వైఎస్‌కు రుణపడి ఉంటాం.మైనార్టీలు ఆయన్ను ఎప్పటికీ మరచిపోరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌కు రుణపడి ఉంటాం.మైనార్టీలు ఆయన్ను ఎప్పటికీ మరచిపోరు

వైఎస్‌కు రుణపడి ఉంటాం.మైనార్టీలు ఆయన్ను ఎప్పటికీ మరచిపోరు

Written By ysrcongress on Thursday, March 1, 2012 | 3/01/2012

శాసనసభలో అక్బరుద్దీన్ భావోద్వేగం 
ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనార్టీలకు స్కాలర్‌షిప్‌లు ఆయన ఘనతే
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానేత 
మైనార్టీలకు కిరణ్ సర్కారు చేసిందేమీ లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మైనార్టీల సమస్యల పట్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించిన తీరు అద్భుతమని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనార్టీలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చిన ఘనత దివంగత నేతకు దక్కుతుందని చెప్పారు. వైఎస్‌ను ‘గ్రేట్ లీడర్’గా కీర్తిస్తూ మైనార్టీలు ఆయన్ను ఎప్పటికీ మరిచిపోరన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన వైఎస్‌ఆర్‌కు సదా రుణపడి ఉంటామని ఉద్వేగంగా చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని అక్బరుద్దీన్ నిప్పులు చెరిగారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై చర్చలో ఆయన పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమం పట్ల సర్కారు అనుసరిస్తోన్న నిర్లక్ష్యపూరిత వైఖరిని బడ్జెట్ కేటాయింపులు తేటతెల్లం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మైనార్టీల కోసం ఆ ప్రభుత్వం చేసినంత కూడా లౌకికవాద పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో చేయలేకపోయారని విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన 15 శాతం నిధులను ఖర్చు చేసినా.. రూ.1500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. వక్ఫ్ భూములను వివిధ ప్రభుత్వాలు నామమాత్రపు లీజులకు ఉదారంగా ఇచ్చేశాయని విమర్శించారు.

ఎమ్మార్‌కు అత్యంత చౌకగా కట్టబెట్టిన భూములు వక్ఫ్ ఆస్తులేనన్నారు. వక్ఫ్ ఆస్తుల ధారాదత్తానికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కర్ణాటకలో రూ.13 కోట్లు కేటాయించగా.. రాష్ట్రంలో కేవలం రూ. 50 లక్షలే ఇచ్చారని, మైనార్టీల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారనే విషయాన్ని ఈ కేటాయింపులే స్పష్టం చేస్తున్నాయన్నారు. పక్కా ఇళ్ల పథకంలో మైనార్టీలకు దక్కింది ఏమీ లేదన్నారు. ఐదు విడతల్లో 6.94 లక్షల ఎకరాల భూములను 5.9 లక్షల మంది పేదలకు పంపిణీ చేశారని, అందులో లబ్దిపొందిన మైనార్టీలు 7,379 (1.48 శాతం) మందేనని సభ దృష్టికి తెచ్చారు. ఉర్దూ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

సర్కారు తీరు వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో ప్రభుత్వాసుపత్రులు అద్వానంగా తయారయ్యాయని, స్పీకర్ తమతో పాటు ఆసుపత్రులను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. అపోలో ఆసుపత్రికి ప్రభుత్వం నామమాత్రపు లీజుకు 28 ఎకరాల భూమిని ఇచ్చిందని, ఆ మేరకు 40% సేవలు పేదలకు అందించాలనే నిబంధన పెట్టారని, కానీ అపోలోలో పేదలకు వైద్యం అందుతోందా? అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.

ఎంఐఎంది 50 ఏళ్ల ప్రయాణం: శాసనసభలో ఎంఐఎం 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిందని ఒవైసీ పేర్కొన్నారు. 1962లో ఐఎంఐ ఏకైక ఎమ్మెల్యేగా సలావుద్దీన్ ఒవైసీ సభలో అడుగు పెట్టారని గుర్తుచేశారు. అప్పట్నుంచీ మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వాల మీద పోరాటాలు చేస్తూనే ఉన్నామని, ఇక మీదట కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎంఐఎం బలం ప్రస్తుతం ఏడుకు చేరిందని, ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎమ్మెల్యేల సంఖ్యను 14కు పెంచుకుంటామన్నారు.
Share this article :

0 comments: