గుంటూరు జిల్లా ఉపాధి హామీ ఉద్యోగులకు జగన్ హామీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు జిల్లా ఉపాధి హామీ ఉద్యోగులకు జగన్ హామీ

గుంటూరు జిల్లా ఉపాధి హామీ ఉద్యోగులకు జగన్ హామీ

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

ఉపాధి హామీ ఉద్యోగులకు బాసటగా ఉంటా: జగన్
మేం అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచుతాం
ఉపాధి ఉద్యోగులకు టైమ్ స్కేల్‌ను తీసుకొస్తాం 
అందరికీ పనిదినాలు కల్పించి వలసల్ని నివారిస్తాం 
* గుంటూరు జిల్లా ఉపాధి హామీ ఉద్యోగులకు జగన్ హామీ 
* సిబ్బంది దీక్షలకు 29న సంఘీభావం తెలుపుతానని భరోసా

గుంటూరు, న్యూస్‌లైన్: ‘‘రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు సరిగ్గా లేదని తెలుస్తోంది. పనులు దొరక్క రాయలసీమ ప్రాంతాల నుంచి ఎందరో కూలీలు గుంటూరు జిల్లాకు వలస వచ్చారు. ఈ రోజు నేను పలకరించిన మిర్చి పొలాల్లోని కూలీలందరూ కర్నూలు, మంత్రాలయం, డోన్, దర్శి ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే. ప్రభుత్వం తీరు ఏమీ బాగాలేదు. కడుపు చేతపట్టుకుని కూలీలు పరుగులు తీయాల్సిన దుస్థితి కల్పించింది. పథకంలో పనిచేసే సిబ్బంది కూడా సంతోషంగా లేరు. ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారు. మేం అధికారంలోకి వ చ్చాక ఉద్యోగ భద్రత గురించి ఏ మేరకు చేయగలనో చెప్పలేను. కానీ.. ఉద్యోగుల వేతనాలు మాత్రం కచ్చితంగా పెంచుతాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి హామీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. 

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్‌ను జిల్లాకు చెందిన సుమారు 50 మందికి పైగా ఉపాధి హామీ ఉద్యోగులు కలిసి తమ ఇబ్బందులను వివరించి వినతిపత్రం సమర్పించారు. ‘‘కూలీలకు పని దినాలు కల్పించాల్సిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధం కావటం అన్యాయం. కూలీలకు ఇచ్చే మెటీరియల్ కాంపౌండ్‌ను తగ్గించాల్సి ఉంది. అప్పుడు కూలీలకు రోజు వారీగా సరైన కూలీ లభించే వీలుంది. అంతేకాకుండా సిబ్బందికి కూడా మంచి వేతనాలివ్వాలి. అపుడే అవినీతికి ఆస్కారం ఉండదు. సామాజిక తనిఖీలు ఉండటం సమంజసమే. అయితే.. ఇందులో మార్పులు తీసుకురావాలి. సిబ్బందికి ఇచ్చే వేతనాలు ఏం సరిపోతాయి? ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ, ఆదర్శ రైతులు చాలీచాలని వేతనాలతో నానా ఇబ్బందులు పడ్తున్నారు. కష్టపడే పేదవాడి కోసం ప్రభుత్వం ఇంకాస్త ఖర్చు పెడితే తప్పేమిటి?’’ అని జగన్ ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ ఉద్యోగులకు టైం స్కేలును తీసుకు రావటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

దీక్షలకు సంఘీభావం
తనను కలిసి వినతిపత్రం అందజేసిన జిల్లా ఉపాధి హామీ ఉద్యోగులతో జగన్ మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 491 జీవో ద్వారా ప్రభుత్వం పని దినాలకు లక్ష్యాలను నిర్ణయించి తమను ఇంటికి పంపేందుకు సిద్ధమైందని పలువురు క్షేత్ర సహాయకులు, ఇంజినీరింగ్ కన్సల్‌టెంట్లు చెప్పారు. ఉద్యోగ భద్రత కొరవడిందని, సామాజిక తనఖీల పేరుతో ఉపాధి సిబ్బందిపై ఇష్టారాజ్యంగా వేటు వేస్తున్నారని జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెబాట పట్టిన వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు జిల్లా అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు సిద్ధం చేశారని పేర్కొన్నారు. 

మంగళవారం నాటి సాక్షి పత్రికను జగన్‌కు చూపించి ‘పొట్టగొట్టే పని’ శీర్షికన తమ ఇబ్బందులను కళ్లకుగట్టినట్లు వెలుగులోకి తెచ్చినట్లు వివరించారు. వారి సాధకబాధకాలను సావధానంగా ఆలకించిన జగన్.. ఈ నెల 29న గుంటూరు వచ్చినపుడు.. దీక్షలు కొనసాగిస్తున్న ఉపాధి సిబ్బందికి సంఘీభావం తెలుపుతానని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ ఉద్యోగ సంఘ నాయకులు లక్ష్మీపతి, సాంబశివరావు, తెల్లమేకల రమేష్ తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Share this article :

0 comments: