కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు

Written By ysrcongress on Saturday, March 10, 2012 | 3/10/2012

* కాంగ్రెస్ నాయకులు, చంద్రబాబు కలిసి కోర్టుల్లో కేసులు వేశారు
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యారు.. ఆర్‌టీఐ పదవులు పంచుకున్నారు
* వీరికి రాజకీయాలు తప్పపజా సమస్యలు పట్టడం లేదు

కోవూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పెద్దలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోపాయకారీ ఒప్పందాలతో ఒక్కటై ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రత్యేక పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పేద ప్రజల గురించి, వారి సమస్యల గురించి ఆలోచించాల్సిన అధికార, ప్రతిపక్షాలు వారిని పట్టించుకోకుండా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారం ఐదోరోజు శుక్రవారం ఆయన విడవలూరు, కోవూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. రోడ్‌షోలో పలుచోట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ఎండగట్టారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

కలిసి కేసులు వేశారు.. పదవుల్ని పంచుకున్నారు
కాంగ్రెస్ నాయకులు, చంద్రబాబు పరిస్థితి ఎలా తయారైందంటే.. వీళ్లిద్దరూ కలిసి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.. చనిపోయిన వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేసేం దుకు ప్రయత్నిస్తున్నారు. అసలు రాజకీయ వ్యవస్థ ఎంతగా చెడిపోయిందంటే చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట.. బతికి ఉన్న చంద్రబాబుకు మరో న్యాయమట! వీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవుతారు.. ఆర్టీఐ కమిషనర్ పదవులను పంచుకుంటారు.. ఇంకా ఎంత దూరం వెళతారంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన జీఎన్ నాయుడు అనే వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున ఐదెకరాల భూమిని కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కేటాయిస్తారు. వీరిద్దరూ కలిసి చేస్తున్న కుతంత్రాలు చూస్తుంటే బాధేస్తోంది. రాష్ట్రంలో వారి రెండు పార్టీలూ తప్ప మూడో పార్టీయే ఉండకూడదనే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.

ప్రజల అనురాగాన్ని కొనాలని చూస్తారు
ఉప ఎన్నికలంటే మంత్రులంతా మోహరిస్తారు. డబ్బు మూటలు తీసుకొచ్చి ఆత్మీయానురాగాలను వేలం పాటలో కొనుగోలు చేసేం దుకు ప్రయత్నిస్తారు. అధికారపక్షాన్ని ఎదుర్కోవాల్సిన భయం ఉంటుంది. అధికార పక్షం చెప్పుచేతల్లో పోలీసులు ఉంటారు. అంతేకాదు అరెస్టు చేస్తారనే భయం ఉంటుంది. కుమ్మక్కయిన అధికార, ప్రతిపక్షాలు రెండింటితోనూ పోరాడాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ భయాలన్నింటినీ పక్కన బెట్టి సాహసోపేతంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ పదవికీ, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికీ రాజీనామాలు చేశారు. ఈ ఉప ఎన్నికలో పోటీ జరుగుతున్నది విలువలు, విశ్వసనీయతకూ, కుళ్లు, కుతంత్రాల రాజకీయాలకూ మధ్యే.

వైఎస్ ఉంటే బాగుండని..
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మళ్లీ గౌరవం ఇనుమడింపజేయాల్సిన అవసరం ఉంది. ఫలానా వ్యక్తి తమ నాయకుడని ప్రజలు గర్వంగా చెప్పుకునే స్థాయికి రాజకీయాలు చేరుకోవాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలను వెనక్కి తీసుకు రావడానికీ, నిజాయతీని నింపడానికీ, రైతన్నకు, పేద ప్రజలకు అండగా నిలవడానికీ పదవులు వదులుకున్న ఈ ఇద్దరికీ ప్రజలు చల్లని ఆశీస్సులు, చల్లని దీవెనలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లి పోయాక రాష్ట్రంలో పేదల గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనీ, చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో పదిలంగా ఉండి పోవాలనీ తపనపడే నాయకుడొక్కరంటే ఒక్కరు కనిపించని పరిస్థితి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆ దివంగత నేత బతికి ఉంటే ఎంత బాగుండును అనుకోని రోజు లేదు.

కార్యకర్తల్లో ఉత్సాహం..
కోవూరులో జగన్ ఐదు రోజుల పర్యటన విజయవంతం

ఉప ఎన్నికలు జరుగుతున్న కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తరఫున పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఐదు రోజుల పాటు చేసిన ప్రచారం కార్యకర్తల్లో ఊపు, ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 5న ప్రారంభమైన జగన్ తొలి విడత పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఎక్కువ భాగం గ్రామీణ నియోజకవర్గమైన కోవూరులోని పల్లెల్లో జగన్ విసృ్తతంగా పర్యటించారు. రోడ్‌షోలు, అవసరమైన చోట్ల బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తొలుత 5 నుంచి 7వ తేదీ వరకే ప్రచారం చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రజలు అడుగడుగునా అభిమానంతో అడ్డుతగులుతూ తమ ఊర్లకు రావాల్సిందేనని పట్టుబట్టడంతో తీవ్రజాప్యమై షెడ్యూల్లో కొన్ని గ్రామాలకు ఆయన వెళ్లలేకపోయారు.

మిగిలిపోయిన గ్రామాల్లో పర్యటించేందుకు పర్యటనను మరో రెండు రోజుల పాటు అదనంగా పొడిగించారు. జగన్ తొలిరోజు కొడవలూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. అడుగడుగున అభిమానం అడ్డుతగలడంతో చివరలో నాలుగు గ్రామాలు మిగిలిపోయాయి. రెండో రోజు ఇందుకూరు పేట మండలంలో కూడా మరో నాలుగు గ్రామాలకు వెళ్లలేక పోయారు. మూడోరోజు విడవలూరు మండలం పర్యటనలో కూడా కొన్ని గ్రామాలు మిగిలాయి. ఈ మిగిలిపోయిన గ్రామాలన్నింటినీ 8, 9 తేదీల్లో సందర్శించి ప్రచారం నిర్వహించారు.

జగన్ కూడా తన పర్యటనలో చాలా ఓపిగ్గా ఎక్కడ జనం తన కోసం వేచి ఉన్నా ప్రచార రథాన్ని ఆపి కిందకు దిగి వారిని పలకరించారు. జగన్ ఇంకా బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. కాగా శుక్రవారం జరిగిన జగన్ రోడ్‌షోలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నాయకులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, డాక్టర్ బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: