బాబు హయాంలో వేల ఎకరాల లీజులు.. వందల కోట్ల రాయితీలు, పెన్నా నుంచి ఇండియా దాకా అందరికీ ఆయనే అన్న - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు హయాంలో వేల ఎకరాల లీజులు.. వందల కోట్ల రాయితీలు, పెన్నా నుంచి ఇండియా దాకా అందరికీ ఆయనే అన్న

బాబు హయాంలో వేల ఎకరాల లీజులు.. వందల కోట్ల రాయితీలు, పెన్నా నుంచి ఇండియా దాకా అందరికీ ఆయనే అన్న

Written By ysrcongress on Friday, March 30, 2012 | 3/30/2012

* మైనింగ్ లీజుల బదలాయింపులకూ ఓకే
* పెన్నా నుంచి ఇండియా దాకా అందరికీ ఆయనే అన్న
* రూ. 40 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీలకూ రూ. 600 కోట్ల పన్ను రాయితీ
* ఎల్ అండ్ టీ, బిర్లా గ్రూపులపై ప్రత్యేక ప్రేమ 
* పెన్నాకు వైఎస్ హయాంలో లీజు.. అందుకే ‘సాక్షి’లో పెట్టుబడులంటూ ఎల్లో రాతలు
* బాబు హయాంలో పెన్నాకు కేటాయించిన మొత్తం భూములు 1,428 ఎకరాలు
* 169 కోట్ల సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్ కూడా.. ఇవేమీ పట్టని ఎల్లో మీడియా, సీబీఐ
* ఇండియా సిమెంట్స్‌కూ భారీ లబ్ధి
* ఎల్ అండ్ టీ, బిర్లా గ్రూపులకైతే అడ్డగోలు అనుమతులతో ప్రయోజనాలు
* నిబంధనల్ని తోసిరాజని మరీ ట్యాక్స్డిఫర్‌మెంట్‌ను వర్తింపజేసిన బాబు 
* ఈ లెక్కన ఇవన్నీ బాబుకు ఎన్ని వేల కోట్లు ముడుపులిచ్చాయో!
* ‘టార్గెట్ వైఎస్సార్’ ఎజెండా తప్ప ఇవేవీ పట్టించుకోని సీబీఐ, ఎల్లో మీడియా

సున్నపు రాయి గనుల్ని లీజుకిచ్చినందుకే పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ సంస్థలు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టాయట...? ఆ కంపెనీలు నడవటానికి నీళ్లు కేటాయించినందుకు అవి కోట్ల రూపాయలు గుమ్మరించాయట...? ఇదీ... సీబీఐ తవ్వుతున్న గుట్టు. దానికి తగుదునమ్మా అంటూ ‘ఈనాడు’, దాని తోకపత్రిక వత్తాసు!!. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు ప్రతిష్టల్ని దిగజార్చాలనే ఏకైక ధ్యేయంతో... ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ... బరితెగింపు రాతలు!!!. 

ఒక లీజు మంజూరు చేసినందుకో... కంపెనీకి నీళ్లిచ్చినందుకో ప్రతిఫలంగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశమే ఉంటే... సీబీఐ వాదనే నిజమైతే... నారా చంద్రబాబు చేతికి ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి ఉండాలి? ఎందుకంటే ఇదే పెన్నా సిమెంట్స్‌కు... ఇదే ఇండియా సిమెంట్స్‌కు ముఖ్యమంత్రి హోదాలో బాబు ఇచ్చినన్ని లీజులు, కల్పించిన పన్ను రాయితీలు బహుశా! ఏ రాష్ట్ర ప్రభుత్వమూ... ఏ కంపెనీకీ ఇవ్వలేదేమో!! వేల ఎకరాల లీజులతో పాటు వందల కోట్ల రూపాయల పన్ను రాయితీల్ని, ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీల్ని, వాటికి తోడుగా నీటి కేటాయింపుల్ని జరిపిన చంద్రబాబుపై సీబీఐ ఎందుకు దృష్టిపెట్టలేదు? నాడు బాబు జారీ చేసిన జీవోలు రామోజీ విషపుత్రిక ‘ఈనాడు’ పత్రికకు, దాని తోకకు ఎందుకు అక్రమాలుగా కనిపించలేదు? బాబు ప్రభుత్వం బరితెగించి జారీ చేసిన ఆ జీవోలు, నాటి పన్ను పందేరాల వివరాలు కావాలంటే మీరే చూడండి...

ఇక్కడ గమనించాల్సిందల్లా ఒక్కటే. చంద్రబాబు హయాంలో లీజు అనుమతులిస్తూ జారీ చేసిన ప్రతి జీవోలోనూ... వేల ఎకరాల గనుల్ని కట్టబెట్టడంతో పాటు నీరు, విద్యుత్ వసతుల్ని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కల్పిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. పెపైచ్చు వీటికి వందల కోట్ల రూపాయల మేర సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్లు కూడా కల్పించారు. మరి 800 ఎకరాల మైనింగ్ లీజు తీసుకున్నందుకే పెన్నా సంస్థ రూ.68 కోట్లు ‘సాక్షి’లో పెట్టుబడి పెట్టిందంటున్న సీబీఐ, దాని మీడియా మిత్రులు వీటినెందుకు పట్టించుకోవటం లేదు? 

తన సిమెంట్ కర్మాగారానికి నీరిచ్చినందుకే ఇండియా సిమెంట్స్ సంస్థ ‘సాక్షి’లో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందంటున్న వారంతా... చంద్రబాబు దానికి చేకూర్చిన ప్రయోజనాల్ని ఎందుకు విస్మరిస్తున్నారు? వారి సిద్ధాంతం ప్రకారం చూసినా... వేల కోట్ల రూపాయల మేర అప్పనంగా లబ్ధి చేకూర్చిన చంద్రబాబుకు ఎన్ని వేల కోట్లు చేరి ఉండాలి? మరి ఆ డబ్బంతా ఎక్కడికెళ్లింది? బాబు దాన్ని ఏ రూట్లో ఎక్కడికి మళ్లించారు? దాని మూలాలెక్కడున్నాయి? ఇవి కదా దర్యాప్తు సంస్థలు ఆరా తీయాల్సింది!! మరి వీటన్నిటినీ వదిలేసి... ఒకే ఒక టార్గెట్ పెట్టుకుని ఇంతలా దిగజారిపోవటం రాష్ట్ర ప్రజలకు తెలియదనుకుంటున్నారా? సీబీఐ తన దృష్టిని సవరించుకునేదెప్పుడు? బాధ్యతగా వ్యవహరించేదెన్నడు? అవన్నీ గాలికి వదిలేస్తే న్యాయానికి ఇక దిక్కెవ్వరు?

పెన్నాకు అన్న... బాబే
దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సిమెంటు ఫ్యాక్టరీ నిమిత్తం పెన్నా సిమెంట్స్‌కు కర్నూలు జిల్లాలో 231.91 ఎకరాల్లోను, 753 ఎకరాల్లోను ఉన్న సున్నపు రాయి గనుల్ని లీజుకిచ్చారని, అందుకు ప్రతిఫలంగానే ఆ సంస్థ జగన్ సంస్థల్లో రూ.68 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నది సీబీఐ చేస్తున్న ప్రధాన ఆరోపణ. తాండూరులో వాల్‌చంద్ తాండూర్ సిమెంట్ పేరిట ఉన్న మైనింగ్ లీజును పెన్నా తాండూర్ సిమెంట్‌కు బదలాయించారని కూడా సీబీఐ చెబుతోంది. దీనికోసమే పెన్నా పెట్టుబడులు పెట్టినట్టుగా సీబీఐ ఇచ్చిన లీకులు, వాటిని అందుకుని రెచ్చిపోయి ‘ఈనాడు’, దాని తోకపత్రిక రాసిన కథనాలు అన్నీ ఇన్నీ కావు. మరి బాబు ఏం చేశారో చూద్దాం...

‘‘పెన్నా సంస్థకు ఈ మూడు లీజుల రూపంలోనే బాబు ప్రభుత్వం 1,987 ఎకరాల సున్నపురాయి గనుల్ని కట్టబెట్టడంతో పాటు రూ.245 కోట్ల మేర సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌ను అందజేసింది’’

జీవో ఎంఎస్ నంబరు 580. ఇచ్చిన తేదీ 4.11.2000
నల్లగొండ జిల్లా గణేశ్ పహాడ్ గ్రామంలోని 1278.83 ఎకరాల్లో విస్తరించిన సున్నపురాయి గనుల ప్రాస్పెక్టివ్ లెసైన్సును పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌కు ఇస్తూ పై జీవోను బాబు ప్రభుత్వం జారీ చేసింది. తర్వాత మైనింగ్ లీజూ మంజూరయింది. లెసైన్సు ఫీజుగా హెక్టారుకు ఏడాదికి రూ.5 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించటంతో పాటు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నీరు, కరెంటు అందిస్తామని హామీ కూడా ఇచ్చారు.

జీవో ఎంఎస్ నంబరు 36. ఇచ్చిన తేదీ 16.1.2001
ఇది కూడా నల్లగొండ జిల్లాలోనే. నేరేడుచర్ల మండలం శూన్యపహాడ్‌లో 150 ఎకరాల సున్నపురాయి గనుల ప్రాస్పెక్టివ్ లెసైన్సును పెన్నా సిమెంట్స్‌కు కేటాయిస్తూ పై జీవోను జారీ చేశారు. తర్వాత మైనింగ్ లీజూ మంజూరయింది. అంతేకాదు.. నల్గొండ జిల్లా గణేశ్‌పహాడ్, శూన్యపహాడ్ గ్రామాల్లో తనకు కేటాయించిన మొత్తం 1428.83 ఎకరాల మైనింగ్ లీజుల్నీ తన అనుబంధ సంస్థ చాణక్య సిమెంట్స్‌కు బదలాయించాలంటూ పెన్నా సిమెంట్స్ దరఖాస్తు చేసుకుంది. బాబు ప్రభుత్వం దీనికి అనుమతిస్తూ 4.7.2001న జీవో ఎంఎస్ నంబరు 382ను జారీ చేసింది.

చాణక్యకు పన్ను డిఫర్‌మెంట్ కూడా...
పెన్నాకు కేటాయించిన లీజుల్ని చాణక్య సిమెంట్స్‌కు కేటాయించటంతో బాబు ప్రభుత్వం ఊరుకోలేదు. అప్పట్లో తనకు కావలసిన కంపెనీలకు అడ్డగోలుగా పన్ను రాయితీల్ని దోచిపెట్టడానికి బాబు సృష్టించిన టార్గెట్-2000 స్కీమ్ పరిధిలోకి ఈ సంస్థను కూడా తీసుకువచ్చారు. దీనికి రూ.169 కోట్ల మేర సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్ ఇచ్చారు. అంటే ఈ కంపెనీ పద్నాలుగేళ్ల పాటు తాను విక్రయించే సిమెంటుపై సేల్స్ ట్యాక్స్‌ను ప్రభుత్వానికి చెల్లించకుండా తనవద్దే ఉంచుకోవచ్చు. అది కూడా గరిష్టంగా రూ.169 కోట్ల దాకా! డిఫర్‌మెంట్ గడువు ముగిశాక.. అంటే 15వ ఏట తొలి ఏడాది మినహాయించుకున్న మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు తొలి ఏడాది గనక సంస్థ రూ.20 కోట్ల అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటే.. దాన్ని తన వద్దే అట్టిపెట్టుకుని.. 15వ ఏట ఈ 20 కోట్లనూ పైసా వడ్డీ లేకుండా చెల్లిస్తుంది. 

నిజానికి ఈ 20 కోట్లనూ వ్యాపారంలో పెట్టకపోయినా.. 15 ఏళ్ల పాటు బ్యాంకులోనే డిపాజిట్ చేసినా అప్పట్లో ఐదేళ్లకు రెట్టింపయ్యే పథకాలుండేవి గనుక కనీసం రూ.160 కోట్లు అయి ఉండేది. మరి ఈ లెక్కన మొత్తం రూ.169 కోట్ల డిఫర్‌మెంట్‌పై ఈ సంస్థకు ఏ మేరకు లాభం చేకూరి ఉంటుందన్నది సీబీఐ, దాని మీడియా మిత్రులు ‘ఈనాడు’, దాని తోకపత్రికే అంచనా కట్టాలి. అందుకోసం ఈ సంస్థ బాబుకు ఎన్ని ముడపులు చెల్లించింది? ఏఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది? ఇవన్నీ బాబే చెప్పాలి. బాబు ప్రభుత్వం తనకు కావాల్సిన వారికి వేల కోట్ల రూపాయల్ని దోచిపెట్టడానికే ఈ టార్గెట్-2000 పథకాన్ని ప్రవేశపెట్టిందని అప్పట్లో తీవ్ర విమర్శలు రేగాయి కూడా.

జీవో ఎంఎస్ నంబరు 256... ఇచ్చిన తేదీ 5.5.2000
నల్లగొండ జిల్లాలో రెండు చోట్ల పెన్నాకు లీజుల్ని మంజూరు చేసిన బాబు ప్రభుత్వం.. ఆ రెండింటికన్నా ముందు అనంతపురం జిల్లాలోనూ అనుమతి ఇచ్చేసింది. తాడిపత్రి తాలూకా తలారి చెరువు గ్రామంలోని 558.26 ఎకరాల సున్నపురాయి గనుల్ని లీజు నిమిత్తం పెన్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు కేటాయిస్తూ పై జీవో జారీ చేసింది. అంతేకాదు. ఇదే ప్లాంటుకు రూ.75,74,08,240 మేర సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌ను మంజూరు చేసింది.

‘ఇండియా’... బాబు దయ!
వైఎస్సార్ ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌కు కేవలం నీళ్లిచ్చినందుకే ఆ సంస్థ జగన్మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందంటూ సీబీఐ, ఎల్లో మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే ... చివరికి 1982లో ఇచ్చిన జీవోను కూడా వైఎస్ ప్రభుత్వానికి అంటగట్టే స్థాయికి. మరి చంద్రబాబు ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌కు ఏం చేసింది? బహుశా! ఏ రాష్ట్ర ప్రభుత్వమూ దీనికింతటి మేలు చేసి ఉండదేమో!! లీజులివ్వటమే కాదు. లీజు బదిలీ చెయ్యటానికీ ఓకే అన్నారు. రూ.296 కోట్ల సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌కూ జెండా ఊపారు బాబు. 

జీవో ఎంఎస్ నెంబరు 543, ఇచ్చిన తేదీ 14.10.2000
1999లో ఇండియా సిమెంట్స్ సంస్థ రంగారెడ్డి జిల్లా తాండూరులో ‘విశాఖ సిమెంట్ ఇండస్ట్రీ’ పేరిట సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అదే పేరిట మైనింగ్ లీజులకూ దరఖాస్తు చేసుకుంది. బాబు దీనికి తాండూరు మండలం సంగం కలాన్‌లో ఉన్న 325.12 ఎకరాల సున్నపురాయి గనుల్ని 30 ఏళ్ల పాటు లీజుకిచ్చేశారు. తొలి ఏడాది ఉచితంగాను... రెండు నుంచి ఐదో ఏడాది దాకా హెక్టారుకు రూ.70, 6 నుంచి నుంచి పదో ఏడాది దాకా హెక్టారుకు రూ.140... 11వ ఏడాది నుంచి హెక్టారుకు ఏటా రూ.200 చొప్పున లీజు చార్జీల్ని నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని జీవోలో పేర్కొన్నారు.

రూ.253 కోట్ల ట్యాక్స్ డిఫర్‌మెంట్
పన్ను రాయితీ విషయానికొస్తే, టార్గెట్-2000 పథకం కింద దీనికి భారీ ఎత్తున సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్ కల్పించారు. ఏకంగా రూ.253,14,43,970 మేర సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌కు అనుమతించటం విశేషం. మొత్తమ్మీద టార్గెట్-2000 పథకంలో లబ్ధి పొందిన కంపెనీల్లో విశాఖ టాప్-6 స్థానంలో ఉండటం గమనార్హం. ఈ రూ.253 కోట్ల ట్యాక్స్ డిఫర్‌మెంట్ కారణంగా ఇండియా సిమెంట్స్ సంస్థకు వడ్డీ రూపంలో చూసుకున్నా రూ.వెయ్యి కోట్లకు పైగానే లబ్ధి కలిగి ఉండవచ్చన్నది పన్ను నిపుణుల అంచనా.

జీవో ఎంఎస్ నంబరు 243, ఇచ్చిన తేదీ 26.9.2000
ఇండియా సిమెంట్స్‌కు గనుల్ని లీజుకివ్వటమే కాదు. వేరొక సంస్థకు లీజుకిచ్చిన గనుల్ని దీనికి బదలాయించడానికి కూడా బాబు ప్రభుత్వం ఎంతమాత్రం వెనకాడలేదు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వి గ్రామంలో 828 ఎకరాలను 1994లో 20 ఏళ్ల పాటు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి లీజుకిచ్చారు. అయితేతమ కంపెనీ నష్టాలతో బీఎఫ్‌ఐఆ ర్ పరిధిలోకి వెళ్లిందని, అందుకని తమ లెసైన్సును ఇండియా సిమెంట్స్‌కు బదలాయించాలని సీసీఐ చేసిన వినతిని బాబు ప్రభుత్వం భేషుగ్గా ఆమోదించేసింది. దీన్నో స్పెషల్ కేసుగా పరిగణించి ఆమోదిస్తున్నట్లు జీవోలో వివరణ కూడా ఇచ్చింది.

దీనికీ ట్యాక్స్ డిఫర్‌మెంట్!
నిజానికి కొత్తగా ఏర్పాటయ్యే సంస్థలకే ట్యాక్స్ డిఫర్‌మెంట్ ఇవ్వాలి. కానీ సీసీఐ నుంచి లీజు బదలాయింపు పొందిన ఇండియా సిమెంట్స్ సంస్థ.. సీసీఐకి చెందిన ప్లాంటును కూడా టేకోవర్ చేసింది. ఆ ప్లాంటుకు ప్రభుత్వం ఏకంగా రూ.43 కోట్ల సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌కు అనుమతిచ్చింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం కావటంతో అప్పట్లో ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసింది. విపక్షంలో ఉన్న రోశయ్య కూడా అసెంబ్లీలో దీన్ని విమర్శించారు. అయినా సరే, బాబు సర్కారు మాత్రం తన తీరు మార్చుకోలేదు. అప్పట్లో సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌కు అనుమతించిన మొత్తంలో కంపెనీల మధ్య కొన్ని తేడాలున్నా.. డిఫర్‌మెంట్ కాలాన్ని మాత్రం అందరికీ దాదాపు 14 ఏళ్లే ఇవ్వటం గమనార్హం.

రాశి సిమెంట్స్‌నూ కట్టబెట్టిన బాబు!
ఇక్కడ ఇండియా సిమెంట్స్‌కు బాబు చేసిన మరో మేలును ప్రస్తావించాలి. రాష్ట్రానికి చెందిన రాశి సిమెంట్స్‌ను ఇండియా సిమెంట్స్‌కు కట్టబెట్టడానికి బాబు ఎంత తహతహలాడారో, రాశి అధినేత విష్ణురాజును ఎంత క్షోభపెట్టారో ప్రస్తావించి తీరాలి. అప్పట్లో రాశికి చెందిన 2.13 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఐడీసీ వద్ద ఉండేది. లిస్టెడ్ కంపెనీ కావటంతో మిగిలిన వాటా కొంత జనం, పెట్టుబడి సంస్థల చేతుల్లోను, కొంత విష్ణురాజు కుటుంబీకుల చేతుల్లోను ఉండేది. బహిరంగ మార్కెట్లో వాటాల్ని కొంటూ వచ్చిన ఇండియా సిమెంట్స్... తన వాటాను 18.03 శాతానికి పెంచుకుంది. అక్కడి నుంచి రాశిని తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ దశలో ఆందోళనకు గురైన విష్ణురాజు.. 1998 జనవరిలో, 77 ఏళ్ల వయసులో తన కుమార్తెలు, అల్లుళ్లు, మనవలతో కలిసి వైస్రాయ్ హోటల్లో ప్రెస్‌మీట్ పెట్టారు. కంపెనీ టేకోవర్ ప్రయత్నాల్ని గట్టిగా ఎదుర్కొంటామన్నారు. రాజు కుటుంబమంతా ఒక్కటి కావటంతో ఏం చేయాలో ఇండియా సిమెంట్స్‌కు తోచలేదు. ఏపీఐడీసీ చేతుల్లో ఉన్న వాటా దానికి వరంలా కలిసొచ్చింది. ఆ వాటా తన చేతికి వస్తే కంపెనీ తన పరమవుతుందని భావించిన ఇండియా సిమెంట్స్.. దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చివరికి చేజిక్కించుకుంది. ఆ వాటా విక్రయించవద్దని ఒక దశలో రాష్ట్ర పారిశ్రామికవేత్తలంతా చంద్రబాబును కోరబోయారు. వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వటానికి కూడా నిరాకరించిన బాబు.. ఇండియా సిమెంట్స్‌కే ఓటేశారు. దీంతో రాశి సంస్థ ఐసీఎల్ చేతికి చేరింది.

ఎల్ అండ్ టీకి ఎదురే లేదు!!
ల్ అండ్ టీ-బాబు బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే! కాకినాడ పోర్టు నుంచి హైటెక్ సిటీదాకా రాష్ట్రంలో ఎల్ అండ్ టీ లేనిదే బాబు హయాంలో ఏ పనీ జరగలేదన్నది పచ్చి నిజం. అలాంటి ఎల్ అండ్ టీకి సున్నపురాయి మైనింగ్ లీజు, ట్యాక్స్ డిఫర్‌మెంట్లు కట్టబెట్టడంలోనూ బాబు తన ప్రత్యేకత చూపించారు.

జీవో ఎంఎస్ నంబరు 501, ఇచ్చిన తేదీ 11.9.2000
ఇదో చిత్రమైన కథ. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట, పెట్నికోట గ్రామాల్లో ఏకంగా 2,087.89 ఎకరాల సున్నపురాయి గనుల్ని 15 ఏళ్ల పాటు ఎల్ అండ్ టీకి కట్టబెడుతూ బాబు పై జీవోను ప్రభుత్వం జారీ చేసింది. తరవాత ఈ ప్రాంతంలో మైనింగ్ చేస్తుండగా ఎల్ అండ్ టీకి షేల్ నిక్షేపాలు దొరికాయి. అంటే రాతి పొరల్లో ఉండే గ్యాస్ నిక్షేపాలన్నమాట. తమ సొంత అవసరాల కోసం వాటిని ఉపయోగించుకుంటామని, తమ మైనింగ్ అనుమతుల్లో షేల్ నిక్షేపాలనూ చేర్చాలని ఎల్ అండ్ టీ లేఖ రాసింది. అసలే బాబు! ఆపై ఎల్ అండ్ టీ!! ఇలా లేఖ రాగానే అలా ప్రభుత్వం అనుమతిచ్చేసింది. తవ్విన షేల్ ధరలో 10 శాతాన్ని రాయల్టీగా చెల్లిస్తే చాలంది.

ట్యాక్స్ డిఫర్‌మెంట్‌లో టాప్!
టార్గెట్- 2000 పెట్టుకున్నదే తనవారి కోసం. కాబట్టి ఎల్ అండ్ టీ విషయంలో బాబు ఏం చేస్తారో తేలిగ్గానే ఊహించవచ్చు. అనుకున్నట్టే బాబు అక్షరాలా ఆరు వందల కోట్ల రూపాయల సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్ దానికి మంజూరు చేశారు. 14 ఏళ్ల పాటు అమ్మకం పన్ను వాయిదాను అనుమతిస్తూ పచ్చజెండా ఊపేశారు. అంతేకాక రూ.10 లక్షల మేర ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీకీ ఓకే అన్నారు. మొత్తంగా టార్గెట్-2000 పథకం కింద లబ్ధి పొందిన సంస్థల జాబితాలో ఎల్ అండ్ టీ 4వ స్థానంలో నిలిచిందంటే.. బాబుకు దీనిపై ఉన్న ప్రేమ తెలియక మానదు.

ఎన్‌సీసీకీ లీజు, డిఫర్‌మెంట్లు...
గతంలో నాగార్జునా సిమెంట్స్ పేరిట చిన్న ప్లాంటును నడిపి, తరవాత దాన్ని విక్రయించేసిన నాగార్జునా కన్‌స్ట్రక్షన్ కంపెనీకీ చంద్రబాబు హయాంలో భారీ కేటాయింపులే జరిగాయి.

జీవో ఎంఎస్ నంబరు 465, ఇచ్చిన తేదీ 29.8.2001
కర్నూలు జిల్లా పీపల్లి మండలం రాచర్ల గ్రామంలో నాగార్జునా కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌కు ఏకంగా 1,260.33 ఎకరాల్లో సున్నపురాయి నిక్షేపాలను లీజుకిచ్చారు. ఈ మేరకు 1995 డిసెంబరు 3న, అంటే తాను సీఎం అయిన మూడు నెలలకు జీవో నంబరు 170ని బాబు జారీ చేశారు. 2027 వరకూ ఈ లీజు గడువుంది. అయితే వివిధ కారణాల వల్ల నాగార్జునా సంస్థ తన సిమెంట్ ప్లాంట్‌ను విక్రయించింది. తన లీజును కూడా ప్రియదర్శిని సిమెంట్స్‌కు బదలాయించాలని దరఖాస్తు చేసుకుంది. 2001 ఆగస్టు 29న దీన్ని బాబు ప్రభుత్వం ఓకే చేసింది. నాగార్జునా కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చిన సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్ కూడా తక్కువేమీ కాదు. ఈ సంస్థకు రూ.20 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీతో పాటు రూ.95 కోట్ల సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌కూ అనుమతినిచ్చారు.

బిర్లాలకు అనుమతులే అనుమతులు...
బిర్లా గ్రూపులోని సిమెంట్ కంపెనీలకు బాబు ప్రభుత్వం ఎడాపెడా అనుమతులు మంజూరు చేసేసింది. అది కె.కె.బిర్లా గ్రూపు కంపెనీ అయిన జువారీ సిమెంట్స్ కావచ్చు.. ఎంపీ బిర్లా గ్రూపుకు చెందిన లోక్ సిమెంట్స్ కావచ్చు. సంస్థ ఏదైతేనేం! వేలాది ఎకరాల సున్నపురాయి మైనింగ్ లీజుల్ని, వందల కోట్ల పన్ను రాయితీల్ని కట్టబెట్టారు బాబు.

జీవో నంబరు 217, ఇచ్చిన తేదీ 6.4.2001 
మాధవ్ ప్రసాద్ బిర్లా గ్రూపునకు చెందిన లోక్ సిమెంట్స్‌కు బాబు ప్రభుత్వం భారీ లీజుల్ని కట్టబెట్టింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల, చిన్న దందులూరు గ్రామాల్లో ఏకంగా 10.1 చదరపు కిలోమీటర్ల సున్నపురాయి నిక్షేపాల్ని ఈ సంస్థకు కట్టబెట్టారు. మరో తమాషా ఏంటంటే.. తొలుత ఇచ్చిన జీవోలో ఏరియాను కేవలం 10.1 ఎకరాలుగా పేర్కొన్నారు. 10 రోజుల తరవాత పై జీవో విడుదల చేస్తూ.. దీన్ని 10.1 చదరపు కిలోమీటర్లకు సవరించారు! కాకపోతే ఆ తరవాత గ్రూపులో జరిగిన పరిణామాల వల్ల ఈ కంపెనీ ఏర్పాటు కాలేదు.

జీవో నంబరు 572, ఇచ్చిన తేదీ 26.11.2001
జువారి సిమెంట్స్ ఇండస్ట్రీస్ అప్పట్లో కె.కె.బిర్లా గ్రూపు చేతిలో ఉండేది. దేశవ్యాప్తంగా సిమెంట్ ఉత్పత్తిలో అగ్రశ్రేణి సంస్థగా ఉండేది. అలాంటి సంస్థకు కడప జిల్లా కోడూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో 600.11 ఎకరాల సున్నపురాయి గనుల్ని మైనింగ్ నిమిత్తం బాబు ప్రభుత్వం 20 ఏళ్ల కాలానికి ధారాదత్తం చేసింది. లీజు చార్జీల్ని తొలి ఏడాదికి ఉచితంగా... రెండు నుంచి ఐదేళ్ల దాకా హెక్టారుకు ఏటా రూ.140గా, 6-10 ఏళ్లకు రూ.230గా, 11వ డాది తరవాత హెక్టారుకు రూ.350గా చార్జీలు నిర్ణయించారు.

జీఓ నంబర్ 567, ఇచ్చిన తేదీ 24.11.2001
జువారి ఇండస్ట్రీస్‌కు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లి గ్రామంలో మరో 1,022.50 ఎకరాల సున్నపురాయి నిక్షేపాల గనుల్ని మైనింగ్ నిమిత్తం లీజుకిచ్చారు. అంతకుముందే మంజూరైన ఈ లీజు అనుమతిని.. 2001 నుంచి 2021 వరకూ 20 ఏళ్లకు బాబు పొడిగించారు.

పెట్టుబడి తక్కువైనా రాయితీకి తక్కువ లేదు!
ఎంతైనా బిర్లా గ్రూపు సంస్థ. అందుకని అనుమతుల విషయంలో బాబు ఒక అడుగు ముందుకే వేశారు. మామూలుగా టార్గెట్-2000 పథకంలో ఆయా కంపెనీలు పెట్టిన పెట్టుబడుల ఆధారంగా సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌ను, ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీని అనుమతించారు. ఉదాహరణకు పెన్నా సిమెంట్‌నే తీసుకుంటే ఆ సంస్థ చాణక్య సిమెంట్స్ పేరిట ఏర్పాటు చేసిన ప్లాంటుపై రూ.125 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అందుకని దానికి రూ.169 కోట్ల సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌కు అనుమతించారు. జువారీ విషయంలో మాత్రం బాబు మహా మాయ స్పష్టంగా బయటపడింది. 

ఈ సంస్థ తన ప్లాంటుపై పెట్టిన పెట్టుబడి కేవలం రూ.44 కోట్లు. కానీ దీనికి ఎల్ అండ్ టీతో సమానంగా దాదాపు రూ.600 కోట్ల మేర సేల్స్ ట్యాక్స్ డిఫర్‌మెంట్‌ను, రూ.10 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీని అనుమతించారు. ఎందుకిలా చేశారన్నది దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిందే తప్ప మామూలు మనుషులకు అర్థం కాదు. ‘‘ఇతర ప్లాంట్లలో ఉత్పత్తి చేసిన సిమెంట్‌ను కూడా ఈ సంస్థ విక్రయిస్తుంది కనక.. వాటిపై కూడా అమ్మకం పన్ను చెల్లించాల్సిన పని లేకుండా ఈ డిఫర్‌మెంట్‌ను అనుమతించి ఉండొచ్చు. ఇదే జరిగి ఉంటే ఇంతకన్నా పెద్ద కుంభకోణం ఇంకొకటి ఉండదు’’ అని కొందరు పన్ను నిపుణులు పేర్కొనటం గమనార్హం.
Share this article :

0 comments: