సౌత్‌ఎండ్ కంపెనీ జగన్‌దేనని చెప్పాలని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సౌత్‌ఎండ్ కంపెనీ జగన్‌దేనని చెప్పాలని

సౌత్‌ఎండ్ కంపెనీ జగన్‌దేనని చెప్పాలని

Written By ysrcongress on Friday, March 16, 2012 | 3/16/2012

సౌత్‌ఎండ్ కంపెనీ జగన్‌దేనని చెప్పాలని, ఆయనకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ వేధింపులపై మరో వ్యాపారవేత్త హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో సీబీఐ పదే పదే పిలుస్తూ వేధింపులకు గురి చేస్తోందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా తాము చెప్పినట్లు స్టేట్‌మెంట్లు ఇవ్వకుంటే అరెస్టు చేస్తామని బెదిరిస్తోందంటూ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, సౌత్‌ఎండ్ ప్రాజెక్ట్స్ ఎండీ ఎన్.మనోహర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి విచారించారు. పిటిషనర్‌ను వేధింపులకు గురి చేయవద్దని న్యాయమూర్తి సీబీఐని ఆదేశించారు. అతన్ని విచారించడం అవసరమని అనుకుంటే సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ముందస్తు నోటీసు జారీ చేసి పిలిపించాలని, అతని న్యాయవాదుల సమక్షంలోనే ప్రశ్నించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

గత 25 సంవత్సరాలుగా పిటిషనర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారని, దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేపట్టారని ఆయన తరపు న్యాయవాది ఎన్.వి.ప్రశాంత్ కోర్టుకు నివేదించారు. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన సౌత్‌ఎండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫౌండేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సునీల్‌రెడ్డికి ఉన్న వాటాలను 2009 అక్టోబర్‌లో పిటిషనర్ చేశారని తెలిపారు. వాటాల కొనుగోలు అనంతరం పిటిషనర్ సౌత్‌ఎండ్ కంపెనీకి ఎండీ అయ్యారని, అప్పటి నుంచి ఆ కంపెనీతో సునీల్‌రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని వివరించారు. ఎమ్మార్ కేసులో సునీల్‌రెడ్డి అరెస్టయిన తరువాత సీబీఐ అధికారులు పిటిషనర్‌కు ఫోన్ చేసి ఫిబ్రవరి 7న తమ ముందు హాజరు కావాలని కోరారని, ఎందుకు హాజరు కావాలంటున్నారని కారణం అడిగినా కూడా చెప్పలేదని ప్రశాంత్ వివరించారు. సీబీఐ అధికారులు కోరినట్లు ఫిబ్రవరి 7న వారి ఎదుట హాజరయ్యారని, గంటలకొద్దీ కూర్చోపెట్టి, చివరకు రెండు గంటలు విచారించారని తెలిపారు. సౌత్‌ఎండ్ ప్రాజెక్ట్స్ గురించిన ప్రతి సమాచారాన్ని డాక్యుమెంట్లతో సహా సీబీఐ అధికారుల ముందుంచారని చెప్పారు. ఆకస్మాత్తుగా సౌత్‌ఎండ్ ప్రాజెక్ట్స్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందినదని, ఆయన కోసమే ఈ కంపెనీని నడుపుతున్నట్లు చెప్పాలంటూ బెదిరింపులకు దిగారని ఆయన కోర్టుకు నివేదించారు. 

సౌత్‌ఎండ్‌లోని పెట్టుబడులన్నీ జగన్‌వేనని చెప్పాలని హుకుం జారీ చేసి, అందుకు అనుగుణంగా స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా తాము చెప్పినట్లు స్టేట్‌మెంట్లు ఇవ్వకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని, కంపెనీలన్నింటినీ సీజ్ చేస్తామని, దీంతో రోడ్డున పడాల్సి వస్తుందంటూ పలు రకాలుగా బెదిరింపులకు దిగారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి, పిటిషనర్‌ను విచారించాలనుకుంటే సీఆర్‌పీఎస్ 160 కింద నోటీసు జారీ చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ సీబీఐ జాయింట్ డెరైక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును రెండు వారాలకు వాయిదా వేశారు.
Share this article :

0 comments: