కాగ్ నివేదిక ఓ రాజకీయ డ్రామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాగ్ నివేదిక ఓ రాజకీయ డ్రామా

కాగ్ నివేదిక ఓ రాజకీయ డ్రామా

Written By news on Friday, March 30, 2012 | 3/30/2012

హైదరాబాద్:2006-2011 మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన భూకేటాయింపులను తప్పు పడుతూ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) నివేదిక సమర్పించడం ఒక రాజకీయ డ్రామా అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఆస్తుల వ్యవహారంలో రేపో మాపో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న తరుణంలో శాసనసభా సమావేశాల్లో అసందర్భంగా కాగ్ విడుదల చేసిన ఈ నివేదిక సీబీఐ చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇచ్చేదిగా ఉందని ఆమె విమర్శించారు. కేవలం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డినీ, ఆయన కుమారుడు జగన్‌నూ లక్ష్యంగా చేసుకుని వారిద్దరినీ అప్రదిష్టపాలు చే యడానికే కాగ్ ఈ నివేదిక ఇచ్చిందని, దీని వెనుక దురుద్దేశ్యాలు ఉన్నాయనీ పద్మ అనుమానం వ్యక్తం చేశారు.

‘దేశంలో 1992 నుంచీ సరళీకృత, ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో అనేక విదేశీ, స్వదేశీ సంస్థలకు పరిశ్రమల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూములను కేటాయించాయి. పరిశ్రమల కోసం కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పోటీ పడుతున్న తరుణంలో ఉచితంగానో, నామమాత్రపు ధరకో లేక మార్కెట్ ధర కన్నా తక్కువకో అన్ని రాష్ట్రాల్లోనూ భూకేటాయింపులు జరిగాయి.పరిశ్రమలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని విధానాలు అనుసరించాయి. ఒక వేళ ఆ విధానాలు తప్పు అని అనుకుంటే కాగ్ అన్ని రాష్ట్రాల్లో జరిగిన భూకేటాయింపులను పరిశీలించి నివేదిక ఇచ్చిందా...? కాగ్ మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగిందో ఎందుకు మాట్లాడలేదు? పోనీ కనీసం రాష్ట్రంలో 1992 నుంచీ జరిగిన భూకేటాయింపులు ఎలా జరిగాయో కాగ్ పరిశీలించిందా...? వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ముందున్న ప్రభుత్వాలు చేసిన భూకేటాయింపులకు అనుసరించిన విధానాలేమిటో చూశారా? అప్పటి విధానాలకూ 2006-11 మధ్య చోటు చేసుకున్న కేటాయింపులకు తేడా ఏమైనా ఉందేమో చూశారా...? అప్పటి విధానాలకు భిన్నంగా కేటాయింపులేమైనా జరిగాయా?’ అని పద్మ కాగ్‌ను సూటిగా ప్రశ్నించారు. అవేమీ లేకుండా కేవలం 2006-11 మధ్య కాలంలో జరిగిన కేటాయింపులనే పరిశీలించి వేలాది కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా నివేదిక ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ఆమె అన్నారు. 

అసలు కాగ్ ఎన్నడూ భూకేటాయింపుల జోలికి వెళ్లలేదు, తన నివేదికల్లో పేర్కొనలేదు, అలాంటిది ఒక్క ఈ సమయంలోనే ఎందుకు పరిశీలించినట్లు, పైగా ప్రతి ఏటా వార్షిక నివేదికలు సమర్పించాల్సిన కాగ్ ఒకే సారి ఐదేళ్ల భూమి కేటాయింపులను పరిశీలించి అందులో తప్పులు ఉన్నాయని ఒకేసారి ప్రకటించడం వెనుక ఉద్దేశ్యాలు ఏమిటని ఆమె నిలదీశారు. కాగ్ నివేదికను ఆసరాగా చేసుకుని తొలి నుంచీ వై.ఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికలు, కేవలం 2006-11 మధ్య కాలంలోనే వై.ఎస్.రాజశేఖరరెడ్డి భూములను కోసుకు తిన్నట్లు, జగన్ ధారాదత్తం చేసినట్లు పనిగట్టుకుని పతాక శీర్షికలతో వార్తా కథనాలు ప్రచురించాయని ఆమె దుయ్యబట్టారు. 

ఓ వైపు వై.ఎస్ హయాంలో జారీ అయిన 26 జీవోలు సక్రమమా? అక్రమమా? అని నిర్థారించుకునేందుకు సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు నోటీసులు ఇచ్చిన తరుణంలో కాగ్ ఇచ్చిన ఈ నివేదికకు ఉన్న హేతుబద్ధత ఏమిట ని ఆమె అన్నారు. కాగ్ తాను ఎంచుకున్న కాలంలో జరిగిన కేటాయింపులు మాత్రమే తప్పు అని చెప్పదల్చుకున్నపుడు మిగతా కాలంలో జరిగిన కేటాయింపుల తప్పొప్పులు ఎందుకు పరిశీలించలేదు, అసలు తప్పు అని చెప్పడానికి ఉన్న ప్రాతిపదిక ఏమిటని ఆమె అన్నారు. కాగ్ చేసిన ఈ ప్రయత్నం సీబీఐకి ఊతం ఇవ్వడానికేననేది వెల్లడవుతోందని అన్నారు. శంకర్రావు, టీడీపీ నాయకులు జగన్‌పై వేసిన కేసులో పేర్కొన్న 26 జీవోల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదనీ అయితే ఇపుడు మాత్రం మౌనంగా ఉండటానికి వీల్లేదని ఆమె అన్నారు. 

కాగ్ నివేదికలో ఎత్తి చూపిన అంశాలకు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల్లో ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలకు భూములు కేటాయిస్తే అది దేశ ప్రయోజనాల కోసం చేసినట్లు, రాష్ట్రంలో చేస్తే స్వార్థ ప్రయోజనాల కోసమే అన్నట్లుగా కాగ్ వ్యవహరించడం చూస్తే ‘కొలవెర్రి’ లాగా ‘కాగ్‌వెర్రి’ ఉన్నట్లుగా అనిపిస్తోందని పద్మ వ్యాఖ్యానించారు. కాగ్ నివేదికను ఆసరాగా చేసుకుని వాటిని జగన్‌కు అంటగట్టాలని చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. కాగ్ ఇచ్చిన నివేదిక జగన్ వ్యతిరేక శక్తుల చేతిలో ఒక సాధనంగా, సీబీఐకి మద్దతు నిచ్చేదిగా మాత్రమే ఉంది తప్ప రాజకీయంగా వచ్చే ఇబ్బందులేమీ ఉండవని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

కాగ్ చెప్పింది వేదమా!?

కాగ్ చెప్పిందే వేదం అన్నట్లుగా మాట్లాడుతూ వై.ఎస్‌నూ జగన్‌నూ విమర్శిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాడు తాను అధికారంలో ఉండగా ఇదే కాగ్ నివేదికలపై ఏమాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని పద్మ సూటిగా ప్రశ్నించారు. బాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాగ్ చేసిన విమర్శలపై ‘వాటిని విశ్వసించొద్దు, అసలు పట్టించుకోవాల్సిన పనేలేదు’ అని మాట్లాడారని ఆమె గుర్తు చేశారు. ఈ-సేవపై నివేదిక ఇస్తే అసలు కాగ్‌లో కంప్యూటర్ గురించి తెలిసిన వారే లేరని బాబు ఎగతాళిగా మాట్లాడారని ఆమె అన్నారు. అలాంటి వ్యక్తి కాగ్ నివేదికను ఆసరాగా చేసుకుని విమర్శలు ఎలా చేస్తున్నారని ఆమె అన్నారు. అధికారంలో ఉంటే ఓ మాట, లేకుంటే మరో మాట మాట్లాడుతూ బాబు తన ద్వంద్వ ప్రమాణాలను బయట పెట్టుకున్నారని పద్మ విమర్శించారు.
Share this article :

0 comments: