ఈనాడు స్థలం వ్యవహారంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనాడు స్థలం వ్యవహారంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు

ఈనాడు స్థలం వ్యవహారంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు

Written By ysrcongress on Friday, March 16, 2012 | 3/16/2012

విశాఖలోని ఈనాడు స్థలం వ్యవహారంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు
ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ కిరణ్, రామోజీకి సహకరించిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపైనా దర్యాప్తు
ఏప్రిల్ 16న నివేదిక సమర్పించాలని ఏసీబీ డీఎస్పీకి కోర్టు ఆదేశం 
విశాఖ సీతమ్మధారలోని ఆదిత్యవర్మ స్థలాన్ని 1974లో లీజుకు తీసుకున్న రామోజీ
అందులో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణకు ఇచ్చి.. ప్రతిఫలంగా 872 చదరపు మీటర్లు తీసుకున్న రామోజీ
తనది కాని స్థలానికి ప్రతిఫలం పొందిన ఈనాడు అధినేత
ఐఏఎస్ అధికారులు ఎస్.వి.ప్రసాద్, కె.వి.రావులు రామోజీకి సహకరించారని ఆదిత్య వర్మ ఫిర్యాదు
ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి
కుట్ర, ఫోర్జరీ, మోసం, అధికార దుర్వినియోగం వంటి పలు సెక్షన్ల కింద దర్యాప్తు చేయాలని ఏసీబీకి ఆదేశం

విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘ఈనాడు’ అధినేత రామోజీరావు అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం స్పందించింది. తనది కాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి అక్రమంగా మరో స్థలాన్ని పొందిన రామోజీతో పాటు ఆయనకు ఆ స్థలాన్ని కేటాయించిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సమగ్ర విచారణ జరపాలని గురువారం ఏసీబీని ఆదేశించింది. ఏప్రిల్ 16న సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. విశాఖలోని సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయమున్న స్థలాన్ని రామోజీ 1974లో మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి లీజుకు తీసుకున్నారు. అందులో కొంత రోడ్డు విస్తరణలో పోయింది. వర్మకు కనీస సమాచారం ఇవ్వకుండా దానికి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని రామోజీ తన ున కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. దీనిపై వర్మ గురువారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. 9 పేజీల ఫిర్యాదుతో పాటు ఆరు కీలక డాక్యుమెంట్లను సమర్పించారు. 1985-86లో విశాఖ కలెక్టర్లుగా పని చేసిన ఎస్.వి ప్రసాద్, కె.వి.రావు రామోజీతో కుమ్మక్కై అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు పలు ఆధారాలను సమర్పించారు. వాటిని పరిశీలించి, వర్మ తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి జి.వెంకటకృష్ణయ్య.. కేసులో ప్రాథమికంగా కుట్ర, మోసం, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి నేరాలున్నట్టు గుర్తించారు. రామోజీ, ఉషోదయా పబ్లికేషన్స్ డెరైక్టర్ కిరణ్, ఐఏఎస్‌లు ఎస్.వి.ప్రసాద్, కె.వి.రావులపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని విశాఖ ఏసీబీ డీఎస్పీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీసీ సెక్షన్ 120బి (కుట్ర), 420 (మోసం), ఫోర్జరీ కేసు కింద 465 (ఫోర్జరీ), 467 (విలువైన సంపద కోసం ఫోర్జరీ చేయడం), 468 (మోసానికి పాల్పడటం కోసం ఫోర్జరీ చేయడం), 471 సెక్షన్ల కింద, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 5(1డి), అధికాార దుర్వినియోగానికి పాల్పడినందుకు సెక్షన్ 30, లేని అధికారాలను ఉపయోగించినందుకు జనరల్ క్లాజెస్ యాక్ట్ సెక్షన్ 6 కింద దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

వర్మ పేర్కొన్న మేరకు కేసు వివరాలిలా ఉన్నాయి..

హైదరాబాద్ వాసి వర్మ.. విశాఖ సీతమ్మధారలోని తన 2.78 ఎకరాల స్థలం, 40వేల చదరపు అడుగులు విస్తీర్ణమున్న 10 పెద్ద భవనాలను నెలకు రూ.3 వేలు వంతున 33 ఏళ్లకు రామోజీకి 1974లో లీజుకిచ్చారు. రామోజీ అందులో ‘ఈనాడు’ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో 1984-85లో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది. రామోజీ దీనిపై వర్మకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, తానే స్థల యజమానినంటూ.. పోయిన స్థలానికి ప్రతిఫలంగా రేసపువానిపాలెం సర్వే నంబరు 52లోని 872 చదరపు మీటర్లను ఇవ్వాలని కోరుతూ 1985 జనవరి 17న విశాఖ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆ స్థలంపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను కలెక్టర్ ఎస్.వి. ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ‘డియర్ శ్రీ సత్యనారాయణమూర్తి’ అంటూ తహసీల్దార్‌ను వ్యక్తిగతంగా సంబోధిస్తూ 1985 ఫిబ్రవరి 21వ తేదీన కలెక్టర్ తన సొంత లెటర్‌హెడ్‌పై లేఖ రాశారు. ఇందులో కలెక్టర్ నిబంధనలను కూడా పాటించలేదు. రామోజీ పేర్కొన్న స్థలం ప్రైవేటు వ్యక్తులదని, అక్కడ మిగులు భూమి లేదని, ఆ స్థలం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నందున దాన్ని కేటాయించే అధికారం తమకు లేదని తహసీల్దార్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు పలు ఆధారాలతో (ఆర్‌సీ నంబరు 1117/85) 1985 ఏప్రిల్ 6న కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దానికి సంబంధించిన టెన్ వన్ అడంగల్ కాపీ, ఇతర వివరాలు, టౌన్‌ప్లానింగ్ ట్రస్టు డెరైక్టర్ లే అవుట్ మ్యాప్‌లను కూడా జోడించారు. కానీ ఆ నివేదికను ప్రసాద్ తిరస్కరించారు. రామోజీ కోరిన 872 గజాలను అప్పగిస్తూ 1985 ఏప్రిల్ 17న ఉత్తర్వులు (ఆర్‌సీ నంబరు 37/85) జారీ చేశారు. తర్వాత వచ్చిన కలెక్టర్ కె.వి.రావు తన అధికార పరిమితిని దాటి ఆ స్థలానికి చదరపు మీటర్‌కు రూ.300 రేటు నిర్ణయిస్తూ ఉత్తర్వులు (ఆర్‌సీ నెంబరు 5740/86బి2.. తేదీ 25-01-1986) జారీ చేశారు. దాన్ని రూ.200కు తగ్గించాలని కోరుతూ 1986 అక్టోబర్ 28న కలెక్టర్‌కు రామోజీ మరో లేఖ రాశారు! అప్పటి కలెక్టర్ బి.కె.అగర్వాల్ పేరిట జాయింట్ కలెక్టర్ కె.రాజు సంతకంతో (నంబరు 5740/బి6/బి2 03-01-1986) ఉత్తర్వులు జారీ చేశారు. విస్తరణలో పోయిన స్థలం యజమాని ఎవరని అధికారులు విచారణ కూడా జరపలేదు. తానే యజమానినన్న రామోజీ వాదనకే వంతపాడారు.

కథ బయటకొచ్చిందిలా: విశాఖలోని సీతమ్మధారలో ఆదిత్య వర్మ నుంచి రామోజీరావు తీసుకున్న స్థలం లీజు గడువు 2007తో పూర్తయింది. లీజు గడువు పొడిగించడానికి స్థలం యజమాని వర్మ తిరస్కరించడంతో రామోజీరావు 2007లో అదనపు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పిటిషన్‌తోపాటు.. రోడ్డు వెడల్పు సందర్భంగా కోల్పోయిన స్థలానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని పొందినట్లు న్యాయస్థానానికి తెలిపారు. అందుకు సంబంధించి అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్.వి.ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టుకు సమర్పించారు. దీంతో రామోజీ అసలు వ్యవహారం బయటకు వచ్చింది. 

ఈనాడు కార్యాలయం ఉన్న స్థలాన్ని రోడ్డు వెడల్పుకు ఇవ్వడం, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నంచి స్థలాన్ని పొందిన విషయం స్థలం అసలు యజమాని అయిన ఆదిత్యవర్మకు తెలిసింది. దీంతో ఆదిత్యవర్మ రామోజీ పొందిన స్థలం పత్రాల నకళ్ల కోసం జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేశారు. రామోజీరావు కోర్టుకు సమర్పించిన పత్రాలకు, కలెక్టర్ కార్యాలయం ఇచ్చిన నకళ్లకు మధ్య వ్యత్యాసం ఉండటాన్ని ఆదిత్యవర్మ గమనించారు. భూమి కొలతలపై రామోజీరావు భిన్నంగా పేర్కొనడంతో ఆదిత్మవర్మ నగరంలోని నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో రామోజీపై క్రిమినల్ కేసు వేశారు. ఈ కేసు ప్రాథమిక ఆధారాలపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి పోలీసు విచారణకు ఆదేశించారు. విశాఖపోలీసులు విచారణ జరిపి రామోజీరావు, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎండీ కిరణ్‌కుమార్‌లపై మోసం, అధికారదుర్వినియోగం వంటి సెక్షన్లపై నేరాభియోగపత్రాన్ని సమర్పించారు. అప్పటి కలెక్టర్, తహసీల్దార్‌లు ఇచ్చిన అసలు పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఆ పత్రాలతో రామోజీరావు లీజు పొడిగించాలని వేసిన కేసులో పత్రాలకు మధ్య తేడా ఉన్నట్టు ఆదిత్యవర్మ గుర్తించారు. దీంతో రామోజీ, ఆయనకు సహకరించిన ఐఏఎస్‌లపై ఆదిత్య వర్మ ఏసీబీ ప్రత్యేక కోర్టులో గురువారం పిటిషన్ వేశారు.
Share this article :

0 comments: