కోవూరు ఎన్నికల్లో పంచేందుకు రూ. కోట్లు సిద్ధం చేసిన టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరు ఎన్నికల్లో పంచేందుకు రూ. కోట్లు సిద్ధం చేసిన టీడీపీ

కోవూరు ఎన్నికల్లో పంచేందుకు రూ. కోట్లు సిద్ధం చేసిన టీడీపీ

Written By ysrcongress on Friday, March 16, 2012 | 3/16/2012

కోవూరు ఎన్నికల్లో పంచేందుకు రూ. కోట్లు సిద్ధం చేసిన టీడీపీ
నెల్లూరులోని టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇంట్లో రూ.కోటి స్వాధీనం
ఆయన తెలుగు యువత అధ్యక్షుడు బీద రవిచంద్రకు బావమరిది
రూ. 5 కోట్లు దొరికినప్పటికీ రూ. కోటినే చూపినట్లు అనుమానాలు
మైపాడు గేటు వద్ద మరో రెండు కోట్లు దొరికినా బయటపెట్టని అధికారులు!
బావమరిది ఇంట్లో సోదాలు జరుగుతుంటే.. 
పక్క వీధిలో బీద రవిచంద్ర చక్కర్లు.. ఫోన్‌లో మంతనాలు

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: కోవూరు ఉప ఎన్నికల్లో ‘ఎలాగైనా’ గెలవాలని కలలుగంటున్న తెలుగుదేశం పార్టీ.. ఓట్ల కోసం ‘ఎంతకైనా’ తెగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల్లో పంచేందుకు తమ పార్టీ నేతల ఇళ్లలో కోట్లాది రూపాయలు రెడీగా ఉంచినట్లు తెలుస్తోంది. వాటిలో ఓ కోటి రూపాయలు గురువారం పోలీసుల చేతికి చిక్కడంతో గుట్టు రట్టయింది. టీడీపీకి చెందిన నెల్లూరు ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ ఇంట్లో ఈ కోటి రూపాయలు దొరికాయి. ఆయన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బీద రవిచంద్రకు స్వయానా బావమరిది. అయితే ఆ ఇంట్లో రూ. 5 కోట్ల రూపాయలు దొరికినా.. కాంగ్రెస్ నేతల ఒత్తిళ్ల మేరకు రూ.కోటి మాత్రమేనంటూ పోలీసులు చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే సమయంలో ఇందుకూరు పేట మండలం మైపాడు గేటు వద్ద మరో రూ. 2 కోట్లు దొరికినట్లు తెలిసినా పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇలా ఒక్కరోజే.. ఒక్క టీడీపీ నేతలే రూ. 7 కోట్లు పందేరానికి సిద్ధమవడం చర్చనీయాంశమైంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌కు తప్ప ఎవరికైనా ఓటు వేయాలంటూ కాంగ్రెస్ కోట్ల రూపాయలు పంచుతున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు మారుతీ నగర్‌లో ఉండే మాజీ కార్పొరేటర్(టీడీపీ) ఓం ప్రకాశ్ యాదవ్‌ఇంట్లో భారీగా నగదును నిల్వ చేసి కోవూరు ఓటర్లకు పంపిణీ చేయాలని టీడీపీ భావించింది. ఆ క్రమంలో టీడీపీ నేతల వ్యవహారంపై అజ్ఞాత వ్యక్తి నగర ఓఎస్‌డీ నరశింహ కిషోర్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఆయన ఓం ప్రకాశ్ యాదవ్ ఇంటిని సోదా చేయాలని నగర సీఐ వీరాంజనేయరెడ్డి, రెండో నగర ఎస్సై కిషోర్‌ను ఆదేశించారు. వారు తమ సిబ్బందితో కలిసి ఓం ప్రకాశ్ యాదవ్ ఇంటిని సోదా చేశారు. ఆ సోదాల్లో నగదు ఉన్న బ్యాగు బయటపడింది. లెక్కించగా రూ.99.98 లక్షలుగా నిర్ధారణ అయింది. ఆ డబ్బులు ఎక్కడివని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్నికల పరిశీలన ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించారు. వారు ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు అప్పగించారు. సరైన పత్రాలు చూపితే డబ్బును తిరిగి ఇచ్చివేస్తామని, లేని పక్షంలో ప్రభుత్వానికి జమచేస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి బాలకృష్ణారెడ్డి తెలిపారు.

పొలాన్ని అమ్మారట.. అగ్రిమెంట్ లేకుండా!

నగదుకు సంబంధించిన వివరాలను అధికారులు అడగగా ఓం ప్రకాశ్ పొంతనలేని సమాధానాలు చెప్పారు. గంగపట్నంలో ఉన్న పొలాన్ని సుకుమార్‌రెడ్డి అనే వ్యక్తికి అమ్మానని, దానికి సంబంధించి టోకన్ అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కాగితాలు చూపాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి బాలకృష్ణారెడ్డి కోరడంతో ఆయన తె ల్లమొహం వేశారు. సరైన ఆధారాలు లేకుండా ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని వారు ప్రశ్నించడంతో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, అందుకు సంబంధించిన డబ్బని బుకాయించారు. ఇంట్లో తాను లేని సమయంలో సోదాలు ఎలా నిర్వహిస్తారని కూడా ఆయన పోలీసులను ప్రశ్నించారు. ‘మా ఇళ్లలో డబ్బులు ఉండకూడదా?’ అంటూ పోలీసులను నిలదీశారు. తనది కష్టపడిన సొమ్మని అన్నారు. తాను ఎవ్వరికైనా డబ్బులు పంచుతూ ఉంటే పట్టుకోవచ్చని, తన సొత్తును తన ఇంట్లోనే ఉంచుకొన్నప్పడు పట్టుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ నేతల హడావుడి: ఓం ప్రకాశ్ ఇంట్లో నగదును స్వాధీనం చేసుకున్నారన్న విషయం తెలుసుకున్న తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పమిడి రవి కుమార్ చౌదరి, మాజీ కార్పొరేటర్ విటపు లలితారామ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేక్రమంలో ఓం ప్రకాశ్ బావ బీద రవిచంద్ర పక్క వీధిలోని పెట్రోల్‌బంకు వద్ద కారులో చక్కర్లు కొడుతూ ఫోనులో మాట్లాడుతూ కనిపించారు. ఆయన ఏపీ 26 ఏబీ 456 స్విఫ్ట్ కారులో ఉన్నారు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు రోజూవాడే కారు బదులు మరో కారులో వచ్చారని తెలుస్తోంది.

మరో రెండు కోట్లు: కోటి రూపాయాలు దొరికిన విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కె.నారాయణస్వామి, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎ.ఎస్.మనోహర్‌లతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మైపాడు గేటు వద్ద రెండు కోట్ల రూపాయలు దొరికినట్లు సమాచారం అందిందని చెప్పారు. అయితే ఆ తర్వాత అధికారులు దీనిపై ఎలాంటి వివరాలనూ వెల్లడించలేదు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు

కోవూరు ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనక్ ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డిలు గురువారం విజ్ఞప్తి చేశారు. కోవూరు నియోజకవర్గం మైపాడు గేటు వద్ద టీడీపీ నేత ఓంప్రకాశ్ ఇంట్లో దొరికిన రూ.కోటిని ఆ పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల ఖర్చులో జమ కట్టాలని కోరారు. పరిమితికి మించి ఎన్నికల ఖర్చు పెడుతున్నందుకు టీడీపీ అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని కోరారు.

ఆ ఏడు కోట్ల కేసు ఇంకా తేలలేదు!

కాగా 2010 జూన్‌లో చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ నేత పేరం హరిబాబు తండ్రి రామక్రిష్ణయ్య నాయుడు హొస్పేట నుంచితిరుపతికి రెండు వాహనాల్లో రూ.7 కోట్లను తరలిస్తూ కదిరి పోలీసులకు దొరికిపోయారు. అప్పట్లో ఈ విషయం సంచలనం రేపింది. ఆ డబ్బంతా చంద్రబాబుదేనని, కావాలంటే ఆయనతో ఫోన్‌లో మాట్లాడిస్తానని రామక్రిష్ణయ్య పోలీసులతో చెప్పారు. అయితే ఇన్ని రోజులు గడిచినా ఆ కేసు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డబ్బు పట్టుబడిన వాహనాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పేరుమీద రిజిస్టరైన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారేకానీ.. కేసును మాత్రం మిస్టరీగానే ఉంచేశారు.
Share this article :

0 comments: