కోతలు ఆపకుంటే మూత తప్పదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోతలు ఆపకుంటే మూత తప్పదు

కోతలు ఆపకుంటే మూత తప్పదు

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: పరిశ్రమలకు విధిస్తున్న విద్యుత్ కోతలపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే పరిశ్రమలను మూసివేయక తప్పదని ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య(ఫ్యాప్సియా) తేల్చి చెప్పింది. లక్షలాది కార్మిక కుటుంబాలు ఆధారపడ్డ చిన్న తరహా పరిశ్రమలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఫ్యాప్సియా అధ్యక్షుడు ఏపీకే రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌రావు, కోశాధికారి ఆనంద్‌రెడ్డి మండిపడ్డారు. 600 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. 

ఫ్యాప్సియా ఆధ్వర్యంలో గురువారమిక్కడ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షలో అధ్యక్షుడు ఏపీకే రెడ్డి, మాజీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, కార్యదర్శి నాగేశ్వర్‌రావు, పారిశ్రామికవాడల నాయకులు డీకే జైన్(నాచారం), పీఎస్‌ఎస్ నాయుడు(మల్లాపూర్), కిషోర్ (పాశమైలారం), ఆర్.నర్సింహ(టెక్స్‌టైల్ పార్క్, మల్కాపూర్), ప్రవీణ్‌కుమార్(నాచారం), మహిపాల్‌రెడ్డి(నాచారం) పాల్గొన్నారు. 

విద్యుత్ కోతతో పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని వారు పేర్కొన్నారు. పరిశ్రమలను నడపకపోయినా కార్మికులకు జీతాలు, విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని వాపోయారు. విద్యుత్తు కోతలు ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయని, సకాలంలో సరఫరా చేయలేకపోతే ఆర్డర్లు రద్దవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో ఇలాగే సమస్య తలెత్తితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 600 మెగా వాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేశారని గుర్తు చేశారు. 

సంక్షోభానికి సర్కారే కారణం: బాబు
రాష్ర్టంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిశ్రమలకు విద్యుత్ సరఫరా మెరుగుపడేలా కృషి చేస్తామన్నారు. ఫ్యాప్సీ ప్రతినిధులు దేవేంద్ర సురానా, ఎంవీ రాజేశ్వరరావు తదితరులు గురువారం చంద్ర బాబును ఆయన నివాసంలో కలిసి విద్యుత్ కోతలతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. 

నెలకు 17 రోజులపాటు విధిస్తున్న కోతల వల్ల పరిశ్ర మలు ఖాయిలా పడే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ర్టంలో సగటున 14 నుంచి 16 శాతం కోతలు ఉండగా... పరిశ్రమలకు మాత్రం 40 నుంచి 60 శాతం కోతలు అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో ఉత్పత్తి పడిపోయి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందన్నారు. అదనపు విద్యుత్ కొనుగోలు చేసి పరిశ్రమలకు సరఫరా చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును వారు కోరారు. 

కోతలు విధిస్తూ లక్షల ఉద్యోగాలా?: ప్యాస్మే
పరిశ్రమలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తుందని సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరగతి పరిశ్రమల సంఘం(ఫ్యాస్మే) ప్రశ్నించింది. అదనపు చార్జీలతో పారిశ్రామిక విధానాన్ని అస్తవ్యస్తం చేస్తోందని ప్రభుత్వంపై మండిపడింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.హనుమంతరావు గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమలకు మౌలిక వసతుల గురించి పట్టించుకోకుంటే పన్నులు చెల్లించకుండా సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.
Share this article :

0 comments: