ఇదంతా చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తికాకపోవడం వల్లే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇదంతా చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తికాకపోవడం వల్లే..

ఇదంతా చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తికాకపోవడం వల్లే..

Written By ysrcongress on Sunday, March 18, 2012 | 3/18/2012

వైఎస్సార్ జిల్లాలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు
ఇదంతా చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తికాకపోవడం వల్లే..
మహానేత బతికి ఉంటే.. మన బతుకులు ఇలా ఉండేవా?
ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి
ఫీజులు చెల్లించలేక విద్యార్థులు పరీక్షలు కూడా రాయలేకపోతున్నారు
ప్రభుత్వ పెద్దలకు ప్రజల బాధలకంటే.. సోనియాను ప్రసన్నం చేసుకోవడంపైనే దృష్టి
వేంపల్లెలో మహానేత విగ్రహాలను ఆవిష్కరించిన వైఎస్ జగన్

కడప(వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్: ‘పొద్దున్నే పులివెందులలో చూశాను. తాగునీటికి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారిలో వస్తూ వేంపల్లె, చుట్టుపక్కల పల్లెల పరిస్థితి గమనించాను. వాళ్లూ అలాగే ఇబ్బంది పడుతున్నారు. వైఎస్సార్ బతికి ఉంటే మన బతుకులు ఇలా ఉండేవా అనిపించింది. ఈ బాధలన్నీ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తికాకపోవడం వల్లే.. దానిపై పాలకులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైఎస్ ఉంటే గండికోటతో పాటు అన్నీ పూర్తయ్యేవి. వైఎస్ మృతి తర్వాత ఆయన స్వప్నాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వేంపల్లెలోని రాయచోటి బైపాస్, పక్కీర్‌పల్లిలో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలు రెండింటిని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్)తో పులివెందుల నియోజకవర్గ ప్రజల తాగు, సాగు నీటి సమస్యలు తీరుతాయని.. అయితే దాన్ని పూర్తి చేసేందుకు మహానేత వైఎస్సార్ మినహా ఏ ఒక్క నాయకుడూ చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఆ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులే అందుకు సాక్ష్యమని వివరించారు.

చంద్రబాబు ఇచ్చింది రూ.30 కోట్లే..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి.. భిక్ష వేసినట్లు సీబీఆర్ కు కేవలం రూ.30 కోట్లను కేటాయించారన్నారు. వైఎస్ అధికారంలోకి రాగానే దీనికి రూ.290 కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతోపాటు పైడిపాలెం రిజర్వాయర్‌కు కలిపి దాదాపు రూ.500 కోట్లకు పైగా నిధులను కేటాయించారని తెలిపారు. ‘వైఎస్ బతికే ఉంటే గండికోట ప్రాజెక్టు పూర్తయ్యేది. దాంతో గండికోట నుంచి సీబీఆర్‌కు, పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లొచ్చేవి. ఆ స్వప్నం సాకారమై ఉంటే నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్య తీరడంతో పాటు లక్ష ఎకరాలకు సాగు నీరు కూడా అందేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం సాగునీరు కాదు కదా.. తాగునీటినీ ప్రజలకు అందించలేని అధ్వాన స్థితిలో ఉంది. వైఎస్ చనిపోయాక ఒక్క ప్రాజెక్టు కాదు కదా.. ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం నిర్మించలేదు’ అని విమర్శించారు. వైఎస్ హయాంలో కేవలం రాజీవ్‌నగర్‌లోనే ఆరువేల ఇళ్లు నిర్మించారని, అక్కడా తాగునీటి సమస్య జటిలంగా ఉందని చెప్పారు. 

అప్పులు చేసి ఫీజులు క డుతున్నారు..

ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థులు పరీక్షలు కూడా రాయలేక ఇబ్బందులు పడుతున్నారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘ఇంజనీరింగ్, మెడిసిన్ కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో.. విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే హాల్‌టికెట్లు ఇవ్వమని తేల్చిచెబుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. కొంతమంది విద్యార్థులయితే.. అప్పులు పుట్టక పరీక్షలు కూడా రాయలేని స్థితిలో ఉన్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు ఓ విశ్వవిద్యాలయం నిర్మించాలని వైఎస్ తపన పడేవారని, ఆయన హయాంలో 14 యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం 11 యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను కూడా ప్రభుత్వం నియమించలేకపోతోందని, ఇందుకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. వైఎస్ చనిపోయాక ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడంపైనే మక్కువ చూపుతున్నారని ధ్వజమెత్తారు. ‘ప్రస్తుతం ప్రజల గురించి ఆలోచించే నాయకుడే లేడు. వైఎస్ ఒక్కరే ఎందుకు సువర్ణపాలన అందించారని నేను ఆలోచించాను. ఎన్నాళ్లు బతికామనేది కాదు.. బతికినంత కాలం ఎలా బతికామనే సిద్ధాంతాన్నే నమ్మడం వల్ల ఆయన జనరంజకంగా పాలించారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: