్ఫూర్తిని కొనసాగించారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామన్నది ముఖ్యం అన్నది ఆచరించి చూపించారు. 

ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరినీ చూసి ప్రజలందరూ కూడా.. ఇలాంటి వాళ్లు ఉండాలి.. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అంటే అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేట్లుగా మన పార్టీ ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో ప్రతి పేదవాడికీ మనం దగ్గర కాగలిగాం. ప్రతి రైతన్నకూ మనం దగ్గర కాగలిగాం. రాజకీయ వ్యవస్థలో మార్పును మన ద్వారానే, మనం తీసుకురాగలుగుతాము అన్న నమ్మకం, విశ్వాసం ప్రతి పేదవాడిలో మనం కలిగించగలిగాం. ఈ నమ్మకం, ఈ విశ్వాసం మన ఊపిరిగా కొనసాగాలి. మన పార్టీకి ఊపిరి ఏమిటీ అంటే.. విలువలు - విశ్వసనీయత అన్న పదం. ఈ రెండు పదాలే మన పార్టీకి ఊపిరి. ఈ రెండు పదాలే మన పార్టీకి కళ్లు. ఇవాళ ఇదే ఊపిరితో, ఇదే కళ్లతో.. ఇంతగా ఆప్యాయత చూపించినందుకు, ఇంతగా ఆత్మీయత పంచిపెట్టినందుకు.. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత రాజశేఖరరెడ్డి మీద అభిమానం, ప్రేమ, ఆత్మీయతలు చూపిస్తూ.. నాకు అండగా, తోడుగా నిలబడ్డందుకు ప్రతి గుండెకూ నేను చేతులు జోడించి, శిరసు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.’’ 

ఇవాళ రాజకీయ వ్యవస్థ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మన ద్వారా సాధ్యమవుతుందని ప్రతి పేదవానిలో నమ్మకం తేగలిగాం. మన పార్టీకి విలువలు, విశ్వసనీయతే కళ్లు, ఊపిరి’’ అని స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణలో నేతలు వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జూపూడి ప్రభాకర్‌రావు, కొల్లి నిర్మలాకుమారి, మారెప్ప, రెహమాన్, జనక్‌ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, ఆదం విజయ్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: