తిరోగమనంలో వ్యవసాయం, తయారీ రంగం పెట్టుబడులు లేకపోతే ప్రగతి ఎలా సాధ్యం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరోగమనంలో వ్యవసాయం, తయారీ రంగం పెట్టుబడులు లేకపోతే ప్రగతి ఎలా సాధ్యం?

తిరోగమనంలో వ్యవసాయం, తయారీ రంగం పెట్టుబడులు లేకపోతే ప్రగతి ఎలా సాధ్యం?

Written By ysrcongress on Sunday, March 18, 2012 | 3/18/2012


అన్ని రంగాలను విస్మరించిన కేంద్రం
తిరోగమనంలో వ్యవసాయం, తయారీ రంగం
పెట్టుబడులు లేకపోతే ప్రగతి ఎలా సాధ్యం?
జైరాం రమేశ్ చర్యలతో దేశం మూడేళ్లు వెనక్కి..
కోవూరు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయం: కొణతాల

హైదరాబాద్, న్యూస్‌లైన్: యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దిశ, దశ లేవని.. అన్ని రంగాలను విస్మరించారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు విమర్శించారు. ప్రతి పౌరునికి ఆర్థిక స్వావలంబన, సాధికారత, భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్త కొణతాల రామకృష్ణతో కలిసి శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో యూపీఏ-2 ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పెట్టుబడులు లేకపోతే ప్రగతి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కీలక రంగాలైన వ్యవసాయాన్ని, తయారీ రంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఎరువుల ధరలపై సబ్సిడీ ఎత్తేస్తే, ధాన్యానికి మద్దతు ధర ఇప్పుడున్న దాని కన్నా రూ.500 పెంచాలి. కానీ కేంద్రం అవేవీ పట్టించుకోకుండా మిన్నకుండి పోయింది. దీంతో 1981-91 మధ్య కాలంలో 5.2 శాతం అభివృద్ధిలో ఉన్న వ్యవసాయ రంగం.. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ ప్రస్తుతం 2 శాతానికి పడిపోయింది’ అని వివరించారు. ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం ఆ బాధ్యతను పూర్తిగా బ్యాంకులపై నెట్టివేయడం దురదృష్టకరమన్నారు. ‘రైతులకు లక్ష రూపాయల వరకు బ్యాంకులు రుణాలిస్తాయని చెబుతారు. కానీ క్షేత్రస్థాయిలో అది జరిగే దాఖలాలు ఒక్కటీ కనిపించదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. సేద్యపు రంగానికి బ్యాంకులు కచ్చితంగా 18 శాతం నిధులు ఇవ్వాలని ఆర్‌బీఐ నిబంధనలున్నాయి. అవి ఏనాడూ పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరిస్తే 60 శాతం మంది ఆధారపడుతున్న వ్యవసాయ రంగ మనుగడ కష్టమే’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 

తయారీ రంగాన్నీ విస్మరించింది..

వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన తయారీ రంగాన్ని కూడా యూపీఏ పూర్తిగా పక్కన పెట్టిందని సోమయాజులు విమర్శించారు. ‘తయారీ రంగంలోని త్రైమాసిక ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రంగం వృద్ధి రేటు నెగిటివ్ 2 శాతంగా ఉంది. ఇదే పద్ధతి కొనసాగితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకపోతే దేశం ముందుకెలా వెళ్లేది?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేస్తేనే.. ప్రైవేటు సంస్థలు రూ.10 ఖర్చు చేస్తాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ‘కేంద్రం ఏటా జీడీపీ వృద్ధిరేటు 9 శాతం లక్ష్యంగా పెట్టుకుంటుంది. కానీ దురదృష్టం కొద్దీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది. 11వ పంచవర్ష ప్రణాళికలో కూడా 9 శాతం లక్ష్యంగా పెట్టుకోగా 7.5 శాతాన్నే సాధించగలిగింది. ప్రస్తుతం అదే మాదిరిగా పాత పాటే పాడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. రెవెన్యూ లోటు సున్నా శాతానికి తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం.. నికర వ్యయం ఖర్చు చేయకపోతే అదెలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. పన్ను రేటు పెంచితే రెవెన్యూ ఆదాయం పెరగదన్న విషయం తెలిసి కూడా కేంద్రం అదే తప్పిదం చేస్తోందని విమర్శించారు.

జైరాం చర్యలతో అభివృద్ధి ఆగిపోయింది..

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జైరాం రమేశ్ తీసుకున్న చర్యలతో దేశం మూడేళ్లు వెనక్కి పోయిందని సోమయాజులు అన్నారు. పర్యావరణాన్ని సాకుగా చూపి బొగ్గు దిగుమతిని పూర్తిగా నిషేధించారని, దీంతో దేశంలో కరెంట్ కొరత ఏర్పడిందన్నారు. ఫలితంగా తయారీ రంగం పూర్తిగా మరుగునపడిందన్నారు. ‘జైరాం చర్యలు చూస్తుంటే.. అస్థిపంజరాన్ని డైటింగ్ చేయమన్నట్లుంది’ అని ఎద్దేవా చేశారు. ఆయన చర్యల వల్లే దేశం మూడేళ్ల అభివృద్ధి ఆగిపోయిందని.. ఈ విషయం తెలిసి కూడా ప్రధాని మన్మోహన్ ఎందుకు మిన్నకుండిపోయారో అర్థంకావడం లేదన్నారు.


కోవూరులోప్రభంజనమే: కొణతాల

కోవూరు ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని కొణతాల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేసి, జగన్‌ను బలపర్చాలని ప్రజలు నిశ్చయించుకున్నారన్నారు. కాంగ్రెస్-టీడీపీలు కుమ్మక్కై అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఆ రెండు పార్టీలకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. మహానేత వైఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నారని కొణతాల చెప్పారు.
Share this article :

0 comments: