రోడ్‌షో..అదుర్స్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోడ్‌షో..అదుర్స్

రోడ్‌షో..అదుర్స్

Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012


గంటల ఆలస్యమైనా ఆయన కోసం వేచి ఉన్న అభిమానం
రెండు రోజులూ అదే జనహోరు.. దారి పొడవునా పూల వర్షం

కోవూరు నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి: అది జాతర కాదు.. పండగా కాదు.. అయినా ఆ ఊళ్లల్లోని జనమంతా ఒక్కచోటకు చేరిపోయారు.. ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వారంతా రోడ్లపైకొచ్చి ఒకాయన కోసం ఎదురుచూస్తున్నారు. అంతలా వారు అభిమానిస్తున్న నేత తమ కంటి ముందు కనిపించగానే ఈలలు.. జేజేలు.. జగన్నినాదాలు.. హర్షాతిరేకాలు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమ, మంగళవారాల్లో పర్యటించిన ప్రతి గ్రామంలోనూ ఇదే తీరు. ఆ ఊరు.. ఈ ఊరు అని లేదు.. ఆయన వెళ్లిన ప్రతి ఊరూ రోడ్డుపైనే ఆయన కోసం వేచి చూస్తూ కనిపించింది. సోమవారం కొడవలూరు మండలంలోని గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించిన జగన్.. మంగళవారం ఇందుకూరుపేట మండలంలోని ఊళ్లలో పర్యటించారు. అయితే ప్రతి ఊళ్లోనూ జనం భారీగా గుమిగూడడంతో జగన్ ఒక ఊరుదాటి మరోఊరుకు వెళ్లడం తీవ్ర ఆలస్యమైపోయింది. దీంతో కొన్ని గ్రామాల పర్యటన వాయిదా పడింది.

తొలిరోజు..

సోమవారం కొడవలూరులో ప్రారంభమైన ప్రచార రోడ్‌షో యల్లాయపాళెం వరకూ ప్రతి గ్రామంలో సాగింది. కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కుగ్రామాల వాసులు కూడా జగన్ కాన్వాయ్‌ను ఆపి.. ఆయనతో కరచాలనం చేసిగాని వదల్లేదు. రేగడి చెరువు గ్రామంలో సుమారు 2 వేల మంది జనాభా ఉంటే.. జగన్‌ను చూసేందుకు సుమారు వెయ్యి మందికిపైగానే తరలివచ్చారు. కమ్మపాళెం గ్రామం లో ఏడెనిమిది వందల కుటుంబాల దాకా ఉంటే.. వెయ్యి మందికి పైగానే జనం రోడ్లపై జగన్ కోసం వేచిచూస్తూ కనిపించారు. 1,500 మంది జనాభా ఉండే తలమంచి గ్రామంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో మండుటెండలో జనం పట్టుబట్టి మూడు చోట్ల జగన్‌తో మాట్లాడించారు. 

గండవరం గ్రామంలో 1,500కు పైగా జనాభా ఉంటే.. మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రటి ఎండలో.. జగన్ కోసం వెయ్యి మందికి పైగానే జనం రోడ్డుపై వేచి ఉండడం గమనార్హం. రాత్రి 7 గంటలకు యల్లాయపాళెంలో రోడ్‌షో జరగాల్సి ఉండగా రాత్రి 9.40 గంటలకు జగన్ ఆ గ్రామానికి చేరుకున్నారు. 3 వేల జనాభా ఉండే ఈ గ్రామంలో ఊరు ఊరంతా ఎదురేగి ఆయనకు స్వాగతం పలికింది. రాత్రి 8 గంటల నుంచి నార్త్‌రాజుపాళెంలో జగన్ కోసం ఎదురు చూసిన వేలాది మంది రాత్రి 10 గంటల తర్వాత సభ జరగదని తెలిసినా 10.30 గంటల దాకా ఆయన కోసం ఎదురు చూశారు.

రెండో రోజు..

ఓవైపు ఎండ మండుతున్నా జనం.. జగన్ వెంట గంటకుపైగా నడిచిన అరుదైన సంఘటన ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరులో చోటు చేసుకుంది. ఈ ఊళ్లో జగన్‌ను చూడ్డానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఆయన ప్రచార వాహనానికి ఎదురుగా వచ్చి ప్రసంగించాలని కోరారు. జగన్ వారికి సర్ది చెబుతూ ఊరి మధ్యలోకి వెళదాం, అక్కడ మాట్లాడతాను అంటూ బయలుదేరారు. అంతే... జనం ఆయనను విడవకుండా వెంట బయలుదేరారు. కొత్తూరు నుంచీ ఇందుకూరుపేట మండల కేంద్రం వరకూ రోడ్‌షో చేస్తూ వెళ్లిన జగన్‌ను వారు జగన్నినాదాలతో అనుసరించారు. ఇందుకూరు పేట నుంచి మైపాడుకు జగన్ వెళుతున్నపుడు ఒక కూడలి వద్ద కొందరు గిరిజనులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. 

అక్కడికి సమీపంలోని తమ జంగంవాని దొరువు గ్రామానికి కూడా రావాలని పట్టుబట్టారు. ప్రచార షెడ్యూలులో ఆ గ్రామం లేకపోవడం, పైగా అది బాగా లోపల ఉండడంతో ఇపుడు వీలు పడదని జగన్ వారికి సర్ది చెప్పారు. గిరిజనులు తాము తయారు చేసి తెచ్చిన వరి వెన్ను, పువ్వుల మాలనైనా వేసుకోవాలని కోరారు. అందుకు అంగీకరించిన జగన్ రథంపై నుంచి దిగి వారు వేసిన పూలమాలను స్వీకరించి కొందరు అవ్వలను ముద్దాడి ముందుకు సాగిపోయారు. ప్రతి గ్రామ పొలిమేరల్లోనూ జనం మేళతాళాలతో స్వాగతం పలికారు. సముద్రతీరంలోని పట్టపు పాళాలను జగన్ సందర్శించినపుడు మత్స్యకారుల నుంచి ఆయనకు మంచి స్పందన లభించింది. జగన్‌ను సమీపించలేని మహిళలు తమ మిద్దెల మీద నుంచి ఆయనకు పళ్లాల్లో ఎర్రనీళ్లు, కర్పూరంతో హారతులు పట్టి అభిమానం చాటుకున్నారు. ఆయన వెంట ప్రచార రథంపై కోవూరు అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులున్నారు.

సర్కారు కళ్లు తెరిచేలా ఓటు

కోవూరు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు


ఇందుకూరు పేట నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: ఉప ఎన్నికల్లో ఒక్క ఓటుతో అందరి కళ్లూ తెరిపించాలని, అప్పటికైనా రైతన్నలు, పేదలు పడుతున్న బాధలు ప్రభుత్వానికి కనిపిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు, పేదల ఆకాంక్షల మేరకే ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో ఉప ఎన్నికల ప్రచారం రెండో రోజు మంగళవారం ఆయన ఇందుకూరుపేట మండలంలో పర్యటించారు. పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో పేదలు, రైతుల గురించి ఆలోచించే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. ఈ ఎన్నికలు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యగాని, పార్టీల మధ్యగాని జరుగుతున్నవి కావని, విలువలు, విశ్వసనీయతకూ మధ్య జరుగుతున్న పోరాటం అని అన్నారు. రైతులకు, పేదలకు అండగా నిలవడానికేప్రసన్నకుమార్‌రెడ్డి పదవిని త్యాగంచేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఆందోళనలో విద్యార్థులు: రాష్ట్రంలో ప్రస్తుతం పేద విద్యార్థులు చదువుల కోసం, వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అందరికీ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే కళాశాల యాజమాన్యాలు ఫీజులు కడితేగానీ పరీక్షలకు అనుమతించబోమని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ సమయంలో రూ.50-60 వేల ఫీజు చెల్లించే పరిస్థితి ఆ పేద విద్యార్థులకు లేదు. పరీక్షలకు సిద్ధం కావాల్సిన విద్యార్థులు క్షోభకు గురవుతున్నారు. ఈ దుస్థితికి కారణం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడమే.

కష్టాల్లో రైతులు: పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతన్న వరి కోసుకునేటప్పుడు ధాన్యం రేటును రూ.700కు తగ్గించేస్తున్నారు... అవే వడ్లు మిల్లర్ల చేతిలోకి వెళ్లిపోగానే బస్తాకు రూ.900 పై చిలుకు ధరకు పెంచేస్తున్నారు. రైతు కూలీకి వంద రూపాయలు కూడా కూలీ రావడం లేదు. రైతుల దీన పరిస్థితిని చూసి కూలీలు కూడా సర్దుకుపోవాల్సిన అగత్యం ఏర్పడింది. రైతన్నల దగ్గరికి వెళ్లి వ్యవసాయం గురించి అడిగితే ‘వ్యవసాయం చేయడం కన్నా ఉరి వేసుకోవడమే మంచిది’ అనే ఆలోచనతో ఉన్నామని చెబుతున్నారు. గద్దెనెక్కిన వారికి ఇవేమీ కనబడడంలేదు. మహానేత ఉండి ఉంటే ఈ పరిస్థితులు ఎదురయ్యేవా? అని అందరూ అనుకుంటున్నారు. రైతన్న ఎలా బతుకుతున్నాడో.. ఏమి చేస్తున్నాడో అన్నదానిపై ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచించడం లేదు.

అన్నింటా లోపాయికారీ అవగాహన:మన ఖర్మ ఏంటంటే కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నేతలు కుమ్మక్కై రాష్ట్రంలో పనిచేస్తున్నారు. అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి కోర్టుల దాకా వెళతాయి. కేసులు వేస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా వారి మధ్య లోపాయికారీ అవగాహన ఉంటుంది. సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవులను కూడా ఈ రెండు పార్టీలు కలిసే పంచుకుంటాయి. కాంగ్రెస్, టీడీపీ రెండూ కలిసి శాసనసభా కమిటీలు వేస్తాయి. అందులో వారే సభ్యులుగా ఉంటారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని లక్ష్యంగా చేసుకుని బురదజల్లే కార్యక్రమం చేపడుతూ రాష్ట్రంలో నీచమైన రాజకీయం చేస్తున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్‌లోని ఐదెకరాల భూమిని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు మనిషి జి.ఎన్.నాయుడుకు కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనం.
Share this article :

0 comments: