పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పెద్దలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పెద్దలు

పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పెద్దలు

Written By news on Wednesday, March 14, 2012 | 3/14/2012ముఖ్యమంత్రితో పలువురు అమాత్యుల భేటీ
ఆయన పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి
కౌంటర్ వేయకపోవడం వల్లే కష్టాలంటున్న మంత్రులు
నోటీసులకు బదులెలా చెప్పాలో తెలియక ఆపసోపాలు
విచారణను ఎదుర్కోక తప్పదేమోనంటూ ఆందోళన
ఢిల్లీ పెద్దలతోనూ మంత్రుల మాటామంతి
జగనే సీబీఐ లక్ష్యమన్న వాదనే నిజమైందంటూ వ్యాఖ్యలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆరుగురు అమాత్యులకు సుప్రీంకోర్టు నోటీసులివ్వడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పెద్దలు, గండం గట్టెక్కే మార్గం కానరాక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకు సీబీఐ కేసు సాధనంగా ఉపయోగపడుతుందని ఆశించిన తమకు, నోటీసులు కొత్త చిక్కు తెచ్చిపెట్టాయని వారు వాపోతున్నారు. ఈ విషయంలో ఏ వైఖరి అనుసరించాలన్న దానిపై తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నారు. సీబీఐ ఇంతకాలంగా జరిపిన దర్యాప్తులో మంత్రివర్గ నిర్ణయాలపై ఏనాడూ దృష్టి సారించకపోగా, ఈ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం తెలిసిందే. ఆ తప్పులే ఇప్పుడు తమ కొంప ముంచుతున్నాయంటూ మంత్రులు ఆందోళన చెందుతున్నారు. నోటీసుల జారీకి సుప్రీం ఆదేశించినట్టు వార్తలొస్తూనే వారు ఉలిక్కి పడ్డారు. వాటిలో ఏముందో, ఏమని బదులిస్తే ఎటు దారి తీస్తుందోనని తీవ్ర భయాందోళనల్లో పడ్డారు. రెండు రోజులుగా పైకి గాంభీర్యం కనబరుస్తున్నా లోలోన గుబులుతోనే గడుపుతున్నారు.

సభలోనూ చర్చలే...

సుప్రీం నోటీసులు జారీ చేసిన జాబితాలో ఉన్న మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి మంగళవారం అసెంబ్లీకి హాజరైనా సభలోకి వెళ్లకుండా మంత్రి ధర్మాన ప్రసాదరావు చాంబర్లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీనియర్ న్యాయ నిపుణులతో చర్చించి నోటీసులకు సమాధానమివ్వాలని నిర్ణయించారు. జీవోల్లో తప్పులేదని అంగీకరిస్తే రాజకీయంగా జగన్ మరింత బలపడతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే మధ్యేమార్గంగా బదులివ్వాలని భావించారు. సీనియర్ మంత్రులు కె .జానారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తదితరులూ దీనిపై మరోపక్క చర్చలు సాగించారు. సభకు వచ్చిన ఎమ్మెల్యేల్లోనూ దీనిపైనే చర్చలు, విశ్లేషణలు సాగాయి. ‘‘జగన్ కేసుపై సీబీఐ చూపిన అత్యుత్సాహమే మంత్రుల పీకల మీదకు తెచ్చింది. శంకర్రావు ద్వారా జగన్‌పై కేసులు వేయించడం, తర్వాత ఎలాంటి వ్యూహమూ లేకుండా అంతా సీబీఐ చేతిలో పెట్టడం వల్లే ఇక్కట్లు వస్తున్నాయి’’ అని వారన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పలుమార్లు సూచించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే ఇప్పుడు తమ కొంప ముంచేలా ఉందంటూ మంత్రులు వాపోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా.. కేబినెట్ నిర్ణయాలపై గానీ, 26 జీవోలపై గానీ సీబీఐ కనీసం విచారణ కూడా చేపట్టకుండానే తప్పులు జరిగినట్టుగా తనకు తానే ఎలా నిర్ణయానికి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఏ ఆధారాలూ లేకుండా జగన్‌ను తొలి నిందితునిగా ఎలా చేర్చిందో అర్థం కావడం లేదంటున్నారు. జగన్‌పై కక్షసాధింపునకే సీబీఐ విచారణ జరిపిస్తున్నారని సుప్రీం నోటీసులతో ప్రజలకు పూర్తిగా తేటతెల్లమైందని వారంగీకరిస్తున్నారు. ‘‘ఆ 26 జీవోలే కీలకమైనవని భావిస్తున్న సీబీఐ, ఇంతకాలం ఆ దిశగా విచారణే చేయకపోవడం వల్లే పరిస్థితి సుప్రీం నోటీసుల దాకా వచ్చింది. తప్పు జరగలేదంటే ఒక సమస్య, జరిగిందని అంగీకరిస్తే మరో సమస్య! మా పార్టీ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది’’ అని వారంటున్నారు.

సీఎం నిర్లిప్తతపై మంత్రుల మండిపాటు

ఆరుగురు మంత్రులకు, 8 మంది సీనియర్ ఐఏఎస్‌లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చినా సీఎం పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ సీనియర్ అమాత్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. నోటీసులపై సభలో ఓవైపు టీడీపీ అలజడి సృష్టిస్తున్నా ఆయన సరిగా స్పందించడం లేదంటూ దుయ్యబడుతున్నారు. ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా కిరణ్ మంగళవారం ఉదయం మహ బూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లబోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వెళ్లాలనుకున్న కిరణ్.. నోటీసులపై విపక్షాలు సభను స్తంభింపజేశాయని మంత్రులు చెప్పడంతో అసెంబ్లీకి వచ్చారు. తన చాంబర్లో గీతారెడ్డి, ధర్మాన, పొన్నాల, కన్నాలతో భేటీ అయ్యారు. గతంలో తమ శాఖల ద్వారా ఇచ్చిన జీవోలు, వాటి నోట్‌ఫైళ్లను వారాయనకు చూపించారు. ‘టెన్షన్ పడొద్దు. ఏం చేయాలో నోటీసులొచ్చాక ఆలోచిద్దాం. అంతవరకు ఏమీ కాదు’ అంటూ వారికి షరామామూలుగా హామీ ఇచ్చి, కాసేపు సభలో గడిపి ప్రచారానికి వెళ్లిపోయారు. మంత్రులు మాత్రం తీవ్ర ఆందోళనతో కన్పించారు. గీతారెడ్డి, పొన్నాల, కన్నా వివాదాస్పద జీవో కాపీలు తదితర ఫైళ్లతో కుస్తీ పడుతూ కన్పించారు. సీఎం ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తుండటంతో వారు మళ్లీ ధర్మాన చాంబర్లో భేటీ అయ్యారు. హస్తిన పెద్దలతో, న్యాయ నిపుణులతో మాట్లాడారు. ఇంకోవైపు.. కొందరు సీనియర్ మంత్రులు జానా చాంబర్లో భేటీ అయ్యారు. నోటీసులను సీఎం సీరియస్‌గా తీసుకుని ఉదయమే మంత్రులతో సమావేశమైతే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రభుత్వంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. సీఎం ప్రచారాలకు వెళ్లిపోయారు. నోటీసులందుకున్న మంత్రులు విచారంగా గదిలో కూర్చున్నారు. ఇక్కడ సీనియర్లమంతా ఉన్నా సీఎం మమ్మల్ని కనీసం సంప్రదించలేదు. సభలో మంత్రులెవరూ లేక ప్రధాన ప్రతిపక్షం నుంచి స్పీకరు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. అసలు ప్రభుత్వముందా అన్న అనుమానం కలుగుతోంది’’ అంటూ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి వాపోయారు. ‘నోటీసులో ఏముందని సీఎం, మంత్రులు భయపడి పారిపోతున్నారో నాకర్థం కావడం లేదు. వారు ఆ మాత్రం సమాధానం కూడా చెప్పుకోలేరా! నాయకత్వ లోపమంటే ఏమిటో మాకిప్పుడు స్పష్టంగా తెలిసొస్తోంది’’ అని అన్నారు. ‘‘ఇలాంటప్పుడు ఏ ముఖ్యమంత్రైనా ఏం చేయాలా అని సీనియర్లతో, తోటి మంత్రులతో చర్చిస్తారు. సభా నేతగా విపక్షాలకు దీటుగా బదులివ్వాలి. కానీ సీఎం అలా వ్యవహరించడమే లేదు’’ అటూ మండిపడ్డారు. మంత్రులు, అధికారులే వ్యక్తిగతంగా సమాధానాలు చెప్పుకుంటారన్న సీఎం వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్‌లోనే అంతా తప్పుబడుతున్నారు!

వారిని తొలగిస్తేనే మంచిది: మరోవైపు సుప్రీం నోటీసులిచ్చిన మంత్రులను తొలగించాలన్న డిమాండ్లు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. ‘‘శంకర్రావుతో హైకోర్టుకు ఫిర్యాదు చేయించి జగన్‌పై సీబీఐ విచారణ చేయించి ఆయన్ను ఇబ్బంది పెడదామనుకున్నాం. ఇప్పుడు మంత్రులకే నోటీసులు రావడంతో ఆ బురద మాపైనే పడుతోంది. జగన్‌పై ఆరోపణలు చేస్తున్న మా పార్టీ, ఇప్పుడీ మంత్రులపై ఉపేక్ష వహించడం తప్పే అవుతుంది. వారిని తొలగిస్తేనే పరువు నిలబడుతుంది’’ అని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు!

గీతారెడ్డి రాజీనామా వదంతులు
మంత్రి గీతారెడ్డి సోమవారం సీఎంను కలసి వచ్చాక.. రాజీనామా చేస్తానని ఆయనతో పేర్కొన్నట్టు అసెంబ్లీలో ప్రచారం జరిగింది. కొన్ని చానళ్లలో స్క్రోలింగులు, ఆ వెంటనే తనకు ఫోన్లు రావడంతో మంత్రి మనస్తాపానికి గురయ్యారు. తప్పు చేయనప్పుడు తాను రాజీనామా చేయాల్సిన పనేముందని మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా ఆమె అన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా తాను జారీ చేసిన జీవోలు, నోట్ ఫైళ్ల కాపీలు చూపుతూ, ‘‘ఇదుగో చూడండి. పలు శాఖల నుంచి ప్రతిపాదనలు, నిరభ్యంతర పత్రాలు వచ్చాకే మా శాఖ చివరగా నిర్ణయం తీసుకుంది. పైగా ఇతర మంత్రులూ అంగీకరించాకే జీవోలొచ్చాయి. ఇందరికి సంబంధముండగా వ్యక్తిగతంగా నేనే నిర్ణయం తీసుకున్నానంటే ఎలా?’’ అని ప్రశ్నించారు.
Share this article :

0 comments: