కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంపైనే పందేలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంపైనే పందేలు

కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంపైనే పందేలు

Written By ysrcongress on Saturday, March 17, 2012 | 3/17/2012

ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై పందేలు కాయడం సహజం. అయితే, నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికపై మాత్రం ఇందుకు భిన్నంగా పందేలు కాస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారన్న విషయంపై అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. దీంతో ఆ విషయాన్ని పక్కనబెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలుస్తాడన్న అంశంపైనే రాష్ట్రావ్యాప్తంగా పందేలు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా.. హైదరాబాద్, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, కరీంనగర్ జిల్లాలు, విజయవాడ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో బెట్టింగుల జోరు మరింత పెరిగింది. పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తున్న అభ్యర్థికి 25 వేల మెజారిటీ వస్తుందని నిన్నటివరకు పందేలు నడవగా, చివరి రోజుల్లో జరిగిన ఉధృత ప్రచారంతో అంచనాలు, రేటు కూడా భారీగా పెరిగాయి. 40 వేల మెజారిటీ వస్తుందన్న సవాల్‌తో లక్షకు మూడు లక్షల రూపాయలిచ్చే స్థాయికి చేరింది. ఈ స్థానాన్ని భారీ ఆధిక్యంతో దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తొలివిడతలో ఐదు రోజులపాటు పర్యటించిన ఆయన బుధ, గురు, శుక్రవారాల్లో మలివిడత ప్రచారం నిర్వహించారు. 2009లో గెలిచిన ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న కోరికతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు విడతల ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చిరంజీవి ప్రచారం చేశారు. అయితే.., పార్టీలతో సంబంధం లేకుండా.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, మద్దతుదారులు కూడా వారి అభ్యర్థులు గెలుస్తారని కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాబోయే మెజారిటీ మీదే పందేలు కాస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ 15వేలు దాటదనే సంఖ్య నుంచి పందేలు మొదలయ్యాయి. మెజారిటీపై కోట్లల్లో కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.20 కోట్ల వరకూ పందేలు కాసినట్టు విశ్వసనీయ సమాచారం. మెజారిటీ 25 వేలకు మించదనే సవాల్‌తో ఓ ప్రముఖుడు రూ.25 కోట్లకు పందెం కాసినట్లు రాజకీయవర్గాల సమాచారం. టీడీపీకి చెందిన ఒక శాసన సభ్యుడు (నెల్లూరు జిల్లా కాదు) వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి 25 వేల మెజారిటీతో గెలుస్తాడని రూ.3 లక్షలకు పందెం కాశారు. 

ఆయనతోపాటు పందెం కాసిన వ్యక్తి కూడా ముందుగానే డబ్బును మధ్యవర్తి వద్ద పెట్టారు. పార్టీ అధినేతల ప్రచారం ముగుస్తున్న దశలో ఆయా పార్టీల మద్దతుదారులు, పందెంరాయుళ్ల అంచనాలు మారిపోయాయి. బుధవారం నుంచి కొందరు నాయకులు మెజారిటీ 40 వేలు దాటుతుందంటూ పందెం కాశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రముఖ కాంట్రాక్టర్ ఈ సంఖ్య మీద రూ.2 కోట్లకు పందెం కాశారు. టీడీపీ మద్దతుదారుడైన మరో కాంట్రాక్టర్ వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 40 వేలు మెజారిటీ వస్తే లక్షకు 3 లక్షలు ఇస్తానని బెట్ కట్టారు. ఇద్దరికీ కావాల్సిన ఒక పెద్దమనిషి వద్దకు బుధవారం ఈ మొత్తం చేరింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి 45 వేలకు లోపే మెజారిటీతో గెలుస్తాడని, ఈ సంఖ్య దాటుతుందని ఎవరైనా పందేనికి సిద్ధమైతే లక్షకు 4 లక్షలకు సిద్ధమంటూ మరికొందరు ముందుకొచ్చారు. ఓ రాజకీయ నాయకుడైతే 45 వేలకు ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందనే సవాల్‌తో గురువారం కోటి రూపాయలు అప్పగించడానికి సిద్ధమయ్యారు. ఆదివారం పోలింగ్ జరుగుతుండటంతో అప్పటికి మెజారిటీ అంకె మీద మరిన్ని కోట్లకు పందేలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ తర్వాత కూడా పందేలకు అనేకమంది సొమ్ములు సిద్ధం చేసుకున్నారు.

తెలంగాణలోనూ అదే తీరు..

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆరు అసెంబ్లీ స్థానాల ఫలితాలపైన కూడా పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల జయాపజయాలపై బెట్టింగ్‌లు ఎక్కువగా సాగుతున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూలు స్థానంలో నాగం జనార్ధన్‌రెడ్డి మెజారిటీపైన కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. మిగతా స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు, మెజారిటీలపై పందేలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం.
Share this article :

0 comments: